అమెరికాలో జాతి విద్వేషం మళ్ళీ ప్రముఖంగా చర్చకు వచ్చింది. గత సంవత్సరం తెల్లజాతి పోలీసు చేతిలో హత్యకు గురయిన ట్రేవాన్ మార్టిన్ కేసులో నిందితుడు నిర్దోషి అని శనివారం కోర్టు తీర్పు చెప్పడంతో అమెరికా వ్యాపితంగా నిరసనలు చెలరేగాయి. అనేక చోట్ల నిరసనకారులు విధ్వంసాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. జాతి బేధం లేకుండా అన్ని జాతుల వారు నిరసనల్లో పాల్గొంటున్నారు. ట్రేవాన్ మార్టిన్ నల్లజాతికి చెందినవాడు కనకనే పోలీసు సహాయకుడు జిమ్మర్ మేన్ అతని నుండి ఎటువంటి ప్రమాదం లేకపోయినా తుపాకితో కాల్చి చంపాడని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. తీర్పు చెప్పిన ఆరుగురు జ్యూరీ సభ్యుల్లో ఐదుగురు తెల్లవారే కావడంతో తీర్పుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
17 సంవత్సరాల ట్రేవాన్ మార్టిన్ ను గత సంవత్సరం ఫిబ్రవరి 26 తేదీన 29 యేళ్ళ జిమ్మర్ మేన్ (నైబర్ హుడ్ వాచ్ మేన్) తుపాకితో కాల్చి చంపాడు. ట్రేవాన్ తనపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్చి చంపానని జిమ్మర్ మేన్ చెప్పాడు. గ్రోసరి షాపులో షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ట్రేవాన్ ను చూసి తాను ఒక అనుమానాస్పద వ్యక్తిని చూశానని అతనిపై కాల్పులు జరపడానికి అనుమతి ఇవ్వాలని ఎమర్జెన్సీ నంబర్ 911 ద్వారా పోలీసు అధికారులను జిమ్మర్ మేన్ కోరాడు. అయితే 911 కాల్ కు అటెండ్ అయిన వ్యక్తి కాల్పులకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కాల్పులు జరపడంతో ట్రేవాన్ చనిపోయాడు.
ట్రేవాన్ తనతో ఘర్షణ పడ్డాడని, తనతో కలబడ్డాడని, గత్యంతరం లేని పరిస్ధితుల్లో కాల్పులు జరిపానని జిమ్మర్ మేన్ చెప్పాడు. కానీ ట్రేవాన్ నిరాయుధంగా ఉన్నాడు. అతని వల్ల జిమ్మర్ మేన్ కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదనీ అంతకు ముందు నుండి నల్లజాతి యువకుడైన ట్రేవాన్ మీద కన్నేసిన జిమ్మర్ మేన్ అవకాశం దొరకబుచ్చుకుని కాల్చి చంపాడని అప్పట్లో పలువురు ఆరోపించారు. జిమ్మర్ మేన్ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినందున అతనిపై కేసు మోపడానికి పోలీసులు నిరాకరించారు. దానితో అమెరికా వ్యాపితంగా ఆందోళనలు చెలరేగాయి. జిమ్మర్ మేన్ పైన హత్యానేరం మోపి విచారణ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మూడు వారాల పాటు ఆందోళనలు కొనసాగిన అనంతరం వారి డిమాండ్లకు ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ప్రత్యేక విచారణాధికారిని నియమించింది.
గత మూడు వారాలుగా ఈ కేసులో విచారణ కొనసాగింది. విచారణ జరుగుతుండగానే అమెరికా వ్యాపితంగా ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ పరిస్ధితులు ఏర్పడ్డాయి. జిమ్మర్ మేన్ నిర్దోషి అని ఆరుగురు సభ్యుల జ్యూరీ మొన్న శనివారం తీర్పు చెప్పడంతో ఈ ఉత్కంఠ కాస్తా ఆగ్రహరూపం దాల్చింది. అందరూ మహిళలే అయిన ఆరుగురు జ్యూరీ సభ్యుల్లో ఐదుగురు తెల్లజాతివారు కాగా ఒక్కరూ మాత్రమే నల్లజాతి సభ్యురాలు. దీనితో ట్రేవాన్ కేసు తీర్పుపై మరింత ఆగ్రహం పెల్లుబుకింది.
హత్య జాతి ప్రాతిపదికన జరగ్గా, తీర్పు కూడా జాతి ప్రాతిపదికనే జరిగిందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, జ్యూరీ సభ్యుల తప్పేమీ లేదనీ ఫ్లోరిడా రాష్ట్ర చట్టాలే ఆ విధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘స్టాండ్ యువర్ గ్రౌండ్’ సూత్రం పేరుతో రూపొందించబడిన ఫ్లోరిడా రాష్ట్ర చట్టాలు పోలీసులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిందని, విచక్షణ లేకుండా కాల్చి చంపే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
లాస్ ఏంజిలిస్ నుండి న్యూయార్క్ నగరం వరకు అమెరికా ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. శాన్ ఫ్రాన్ సిస్కో, వాషింగ్టన్, డి.సి, న్యూయార్క్, చికాగో లాంటి నగరాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయని రష్యా టుడే తెలిపింది. పరిస్ధితిని పసిగట్టిన లాస్ ఏంజిలిస్ పోలీసు అధికారులు నగర వ్యాపితంగా ‘పోలీస్ ఆలార్డ్’ ప్రకటించారని లాస్ ఏంజిలిస్ టైమ్స్ పత్రిక తెలిపింది. “ఈ కేసు శక్తివంతమైన భావోద్వేగాలను పురిగొల్పిందని నాకు తెలుసు. తీర్పు నేపధ్యంలో ఈ భావోద్వేగాలు మరింత ఉచ్ఛ స్ధాయికి చేరాయని కూడా తెలుసు. కానీ మన దేశానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. జ్యూరీ కూడా తన తీర్పు వెలువరించింది” అని అధ్యక్షుడు ఒబామా ఆందోళనలపై వ్యాఖ్యానించినట్లు పత్రికలు తెలిపాయి.
కాలిఫోర్నియా రాష్ట్రం లోని ఒక్లాండ్ లో ఆందోళనకారులు వివిధ భవనాలు, షాపుల అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారని తెలుస్తున్నది. నగరంలో అనేక చోట్ల మంటలు చెలరేగాయని, పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారని ఆర్.టి తెలిపింది. చికాగో నగరంలో ప్రదర్శకులు “ట్రేవాన్ మార్టిన్ ను ఎవరు చంపారు? ఈ మొత్తం వ్యవస్ధ” అని సూచిస్తూ బ్యానర్లు, ప్లేకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనలన్నింటిలోనూ అన్ని రకాల ప్రజలు పాల్గొంటున్నారని పత్రికలు చెబుతున్నాయి. హత్య జరిగిన శాన్ ఫోర్డ్ నగరంలోనూ ప్రదర్శనలు, ఆందోళనలు, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిలిస్ నగరంలో కూడా విధ్వంసం చోటు చేసుకుంది.
ప్రస్తుత ఆందోళనల వలన జిమ్మర్ మేన్ పై పునర్విచారణ జరిగే అవకాశాలు లేవని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జిమ్మర్ మేన్ పై మానవ హక్కుల ఉల్లంఘన కేసులు మోపి విచారణ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. హత్యా నేరాన్ని కొట్టివేసినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘన కింద విచారణ చేయవచ్చని హక్కుల సంస్ధలు చెబుతున్నాయి. ఈ మేరకు జస్టిస్ విభాగంపై తాము ఒత్తిడి తెచ్చేందుకు హక్కుల సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పేరుకి ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం.ఆచరణలో వర్ధమాన దేశాలపై నిరంతర దురాక్రమణ పర్వం. చివరకు స్వదేశంలో కూడా కొనసాగుతున్న జాత్యహంకారo
ఏ దేశం లోనైనా ‘జిమ్మర్ మేన్’ లు ఒకే రకంగా ఉంటారు కాకపోతే వేష భాషలు వేరు. ఆస్వభావానికి ఎన్ని పేర్లైనా పెట్టు కోవచ్చు అహాంకారం, దురాహంకారం, జాత్యాహంకారం, కులహంకారం, మతాహంకరం ఇలా ………ఎన్నైనా!