సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా ఖాతాదారుల సమాచారం తెలుసుకోకుండా ఖాతాలు తెరిచినందుకు మొత్తం 22 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు, ఆర్.బి.ఐ 49.5 కోట్ల జరిమానా విధించింది.
అంతర్జాల వార్తల పోర్టల్ ‘కోబ్రా పోస్ట్’ నెలల తరబడి పరిశోధన జరిపి దేశంలోని పేరు పొందిన బ్యాంకులన్నీ ఆర్.బి.ఐ విధించిన కె.వై.ఎల్-ఎ.ఎం.ఎల్ (Know your Customer – Anti-Money Laundering) నిబంధనలు అడ్డంగా ఉల్లంఘిస్తున్నాయని గత మార్చిలో వెల్లడి చేసింది. (ఆ కధనం ఇక్కడ చూడండి) ఈ నిబంధనల ప్రకారం డబ్బు డిపాజిట్ గా తీసుకునే ముందు బ్యాంకులు ఖాతాదారుల పూర్తి వివరాలను తెలుసుకోవాలి. వారు తెచ్చిన డబ్బు సక్రమ మార్గాల్లో సంపాదించిందే అని ధ్రువపరుచుకోవాలి. ఈ నిబంధనలను గాలికి వదిలేసి నల్ల డబ్బును బినామీ పేర్లతో డిపాజిట్ చేయడానికి బ్యాంకులు వివిధ మార్గాలను, ద్రవ్య పరికరాలను అభివృద్ధి చేశాయని కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ వెల్లడి చేసింది. ఆపరేషన్ ఫలితాలను ఆర్.బి.ఐ సీరియస్ గా తీసుకోవడంతో అప్పట్లో కొన్ని బలి పశువుల తలలు తెగిపడ్డాయి కూడా.
ఈ నేపధ్యంలో అప్పటి నుండి విచారణ చేపట్టిన ఆర్.బి.ఐ, నిబంధనలను బేఖాతరు చేస్తున్నందుకు గాను మొత్తం 22 బ్యాంకులకు జరిమానా విధిస్తున్నట్లు సోమవారం (జులై 15) ప్రకటించింది. దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకులైన ఐ.సి.ఐ.సి.ఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకులు ఇప్పటికే 10.5 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాయి. ఇవి కాకుండా మరో 22 బ్యాంకులకు జరిమానా విధిస్తున్నట్లు ఆర్.బి.ఐ ప్రకటించింది.
“ప్రతి ఒక్క కేసును పరిశీలించిన పిమ్మట, వివిధ బ్యాంకులపై వచ్చిన నిబంధనల ఉల్లంఘన ఆరోపణల్లో కొన్ని నిజమేనని రుజువయ్యిందని రిజర్వ్ బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. ఈ ఉల్లంఘనలకు గాను డబ్బు రూపేణా అపరాధ రుసుము వసూలు చేయాలని బ్యాంకు నిర్ణయించింది” అని ఆర్.బి.ఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్.బి.ఐ కూడా జరిమానా ఎదుర్కోవడం విశేషం. ఎస్.బి.ఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లతో పాటు పశ్చిమ దేశాలకు చెందిన భారీ ఇన్వెస్ట్ మెంటు బ్యాంకులు కూడా జరిమానా చెల్లించనున్నాయి. ఇవన్నీ ఖాతాదారులు ఎవరో తెలుసుకోకుండానే డిపాజిట్లు స్వీకరించాయని ఆర్.బి.ఐ తెలిపింది.
ది హిందు పత్రిక ప్రకారం ఎస్.బి.ఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ.ఓ.బి, ఫెడరల్ బ్యాంకులకు తలా రు. 3 కోట్లు చెల్లించాలని ఆర్.బి.ఐ ఆదేశించింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మి విలాస్ బ్యాంక్, పి.ఎన్.బి, జమ్ము & కాశ్మీర్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ లు తలా 2.5 కోట్లు జరిమానా చెల్లించాలి. అలాగే యెస్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓ.బి.సి, ధనలక్ష్మి బ్యాంకులు తలా 2 కోట్లు, డ్యూశ్చ్ బ్యాంక్ (జర్మనీ), డి.సి.బి, ఐ.ఎన్.జి వైశ్య, కొటాక్ మహీంద్ర, రత్నాకర్ బ్యాంకులకు కూడా జరిమానా విధించబడింది.
ఇవి కాకుండా మరి కొన్ని బ్యాంకులకు ఆర్.బి.ఐ హెచ్చరికలు జారీ చేసింది. సిటీ బ్యాంక్ (అమెరికా), స్టాండర్డ్ చార్టర్డ్ (లండన్), బి.ఎన్.పి పరిబాస్ (ఫ్రాన్స్), బార్ క్లేస్ (లండన్), రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్ (స్కాట్లండ్), బ్యాంక్ ఆఫ్ టోక్యో మిత్సుబిషి (జపాన్) బ్యాంకులు ఆర్.బి.ఐ నుండి హెచ్చరికలు అందుకున్నాయి. ఇవన్నీ వివిధ సందర్భాల్లో వివిధ దేశాల్లో నల్ల డబ్బు చలామణి చేస్తున్నందుకు గాను వందల మిలియన్ల కొద్దీ డాలర్లను జరిమానా చెల్లించుకున్నవే కావడం గమనార్హం. అడ్డదిడ్డమైన ద్రవ్య పరికరాలు రూపొందించి తాము సృష్టించిన మాయలో తామే పడిపోయి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెత్తి మీదికి భారీ ఆర్ధిక సంక్షోభాన్ని తేవడంలో ఇవి కూడా భాగస్వామ్యం వహించాయి.
నల్లడబ్బు చలామణి విషయమై ఆర్.బి.ఐ ఇంకా ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. అలాగని నల్లడబ్బు చలామణి చేయడం లేదని పూర్తిగా సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఆర్.బి.ఐ సిద్ధంగా లేదు. కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ లో వాస్తవంగా డబ్బు డిపాజిట్ చేయడం జరగలేదు కాబట్టి ఆ మేరకు బ్యాంకులు బతికిపోయాయి. అయితే నల్ల డబ్బు చలామణికి తాము ఏయే మార్గాలు అందుబాటులో ఉంచామో బ్యాంకుల మేనేజర్లు, ఇతర అధికారులు రహస్య కెమెరా ముందు చెప్పినందున దాని ఆధారంగా దర్యాప్తు చేయాల్సి ఉన్నది. వివిధ పధకాల కింద జరిగిన డబ్బు మార్పిడిలను అటు చివరి నుండి ఇటు చివరి వరకూ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుందనీ, పన్ను మరియు ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీలు ఈ పని చేస్తాయని, అది జరిగాకే మనీ లాండరింగ్ పై చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుందని ఆర్.బి.ఐ స్పష్టం చేసింది.
బ్యాంకుల అక్రమ కార్యకలాపాల వల్ల సక్రమ డబ్బును కూడా కోల్పోయే ప్రమాదాన్ని డిపాజిట్ దారులు ఎదుర్కొంటారని ఇటీవలి సైప్రస్ ఉదాహరణ ద్వారా తెలుస్తున్నది. కాబట్టి డిపాజిట్ దారులే తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.