తెలంగాణ అంటే జనం కాదా? -కార్టూన్


Telangana cake

కాదన్నట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే. తెలంగాణ ఉద్యమం అంటే ప్రజలు, వారి ఆకాంక్షలు, వారి అవసరాలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే కాంగ్రెస్ దృష్టిలో 2014 ఎన్నికల్లో కురిసే ఓట్లు, సీట్లు మాత్రమే. ఆ మాటకొస్తే ఏ పార్టీకి మాత్రం కాదు? తెలంగాణ వాగ్దానం చేసిన బి.జె.పి కూడా 1999 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం సీట్ల కోసం దాన్ని పక్కన పెట్టింది. అవే సీట్ల కోసం రేపు తెలంగాణ ఇవ్వడానికి సోనియా సుముఖంగా ఉన్నట్లు వార్తా, విశ్లేషణలు చెబుతున్నాయి.

ది హిందు పత్రిక ప్రకారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలంగా తమ వాదనలు వినిపిస్తున్నపుడు ‘రాష్ట్రం సమైక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒనగూరే రాజకీయ ప్రయోజనం ఏమిటి?’ అని సోనియా గాంధీ అడిగారు. పత్రిక, ఓ కాంగ్రెస్ ఎం.పి ని ఉటంకిస్తూ ఈ సంగతి తెలిపింది. దానికి సమాధానంగా కిరణ్ కుమార్ రెడ్డి ‘ఖచ్చితంగా ఫలానా ప్రయోజనం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు’ అని బదులిచ్చారట.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన సమాధానం కొనసాగిస్తూ కోర్ కమిటీ తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర మరియు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనీ, కేవలం తెలంగాణ ప్రజల సెంటిమెంటును మాత్రమే దృష్టిలో పెట్టుకోరాదని కోరారట. దానికి సోనియా ‘అయితే ప్రజలు సిద్ధాంతాల ప్రాతిపదికనే ఓట్లు వేస్తున్నారా?’ అని స్వరం పెంచి అడిగారట.

కాంగ్రెస్ ఎం.పి చెప్పిందే నిజం అయితే జనం సిద్ధాంతం ప్రాతిపదికన ఓటు వేయడం లేదు కాబట్టి పార్టీలు కూడా సిద్ధాంతాలు పాటించనక్కర్లేదనీ సోనియా చెప్పదలిచారా?

సోనియా గాంధీ లేదా ఇతర నాయకులని జనం అనేక ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అసలు కాంగ్రెస్ గానీ, ఇతర రాజకీయ పార్టీలు గానీ తమ ప్రకటిత సిద్ధాంతాల ప్రకారమే పాలన సాగిస్తున్నాయా? ‘పేదవాడి గుడిసెనుండి మా పార్టీ పుట్టింది’ అని ప్రతి పార్టీ చెప్పుకోవడమే గానీ, ఆ గుడిసెల జనం గురించి ఏనాడన్నా పట్టించుకున్న పాపాన పోయారా?

‘సోషలిస్టిక్ పాట్రన్ ఆఫ్ సొసైటీ’ ని నిర్మిస్తామన్న నెహ్రూ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ఎందుకు వదులుకుంది? నెహ్రూవియన్ సిద్ధాంతాలను వదిలి మన్మోహనామిక్స్ గా చెప్పే నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేస్తోంది? దేశ సంపదను విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు సకల పార్టీల నేతలు ఎందుకు అప్పగిస్తున్నట్లు?

తెలంగాణ వరకు తీసుకున్నా ఏ సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా తెలంగాణ సమస్యను నాన్చుతూ ‘ఇదిగో, అదిగో’ అని సాగదీస్తోంది? నిన్నటికి నిన్న కోర్ కమిటీ లో ‘అటో, ఇటో తేల్చేస్తాం’ అన్న కాంగ్రెస్ మళ్ళీ సి.డబ్ల్యూ.సి మీదకి నెట్టేయడం ఏ నైతిక ప్రాతిపదికన జరిగింది?

తెలంగాణ ఉద్యమంలో సైతం ప్రజల ప్రయోజనాలకు కాకుండా ధనిక వర్గ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండడం కాదనలేని వాస్తవం. చెబుతున్నది ప్రజల ప్రయోజనాలే గానీ, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీల్లో మెజారిటీ శ్రామిక ప్రజల ప్రయోజనాలకు కాకుండా వారి శ్రమను దోపిడీ చేసే దోపిడీ వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నవే.

కార్టూన్ లో  చూపినట్లుగా ఆంధ్ర ప్రదేశ్ వనరులు అనే కేక్ మొత్తం తమకే కావాలని సమైక్యాంధ్ర వాదులు కోరుతుండగా, దానిలో తమ వాటా తమకు కావాలని తెలంగాణ ధనికులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే తమకు కేకూ కావాలి, దానిని తామే తినాలి అని కోరుతున్నారు. కాంగ్రెస్ అనగా ఆ పార్టీ ప్రాతినిధ్యం వహించే జాతీయ స్ధాయి దళారీ బూర్జువా-భూస్వామ్య-సామ్రాజ్యవాద వర్గాల కూటమి అని అర్ధం.

6 thoughts on “తెలంగాణ అంటే జనం కాదా? -కార్టూన్

 1. andaru dongale …telangana vachinaa danavanthullade rajyam avuthadhi … kabati telangana avasram ledu anaa mee voodeshyam kadua kada ?? … endhukante CPM pathrikaa ayeena HINDU antha kanna goppa cartoon veyaledu

 2. నెహ్రూ చెప్పిన సొషలిస్టు సిద్దాంతం సంస్కరణ వాదాన్నే సొషలిస్టుగా చెపుతున్నారు. అప్పటి ఉమ్మడి కమ్మునిస్టులొని రివిజినిస్టులు (ఇప్పటి సి.పి.ఐ పార్టీ గా ఆవిర్బవించింది)దిన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీతొ మిలాకత్ అవ్వాలని శాంతియుత సొషలిజం వస్తుందనీ ఒక తీర్మాణం చేశారు అయితే ఆతీర్మాణం నెగ్గలేదు. నెహ్రూ సొషలిజానికీ ఇప్పటి మన్మొహన్ ఆర్దిక సంస్కరణకూ సారాంశంలొ తేడా ఎమీలేదు. పేరులొనేతెడా. కాబటీ ఎందుకు అమలు పరచలేదు అనేదానికి అర్దం లేదు. కాదంటారా శెఖర్ గారూ.

 3. రామమోహన్ గారు

  నెహ్రూ చెప్పింది స్టేట్ కేపిటలిజం. మన్మోహన్ అండ్ కో అమలు చేస్తున్నది ప్రైవేట్ కేపిటలిజం లేదా మార్కెట్ ఎకానమీ. నిజానికి మార్కెట్ ఎకానమీ అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇది సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధకు అనుబంధంగా ఉండేదే తప్ప స్వతంత్ర ఉనికితో ఉండేది కాదు కాబట్టి. పెరిఫరల్ ఆఫ్ ద మార్కెట్ ఎకానమీ అంటే సరిపోతుందేమో.

  స్టేట్ కేపిటలిజానికి, మార్కెట్ ఎకానమీకీ తేడా ఉంది. ఆ తేడా పేరుకు మాత్రమే పరిమితం కాదు. ఆ తేడాయే లేకపోతే ప్రత్యేకంగా డంకెల్ ఒప్పందాన్ని రూపొందించి దేశంపై రుద్ది నూతన ఆర్ధిక విధానాలు అంటూ ప్రత్యేకంగా అమలు చేసే అవసరం సామ్రాజ్యవాదానికీ, మూడో ప్రపంచ దేశాల పాలకవర్గాలకు ఉండదు కదా.

  స్టేట్ కేపిటలిజంలో కార్మికవర్గానికి కాస్త వాటా దక్కుతుంది. ప్రభుత్వరంగ ఉద్యోగాలు, సహకార వ్యవస్ధలో అందే పరిమిత లాభాలు, కొద్ది మందికైనా ఒనగూరే ఉద్యోగ భద్రత, ప్రభుత్వాలపై ఉండే పరిమిత బాధ్యత… ఇవన్నీ ప్రజలకు కొంతమేరకు లబ్ది చేకూర్చుతాయి. (అందువలన ప్రభుత్వ రంగాన్ని కాపాడాలనే నినాదాన్ని ఇవ్వాల్సివస్తుంది.)

  రష్యా, చైనాల్లో అప్పతి సోషలిస్టు వ్యవస్ధల వలన పశ్చిమ దేశాలకు కూడా ఈ స్టేట్ కేపిటలిజాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది. కీన్స్ అనే ఆర్ధికవేత్త ఈ విధానాలకు రూపకర్త.

  తేడా కొద్దిగా ఉన్నా సరే, దాన్ని గుర్తించాలి. గుర్తించి దానికి అనుగుణంగా పోరాట నినాదాలు ఇవ్వడం కమ్యూనిస్టు పార్టీల పరిమిత కర్తవ్యంగా ఉంటుంది.

  అయితే, నెహ్రూ పరిమితులను గుర్తించకుండా సోషలిజం తెచ్చే బాధ్యతని ఆయనకు అప్పజెప్పడం సి.పి.ఐ యొక్క సైద్ధాంతిక, ఆచరణాత్మక తప్పిదం.

 4. విదేశీ అప్పుల కోసం దేశ కరెన్సీ విలువని తగ్గించే ఆర్థిక విధానాన్ని ప్రవేశ పెట్టింది నెహ్రూనే. 1947లో రూపాయి విలువ డాలర్ విలువతో సమానంగా ఉండేది. పంచ వర్ష ప్రణాళికలకి కావలసిన విదేశీ అప్పుల కోసం కరెన్సీ విలువని తగ్గించే విధానం ప్రవేశపెట్టాడు నెహ్రూ. మన్మోహన సింహుడు మరింత దిగజారి ఐటి కంపెనీల లాభాల కోసం కూడా కరెన్సీ విలువని తగ్గిస్తున్నాడు. అప్పు చేసి పప్పు కూడు విధానంలో మాత్రం నెహ్రూకీ, మన్మోహనునికీ మధ్య పెద్ద తేడా లేదు.

 5. ఏదైనా మనదేశం మొదటినుండి విదేశి ఆర్దిక విదానానికి అనుసందానిచబడిందే. అప్పటి విదేశి పెట్టు బడి వలన మనదేశ ఆర్దిక వనరులు- శ్రామిక వనరులతో పాటు, సహజ వనరులు అతి తక్కువ విలువకు, బ్రిటిష వలస పాలకులు వెల్లి పోయిన తర్వాత కూడా, ఎలా తరలించుక పోతున్నారో ఆర్దిక వేత్తలు, ఆ కొద్ది దానికే, విమర్శిస్తు ఉండేవారు, కాని ఇప్పుడు !? మొ త్తం దేశాన్నే మూట గట్టుక వెలుతున్నారు. విదేశ పెట్టు బడులు ఇంకా ఎక్కువ రావలంటున్నారు.
  పెట్టు బడి కల్పనకు, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టాలంటున్నారు. దీని ప్రభావం రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు తెచ్చాయి. అప్పుడు ప్రజాస్వామ్య భావం కూడా మెండుగా వుండెది. ఇప్పుడు పాసిజం జడలు ఇప్పుకొని నర్తిస్తున్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s