భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది.
మే 2, 2011 తేదీన పాకిస్ధాన్ లోని ఆబోత్తాబాద్ లోని ఒక ఇంటిపై అమెరికన్ నేవీ సీల్ హెలికాప్టర్లు దాడి చేసి ఒసామా బిన్ లాడెన్ ను హత్య చేశాయని అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడి గురించి పాక్ ప్రభుత్వానికి ముందుగానే తెలిపామని అమెరికా అధికారులు చెప్పినప్పటికీ అది నిజం కాదనీ, తమకు ముందుగా సమాచారం లేదని పాకిస్ధాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాక్ సరిహద్దులను ఉల్లంఘించి అమెరికా సైనికులు పాల్పడిన చర్య పట్ల పాక్ ప్రజలు దేశ వ్యాపితంగా నిరసనలు చేయడంతో దాడికి దారితీసిన పరిస్ధితులను విచారించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక సమర్పించడంతో ఆనాటి ఘటనలపై పాకిస్ధాన్ లో పోస్టుమార్టం జరుగుతోంది.
వాస్తవానికి కమిటీ నివేదిక రహస్యం. నివేదిక అంశాలు ప్రభుత్వానికి మాత్రమే పరిమితం. కానీ నివేదికలోని వివిధ అంశాలు లీక్ కావడంతో అవి రోజుకు ఒక్కొక్కటి చొప్పున పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. పాక్ ప్రభుత్వం కింది నుండి పై వరకూ అన్ని స్ధాయిల్లోనూ విఫలం అవడం వల్లనే లాడెన్ 9 సంవత్సరాల పాటు ఎవరికి తెలియకుండా పాక్ భూభాగంలో ఉండగలిగాడని నివేదిక పేర్కొన్నట్లుగా రెండు రోజుల క్రితం పత్రికలు తెలిపాయి. అంతే కాకుండా పాకిస్ధాన్ మిలట్రీ అవసరం కంటే ఎక్కువగా భారత్ సరిహద్దులపై కేంద్రీకరించడంతో పశ్చిమ సరిహద్దులో ఏం జరుగుతున్నదీ గ్రహించలేని పరిస్ధితిలో ఉండిపోయిందని నివేదిక అభిప్రాయపడినట్లు బుధవారం ది హిందు తెలిపింది.
పత్రిక ప్రకారం పాకిస్ధాన్ మిలట్రీకి భారత దేశమే ప్రధాన కేంద్రీకృత అంశంగా కొనసాగుతూ వచ్చిందని అబొత్తాబాద్ కమిషన్ అభిప్రాయపడింది. “పాక్ సరిహద్దులను అతిక్రమిస్తూ అమెరికా సైన్యం జరుపుతున్న దాడులు నానాటికీ పెరిగిపోవడం, స్పెషల్ ఆపరేషన్లు, పాక్ వ్యతిరేక అమెరికా గూఢచార నెట్ వర్క్ విస్తృతం కావడం… ఇవన్నీ ప్రమాదకర పరిస్ధితిని కల్పిస్తున్నప్పటికీ దానిని గ్రహించడంలో పాక్ మిలట్రీ విఫలం అయింది” అని కమిషన్ నివేదిక పేర్కొంది.
“ఇటీవల సంవత్సరాల్లో అమెరికా-పాకిస్ధాన్ సంబంధాల్లో ప్రతికూల పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ సరిహద్దును, గగనతలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, రక్షణ ప్రణాళికను కేవలం తూర్పు (ఇండియాతో) సరిహద్దు వరకే పరిమితం చేయడానికి తగిన భూమిక లేదు,” అని నివేదిక పేర్కొంది. అమెరికాతో సంబంధాల్లో ఉద్రిక్తతలు ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు ఆఫ్ఘనిస్ధాన్ తో విభేదాలు పెరుగుతూ వచ్చాయనీ, అదే సమయంలో ఆఫ్ఘన్-ఇండియాల మధ్యా, ఇండియా-అమెరికాల మధ్యా వ్యూహాత్మక సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందాయని నివేదిక ఎత్తిచూపింది.
“పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన అమెరికా బెదిరింపు విధానాలకూ, అంతకంతకూ గతిశీలంగా మారుతున్న అమెరికా జోజ్యందారీ విధానాలకూ పశ్చిమ సరిహద్దులను పూర్తిగా వదిలిపెట్టడానికి బదులుగా ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది” అని నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రచ్చన్న యుద్ధం పొడుగునా పాకిస్ధాన్ అమెరికాతో అంటకాగింది. అమెరికా విధిలించే సహాయం కోసం దేశ ఆర్ధిక వ్యవస్ధను అమెరికా కంపెనీలకు దాసోహం కావించింది. సి.ఐ.ఏకు అనుబంధ సంస్ధగా ఐ.ఎస్.ఐను అభివృద్ధి చేసి టెర్రరిస్టు సంస్ధలను పెంచి పోషించింది. ఇన్ని చేసినప్పటికీ అమెరికాకు ఇప్పుడు పాకిస్ధాన్ చేదైపోయిందని అబొత్తాబాద్ కమిషన్ నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది.
నిజమేనా?
అయితే అమెరికాకు పాకిస్ధాన్ నిజంగానే చేదయిందా అన్నది తర్కించుకోవాల్సిన అంశం. తమ ప్రపంచ మిలట్రీ వ్యూహాన్ని ఆసియా కేంద్రకంగా (Asia pivot) మార్చుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించినప్పటి నుండే అమెరికా-పాక్ ల మధ్య దూరం పెరుగుతూ, అమెరికా-ఇండియాల మధ్య దూరం తరుగుతొందని వార్తా విశ్లేషణలు సాగుతున్నాయి. పాక్ తో సంబంధాలను పలచన చేసుకునే వ్యూహంలో భాగంగా ఆ దేశంతో అమెరికా పైకి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ రావడం ఒక వాస్తవం.
ఆఫ్ఘన్ తాలిబాన్ కు పాక్ పాలకులు మద్దతు ఇస్తున్నారనీ, పాక్ తాలిబాన్ (హకాని నెట్ వర్క్) ను వారు పెంచి పోషిస్తున్నారనీ, ఆఫ్ఘన్ సరిహద్దులోని పాక్ భూభాగంలో టెర్రరిస్టులకు రక్షణ ఇస్తున్నారనీ రెండేళ్లుగా అమెరికా ఆరోపణల స్వరం పెంచుతూ వచ్చింది. టెర్రరిస్టులపై దాడి పేరుతో ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో పలువురు పాక్ సైనికులను కూడా అమెరికా సైనికులు కాల్చి చంపిన ఘటనలు జరిగాయి. రాజకీయ రంగంలో అమెరికా-పాక్ దేశాల మంత్రులు, అధికారులు పలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ప్రకటనల యుద్ధం సాగించారు. ఇవన్నీ అమెరికా-పాకిస్ధాన్ ల మధ్య దూరం పెరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రా కలిగించాయి.
కానీ ఇదంతా ప్రచారం కోసమేనని, భారత ప్రజలకు మానసికంగా దగ్గరకావడానికేనని పలువురు విశ్లేషకులు వివిధ సందర్భాల్లో తెలిపారు. ఒబామా ప్రకటించిన ఆసియా-పివోట్ వ్యూహంలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా ఇండియాను భాగస్వామిగా చేసుకోవడానికి అమెరికా ఎత్తుగడ వేసిందనీ, దానిలో భాగంగా భారత ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పరచుకోడానికి వీలుగా పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా అలంకార ప్రాయమైన (rhetoric) వ్యతిరేకతను ప్రచారంలో పెడుతోందని వారు విశ్లేషించారు.
భారత ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న పాకిస్ధాన్ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అనే సూత్రాన్ని అమలు చేస్తోందని, తద్వారా తాను సాగించబోయే చైనా వ్యతిరేక ప్రచార-ప్రచ్ఛన్న యుద్ధాలకు భారత ప్రజల మద్దతును సమీకరించాలని అమెరికా తలపోసిందని వారు విశ్లేషించారు. ఈ విశ్లేషణ ప్రకారం చూసినపుడు అబొత్తాబాద్ కమిషన్ నివేదిక అందులో భాగమే అనిపించక మానదు. అయితే ఈ విశ్లేషణను పూర్తిగా నలుపు-తెలుపు తరహాలో ఉన్నది ఉన్నట్లుగా చూడడానికి వీలు లేదు. దీనిని స్ధూలంగా అవగాహనలోకి తీసుకుంటూనే పాక్-అమెరికా పాలక వర్గాల మధ్య తలెత్తిన వివిధ వైరుధ్యాలను పరిష్కారం చేసుకునే ప్రక్రియలో భాగంగా కూడా చూడవలసి ఉంటుంది.
లాడెన్ మృతికి సాక్ష్యాలు లేవు
ఇంతకీ ఆరోజు అబ్బోత్తాబాద్ ఇంటిపై జరిగిన దాడిలో ఒసామాని చంపేశామని ఒబామా చెప్పుకోవడమే తప్ప అందుకు సాక్ష్యాలను ఇప్పటికీ అమెరికా వెల్లడి చేయలేదు. కనీసం ఆయన మృత దేహాన్ని ఎక్కడ పూడ్చింది కూడా అమెరికా చెప్పలేదు. ఒసామా మృతి ఫోటోలను బహిర్గతం చేస్తే అది జాతీయ భద్రతకు ముప్పు అని కొందరు అమెరికా అధికారులు చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదు. ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ తన మరణానంతరం పూజలు అందుకున్నట్లే ఒసామా సమాధి కూడా పూజలు అందుకుంటుందన్న భయంతోనే ఆయనని పూడ్చిన స్ధలం చెప్పలేదని మరికొందరు అధికారులు చెప్పారు. ఇవేవీ కాదు, ఒసామా శవాన్ని సముద్రంలో పారేశామని చెప్పినవారూ ఉన్నారు.
అయితే అధ్యక్షుడు ఒబామా మాత్రం ఒసామా మృతి తాలూకు ఫోటోలు భయంకరంగా ఉన్నాయనీ అందుకే విడుదల చేయలేదనీ చెప్పారు. కానీ ఒసామా కాకుండా అబ్బోత్తాబాద్ కాంపౌండ్ లో అమెరికా సైనికుల చేతుల్లో చనిపోయిన ముగ్గురు ఇతరుల ఫోటోలను మాత్రం విడుదల చేశారు. ఈ ఫోటోలు పరమ భయంకరంగా ఉన్నాయి. ఇంతకంటే భయంకరంగా ఒక వ్యక్తిని చంపడం కుదరదు అన్నంత భయంకరంగా ఉన్నాయని కింది ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఇంత భయంకరమైన ఫోటోలనే విడుదల చేసినప్పుడు లాడెన్ మృతి తాలూకు ఫోటోలను ఎందుకు విడుదల చేయలేదు అన్నది శేష ప్రశ్నగా మిగిలిపోయింది.
- అబ్బొత్తాబాద్ ఇంట్లో లాడేన్ అంటూ అమెరికా విడుదల చేసిన వీడియో గ్రాబ్ ఇది
- దాడి చేసిన రెండు హెలికాప్టర్లలో ఒకటి అక్కడె కూలిపోయిందట. అదే ఇది
- కూలిపోయిన నేవీ సీల్ హెలికాప్టర్
- లాడెన్ ఇల్లు
- లాడేన్ ఈ బెడ్ పైనే పడుకున్నాడట. ఇన్ని ఫొటోలు ఇచ్చినా లాడెన్ చనిపోయిన ఫొటో ఇవ్వకపోవడమే విచిత్రం!
ఇలాంటి శేష ప్రశ్నలు అనేకం లాడెన్ మృతి విషయంలో తలెత్తాయి. వీటిల్లో వేటికీ సమాధానం ఇవ్వడానికి అమెరికా ఆసక్తి చూపలేదు. లాడెన్ మృతితో పాటు 9/11 దాడుల విషయంలో కూడా అనేక ఇబ్బందికరమైన శేష ప్రశ్నలు ఉన్నాయి. ఆ దాడులను అమెరికా పాలకవర్గాల్లోని ఒక సెక్షన్ చేయించిందని ఆరోపిస్తూ అనేకమంది నిపుణులు ససాక్ష్యాలతో విశ్లేషణలు ప్రచురించారు. పుస్తకాలు కూడా ప్రచురితం అయ్యాయి. వివిధ వెబ్ సైట్లు కూడా నిర్వహించబడుతున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లపై దాడుల కోసమే 9/11 దాడి జరిగిందనీ, అమెరికా ప్రజలను భయపెట్టే శత్రువు లేని పరిస్ధితుల్లో ‘టెర్రరిజం’ అనే కొత్త శక్తివంతమైన శత్రువును సృష్టించుకునే కార్యక్రమంలో ఈ దాడి ఒక భాగమనీ ఇవన్నీ వివరిస్తున్నాయి.
కాబట్టి భారత ప్రజలు అమెరికా అనుకూల సెంటిమెంట్లకు లోనూ కాకుండా అప్రమత్తతో ఉండాల్సిన అగత్యం ముంచుకువస్తోంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం వహించిన ఏ దేశమూ బాగుపడిన చరిత్ర లేదు. పొరుగునే ఉన్న పాకిస్ధాన్ అందుకు ప్రబల ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త!
ఈ లాంటి తెరవెనుక నాటకాలు ప్రజలకు తెలియక పోవటం వల్లనే అందరు ప్రజలు ప్రజలు అని నాటకాలు ఆడేది.
అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం వహించిన ఏ దేశమూ బాగుపడిన చరిత్ర లేదు. mari evarito unte baagupadataaru
mee vishelashenaa balance thappu thundhi emo ani pisthundhi …. entha america chedda desham ayeena …. hethuvu ku andhanni karanala nu chupi america ne WTO towers dadi cheyinchu kundhi ante baledu ..
అమెరికా తన స్వార్థప్రయొజనల కొసం ఎంతకైనా తెగిస్తుంది. ఈ విషయాన్ని మన పాలకులు ఎప్పతికి తెలుసుకుంతారొ!
చందుగారు
‘హేతువుకు అందని కారణాలు’ అని మొదట అనిపిస్తుంది. కాని లోతుగా అధ్యయనం చేసేకొద్దీ అమెరికా చర్యలకు హేతువుని అర్ధం చేసుకోగలం.
నిజానికి అమెరికా ఇలాంటి చర్యలను గతంలో ఎన్నో చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న దశలో జపాన్ అన్ని ఫ్రంట్ లలో ఓడిపోయి లొంగిపోతున్న దశలో రెండు చోట్ల అణుబాంబులు వేసి అధికారిక లెక్కల ప్రకారమే రెండు లక్షల మందిని చంపేసింది. కొరియా యుద్ధంలో లక్షలాదిమందిని వైమానిక దాడులతో చంపేసి దక్షిణ కొరియాలో నియంతలను ప్రతిష్టించి కాపాడిన చరిత్ర అమెరికాది. అనేక చిన్న దేశాలు మాట వినకపోతే ఏకంగా అధ్యక్ష భవనాలపైనే బాంబులు కురిపించి చంపిన చరిత్ర అమెరికాదే. పచ్చి అబద్ధాలు చెప్పి ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలను చేసిందీ, చేస్తున్నదీ అమెరికాయే.
ఇన్ని చేసిన అమెరికాకు డబ్ల్యు.టి.ఒ టవర్స్ ను కూల్చుకోవడం పెద్ద విషయం కాదు. అమెరికాకు సంబంధించి ఇంకా నమ్మలేని నిజాలు చాలానే ఉన్నాయి. అవి నేను కనిపెట్టినవి కాదు. అమెరికన్లే పరిశోధించి వెల్లడి చేసినవి. వాటిల్లో మనకు చాలా తెలియవు. అంతే. అమెరికా ప్రవర్తనను అర్ధం చేసుకోవాలంటే వ్యవస్ధల పరిణామక్రమం, వ్యవస్ధల్లో వివిధ వర్గాల పొందికలు ఇవన్నీ అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.నేను రాసిన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని విషయాల కోసం చూస్తే భవిష్యత్తులో ఇంకొంత బోధపడే అవకాశం ఉంటుంది.