(బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నాడన్న అనుమానంతో అమెరికా పనుపున ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అనుమతి నిరాకరించి, ఆస్ట్రియాలో బలవంతంగా కిందకి దించిన ఉదంతం గురించి ది హిందు పత్రిక బుధవారం -జులై 10- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం -విశేఖర్)
“తన ఇష్టం లేకుండా ఒక పావుగా ఉండవలసిన అవసరం గానీ, అందుకు తగిన కారణం గానీ లాటిన్ అమెరికాకు లేదు,” 1982లో సాహిత్యానికి నోబెల్ పురస్కారం స్వీకరిస్తూ కొలంబియన్ రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ అన్న మాటలివి. తమ స్వాతంత్ర్య స్ఫూర్తికి తగినట్లుగానే అంతర్జాతీయ సమాజంలో అండర్ డాగ్స్ పరిగణించబడే (లాటిన్ అమెరికా) దేశాలు మరోసారి తమ కర్తవ్య దీక్షను చాటుకున్నాయి, ఈసారి స్నోడెన్ కోసం!
ఎడ్వర్డ్ స్నోడెన్ అనే పలాయనుడి కోసం అమెరికా సాగిస్తున్న వేటకు సాయం చేయడానికో లేదా అమెరికాను మెప్పించడానికో ఇండియాతో సహా, పలు శక్తివంతమైన దేశాలు తమను తాము ఒడలు మరిచి సాష్టాంగ ప్రమాణ సమానంగా సమర్పించుకోగా మూడు లాటిన్ అమెరికా దేశాలు అత్యంత సాహసోపేతంగా ‘ఎడ్వర్డ్ స్నోడెన్ ద విజిల్ బ్లోయర్’ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాయి.
గత వారం ఐరోపాలో బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ కు అనూహ్య రీతిలో ఎదురైన అనాదరణ, దుర్వర్తనలకు స్పందనగా బొలీవియా, నికరాగువా, వెనిజులా దేశాలు చేతులు చాచి స్నోడెన్ ను ఆహ్వానిస్తున్నాయనడంలో సందేహం లేదు. మాస్కో నుండి లా పాజ్ కు తిరుగు ప్రయాణంలో ఉన్న ఆయన విమానం, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో బలవంతంగా ఆస్ట్రియాలో దిగవలసి వచ్చింది. స్నోడెన్ ఆయన విమానంలో ఉన్నాడన్న తప్పుడు నమ్మకం వలన ఇలా జరిగింది.
అనేక గంటలపాటు మొరేల్స్ వియన్నా విమానాశ్రయంలో చిక్కుకుపోవలసివచ్చింది. తాము మొరేల్స్ విమానాన్ని అధికారికంగా తనిఖీ చేయలేదని చెబుతున్న వియన్నా అధికారులు విమానంలో ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రయాణికుడుగా లేడని మాత్రం ధృవీకరించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం రాజకీయ ఆశ్రయం పొందడానికి స్నోడెన్ కి హక్కు ఉన్నది. ఐరోపా చర్యలు ఈ హక్కు పట్ల అత్యంత మొరటుగా వ్యవహరించాయి. అంతే కాదు, ఒక దేశ అధ్యక్షుడుగా మొరేల్స్ అనుభవించే దోషరాహిత్య (immunity) హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే ఇది.
బొలీవియా అధ్యక్షుడికి తమ గగనతలాన్ని మూసివేసిన దేశాలు, స్నోడెన్ ఆనుపానులపై అమెరికా అందించిన సమాచారం -ఆదేశాలు అని చదువుకోవాలి- ఆధారంగా అలా చేశాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం యూరోపియన్ల పరికిపంద ప్రవర్తనను, కర్ర పెత్తనాన్నీ బట్టబయలు చేయగా, లాటిన్ అమెరికా నుండి ఉద్భవించిన ‘రాజకీయ ఆశ్రయ ప్రదానం’ అనేది ప్రపంచ యవనికపై వాషింగ్టన్ పెత్తనం ఇక ఎంతమాత్రం చెల్లుబాటు కాదని స్పష్టం చేస్తోంది.
ఆ మూడు దేశాలను అమెరికాతో బదులు తీర్చుకోవడానికి ముందుకు ఉరికిన ‘వామపక్ష ప్రభుత్వాలు’ గా కొట్టిపారేసేవారు, ఈ ప్రాంతంలోని ఇతర ప్రభుత్వాలు కూడా ఆ దేశాలకు మద్దతు ప్రకటించిన వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. దక్షిణ అమెరికా ఖండానికి విశాల ప్రాతిపదికన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘దక్షిణ అమెరికా దేశాల యూనియన్’ (UNASUR), అధ్యక్షుడు మొరేల్స్ పట్ల ఐరోపా చర్యను ఎటువంటి శషభిషలు లేకుండా ఖండించాయి.
లాటిన్ అమెరికా దేశాల సార్వభౌమాధికార హక్కులను అసమంజసంగా పరిగణించడం యూరోపియన్ శక్తులకు ఇది కొత్త కాదు. గత సంవత్సరం ఈక్వడార్ లో రాజకీయ ఆశ్రయం కోరిన వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ ఆసాంజేను అరెస్టు చేయడానికి లండన్ లోని ఈక్వడార్ ఎంబసీ పైకి దాడి చేస్తామని యు.కె బెదిరించింది. సదరు బెదిరింపును లక్ష్యపెట్టకపోగా ఈక్వడార్ ఆసాంజేకు రాజకీయ ఆశ్రయాన్ని మంజూరు చేసింది. స్నోడెన్ విషయంలో చరిత్ర మరొక్కసారి పునరావృతం అయింది, అంతే; మందబలాన్ని మొరటుగా ప్రదర్శించుకోవడం ద్వారా అంతర్జాతీయ రాజకీయాలను ఆడించలేనని పశ్చిమ దేశాలు గ్రహించనంతకాలం చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటుంది.
visekhar garu ee varthanu mee website lo post cheyagalaru.
http://www.cubadebate.cu/noticias/2013/07/10/el-espionaje-made-in-usa-data-de-1862/