స్నోడెన్: బొలీవియాకు సారీ చెప్పడానికి రెడీ -స్పెయిన్


UNASUR సమావేశాల సందర్భంగా వెనిజులా (మదురో), బొలీవియా (మొరేల్స్), కొరియా (ఈక్వడార్) దేశాల అధ్యక్షులు

UNASUR సమావేశాల సందర్భంగా వెనిజులా (మదురో), బొలీవియా (మొరేల్స్), కొరియా (ఈక్వడార్) దేశాల అధ్యక్షులు

బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న జెట్ విమానానికి తమ గగనతలంలోకి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించినందుకు సారీ చెప్పడానికి స్పెయిన్ సిద్ధపడింది. తాము తప్పు చేయలేదని కాబట్టి బొలీవియాకు ఆపాలజీ చెప్పాల్సిన అవసరం లేదని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన స్పెయిన్ ఇంతలోనే తమ అవగాహన మార్చుకోవడం విశేషం. అయితే ఇవా మొరేల్స్ విమానానికి అనుమతి నిరాకరించామని చెప్పడంలో నిజం లేదని స్పెయిన్ విదేశాంగ మంత్రి ఇప్పటికీ చెబుతున్నారు. సంఘటనలో అపార్ధం దొర్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల దానికి ఆపాలజీ చెప్పడానికి తాము సిద్ధమేనని స్పెయిన్ విదేశీ మంత్రి స్పష్టం చేశారని ది హిందు, బ్యూనోస్ ఎయిర్ టైమ్స్ (అర్జెంటీనా పత్రిక), సి.బి.ఎస్ న్యూస్ తదితర పత్రికలు తెలిపాయి.

ది హిందు పత్రిక ప్రకారం గత వారం బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానం విషయంలో జరిగిన సంఘటనకు గాను ఆపాలజీ చెప్పడానికి స్పెయిన్ ప్రభుత్వం సిద్ధపడింది. మాస్కోలో గ్యాస్ ఉత్పత్తి దేశాల సమావేశంలో పాల్గొని బొలీవియాకు తిరిగి వస్తుండగా ఇవా మొరేల్స్ విమానానికి నాలుగు యూరోపియన్ దేశాలు తమ దేశాలపై ఎగరడానికి అనుమతి నిరాకరించాయి. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు మొరేల్స్ విమానానికి అనుమతి రద్దు చేయడంతో అది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది.

మొరేల్స్ విమానంలో స్నోడెన్ ప్రయాణిస్తున్నాడని తమకు సి.ఐ.ఏ సమాచారం ఇచ్చిందని, అందువల్లనే ఆయన విమానానికి అనుమతి నిరాకరించాల్సి వచ్చిందని ఆ తర్వాత ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ఆస్ట్రియా అధికారులు కూడా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. తమ విమానాన్ని తనిఖీ చేయడానికి ఆస్ట్రియా పోలీసులకు అనుమతి నిరాకరించిన మొరేల్స్ చర్చల అనంతరం అనుమతి ఇచ్చారు. అయితే దాదాపు 12 గంటల సేపు వియన్నా విమానాశ్రయంలో ఉన్నప్పటికీ పోలీసులు స్నోడెన్ ఆచూకిని సదరు విమానంలో కనిపెట్టలేకపోయారు. మొరేల్స్ విమానంలో ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నారనడం ఒట్టి పుకారేనని ఆస్ట్రియా విదేశీ మంత్రి ప్రకటించారు. దానితో తమ తమ గగనతలాల్లో అనుమతి నిరాకరించిన నాలుగు దేశాలు ఇరకాటంలో పడ్డాయి. ఒక దేశాధ్యక్షుడి విమానాన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అడ్డుకోవడం పలు విమర్శలకు దారి తీసింది.

అన్నివైపుల నుండి విమర్శలు రావడంతో ఫ్రాన్స్ అధికారులు దాదాపు ఆపాలజీ చెప్పినంత పని చేశారు. కానీ ఫ్రాన్స్ అధికారుల విచారాన్ని బొలీవియా ప్రభుత్వం నిరాకరించింది. నామమాత్ర విచారంతో సరిపెట్టుకోడానికి వీలు లేదనీ, ఇదే పరిస్ధితి పశ్చిమ రాజ్యాలకు ఎదురైతే ప్రపంచ వ్యాపితంగా ఎంత గగ్గోలు పుట్టేదో ఊహించవచ్చనీ, పశ్చిమ పత్రికలు సైతం ఎంత విషం కక్కుతాయో అందరికీ తెలిసిన విషయమేననీ లాటిన్ అమెరికా దేశాలు వ్యాఖ్యానించాయి. దక్షిణ అమెరికా దేశాల కూటమి UNASUR అత్యవసరంగా జులై 5 తేదీన సమావేశమై బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ కు సంఘీభావం ప్రకటించాయి. ఐరాసలో బొలీవియా చేసిన ఫిర్యాదుకు మద్దతు ప్రకటించాయి.

ఈ నేపధ్యంలో స్పెయిన్ తన ప్రకటిత అవగాహనను మార్చుకుంది. తామసలు మొరేల్స్ విమానానికి అనుమతి నిరాకరించడం జరగలేదని చెబుతూనే చిన్న అపార్ధం చోటు చేసుకున్నందున ఆపాలజీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని స్పెయిన్ విదేశీ మంత్రి జోస్ మాన్యుయెల్ గార్సియా-మార్గల్లో మంగళవారం ప్రకటించారు. “ఏమన్నా అపార్ధం చోటు చేసుకుంటే, (బొలీవియా) అధ్యక్షుడికి ఆపాలజీ చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు” అని గార్షియా ప్రకటించారని ది హిందు తెలిపింది.

వాస్తవంగా స్పెయిన్ కి చెందిన కేనరీ ద్వీపకల్పంలో తిరిగి ఇంధనం నింపుకోడానికి తాము మొరేల్స్ కు అనుమతి ఇచ్చామని కానీ ఆ విమానానికి ఇచ్చిన అనుమతి గడువు ముగిసిపోవడంతో తిరిగి అనుమతి ఇవ్వాల్సి వచ్చిందనీ గార్షియా చెబుతున్నారు. అయితే ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాల మంత్రులు, అధికారులతో పాటు వివిధ పత్రికలు చేసిన ప్రకటనలు, విశ్లేషణలు ఈ వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. గడువు ముగిసిందని స్పెయిన్ అనుమతి నిరాకరిస్తే మరి పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ ప్రభుత్వాలు ఎందుకు అనుమతి నిరాకరించినట్లు? స్నోడెన్ విమానంలో ఉన్నారనడం ఒట్టి పుకారని ఆస్ట్రియా మంత్రి ఎందుకు అన్నట్లు? తమకు తప్పుడు సమాచారం అందిందని ఫ్రాన్స్ ఎందుకు ప్రకటించినట్లు? మొరేల్స్ విమానాన్ని ఆస్ట్రియా పోలీసులు ఎందుకు తనిఖీ చేసినట్లు?

బొలీవియా ప్రభుత్వం ఈ నాలుగు దేశాల రాయబారులను పిలిపించి తమ అధ్యక్షుడి పట్ల వ్యవహరించిన తీరుకు వివరణ కోరిన తర్వాతనే స్పెయిన్ ఆపాలజీ చెప్పడానికి ముందుకు రావడం గమనార్హం.

స్నోడెన్ కు ఆశ్రయానికి వెనిజులా సిద్ధం

ఇదిలా ఉండగా అమెరికా ప్రపంచ పోలీసు నిర్వాకాన్ని మరోసారి లోకానికి వెల్లడి చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి దక్షిణ అమెరికా దేశాలు ముందుకు వచ్చాయి. UNASUR కూటమి సమావేశాల నుండి తమ స్వదేశాలకు తిరిగి చేరుకున్న అనంతరం దక్షిణ అమెరికా దేశాలు స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడానికి సంసిద్ధత తెలిపాయి. వెనిజులా, బొలీవియాలతో పాటు మధ్య అమెరికా దేశం నికరాగువా కూడా స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రష్యాలోనే ప్రకటించిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తమ సంసిద్ధతను మరోసారి ధ్రువపరిచారు. బొలీవియా కూడా స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ‘పరిస్ధితులు అనుకూలిస్తే’ ఆశ్రయం ఇవ్వడానికి తామూ సిద్ధమని నికరాగువా అధ్యక్షుడు సైతం గత శనివారం ప్రకటించారు. ఈ మూడు దేశాలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిరస్కరించే దేశాలు కావడం గమనార్హం. కాగా వెనిజులా నిర్ణయానికి అర్జెంటీనా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది.

One thought on “స్నోడెన్: బొలీవియాకు సారీ చెప్పడానికి రెడీ -స్పెయిన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s