అమెరికాలో ప్రయాణికుల విమానం క్రాష్ ల్యాండింగ్ -ఫోటోలు


సౌత్ కొరియాకు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి అమెరికాలోని శాన్ ఫ్రాన్ సిస్కో నగర విమానాశ్రయంలో దిగుతుండగా అదుపు తప్పి కూలిపోయింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా 181 మంది వరకూ గాయపడ్డారు. గాయపడ్డివారిలో కనీసం 50 మంది పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదుపు తప్పి కూలుతుండగా విమానానికి మంటలు అంటుకోవడంతో పలువురు ప్రయాణీకులకు కాలిన గాయాలు అయ్యాయి. ‘ఏసియానా ఎయిర్ లైన్స్’ రవాణా కంపెనీకి చెందిన బోయింగ్ 777 విమానం పైలట్లు అనుభవం కలిగినవారనీ, యాంత్రిక లోపం కూడా ఏదీ లేదనీ కంపెనీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా స్పష్టం కాలేదని తెలుస్తోంది.

“ఈ విమానాన్ని మేము మార్చి 2006లో కొనుగోలు చేశాము. ప్రస్తుతానికి ఇంజన్ లోపం గానీ, యాంత్రిక సమస్యలు గానీ ఏమీ లేవని మాత్రం చెప్పగలం” అని కంపెనీ సి.ఇ.ఓ యూన్ యాంగ్-దూ తెలిపాడని రష్యా టుడే పత్రిక తెలిపింది. 300కి పైగా ప్రయాణీకులు ఉన్న విమానం దిగుతుండగా రన్ వే ను ఢీకొట్టడంతో మంటలు అంటుకున్నాయని ది హిందు తెలిపింది. విమానం కిందికి దిగుతుండగా అటూ ఇటూ ప్రమాదకరంగా ఒరగడం గమనించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక దశలో విమానం తోక భాగం నేలకు రాసుకోవడంతో అది పూర్తిగా ఊడిపోయింది.

విమానం నుండి మంటలు బైటికి రావడం జరిగేసరికి పై భాగం మొత్తం కాలిపోయిందని తోక ఊడిపోయిందని, విమానం భాగాలు రన్ వే ప్రారంభంలో చెల్లాచెదురుగా పడిపోయాయని పత్రికలు తెలిపాయి. ఒక ఇంజన్ పగిలిపోయిందని తెలుస్తోంది. మండుతున్న విమానంలో నుండి ప్రయాణీకులు తప్పించుకోగలగడమే ఒక అద్భుతమని కొందరు వ్యాఖ్యానిస్తున్నాయి. విమానం ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన అనేకమంది ట్విట్టర్ లాంటి వెబ్ సైట్లలో సదరు దృశ్యాలను ప్రచురించారు. అమెరికా ఫెడరల్ పోలీసు సంస్ధ ఎఫ్.బి.ఐ, టెర్రరిస్టు కోణాన్ని కొట్టిపారేసింది.

విమానం కిందికి దిగుతున్నపుడు పైలట్ నుండి గానీ, ఇతర సిబ్బంది నుండి గానీ ముందస్తు హెచ్చరికలు రాలేదని ప్రమాదం నుండి బైటపడిన ప్రయాణీకుడు వేద్ పాల్ సింగ్ చెప్పారని ది హిందు (వయా ఎపి) తెలిపింది. విమానం మధ్య భాగంలో కూర్చున్న వేద్ పాల్ సింగ్ కుటుంబం కూడా ప్రమాదం నుండి బైటపడినట్లు తెలుస్తోంది. అయితే వేద్ పాల్ సింగ్ కాలర్ బోన్ చిట్లిపోయింది. “ఏదో ఘోరమైన తప్పు జరిగిందని మాకు అర్ధం అయింది. భారీ శబ్దం వచ్చింది. మేము బతికి ఉండడం అద్భుతమే” అని ఆయన తెలిపారు. జనం తమకు తోచిన పద్ధతిలో బైటపడడానికి ప్రయత్నించక ముందు విమానం శబ్దం లేకుండా అయిపోయిందని మొత్తం ఘటన 10 సెకన్లలో పూర్తయిందని తేజ్ పాల్ సింగ్ 15 యేళ్ళ కుమారుడు తెలిపాడు.

విమానం అవసరం అయినదానికంటే బాగా కిందకు రావడం వలన సముద్రం ఒడ్డునే ఉన్న గోడకు విమానం లోని ఏదో ఒక భాగం రాసుకుని ప్రమాదం జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సముద్రం ఒడ్డున ఉన్న అమెరికాలోని అనేక విమానాశ్రయాల్లో విమానాలు సముద్రంలోకి దూసుకుపోకుండా ఉండడానికి గోడలు నిర్మించారు. ఇలాంటి గోడను విమానం భాగం ఒకటి ఢీ కోట్టి ఉండవచ్చని తెలుస్తోంది. బహుశా ల్యాండింగ్ గేర్ (చక్రాలు) ముందుగానే కిందికి రావడం వల్ల గోడను తాకి ఉండొచ్చని భావిస్తున్నారు.

విమానం షాంఘై నుండి బయలుదేరి సియోల్ లో ఒక సారి ఆగి అనంతరం శాన్ ఫ్రాన్ సిస్కో వచ్చింది. విమానంలో 16 మంది సిబ్బంది, 291 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 77 మంది దక్షిణ కొరియా దేశస్ధులు, 141 మంది చైనీయులు కాగా 61 మంది అమెరికన్లు. ఒక జపనీయుడు కూడా ఉన్నారు. మిగిలినవారి జాతీయత తెలియలేదు. విమానాశ్రయ ప్రతినిధి ప్రకారం 49 మంది పరిస్ధితి తీవ్రంగా ఉండగా 132 మందికి తక్కువ తీవ్రతతో కూడిన గాయాలయ్యాయి.

One thought on “అమెరికాలో ప్రయాణికుల విమానం క్రాష్ ల్యాండింగ్ -ఫోటోలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s