ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్


ది హిందు నుండి

ది హిందు నుండి

ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ప్రపంచంలో ఎన్ని నియంతృత్వాలు పని చేయగలవో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓట్ల కోసం మద్యం, డబ్బు, బంగారం దగ్గర్నుండి క్రికెట్ కిట్ల వరకూ పంచి పెట్టినా అది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసే మిలట్రీ అధికారులు కూడా ‘ప్రజాస్వామ్యం కోసమే కుట్ర చేశాం’ అని చెబుతారు. అదే నోటితో ‘త్వరలోనే ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వానికి అధికారం అప్పజెబుతాం’ అని కూడా చెబుతారు. చివరికి హిట్లర్ కూడా తనది ప్రజాస్వామ్య పాలనే అని చెప్పుకున్నాడు.

ఈజిప్టులో మహమ్మద్ మోర్శి నేతృత్వంలోని ‘ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ’ (దీనికి ముస్లిం బ్రదర్ హుడ్ మాతృ సంస్ధ) రెండేళ్ల క్రితం ఎన్నికల్లో అధికారం సంపాదించింది. ఈజిప్టులో మొట్ట మొదటి ప్రజాస్వామిక ఎన్నికలుగానూ, చారిత్రక ఎన్నికలు గానూ పశ్చిమ పత్రికలు సదరు ఎన్నికలను కీర్తించాయి. అమెరికా, ఐరోపాలతో పాటు ఇండియా తదితర దేశాలు కూడా మోర్శి ప్రజా ప్రభుత్వాన్ని స్వాగతించాయి.

ఇప్పుడే అదే ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మళ్ళీ పెద్ద ఎత్తున తిరగబడ్డారు. బి.బి.సి ప్రకారం చరిత్రలోనే ఇంత పెద్ద ప్రజా కదలిక మరే దేశం లోనూ జరగలేదు. మాజీ నియంత హోస్నీ ముబారక్ పాలనకు వ్యతిరేకంగా ఈజిప్టులో చెలరేగిన ‘అరబ్ వసంతం’లో కూడా ఇంతగా ప్రజలు కద్దల్లేదట. అది నిజం కావచ్చు కూడా. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రజలే ఎందుకు తిరగబడినట్లు? పశ్చిమ పత్రికలు ఈ ప్రశ్నను అసలు పట్టించుకోలేదు.

ఆశ్చర్యకరంగా హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటులో సంయమనం పాటించినందుకు, ప్రజల పక్షం వహించినందుకు అక్కడి మిలట్రీని పశ్చిమ దేశాలు, పత్రికలు ప్రశంసలు కురిపించాయి. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంగా తామే కీర్తించిన మొర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటుకు కూడా మళ్ళీ మిలట్రీ సహకరించిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఏమిటి ఈ విచిత్రం? ఇంతకీ ఈజిప్టు మిలట్రీ ఎవరి పక్షం?

వాస్తవం ఏమిటంటే ప్రజలు రెండేళ్ల క్రితం తిరగబడింది, మొన్న తిరగబడిందీ తమను కష్టాలపాలు చేస్తున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా. ఐ.ఎం.ఎఫ్ ఆదేశాల ప్రకారం, షరతుల ప్రకారం ముబారక్ అనుసరించిన విధానాలు ఈజిప్టు ప్రజలను తీవ్ర దరిద్రంలోకి, నిరుద్యోగం లోకి నెట్టివేశాయి. దానితో సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ప్రబలి ఉద్యమాల బాట పట్టారు. ఈ ఉద్యమాలను ముస్లిం బ్రదర్ హుడ్, దానికి మద్దతుగా నిలిచిన అమెరికన్ ఎన్.జి.ఓ లు (నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ నాన్-వయోలెంట్ కాన్ఫ్లిక్ట్, ఏప్రిల్ 14 మూవ్ మెంట్ మొ.వి) అమెరికాకు అనుకూలంగా నేర్పుగా పక్కదారి పట్టించాయి. ఆ వివరాలు ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ముబారక్ విధానాలను సవరిస్తానని అధికారంలోకి వచ్చిన ముస్లిం బ్రదర్ హుడ్ కూడా ఐ.ఎం.ఎఫ్ విధానాలనే కొనసాగించింది. మోర్శి అధికారం చేపట్టడానికి అదొక షరతు కూడా అని గ్లోబల్ రీసెర్చ్ లాంటి సంస్ధలు తెలిపాయి. మిలట్రీ డాట్ కామ్ వెబ్ సైట్ ప్రకారం ఇటీవలి ఉద్యమాలు జరిగినన్ని రోజులూ ఈజిప్టు మిలట్రీ చీఫ్ అబ్దుల్ ఫతా ఆల్-సిసి నిరంతరం అమెరికాతో సంప్రదింపులు కొనసాగించాడు. దేశవ్యాపితంగా చెలరేగిన నిరసన ప్రదర్శనల్లో ప్రజలు అమెరికాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శిస్తుండగా, ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ఫోజు పెట్టిన మిలట్రీ చీఫ్ అమెరికాతో మంతనాలు జరపడం ఏమి సూచిస్తోంది?

ప్రజలు తమ దుర్భర పరిస్ధితులకు వ్యతిరేకంగా వీధుల్లోకి రాగా ఆ వ్యతిరేకతను భద్రంగా పక్కదారి పట్టించి ప్రజల నిరసన ఒక స్పష్టమైన ప్రజా ప్రభుత్వం నెలకొనేలా దారి తీయకుండా మిలట్రీ మోసపూరిత పాత్ర పోషించింది అని అర్ధం అవుతోంది. ముబారక్-అమెరికా కూటమి వ్యతిరేక నిరసనను పక్కదారి పట్టించి మొర్శి-ముబారక్ కూటమిని ప్రతిష్టించినట్లే, నిన్నటి నిరసనాలను కూడా పక్కదారి పట్టించి _____________-అమెరికా కూటమిని ప్రతిష్టించడానికి మిలట్రీ మరోసారి మంత్రసాని పనికి పూనుకుంది. ఈ ఖాళీని పూరించడం ఇప్పుడు మిలట్రీ పని. అమెరికా లేదా ఐ.ఎం.ఎఫ్ ల పాత్ర అన్నీ ప్రభుత్వాల్లోనూ కొనసాగేలా చేయడమే మిలట్రీ పాత్ర. అది దళారీ పాత్ర. అనగా బ్రోకర్ పాత్ర. దానికి ఈజిప్టు ప్రజల ప్రయోజనాలు అనవసరం. అమెరికా ఏటా అందజేసే 1.5 బిలియన్ డాలర్ల మూట మాత్రమే దానికి కావాలి.

కానీ ప్రజల ఉద్యమం మాత్రం నిజం. ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు నటించి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టడమే మిలట్రీ పోషిస్తున్న పాత్ర. ఈజిప్టులో మరోసారి మిలట్రీ కుట్ర జరిగింది నిజమే. కానీ ఆ కుట్ర మోర్సికి వ్యతిరేకంగా కాదు. ప్రజల ఉద్యమాలకు వ్యతిరేకంగా మాత్రమే అది జరిగింది. మళ్ళీ ఎన్నికల నాటకం ఆడి ప్రజలకు ఆమోదయోగ్యం అయిన ఒక మొఖాన్ని తెరమీదికి తెస్తారు. ఆ మొఖం తెరవెనుక అమెరికాతో లాలూచీ పడాలి. తెరముందు ప్రజానుకూల ఫోజులు పెట్టాలి.

రెండేళ్ల క్రితం ఒకసారి ఈ నాటకాన్ని ఈజిప్టు ప్రజలు తెలియక ఆమోదించారు. ఇప్పుడు మళ్ళీ తెలియకనే ఆమోదిస్తున్నారు. కానీ మూడోసారి లేదా నాలుగోసారి వారు ఆమోదించకపోవచ్చు. అలా వారు ఆమోదించకుండా ఉండేలా సరైన నాయకత్వం అందించే శక్తులు లేకపోవడమే ఇప్పటి సమస్య. ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఈజిప్టు ప్రజలు మోసపోవడం తప్పదు.

3 thoughts on “ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్

  1. chala saralamga rasaru superb. visekar garu, egypt ni control cheyyadamlo america interest yendhi, intaki mana india kuda world bank , imf member ye kada. i read india had taken $7 billion during 1990 to overcome economic crisis. mana india bathuku kuda beggar bathukena? imf bhootam nu chi bayata padalante india yem cheyyali. head and shoulders , cocacola, hul etc lanti mnc’s ni raddu chesi videsi vyaparastulni protsahinchi aa vache laabaallo pani chesey andarni baga swamulni cheste manam ee voobhi lonchi bayata padacha ? if ur answer is yes then why politicians not doing this ? waiting for ur answer

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s