స్నోడెన్ భయం: బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని దింపిన ఆస్ట్రియా


వియన్నా విమానాశ్రయంలో తనిఖీ అనంతరం బయలుదేరుతున్న ఇవా మొరేల్స్

వియన్నా విమానాశ్రయంలో తనిఖీ అనంతరం బయలుదేరుతున్న ఇవా మొరేల్స్

అమెరికా, ఐరోపా రాజ్యాలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన రష్యా విమానాశ్రయంలో కూర్చుని ఏ దేశం తనకు ఆశ్రయం ఇస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆయన తమకు తెలియకుండా ఎక్కడ తప్పించుకుని పోతాడా అని అమెరికా కుక్క కాపలా కాస్తోంది. స్నోడెన్ కోసం అమెరికా ఎంతకు తెగించిందంటే బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంపై ప్రయాణించకుండా ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చేటంతగా. ఫ్రాన్సు, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి క్లియరెన్స్ నిరాకరించగా, ఆస్ట్రియా ఆయన విమానాన్ని ఏకంగా బలవంతంగా కిందకి దించి స్నోడెన్ ఉన్నాడేమోనని తమ పోలీసుల చేత వెతికించింది.

బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానం తమ గగనతలంపై ప్రయాణించడానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చిన ఆస్ట్రియా బుధవారం ఉదయం దానిని బలవంతంగా వియన్నాలో దింపింది. యూరోపియన్ యూనియన్ కి చెందిన కొన్ని ఇతర దేశాలు (ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్) మొరేల్స్ విమానానికి అనుమతి నిరాకరించిన అనంతరం ఆస్ట్రియా అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అయితే అనూహ్యంగా విమానాన్ని వియన్నాలో దింపారు.

ఆస్ట్రియా విదేశీ మంత్రి కాఫీ సేవనం పేరుతో తన జెట్ విమానంలోకి ప్రవేశించి తనిఖీ చేయడానికి ప్రయత్నించారని అందుకు తాను నిరాకరించారని మొరేల్స్ చెప్పినట్లు ది హిందు తెలిపింది. అయితే చర్చల అనంతరం విమానం తనిఖీకి మొరేల్స్ అనుమతి ఇవ్వడంతో వియన్నా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి స్నోడెన్ లేడని తేల్చుకున్నాకనే విమానం బయలుదేరింది. వియన్నాలో తనిఖీ పూర్తయ్యాక స్పెయిన్ తమ గగనతలంపై ప్రయాణించడానికి మొరేల్స్ విమానానికి అనుమతి ఇచ్చింది. అంటే మొరేల్స్ విమానాన్ని దించి తనిఖీ చేయడానికి ఒక పధకం ప్రకారం ఐరోపా దేశాలు కూడబలుక్కుని ఈ దారుణ చర్యకు ఒడిగట్టాయని స్పష్టం అవుతోంది. మొదట అనుమతి ఎందుకు నిరాకరించారన్న ప్రశ్నకు స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు ఇంకా బదులు ఇవ్వలేదు.

“ఇవా మొరేల్స్, సామ్రాజ్యవాద బందీగా మార్చబడ్డారు” అని బొలీవియా ఉపాధ్యక్షుడు అల్వారో గార్సియా లినేరా ఆగ్రహంగా ప్రకటించారు. “ఆయనను బందీ చేయమని అమెరికాయే ఆదేశించిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము” అని ఆయన బొలీవియా రాజధాని లా పాజ్ లో ప్రకటించారు. మాస్కోలో జరిగిన గ్యాస్ ఉత్పత్తి దేశాల సమావేశానికి హాజరైన మొరేల్స్ తిరిగి ప్రయాణంలో ఉండగా ఐరోపా దేశాలు అమెరికా ఆదేశాలతో ఈ పిచ్చి పనికి పూనుకున్నాయి.

దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా ఉల్లంఘించడం, అది కూడా అనేక మానవ హక్కుల ఒప్పందాలకు, అంతర్జాతీయ రాయబారుల ఒప్పందాలకు కేంద్రం అయిన వియన్నాలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోడాన్ని బట్టి అంతర్జాతీయ ఒప్పందాలంటే అమెరికా, ఐరోపాలకు ఎంత తేలికో అర్ధం అవుతోంది. అంతర్జాతీయ ఒప్పందాలు వర్ధమాన దేశాలను నియంత్రించడానికే తప్ప పెత్తందారీ దేశాలు పాటించడానికి కాదని కూడా ఈ ఘటన రుజువు చేస్తోంది.

వియన్నా విమానాశ్రయంలో ఒక పక్క విమానాన్ని తనిఖీ చేస్తుండగా మరో పక్క ఇవా మొరేల్స్ విలేఖరులతో మాట్లాడారు. తాను క్రిమినల్ ని కాదని ఆయన విలేఖరులకు స్పష్టం చేస్తూ ప్రపంచం వలస పాలనా కాలంలో లేదని ఐరోపా దేశాలకు గుర్తు చేశారు. తన ప్రయాణానికి ఆటంకం కలగ జేసిన దేశాలు తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ లు దీనికి కారణాలేమిటో ప్రపంచానికి వివరణ ఇవ్వాలి. ఇలాంటి చర్యలు కొన్ని ఇ.యు దేశాల అణచివేత విధానాలను సూచిస్తున్నాయి” అని మొరేల్స్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. స్నోడెన్ తన విమానంలో ఉన్నాడన్న అనుమానాల్ని తిరస్కరిస్తూ “ఈ యువకుడిని నేను తీసుకెళ్లడానికి సూట్ కేస్ ఏమీ కాదు కదా” అని వ్యాఖ్యానించారు.  “నన్ను భయపెట్టడానికి, బెదిరించడానికి చేసిన ప్రయత్నం ఇది. దానికి ఇంకేదో సాకు చెబుతున్నారు. ఆధిపత్య ఆర్ధిక శక్తులకు వ్యతిరేకంగా మేము సాగిస్తున్న పోరాటం గొంతు నొక్కడానికే ఇలా చేశారు” అని ఆయన ప్రకటించారు.

వియన్నా ఘటనపై పలు లాటిన్ అమెరికా దేశాలు ఆగ్రహం ప్రకటించాయి. అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా కిర్ష్నర్ పరిస్ధితిని పిచ్చితనం గా అభివర్ణించారు. “ఒక దేశాధ్యక్షుడు గానీ, ఆయన విమానం గానీ పూర్తి రక్షణ (immunity) కలిగి ఉంటారు. ఈ స్ధాయిలో నిరపరాధం (impunity) వ్యక్తం కావడం కానీ వినీ ఎరుగం” అని ఆమె వ్యాఖ్యానించారు. మొరేల్స్ విమానాన్ని బలవంతంగా కిందకు దించి ఆయనను బందీగా ఉంచడాన్ని ఖండిస్తున్నట్లు క్యూబా ప్రకటించింది. “మొరేల్స్ నిర్బంధం ఆమోదనీయం కాదు. ఇది సమర్ధించుకోడానికి వీలు లేని చర్య. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలన్నింటినీ ఇది బాధించింది” అని క్యూబా ఒక ప్రకటనలో తెలిపిందని రష్యా టుడే తెలియజేసింది.

ఈక్వడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా మరింత తీవ్రంగా స్పందించారు. దక్షిణ అమెరికా దేశాలు వెంటనే తగిన చర్య తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. “UNASUR (యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్) కి ఇది నిర్ణయాత్మక సమయం! మనం వలసల నుండి గ్రాడ్యుయేషన్ పొందామా లేక మన స్వతంత్రతను, సౌర్వభౌమత్వాన్ని, గౌరవాన్ని పరిరక్షించుకోవడమా! మనం అంతా బొలీవియాలం” అని కొరియా పిలుపు ఇచ్చారు. UNASUR దేశాలు తక్షణమే సమావేశం కావాలని ఆయన కోరారు.

ఐరాసలో బొలీవియా ప్రతినిధి ఈ అంశాన్ని “దురాక్రమణ చర్య, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన” అని ప్రకటించారు. ఎన్.ఎస్.ఏ లీకర్ స్నోడెన్ కోసం తమ దేశాధ్యక్షుడి అధికారిక జెట్ విమానాన్ని తనిఖీ చేయడంపై ఐరాసకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. విమానం తనిఖీ చేయాలన్న ఆదేశాలు అమెరికా నుండే వచ్చాయనడంలో తమకు ఎట్టి అనుమానం లేదని ఆయన న్యూయార్క్ లో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. 12 గంటల పాటు తమ దేశాధ్యక్షుడిని, ఆయన విమానాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం బందీగా ఉంచుకోవడం పిరికి చర్య గా ఆయన అభివర్ణించారు.

ఆస్ట్రియాలో బొలీవియా రాయబారి రికార్డో మార్టినేజ్ విమానం దింపివేత ఘటనను ‘కనీ వినీ ఎరుగనిది’ అని అభివర్ణించారు. “రాజ్యాల (దేశాల) పరస్పర సహకార, స్నేహపూర్వక ఉనికిని కలిగి ఉంటాయన్న లాజిక్ కి ఇది బద్ధ విరుద్ధం. అనేక అంతర్జాతీయ ఒప్పందాలను, అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించడమే ఇది” అని ఆర్.టి కి ఇంటర్వ్యూ ఇస్తూ రికార్డో వ్యాఖ్యానించారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం పట్ల వారికి ఉన్న తేలిక భావనను ఇది రుజువు చేస్తోందన్నారు.

స్నోడెన్ అనే ఒక పరిణామం పట్ల అమెరికా ఎంత కలవరపాటుకు గురవుతున్నదో మొరేల్స్ విమాన ఘటన స్పష్టం చేస్తోంది. స్నోడెన్ వెల్లడించబోయే మరిన్ని అమెరికా దుర్మార్గాలు నిజంగా బైటికి వస్తే జరగబోయే పరిణామాల పట్ల అమెరికా కలవరపడుతోందన్నది స్పష్టమే. అమెరికా కలవరపాటును ఐరోపాతో సహా రష్యా, చైనా తదితర దేశాలు కూడా షేర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు స్నోడెన్ కి సానుభూతి తెలుపుతూనే మరోవైపు ఆయన నోరు మూయించడానికి రష్యా ప్రయత్నం చేసి విఫలం అయింది.

స్నోడెన్ వెల్లడించబోయే సంగతులు మొత్తంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెత్తనం వెలగబెడుతున్న భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వర్గాలకు భీతి కలిగిస్తోందని రష్యా, చైనా, ఐరోపా తదితర దేశాల మౌనం ద్వారా లేదా నోరు మూయించే ప్రయత్నాల ద్వారా తెలుస్తోంది. దాదాపు ప్రతి దేశం లోనూ ప్రభుత్వాధికారం వెలగబెడుతున్న దోపిడీ వర్గాలు పైకి ప్రజాస్వామ్యం అని చెబుతూనే వాస్తవానికి లోలోపల దుర్గంధం వెదజల్లే నియంతృత్వ స్వభావాలను కలిగి ఉన్నాయనీ, ఆ స్వభావాలు వెల్లడి అవుతాయన్న భయమే స్నోడెన్ కట్టడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నించడానికి దారి తీస్తోందని అర్ధం చేసుకోవచ్చు. రాయబార కార్యాలయాల గూఢచర్యం కొత్తేమీ కాదని భారత దేశ మంత్రుల దగ్గర్నుండి, మాజీ రాయబారుల వరకూ పత్రికల్లో ప్రకటనలు చేస్తూ, విశ్లేషణలు రాస్తున్నారు. కాబట్టి వీరందరికీ ప్రజల నుండి దాచి పెట్టవలసింది చాలా ఉన్నదని అర్ధం అవుతోంది. స్నోడెన్ వాస్తవాలు నిజానికి వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు కాదు, మొత్తం అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర దేశాల ప్రజలందరికీ అవసరం. అందుకే అవి బైటికి రావాలి.

One thought on “స్నోడెన్ భయం: బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని దింపిన ఆస్ట్రియా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s