స్నోడెన్ రాజకీయ ఆశ్రయం, వివిధ దేశాల స్పందనలు


Snowden 2

ప్రపంచ ప్రజలపై అమెరికా దొంగచాటు నిఘాను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ సకల దేశాల ఎజెండాలోకి చేరిపోయాడు. రాజకీయ ఆశ్రయం కోరుతూ ఆయన వివిధ దేశాలకు వినతి పత్రాలు పంపడంతో ఆయా దేశాల ప్రజాస్వామ్య కబుర్ల ముసుగులు ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నాయి. రాజకీయ ఆశ్రయం పొందడం ప్రపంచంలో ప్రతి పౌరుడి హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించగా సభ్య దేశాలన్నీ దాన్ని ఆమోదించాయి. ఐరాస ఒప్పంద పత్రాలపై తాము చేసిన సంతకాలు ఎంత నామమాత్రమో అనేక దేశాలు వెల్లడించుకోగా, చాలా కొద్ది దేశాలు మాత్రమే, అది కూడా లెఫ్ట్ ప్రభుత్వాలు ఉన్నాయని చెబుతున్న కొద్ది దేశాలు మాత్రమే సానుకూలంగా స్పందించాయి.

మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఐరోపా దేశాలు తమ ఊరుదిబ్బతనాన్ని రుజువు చేసుకుంటున్నాయి. ఆసాంజే ఉదంతంతో బ్రిటన్ ప్రజాస్వామిక ముసుగు ఎన్నడో చిరిగిపోయింది. మొత్తం 21 దేశాలకు స్నోడెన్ దరఖాస్తు చేసుకోగా రష్యా అధ్యక్షుడు విధించిన షరతుతో ఆ ఒక్క దేశానికి ఇచ్చిన దరఖాస్తును విరమించుకున్నాడు. ఎడ్వర్డ్ స్నోడెన్ చేసుకున్న ఇతర దరఖాస్తులకు వివిధ దేశాల స్పందనలు ఈ విధంగా ఉన్నాయి.

Eva Morales

Eva Morales

బొలీవియా: రష్యా టుడే స్పానిష్ చానెల్ తో మాట్లాడుతూ బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్, రాజకీయ ఆశ్రయం కోసం స్నోడెన్ దరఖాస్తు చేసుకుంటే తాను తప్పనిసరిగా పరిశీలిస్తానని చెప్పారు. ఆయన స్పందించే సమయానికి స్నోడెన్ దరఖాస్తు బొలీవియా ప్రభుత్వానికి చేరనట్లు కనిపిస్తోంది.

“మాకు విన్నపం అందినట్లయితే దానిని చర్చించి పరిగణించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఇవ్వకూడదు? చర్చించాల్సిన విషయాలను అనేకం ఆయన మనముందు ఉంచారు. అంతర్జాతీయ స్ధాయిలో చర్చ జరగాల్సి ఉంది. అది గూఢచర్యం కావచ్చు, నియంత్రణ కావచ్చు, బాధితులకు అండగా నిలవడానికి బొలీవియా సిద్ధంగా ఉంది. ఆయనకు సహాయం చేయడానికి మేమున్నాం” అని ఇవా మొరేల్స్ స్పష్టం చేశారు. ఇవా మొరేల్స్ బొలీవియా అధ్యక్షుడుగా ఎన్నికయిన మొట్టమొదటి స్ధానిక తెగల సంతతి వ్యక్తి.

రష్యా: స్నోడెన్ కి రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరిస్తూ అధ్యక్షుడు పుతిన్ ఒక షరతు విధించాడు. “మా అమెరికన్ భాగస్వాముల రహస్యాలను బైటపెట్టడం ఇక నుండి ఆపివేయాలి. కానీ ఆయనను అమెరికాకి అప్పగించే ఉద్దేశ్యం మాకు లేదు” అని పుతిన్ తెలిపారు. అమెరికాకి అప్పగిస్తే స్నోడెన్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని కాబట్టి రష్యా ఆ పని చేసే అవకాశం లేనే లేదని పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. పుతిన్ షరతుతో స్నోడెన్ తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు.

ఆస్ట్రియా: ఆస్ట్రియా హోమ్ మంత్రి జోహాన్నా మిక్ల్-లీత్నర్ ప్రకారం ఆ దేశంలో రాజకీయ ఆశ్రయం పొందాలంటే అలా కోరే వ్యక్తి ముందు ఆస్ట్రియా రావాలి. రష్యాలో ఉన్న ఆస్ట్రియా ఎంబసీకి దరఖాస్తు చేసినా దానిని పరిగణించరు. కాబట్టి ఆస్ట్రియా తలుపులు మూసుకున్నట్లే. ఒకవేళ స్నోడెన్ ఆస్ట్రియా వస్తే ఆయనను అమెరికాకి అప్పగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆయనని అరెస్టు చేయాలంటూ ఇంటర్ పోల్ అరెస్టు వారెంటు ఇవ్వలేదు గనుక అలా జరగదని చెప్పాడు. అంటే వారంట్ ఇస్తే అరెస్టు చేసి అమెరికాకు పంపుతారన్నమాటే!

ఫిన్లాండ్: ఫిన్లాండ్ విదేశాంగ శాఖ ప్రతినిధి కీజో నోర్వాంతో ప్రకారం స్నోడెన్ దరఖాస్తు వారికి అందింది. “మాకు వినతి పత్రం అందిందని ధృవపరచగలం. కానీ దానిని అధికారికంగా పరిగణించడం కుదరదు. అధికారికంగా రాజకీయ ఆశ్రయం పొందగోరితే స్నోడెన్ మొదట ఫిన్లాండ్ రావాలి. పోలీసుల వద్దకు గానీ, మైగ్రేషన్ సేవల వద్దకి గానీ వెళ్ళాలి. కానీ ఈ కేసులో చూస్తే ఈ ప్రక్రియను పాటించలేదు. కాబట్టి దరఖాస్తును పరిగణించడం లేదు” అని కీజో చెప్పారని ఇటార్-టాస్ వార్తా సంస్ధ (రష్యా) తెలిపింది. కనుక ఫిన్లాండ్ నో చెప్పేసింది.

స్పెయిన్: స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ గార్షియా-మార్గల్లో ప్రకారం ఆయనకి స్నోడెన్ రాజకీయ ఆశ్రయం దరఖాస్తు విషయం ఏమీ తెలియదు. కానీ స్పెయిన్ లో రాజకీయ ఆశ్రయం పొందాలంటే ముందు ఆ వ్యక్తి స్పెయిన్ గడ్డపైన ఉండాలని ఆయన తెలిపారు. “రాజకీయ ఆశ్రయ పిటిషన్ ని అసలు పిటిషన్ గా ప్రభుత్వం పరిగణించాలంటే… అనగా చట్టబద్ధంగా అనుమతి పొందాలంటే, అలాంటి వ్యక్తి మొదట స్పెయిన్ లో ఉండాలి” అని జోస్ తెలిపాడు. కనుక స్పెయిన్ దారి కూడా మూసుకుపోయింది.

ఇండియా: భారత పాలకులు కనీసం చట్టాలూ, గాడిద గుడ్డు అంటూ నీళ్ళు నమిలే పని పెట్టుకోలేదు. సింపుల్ గా ‘మాకేం అవసరం’ అన్నారంతే. ప్రపంచంలో మేమే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం కదా, అలా చెబుతున్నందుకైనా ఒక కారణం చూపాలి గదా అని వారు అనుకోలేదు. స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి “మాకు కారణాల్లేవు” అని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ తేల్చిపారేశారు.

పోలండ్: తూర్పు యూరప్ లో అమెరికాకు అత్యంత విశ్వాసపాత్రమైన దేశం ఇది. స్నోడెన్ దరఖాస్తు చేసుకున్న దేశాల్లో పోలెండ్ కూడా ఒకటి. కానీ దరఖాస్తు తమకు చేరిందీ లేనిదీ చెప్పకుండా లేదా దరఖాస్తును పరిగణిస్తున్నామా లేదా చెప్పకుండా పోలెండు నాయకులు డొంక తిరుగుడుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలండ్ రాయబారులపై నిఘా పెట్టినందుకు తాము అమెరికాను వివరణ కోరుతామని మాత్రమే వారు తెలిపారు. “పోలండ్, ఇ.యు ల రాయబార కార్యాలయాలపై నిఘా పెట్టిన  ఎన్.ఎస్.ఏ చర్యలపై మేము అమెరికాను వివరణ కోరుతామ్” అని పోలండ్ విదేశీ మంత్రి రాదోస్లా సికోర్ స్కీ ట్విట్టర్ల్ లో రాసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్.టి ప్రకారం పోలండ్ కూడా స్నోడెన్ దరఖాస్తును తిరస్కరించింది.

బ్రెజిల్: స్నోడెన్ రాజకీయ ఆశ్రయ దరఖాస్తును తాము తిరస్కరిస్తున్నట్లు బ్రెజిల్ నేరుగా చెప్పేసింది. దానికి ఫలానా కారణాలు ఉన్నాయని ఆ దేశం ఏమీ చెప్పలేదు. ‘కారణాలు లేవు’ అని కూడా చెప్పలేదు. ‘దరఖాస్తును తిరస్కరించాం’ అని మాత్రమే బ్రెజిల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికాకి వ్యతిరేకంగా తరచుగా పెడబొబ్బలు పెట్టే దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఎన్ని కబుర్లు చెప్పినా అమెరికాతో వ్యాపారం చెడడం బ్రెజిల్ పాలకులకు ఇష్టం ఉండదు.

నార్వే: నార్వే ప్రభుత్వం ఎవరికయినా రాజకీయ ఆశ్రయం ఇవ్వాలంటే మొదట ఆ దేశం వెళ్ళాలి. అప్పుడే వారి దరఖాస్తు పరిగణించడానికి వీలవుతుంది. వివిధ దేశాల మధ్య, వివిధ గ్రూపుల మధ్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించే నార్వే, తమ దాకా వస్తే గనక అమెరికా పక్కలో చేరిపోతుంది.

Nicolas Maduro

Nicolas Maduro

వెనిజులా: అధ్యక్షుడు నికోలస్ మదురో సానుకూలంగా స్పందించారు. అమెరికాను చీల్చి చెండాడారు కూడాను. ఆయిల్ దేశాల సమావేశాల కోసం రష్యాలో ఉన్న మదురో ఇలా స్పందించారు. “ఏది ఏమయినా సరే, అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం ఈ యువకుడికి రక్షణ ఇచ్చి తీరాలి. రక్షణ పొందడానికి అతనికి హక్కు ఉంది. ఎందుకంటే అమెరికా ఆయన వెంటపడుతోంది. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్)… ఇలా అందరూ ఆయన వెంటపడుతున్నారు. ఎందుకని? ఆయన ఏ నేరం చేశారని? క్షిపణి ప్రయోగించి ఎవర్నైనా చంపేశారా? బాంబులు పెట్టి ఇంకెవర్నైనా చంపారా? లేదు. ఆయన అలాంటిదేమీ చేయలేదు. దానికి విరుద్ధంగా, యుద్ధాలను నివారించడానికి ఆయన తాను చేయదలచుకున్నదంతా చేస్తున్నారు. మొత్తం ప్రపంచానికి వ్యతిరేకంగా జరుగుతున్న చట్ట విరుద్ధ చర్యలను నివారించడానికి ఆయన కృషి చేస్తున్నారు. స్నోడెన్ నుండి ఇంతవరకూ మాకు దరఖాస్తు అందలేదు. మాకు అందిన వెంటనే మేము పరిగణనలోకి తీసుకుంటాము” అని మదురో విలేఖరులకు తెలిపారు.

ఇటలీ: ఈ దేశం కూడా షరా మామూలే. స్నోడెన్ ఇటలీ వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే గాని దానిని పరిగణించడానికి వీలు లేదని ఇటలీ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది. స్నోడెన్ దరఖాస్తు తమకు ఫాక్స్ ద్వారా అందిందని, ఆ విధంగా ఫాక్స్ దరఖాస్తును ఇటలీ చట్టాలు ఒప్పుకోవనీ ఆ దేశం తెలిపింది.

ఇంకా చైనా, క్యూబా, ఫ్రాన్స్, జర్మనీ, ఐస్ లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నికరాగువా, స్విట్జర్లాండ్ దేశాలు స్నోడెన్ దరఖాస్తు పై స్పందించాల్సి ఉంది. ఈక్వడార్ తనకు అందిన దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి కొన్నివారాలు పడుతుందని తెలిపింది.

8 thoughts on “స్నోడెన్ రాజకీయ ఆశ్రయం, వివిధ దేశాల స్పందనలు

 1. మిగతా దేశాల సంగతి సరే అమెరికాని నోరుమూసుకోమనే చైనా, వీర దేశం క్యూబా కూడా స్నోడెన్ కి నో చెప్పాయని ఈనాడు కథనం. అన్ని దేశాల గురించి రాసి, చైనా ను ఎందుకు వదిలేశారు మిస్టర్ శేఖర్. మన ఇంటిని తిట్టుకోడానికేగాని, పక్క ఇళ్ళవారి బుధ్ధులు గ్రహించడానికి పనికిరాదా మీ మేధావితనం?

 2. @surya

  స్నోడెన్ కి చైనా, క్యూబా నో చెప్పాయన్న వార్త నిజమేనా? నిజం ఏమిటంటే ఇప్పటికీ అవి స్పందించలేదు. మీరు గమనిస్తే ఈ రెండు దేశాలు ఇంకా స్పందించలేదని రాశాను. కాబట్టి చైనాను వదిలేశానన్న మీ గమనింపులో వాస్తవం లేదు. ఈనాడు వార్తకి బాధ్యుడిని నేను కాదు కాబట్టి మీరు వారినే అడగడం ఉత్తమం.

  దేశాన్ని విదేశీ కంపెనీలకు అప్పజెప్పే పాలకుల్ని విమర్శిస్తే మన ఇంటిని తిట్టుకోవడం అవదనుకుంటాను. అవుతుందని వాదిస్తే అది మీ అవగాహన. దానికీ నేను బాధ్యుడిని కాను.

  చైనా, క్యూబాలు మీరు చెప్పే వీరులేమీ కారు. అమెరికాతో స్నేహానికి క్యూబా కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అమెరికాతో చైనాకి గట్టి వ్యాపార బంధాలు ఉన్నాయి. కాబట్టి అవి రెండూ నో చెప్పినా ఆశ్చర్యం లేదు.

  ఏమన్నా అనుమానం ఉంటే అడగాలి. అంతేగాని మీ అభిప్రాయాల్ని నా నోట్లోకి చొప్పించడం విజ్ఞుల లక్షణం కాదు. గమనించగలరు. అంతే కాకుండా ఆర్టికల్ ని సంపూర్ణంగా చదివి విమర్శలకు దిగాలి. కొంత చదివి మిగతాది మీరు పూర్తి చేసుకుని విమర్శ ప్రారంభించడం కరెక్టు కాదు.

 3. అయ్యా… తమరి వార్తలన్నిట్లోనూ తమరి ఆలోచనల మసాలా కలిపి రాస్తూ మళ్ళీ నేనేదో నా అభిప్రాయాన్ని మీ నోట్లో ఉచంచుతున్నట్లు నిందలెందుకు? క్యూబా, చైనా నో చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదుగాని, ఇండియా నో చెప్పినందుకు మాత్రం మీరు బోలెడు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక అంతర్జాతీయ రాజకీయ విషయం. ప్రతి దేశానికీ తమ తమ లాభ నష్టాలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని ఆయా దేశాలు నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఇండియా నో చెప్పినంత మాత్రాన మన ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఒకవేల మీకు ఈ ప్రజాస్వామ్యం నచ్చకపోతే ఏ అంటార్కిటికా కో పోయి హాపీగా ఉండొచ్చు.

 4. @surya

  నేనిప్పుడు ఏమనాలంటే మీకు నా ఆలోచనల మసాలా నచ్చకపోతే మరో మసాలా చూసుకోండి అని.

  చైనా గురించి రాసినా, రాయలేదన్నది మీరే కదా. ఇక నింద ఎలా అవుతుంది?

  చర్చించే పద్ధతిలో వ్యాఖ్యలు రాయగలిగితే రాయండి. చర్చిద్దాం!

  ఇంతకీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెప్పండి. వ్యంగ్యం లేకుండా.

 5. Naku ardhmina vishayam enti ante…. China america ni kattadi cheyyadaniki snoden ni bitaki techindi…so Snoden ane vyakti china valla Bitaki vachadu gani ,… prajaswamyam mida bhakti to kadu.. kanuka mana desam ataniki aasrayam ivvavalasina avasaram ledu…

 6. america oka jittulamari nakka, papam snowden. netaji ye bathikunte tappakunda india lo asrayam ichundevaremo. congress, bjp yeppudo india ni american mns’s ki takattu pettesai. avi yedo chestai ani asinchadam kuda porapate.

  jittula mari bhutam america gurinchi rajiv dixit baaga chepparu. see this

 7. know about american agent mms (manmohan sigh), montek singh – by rajiv dixit. rajiv dixit was an excellent orator, nationalist, social worker, scientist, ayurvedic doctor. he was fighting against 100’s of mnc’s. his death was mystery. many assume evil forces like mnc’s conspired to kill him.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s