గ్రీసు రుణ సంక్షోభం: లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్


యూరప్ రుణ సంక్షోభం కూడా అంటురోగమే

యూరప్ రుణ సంక్షోభం కూడా అంటురోగమే

దేశాల ఆర్ధిక వ్యవస్ధల తప్పులను సవరించే బాధ్యతను తనకు తాను నెత్తిమీద వేసుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్ధ మొదటిసారిగా, పటాటోపానికే ఐనా, లెంపలు వేసుకుంది. గ్రీసు దేశ ప్రజలపై బలవంతంగా రుద్దిన పొదుపు విధానాలు ఎంతవరకు పని చేస్తాయన్న విషయమై తాము తప్పుడు అంచనాలు వేశామని అంగీకరించింది. అమెరికా, ఐరోపాల తరపున ప్రపంచ దేశాల మీద ద్రవ్య పెత్తనం సాగించే ఐ.ఎం.ఎఫ్, తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అసాధారణం. అయితే, ఈ ఒప్పుకోలు వలన గ్రీసు ప్రజలకు ఒరగబోయేది ఏమీ లేకపోవడమే అన్యాయం.

గ్రీసు ఋణ సంక్షోభం గత నాలుగేళ్లుగా ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్ధ అవసరాల కోసం అప్పులు పుట్టకపోవడమే ఋణ సంక్షోభం. 2009-10లో అలవికాని మొత్తంలో వడ్డీ రేట్లను మార్కెట్లు డిమాండ్ చేయడంతో ఋణ సేకరణకు గ్రీసుకు దారులు మూసుకుపోయాయి. అప్పటికే గ్రీసు రుణం ఆ దేశ జి.డి.పి కంటే ఎక్కువ కావడం, ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోవడం (పన్నుల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ కావడం), కరెంటు ఖాతా లోటు భారీగా పెరగడం… ఈ కారణాల వలన ప్రైవేటు మదుపుదారులు (సూపర్ ధనికులు, ఇన్వెస్ట్ మెంటు బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, వివిధ కంపెనీలు మొ. వారు) గ్రీసు ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం కోల్పోయారు. దానివలన వాళ్ళు ఎక్కువ వడ్డీని డిమాండ్ చేశారు. మదుపరులు డిమాండ్ చేసిన వడ్డీకి రుణం తీసుకుంటే ఆర్ధిక వ్యవస్ధ దివాళా తీస్తుంది. అధిక వడ్డీలకు మార్కెట్లలో అప్పు తీసుకోలేక, అవసరాలు గడిచే దారిలేక సంక్షోభ పరిస్ధితిని గ్రీసు ఎదుర్కొంది.

దేశాల ఋణ సేకరణ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం ఉపయోగం. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు తమ రోజువారీ అవసరాల కోసం పన్నులు తదితర ఆదాయాలపై ఆధారపడాలి. కానీ పన్నుల వసూళ్లు ఎప్పటికప్పుడు రెడీగా అందుబాటులోకి రావు. ఈ లోపు అవసరాలు గడపడానికి ప్రైవేటు మార్కెట్ల నుండి రుణాలు సేకరిస్తాయి. ఋణ సేకరణ ప్రధానంగా సార్వభౌమ ఋణ పత్రాలను (Sovereign Debt Bonds) జారీ చేయడం ద్వారా జరుగుతుంది. ఆరు నెలల నుండి 25 లేదా 30 సంవత్సరాల వరకూ వివిధ కాల పరిమితుల్లో ప్రభుత్వాలు సావరిన్ బాండ్లు వేలం వేస్తాయి. మార్కెట్లో ఎంత తక్కువ వడ్డీకి రుణాలు సేకరించగలిగితే అంత ఎక్కువ నమ్మకం ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధపై ఋణ దాతలకు (బాండ్ల కొనుగోలుదారులకు) ఉన్నట్లు లెక్క. ఇలా బాండ్ల ద్వారా సేకరించిన రుణాలకు ప్రభుత్వాలు పీరియాడికల్ గా వడ్డీ చెల్లింపులు చేస్తాయి. గడువు సమయానికి చెల్లింపులు చేయలేకపోతే అది దివాలా (default) కిందికి వస్తుంది.

ప్రపంచీకరణ యుగంలో ‘రుణానుబంధం’ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఉదాహరణకి గ్రీసుకు అమెరికన్ వాల్ స్ట్రీట్ బ్యాంకుల నుండి, లండన్, ప్యారిస్, ఫ్రాంక్ ఫర్ట్, బ్రస్సెల్స్ లాంటి అనేక నగరాల మరియు దేశాల బ్యాంకులు, కంపెనీల నుండి రుణాలు రావచ్చు. ఈ రుణాల దాతలు మళ్ళీ వేరే కంపెనీల నుండి, బ్యాంకుల నుండి రుణాలు తెచ్చి ఉండవచ్చు. ప్యారిస్ బ్యాంకులకు గ్రీసు రుణాల్లో పెట్టుబడులు ఉంటాయి. కాని లండన్ బ్యాంకులు ప్యారిస్ బ్యాంకుల్లో ఋణ పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు. అదే తరహాలో లండన్ బ్యాంకులు వాల్ స్ట్రీట్ కంపెనీల నుండి అప్పులు తెచ్చి ఉండవచ్చు. ఇలా అంతర్జాతీయంగా ద్రవ్య మార్కెట్లు పరస్పరం ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. ఈ వలయంలో ఏ దేశం దూరినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మిగిలిన అన్నీ దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో పెనవేసుకుని ఉన్నట్లే. కాబట్టి ఒక దేశం దివాళా స్ధితికి చేరుకుంటే ఆ ప్రభావం చైన్ రియాక్షన్ తరహాలో ఆ దేశంతో ద్రవ్య లావాదేవీలు నడుపుతున్న ఇతర దేశాలు కూడా సంక్షోభం లోకి ఈడ్వబడతాయి. దీనిని ఆంగ్లంలో contagion effect అంటారు. అంటే అంటు రోగం మాదిరి అన్నమాట.

ఈ పరిస్ధితి వలన గ్రీసు ఋణ సంక్షోభం అప్పట్లో పెద్ద వార్త అయింది. (ఇప్పటికీ వార్తే అనుకోండి.) 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అప్పటికి ఇంకా ముగియలేదు. పశ్చిమ దేశాలన్నీ ఆర్ధిక మాంద్యాన్ని (recession) ఎదుర్కొంటున్న పరిస్ధితి. ‘టూ బిగ్ టు ఫెయిల్’ అని పేరు పొందిన భారీ కంపెనీలు సైతం ప్రభుత్వ బెయిలౌట్లతో కనాకష్టంగా నెట్టుకొస్తున్నాయి. ఆ పరిస్ధితిలో గ్రీసు ఋణ సంక్షోభం ఆశనిపాతంలా ఐరోపాను తాకింది. గ్రీసు ఋణ సంక్షోభం అంటే ఆ దేశానికి, ఆ దేశంలోని బ్యాంకులు తదితర కంపెనీలకు ఇచ్చిన అప్పులు తిరిగి రావడం కష్టం అని కూడా అర్ధం. గ్రీసు యూరో జోన్ సభ్యురాలు గనుక ఇతర యూరో దేశాలకు త్వరగా సంక్షోభం పాకే పరిస్ధితి ఏర్పడింది. దానితో యూరోపియన్ దేశాలన్నీ కూడి సమాలోచనలు జరిపాయి. 27 దేశాల ఇ.యు, 17 యూరో దేశాల యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ (ట్రొయికా అంటారు)… ఈ మూడు కలిసి బెయిలౌట్ నిధిని ఏర్పాటు చేశాయి. ఋణ సంక్షోభంలో ఉన్న యూరో దేశాలకు మార్కెట్లకు బదులుగా ఈ నిధి నుండి రుణాలు సరసమైన వడ్డీకి ఇవ్వడానికి నిర్ణయించారు.

అయితే పేరుకు సరసమే గానీ బెయిలౌట్ తో పాటు అనేక విషమ షరతులు వచ్చి పడ్డాయి. ఉద్యోగాల రద్దు; వేతనాల కోత; పెన్షన్, ఆరోగ్య భృతి, నిరుద్యోగ భృతి తదితర సదుపాయాల కోత లేదా రద్దు; సబ్సిడీల రద్దు లేదా కోత; హౌసింగ్ రుణాల స్తంభన తదితర అనేక విషమ షరతులను ఋణ పీడిత దేశాలపై బెయిలౌట్ మాటున, ట్రొయికా రుద్దింది. దీనితో ప్రజల ఆదాయాలు పడిపోయాయి. నిరుద్యోగం పెరిగింది. సమ్మెలు నిత్యకృత్యం అయ్యాయి. సామాజిక సంక్షోభం తీవ్రమై వలస వచ్చిన కార్మికులపై దాడులు పెరిగాయి. అత్యంత పటిష్టమైన ఆర్ధిక వ్యవస్ధ అని చెప్పే జర్మనీ లోనే ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు ‘మల్టీ కల్చరలిజం’ విఫలం అయింది అంటూ ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ సైతం ఈ తరహాలో ప్రకటనలు ఇచ్చారు. బ్రిటన్ లో సంవత్సరం క్రితం తోట్టెన్ హామ్ లో జరిగిన అల్లర్లు ఈ సామాజిక సంక్షోభంలో భాగమే.

గత మూడేళ్లుగా గ్రీసులో ఇదే పరిస్ధితి. బెయిలౌట్ పేరుతో గ్రీసుకు ట్రొయికా ఇచ్చిన రుణాల్లో సింహా భాగం ఆ అరుణాలు ఇచ్చిన దేశాలకే రుణాల చెల్లింపుల రూపంలో వెళ్లిపోయాయి. బెయిలౌట్ నిధికి సింహభాగం నిధులు సమకూర్చిన జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలే ఈ రుణాలను తీసేసుకున్నాయి. అంటే తమకు ఇవ్వవలసిన బాకీలను గ్రీసు తదితర ఋణ పీడిత దేశాల దగ్గర్నుండి వసూలు చేసుకోవడానికే బెయిలౌట్ నిధి ఏర్పాటు చేశాయన్నమాట! ఇచ్చి తీసుకోవడం తప్ప అందులో నేరం ఏముంది అనవచ్చు. బెయిలౌట్ రుణాలతో పాటు ఋణ పీడిత దేశాలపై రుద్దిన విషమ షరతులే అసలు నేరం. బెయిలౌట్ లక్ష్యం కూడా అవే. పైగా గ్రీసు పై అదనపు రుణ భారం మోపబడింది. 2009లో గ్రీసు ఋణం ఆ దేశ జి.డి.పి లో 100 శాతం దగ్గర్లో ఉంటే ఇప్పుడది 175 శాతం.

సంక్షోభం పేరు చెప్పి గ్రీసు దేశంలో పబ్లిక్ సెక్టార్ ను అతి చౌక రేట్లకు అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, తదాదిగా గల ధనిక దేశాల ప్రైవేటు కంపెనీలు కొనేయడం బెయిలౌట్ లక్ష్యంలో ప్రధాన భాగం. గ్రీసులో కార్మికులకు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, చెల్లిస్తున్న వేతనాలను భారీగా తగ్గించడం ఇంకో లక్ష్యం. తద్వారా కార్మికులు, ఉద్యోగుల వేతనాల నుండి భారీ మొత్తాన్ని కంపెనీల లాభాల కిందికి తరలించడం ఇందులో ఇమిడి ఉంటుంది. అంతే కాకుండా రద్దు చేసిన ఉద్యోగాల స్ధానంలో చేర్చుకునే కొత్త ఉద్యోగులకు ఇక అతి తక్కువ వేతనాలు చెల్లించవచ్చు. ఆ విధంగా భవిష్యత్ లాభాల పెరుగుదలకు గ్యారంటీ సాధించబడింది. ఈ చర్యల వలన అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు లబ్ది పొందగా ప్రజలు ఆదాయాలు, ఇళ్ళు, భద్రత కోల్పోయి వీధిన పడ్డారు. గ్రీసులో ఇప్పుడు నిరుద్యోగం 27 శాతం ఉన్నది. వేతనాలు సగానికి సగం పడిపోయాయి. పెన్షన్ లాంటి సదుపాయాలు అనేకం కోతపెట్టడమో, రద్దు చేయడమో చేశారు. మిగిలి ఉన్న ఒకటీ ఆరా పెన్షన్లకు లెక్కలు మార్చేసి తగ్గింపులు సాధించారు.

దీనితో గ్రీసు ఉత్పత్తి పడిపోయింది. 2008లో 0.3 శాతం వృద్ధి చెందిన గ్రీసు జి.డి.పి డిసెంబర్ 2010 నాటికి -9 శాతం నమోదు చేసింది. 2009లో గ్రీసు స్ధూల జాతీయోత్పత్తి 347.042 అమెరికన్ డాలర్లు కాగా 2012లో అది 298.734 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే 14 శాతం తగ్గుదల! వేతనాల కోత, నిరుద్యోగం వలన ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. దానితో కొనుగోళ్ళు తగ్గి ఉత్పత్తి మరింత తగ్గింది. ఫలితంగా ప్రభుత్వానికి వసూళ్లు తగ్గిపోయాయి. వసూళ్లు పెంచుకోవడానికి పన్నులు మరింత పెంచి ఖర్చులు మరిన్ని తగ్గించారు. ఇది మళ్ళీ జి.డి.పి పైన వ్యతిరేక ప్రభావం చూపింది. గత మూడేళ్లుగా గ్రీసులో ఇదే పరిస్ధితి. తమ పొదుపు విధానాలు తాము ఊహించినదానికంటే ఎక్కువ మాంద్యానికి గురి చేశాయని ఐ.ఎం.ఎఫ్ ఇప్పుడు చెబుతోంది. కానీ జోసెఫ్ స్టీగ్లిట్జ్ లాంటి ఆర్ధిక నోబెల్ గ్రహీతలు, నౌరిల్ రౌబిని లాంటి ప్రఖ్యాత ఆర్ధికవేత్తలు అప్పుడే హెచ్చరించారు. అమెరికా సైతం, దూకుడు తగ్గించాలని ఐరోపాను హెచ్చరించింది. ఇప్పుడు గ్రీసు ప్రజల కష్టాలకు జవాబుదారీ ఎవరు? గ్రీసు పాలకులా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధా లేక వీరికి అవకాశం ఇచ్చిన వ్యవస్ధలోనే తీవ్ర లోపాలు ఉన్నాయా? ఆర్ధికవేత్తలు జవాబు చెప్పాలి.

(ఈ ఆర్టికల్ రాసి వారం పైనే అవుతోంది. పబ్లిష్ చేయడం మరిచాను. ఉపయోగకరమైన అంశాలున్నందున ప్రచురిస్తున్నాను. -విశేఖర్)

4 thoughts on “గ్రీసు రుణ సంక్షోభం: లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్

  1. అద్భుతంగా వివరించారు. నాకు తెలిసి ‘ఈనాడు’ కూడా ఇంత నిశితంగా వ్రాయలేదు ఋణ సంక్షోభం గురించి.

  2. చాలా బాగా రాశారు శేఖర్ గారూ…ఒక చక్కని ఉపాధ్యాయుడు పాఠం చెబితే ఎంత బాగా అర్ధమవుతుందో…అంత చక్కగా అర్ధమైంది. ఋణ సంక్షోభం గురించి ఇంత చక్కని వ్యాసాన్ని నేను చదవలేదు ఇప్పటిదాకా…!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s