అమెరికా గూఢచారులకు ఒక్క జనం మాత్రమే కాదు, ఐరోపా రాయబారులు కూడా లోకువే. యూరోపియన్ యూనియన్ రాయబారులు, ఇతర అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై కూడా ఎన్.ఎస్.ఎ గూఢచారులు నిఘా వేశారని స్నోడెన్ పత్రాలను ఉటంకిస్తూ జర్మన్ వార్తల మ్యాగజైన్ డర్ స్పీజెల్ తెలిపింది. ఈ మేరకు ది హిందూ ఓ వార్త ప్రచురించింది. ప్రపంచ వ్యాపితంగా సమస్త దేశాల ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగదారుల సంభాషణలపై ‘ప్రిజమ్’ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా నిఘా పెడుతోందని వెల్లడి అయినపుడు అమెరికా ప్రజల్ని టెర్రరిస్టుల బారినుండి కాపాడడానికే అలా చేస్తున్నానని అమెరికా పాలకులు సమర్ధించుకున్నారు. కాగా ఇ.యు నాయకులు అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారు.
సెప్టెంబర్ 2010 నాటి ‘టాప్ సీక్రెట్’ ఎన్.ఎస్.ఎ పత్రం ఒకదానిని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేశారు. ఆ పత్రాన్ని డర్ స్పీజెల్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ పత్రం ప్రకారం వాషింగ్టన్ లోని యూరోపియన్ యూనియన్ అంతర్గత కంప్యూటర్ నెట్ వర్క్ పైనే ఎన్.ఎస్.ఎ నిఘా పెట్టింది. న్యూయార్క్ లో 28 దేశాలు ఇ.యు కు ఐరాస బ్రాంచి కార్యాలయం ఉండగా దానిపైనా ఎన్.ఎస్.ఎ నిఘా పెట్టింది. అంతటితో ఆగకుండా బ్రసెల్స్ (బెల్జియం రాజధాని) లోని యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ ల ప్రధాన కార్యాలయం జస్టస్ లిప్సియస్ బిల్డింగ్ పైన కూడా ఐదేళ్ల పాటు నిఘా పెట్టి టెలీ కమ్యూనికేషన్స్ సంభాషణలను అన్నింటినీ విన్నది. ఈ భవనంలో ఇ.యు సభ్య దేశాలన్నింటికీ కార్యాలయాలు ఉన్నాయి.
ఈ నిఘా ద్వారా ఎన్.ఎస్.ఎ ఇ.యు, ఇ.సిల నాయకులు మరియు అధికారుల ఈ మెయిళ్ళు, మెసేజ్ లలోకి తొంగి చూసింది. టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేసింది. నాటో (అమెరికా, ఐరోపా దేశాల మిలటరీ కూటమి) కార్యాలయం నుండి ఈ కార్యాలయాలకు వచ్చిన టెలిఫోన్ కాల్స్ అన్నింటినీ ఎన్.ఎస్.ఎ రికార్డు చేసింది. నాటో కార్యాలయం లోనే ఒక ఆఫీసు తెరిచిన ఎన్.ఎస్.ఎ అక్కడి నుండి కూడా ఇ.సి కార్యాలయం పైన నిఘా పెట్టింది.
ఐరోపా ఆగ్రహం
నిఘా వార్తలపై వ్యాఖ్యానించడానికి వైట్ హౌస్ నిరాకరించిందని తెలుస్తోంది. కానీ ఇ.యు అధికారులు, వివిధ ఇ.యు దేశాల నాయకులు మాత్రం అమెరికా గూఢచర్యం పైన ఆగ్రహావేశాలు ప్రకటించారు. ఈ వార్త పైన తగిన వివరణ ఇవ్వాలని లేకపోతే అమెరికా-ఇ.యు ల సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.
“అమెరికా అధికారులు ఇ.యు కార్యాలయాలపైన నిఘా వేశారన్న వార్త విని నేను షాక్ తిన్నాను. ఈ ఆరోపణలు నిజమే ఐతే అది చాలా తీవ్రమైన విషయం. అమెరికా-ఇ.యు సంబంధాలపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది” అని ఇ.యు పార్లమెంటు అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ అన్నారు. “యూరోపియన్ పార్లమెంటు తరపున నేను పూర్తి వివరణ కోరుతున్నాను. అమెరికా అధికారులు ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారం, సాధ్యమైనంత వేగంగా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను” అని ఆయన అన్నారని రష్యా టుడే తెలిపింది.
జర్మనీ న్యాయ మంత్రి కూడా అమెరికా నుండి వెంటనే వివరణ కావాలని డిమాండ్ చేశారు. ఇ.యు ఆఫీసులను బగ్గింగ్ చేయడం ‘కోల్డ్ వార్’ అవశేషాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇ.యు పైన పూర్తిగా ‘వ్యత్యాసపూర్వకమైన’ (disprportionate) నిఘా చర్యలు తీసుకోవడంపై వస్తున్న మీడియా వార్తలు సరైనవా కావా అన్న విషయంలో అమెరికావైపు నుండి పూర్తి వివరణ వెంటనే ఇవ్వాలి” అని జర్మనీ న్యాయ మంత్రి ల్యూసర్-ష్నారెన్ బర్గర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇక్కడ ‘పూర్తిగా వ్యత్యాసపూర్వకమైన నిఘా’ అన్న పదజాలం ప్రత్యేకంగా గుర్తించాలి. ఇ.యు కూడా ఏదో విధంగా అమెరికాపై నిఘా వేస్తోందన్న ఒప్పుకోలు ఇందులో కనిపిస్తోంది. ‘మేము మీపై ఎంత నిఘా పెడితే మీరు మాపై అంతే నిఘా పెట్టాలి గానీ అంతకు మించి ఎలా పెడతారు?’ అని ప్రశ్నిస్తున్నట్లు ఉంది. ‘ఎంత తోడు దొంగలం ఐనా మరీ ఇంత అతి పనికిరాదు’ అని చెబుతున్నట్లు కూడా ఉంది. బ్రిటన్ గూఢచార సంస్ధ జి.సి.హెచ్.క్యూ కూడా 2009లో జి20 దేశాధినేతల సమావేశానికి హాజరయిన అధికారులు, నాయకులపై నిఘా పెట్టిన సంగతిని స్నోడెన్ పత్రాలే వెల్లడి చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
“ఈ వార్తలు నిజమే అయితే, చాలా రోతగా ఉన్నాయి” అని లగ్జెంబర్గ్ విదేశీ మంత్రి జీన్ అస్సెల్ బార్న్ డర్ స్పీజెల్ తో వ్యాఖ్యానించారు. “ఇది వెంటనే ఆగిపోతుందని అమెరికా ప్రభుత్వ అత్యున్నత స్ధాయి నుండి మాకు హామీ అందాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ప్రిజమ్ ప్రోగ్రామ్ కూడా ఇంత ఘోరమైనదే. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే ఎక్కువే. ప్రపంచ ప్రజలందరికీ వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన నిఘా అది. కానీ ఇందులో అమెరికా-బ్రిటన్ ఇద్దరూ భాగస్వాములు. ప్రిజమ్ ప్రోగ్రామ్ పైన భారత ప్రభుత్వం, ఇతర దేశాల ప్రభుత్వాలు ఇ.యు తరహాలో స్పందించాల్సి ఉండగా ఆ స్పందనే లేదు. విచిత్రంగా భారత ప్రభుత్వం ఆశ్చర్యం ప్రకటించి ఊరుకుంది.
అమెరికా ఆర్ధిక పతనం
అమెరికా ఆర్ధిక పతనమే ఆ దేశాన్ని ఇలాంటి పనులకు ప్రేరేపిస్తున్నదని బెల్జియన్ పార్లమెంటు మాజీ డిప్యూటీ స్పీకర్ లోడ్ వానూస్త్ వ్యాఖ్యానించడం విశేషం. ఇ.యు పై అమెరికా పెట్టిన నిఘా ‘ఆర్ధిక నిఘా’గా ఆయన అభివర్ణించాడు. “అమెరికాతో కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇ.యు ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఆ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిఘా ద్వారా ప్రత్యర్ధి ఇ.యు, తన అంతర్గత చర్చల్లో ఎ వ్యూహాలు రచిస్తున్నదీ తెలుసుకునే అవకాశం అమెరికాకు లభిస్తుంది” అని వానూస్త్ తెలిపాడు.
అమెరికా ఆర్ధిక శక్తి పతనం అవుతుండడంతో నిరాశా, నిస్పృహల పరిస్ధితి నుండి అమెరికా ఇలాంటి పనులకు పాల్పడుతోందని బెల్జియన్ నేత వ్యాఖ్యానిస్తున్నారు. “ఆర్ధిక పరంగా చూస్తే అమెరికా అన్ని చోట్లా పునాది కోల్పోతోంది. ఉదాహరణకి బ్రిక్స్ దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి. (బ్రిక్స్ బ్యాంకును వానూస్త్ ప్రస్తావిస్తున్నారు.) ఇ.యుకి రష్యాతో బలవత్తరమైన సంబంధాలు ఉన్నాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో కూడా ఇ.యుకు గట్టి సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఒకప్పుడు తన ఆర్ధిక ప్రాధామ్యాలను ఇతరులపై రుద్దినట్లుగా ఇప్పుడు రుద్దలేకపోతోంది. కాబట్టి ఈ ఆర్ధిక నిఘా వలన అమెరికాకు పెద్ద నష్టమే ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో అమెరికా, ఇ.యు ల మధ్య మాటల యుద్ధమో లేక ప్రకటనల యుద్ధమో జరగబోతోందని నావూస్త్ మాటలు సూచిస్తున్నాయి. అవేవీ కాకపోతే తలుపులు మూసుకున్న గదుల్లో ఒకరిపై మరొకరు తీవ్ర యుద్ధాలు చేసుకోవచ్చు. ఇరు పక్షాల మధ్య సంబంధాలు చెడితే ఇద్దరికీ నష్టమే గనుక “మూసిన తలుపులు వెనక కఠిన వాగ్వాదాలు ఇరు పక్షాలు చేసుకోవచ్చు” అని కూడా వానూస్త్ సూచించారు.
ఏమీ చేయనిదీ, చేయలేకపోతున్నదీ భారత పాలకులే. ఈ సంగతిని భారత ప్రజలే గుర్తించాల్సి ఉంది.
Fact rasaru sir
ilanti panulu cheste ne ardika vyavasta patanam avutundi emi cheyakundane mana economy patanam avutundi
Dear Visekhar, Have you read this article: http://stockmusings.com/tracing-the-genesis-of-the-rupee-dollar-relationship/
Govt may devalue rupee up to 1 USD = 100 Rs for the sake of IT industry. Please translate this article to Telugu.
atyadhunika sankethika parignam nu america durviniyogam chestundi, ide pani alkyda cheste!
Please read today’s( 1 july 2013) Eeenadu telugu daily business page. There HE discussed wht RBI has to do before its announcemnt on Rupee at the end of this month. I liked very much. he too says the rupee may be devalued up to Rs70 agins a US dollar.
Please read today’s Eenadu business page article written by SSTaropore:
“chetulu kalai melkonandi ippatikaina”