ఉత్తర ఖండ్ మరణాలు పదివేలు?


Uttarakhand

ఉత్తర ఖండ్ జల ప్రళయం మరణాలు పదివేలకు పైనే ఉంటాయని ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మరణాలు ఐదు వేలకు పైనే ఉండొచ్చని అంచనా వేసిన గోవింద్ సింగ్, ఇప్పుడా సంఖ్యను రెట్టింపు చేశారు. గల్లంతయిన వారి సంఖ్య గురించి గ్రామాల నుండి తనకు అందుతున్న సమాచారం ప్రకారం మరణాలు పదివేలకు పైనే ఉండవచ్చని రూఢి అవుతోందని ఆయన తెలిపారు. అయితే ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య వెయ్యి లోపే. అయితే ఆయన మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చన్న అంచనాను తప్పు పట్టకపోవడం గమనార్హం.

అల్మోరాలో సహాయ కార్యక్రమాలు పరిశీలించిన స్పీకర్ కుంజ్వాల్ మృతుల సంఖ్యపై తన అంచనాను విలేఖరులకు తెలిపారు. “ఇంతకుముందు గర్వాల్ ప్రాంతం పర్యటించి వచ్చిన తర్వాత మృతుల సంఖ్య 4,000 నుండి 5,000 వరకు ఉండవచ్చని అనుకున్నాను. కానీ నాకు అందుతున్న సమాచారం ప్రకారం, జనం కనుగొంటున్న మృత దేహాలను బట్టి చూస్తే ఈ సంఖ్య 10,000 కు పైనే ఉంటుందని నేను చెప్పగలను” అని గోవింద్ సింగ్ కుంజ్వాల్ తెలిపారు. కేదార్ నాధ్ లో శిధిలాల నుండి ఇంకా మృత దేహాలను వెలికి తీస్తున్నారని ఆయన తెలిపినట్లు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.

అయితే హిమాలయాల నుండి విరుచుకుపడిన సునామీ సంభవించి రెండు వారాల తర్వాత కూడా మృతుల సంఖ్య చెప్పడానికి ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ నిరాకరిస్తున్నారు. వెయ్యి మందికి పైగా మాత్రమే జనం చనిపోయి ఉండవచ్చని ఆయన ప్రస్తుతానికి అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. కొండల మీది నుండి నీటితో పాటు కొట్టుకు వచ్చిన బురద మట్టి, రాళ్ళు, విరిగిపడిన కొండ చరియలు అన్నీ తొలగించాక మాత్రమే మృతుల సంఖ్యను నిర్ధారించగలమని ముఖ్యమంత్రి చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం మరో రెండు రోజుల్లో మృతుల సంఖ్య విషయంలో ఒక స్పష్టత రావచ్చని అంటున్నారు. గల్లంతయిన వారి సంఖ్య 3,000 మందిగా లెక్క తేలుతోందని, వీరిలో రెండు మూడుసార్లు లెక్కించబడినవారిని తగ్గిస్తే అసలు సంఖ్య తెలియవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

మందాకిని, బాగీరధి తదితర పెద్ద, చిన్న నదులు గట్టుతో సంబంధం లేకుండా రోడ్లను, ఊళ్ళను కోసుకుంటూ, నెట్టుకుంటూ, ముంచేస్తూ, తనతో పాటు ఈడ్చుకెళుతూ కనీ వినీ ఎరుగని విలయాన్ని సృష్టించాయి. దీనివలన ఉత్తర ఖండ్ రాష్ట్రంలో రోడ్లు ఛిన్నాభిన్నం అయ్యాయి. తెహ్రీ జిల్లాలో 259 రోడ్లు నాశనం కాగా, డెహ్రాడూన్ జిల్లాలో 139 రోడ్లు, ఉత్తర కాశి జిల్లాలో 132 రోడ్లు, చమోలి జిల్లాలో 110 రోడ్లు, రుద్రప్రయాగ జిల్లాలో 71 రోడ్లు విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

వాతావరణం సరిగా లేకపోవడంతో బద్రీనాధ్ లో నిలిచిపోయిన సహాయ కార్యక్రమాలు శనివారం కాస్త తెరిపిడి పడడంతో తిరిగి పుంజుకున్నట్లు ది హిందు తెలిపింది. స్ధానిక గ్రామీణులతో సహా 1313 మందిని వివిధ చోట్ల నుండి ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. వారిలో 600 మందిని హెలికాప్టర్ల లోనూ, మిగిలినవారిని రోడ్ల ద్వారానూ తరలించారని  ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ విలేఖరులకు తెలిపారు. ఖాళీ చేయవలసినవారు ఇంకా 500 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

ఇంకా చిక్కుకుపోయి ఉన్న యాత్రీకులకు, వరదలలో మునిగిపోయిన గ్రామాలకు సరుకులు అందజేయడానికి యుద్ధ ప్రాతిపతికన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రుద్రప్రయాగ్, చమోలి, ఉత్తర కాశి జిల్లాలలోని 600 గ్రామాలు బైటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడంతో హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్ధాలు, సరుకులు సరఫరా చేస్తున్నారు. ఈ గ్రామాలకు ఇప్పటివరకూ 2,379 మెట్రిక్ టన్నుల గోధుమ, 2,875 టన్నుల బియ్యం సరఫరా చేశారని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా భాగీరధి నది పొంగుతుండడంతో సమీప గ్రామాల వారు భయంతో వణికిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నది ఒడ్డున నివశిస్తున్న 200 కుటుంబాల వారిని సురక్షిత గ్రామాలకు తరలించారు. అయితే భాగీరధి నది విషయంలో ప్రమాదం లేదని వాతావరణ అధికారులు, నిపుణులు హామీ ఇస్తున్నారు. చాలా రోజులకు సూర్యుడు కనిపించడంతో గ్లేసియర్లు కరిగి నీరుగా మారుతోందని, దానివల్ల నీటి మట్టం పెరిగిందని, వరదలు తెచ్చే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. ప్రజలు మాత్రం ఏ చిన్న జల అలికిడి విన్నా వణికిపోతున్నారు.

One thought on “ఉత్తర ఖండ్ మరణాలు పదివేలు?

  1. ప్రమాదాలు అక్కడాజరగడంలేదా? కానీ దానిని ఎదుర్కోవడంలోనే ఉంటుంది వారి సత్తా! దేశనాయకులారా! మనదేశ సైనికుల పరాక్రమాన్ని చూసైనా మేల్కోండి.సంకుచితభావనలుతో పాలించకండి విశాలధృక్పథంతొ దేశసేవ(ప్రజాసేవ) చేయండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s