ఇండియా విదేశీ అప్పు రు. 23.4 లక్షల కోట్లు


From The Hindu

From The Hindu

2013 మార్చి మాసాంతానికి భారత దేశ విదేశీ అప్పు 390 బిలియన్ డాలర్లని ఆర్.బి.ఐ తెలిపింది. డాలర్ కి 60 రూపాయల లెక్కన ఇది 23.4 లక్షల కోట్ల రూపాయలకు సమానం. అంతకు ముందరి ఆర్ధిక సంవత్సరం (2011-12) తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలుస్తోంది. స్వల్ప కాళిక వాణిజ్య రుణాలు, విదేశీ వాణిజ్య రుణాలు బాగా పెరగడంతో విదేశీ అప్పు విపరీతంగా పెరిగిందని ఆర్.బి.ఐ గురువారం తెలిపింది. కరెంటు ఖాతా లోటు పూడ్చుకోడానికి విదేశీ కరెన్సీలలో రుణాలు సేకరించాల్సి రావడంతో విదేశీ అప్పు బాగా పెరిగిందని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది.

“2012-13లో కరెంటు ఖాతా లోటు చాలా ఎక్కువగా ఉంది. ఈ లోటును పూడ్చుకోడానికి ప్రభుత్వం రుణాలపై ఎక్కువగా ఆధారపడింది. ముఖ్యంగా వాణిజ్య రుణాలపై ఎక్కువగా ఆధారపడింది. ఫలితంగా ఈ కాలంలో భారత దేశ విదేశీ అప్పు గణనీయంగా పెరిగింది” అని ఆర్.బి.ఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. వాణిజ్య మిగులు లేదా తగులు (ఎగుమతులు, దిగుమతుల తేడా), విదేశాల్లో పెట్టుబడులు ఆదాయ వ్యయాలు, నగదు బదిలీలు మొత్తం కలపగా వచ్చేది కరెంటు ఖాతా.

స్ధూలంగా చూస్తే దేశం యొక్క సరుకులు, సేవల, నగదు బదిలీల ఎగుమతుల మొత్తం వాటి దిగుమతుల కంటే తక్కువగా ఉంటే అదే కరెంటు ఖాతా లోటు. అంటే విదేశీ కరెన్సీలలో దేశ ఖర్చు కంటే ఆదాయం తక్కువగా ఉండడం కరెంటు ఖాతాలో లోటును సృష్టిస్తుంది. ఈ లోటు పూడ్చడానికి విదేశీ అప్పులు తేవడం, ఆ అప్పులపై వడ్డీలు చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేయడం… దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్ధితి విదేశీ అప్పును కొండలా పేర్చుతోంది.

మార్చి 2012 నాటికి విదేశీ అప్పు 345.5 బిలియన్ డాలర్లు ఉండగా మార్చి 2013 అంతానికి అది 390 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్.బి.ఐ అంచనా వేసింది. శాతాలలో చూస్తే ఈ పెరుగుదల (390-345.5 / 345.5 x 100) 12.87 శాతం లేదా దాదాపు 13 శాతం.

విదేశీ అప్పులో విదేశీ వాణిజ్య రుణాలు (External Commercial Barrowings) అత్యధికంగా (120.9 బిలియన్ డాలర్లు) 31 శాతం ఉన్నది. ఆ తర్వాత స్వల్పకాలిక రుణాల మొత్తం 24.8 శాతం (96.7 బిలియన్ డాలర్లు), ఎన్.ఆర్.ఐ డిపాజిట్లు (71 బిలియన్ డాలర్లు) 18.2 శాతం ఉన్నదని ది హిందు తెలిపింది. ఎన్.ఆర్.ఐ డిపాజిట్ల మొత్తం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 12.2 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలుస్తోంది. స్వల్ప మరియు దీర్ఘ కాళిక వాణిజ్య రుణాలు 20.3 బిలియన్లు పెరిగాయని విదేశీ అప్పు పెరుగుదలలో ఇదే అధిక మొత్తం అని ఆర్.బి.ఐ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.

విదేశీ అప్పు ఒక్క డాలర్లలో మాత్రమే ఉండదు. డాలర్లతో పాటు జపనీస్ యెన్, యూరోపియన్ యూరో లలో కూడా ఈ రుణాలు సేకరించబడతాయి. అయితే అంతర్జాతీయ వాణిజ్యం లోనూ, ద్రవ్య మార్కెట్ లోనూ డాలర్ ఆధిపత్యం కొనసాగుతున్నందున ఇతర కరెన్సీల కంటే డాలర్ రుణాలే ఎక్కువగా ఉంటాయి. 2012-13 రుణాల్లో డాలర్ రుణాల వాటా 57.2 శాతం కాగా యెన్ ల వాటా 6.3 శాతం. అలాగే యూరో వాటా 3.5 శాతం.

9 thoughts on “ఇండియా విదేశీ అప్పు రు. 23.4 లక్షల కోట్లు

 1. విశేఖర్ గారు,మీరు ఇప్పటివరకు పొస్ట్ చేసిన టపాలలో(గత 2 మాసాలలో)నాకు అమితాసక్తిని కలిగించిన టపా ఇది.ఎందుకంటే,మన దేశానికి ఉన్న అప్పుమొత్తం తీరిపోవాలని నా చిరకాలకోరిక! రాబోయే పదేళ్ళలో ఇదిసాధ్యమవ్వాలంటే మన ఆర్థిక వ్యవస్థకు ఎన్న దారులేమిటి?

 2. మూల గారు అప్పు దానికదే చెడ్డది కాదు. కాని ఆ అప్పు ఎందుకు వినియోగిస్తున్నారన్నదే ముఖ్యం. పెద్ద మొత్తాల్లో అప్పులు తీసుకుంటున్నపుడు దానిని ఉత్పాదక పెట్టుబడిగా ప్రజల ఆస్తులను, ఆదాయాలను పెంచడానికి వినియోగిస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అలా చేస్తే అప్పు తీర్చడం కష్టం ఎమీ కాదు.

  కాని మన బడ్జెట్ లో అధిక భాగం అనుత్పాదక వ్యయం. ఉన్న కొద్ది ఉత్పాదక వ్యయంలో కూడా పర్సెంటీజీల కింద నల్ల ధనంగా విదేశాలకు తరలి వెళ్తోంది. అప్పుల భారం మాత్రం పెరిగే పన్నుల రూపంలో, పెరుగుతున్న ధరల రూపంలో, తగ్గుతున్న ఆదాయాల రూపంలో ప్రజల నెత్తినే పడుతోంది. ఇంతకు ముందు చెప్పినట్లు అన్నీ సక్రమంగా జరిగితే అసాధ్యం అనేది ఉండదు. సక్రమంగా జరగడం అంటే ప్రతి ఖర్చూ ప్రజల కోసమే జరగడం.

 3. విశేఖర్ గారు. రష్యా విప్లవం తర్వాత లెనిన్ తమ విదేశీ అప్పులన్నింటినీ రద్దు చేసినట్లు చదివాను.

  అలాగే భవిష్యత్తులో మన దగ్గరా ఎప్పుడైనా ఓ ప్రజా ప్రభుత్వం, బాధ్యత గత ప్రభుత్వం…విదేశీ అప్పులన్నీ రద్దు చేయవచ్చు కదా.?

  ( వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థల అప్పులు మామూలు వ్యక్తుల మధ్య అప్పు లాంటింది కాదు. అంటే అప్పు తీసుకున్న దేశం తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే అధికారం ఉండదు. ఫలానా పనికే వినియోగించాలి…లాంటి షరతుల మీదనే అది అప్పు ఇస్తుంది కదా. అంటే అది ఎలా ఖర్చయిపోతుందని పర్యవేక్షించాల్సిన బాధ్యత దానిపై కూడా ఉంది. అప్పు దుర్వినియోగమైతే దాని పాత్ర కూడా ఉన్నట్లే. )

  అందుకే భవిష్యత్తులో వచ్చే ఆ వచ్చే ప్రజా ప్రభుత్వం ఏమని వాదించాలంటే….

  ” మీరిచ్చిన అప్పులన్నీ గతంలో దోపిడీ దారులు దోచుకున్నారు. ప్రజోపయోగకరమైన పనులు చేయలేదు. మీరు జనానికి ఉపయోగపడతాయా, లేదా అని చూడకుండా దివాళాకోరులకు అప్పులు ఇచ్చారు. కాబట్టి గతంలో దోపిడీ ప్రభుత్వాలకు మాకు సంబంధం లేదు. కాబట్టి మీ అప్పులు మేం చెల్లించం అనాలి”. )

  నా ఈ వాదనతో కొందరు విభేదించవచ్చు. ఇది అప్పులు కట్టలేక దివాళా తీసి ఎగ్గొట్టడమో….మరోటో కాదు. దేశ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా, దోచుకోవడానికి అప్పులు ఇస్తే ఆ తర్వాత వచ్చే ప్రజాప్రభుత్వాలు వాటిని చెల్లించవని వరల్డ్ బ్యాంకు లాంటి దోపిడీ దారులకు తెలిసేలా…. గుణపాఠం వచ్చేలా చేయడానికి.

  ఇలాంటి చర్య వల్ల మన దేశం పరువు పోతుందనో….ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందనో కొందరు వాదించవచ్చు. కానీ బాధ్యత గల ప్రభుత్వం వచ్చి…. దేశం అభివృద్ధి బాటన పడితే, అప్పులిచ్చే వాడు మళ్లి చచ్చినట్లు వచ్చి అప్పులిస్తాడు.

  రష్యా అలా చేయడం వల్ల పరువు పోయిందా. ఆ తర్వాత ప్రపంచంలోనే అగ్ర దేశంగా ఎదిగింది కదా…?

  ఐతే ఇది నాకున్న కొద్ది అవగాహన పరిధిలో నా అభిప్రాయం మాత్రమే….పైగా అదీ ప్రజల ప్రభుత్వం ఏర్పడితే. ఆ ప్రభుత్వానికి అగ్రదేశాలను ఎదిరించే ధైర్యం ఉన్నప్పుడే.

 4. చందు తులసి గారు,
  మీరు కొద్ది అవగహన అంటున్నారుగాని, చాలా సరిగ్గా చెప్పారని నాకు తోస్తున్నది. నేనుకూడా ఎక్కడో చదివినట్ట్లు గుర్తు. ఇక పరువంటారా, అప్పిచ్చే వారికి లేని పరువు తిరిగి చెల్లించేవారికెందుకండి(ఇది దేశాల విషయంలోనే సుమండీ! వ్యక్తుల విషయంలో కాదు) ఎందుకంటే, వాల్లు మన దేశాన్నే దోచుకొని, మల్లీ మనకే అప్పు లిస్తున్నారు! – వ్యక్తుల విషయములో దాదాపు అంతే ననుకోండి. మన మైక్రో ఫైనాన్‌ స్‌ సంస్తల్లాగా! వరల్డ్‌ బ్యాంక్‌ వాల్లు అప్పిచ్చే దేశాలకు షరతులు విదించడం అవునేమో కాని, ఆషరతులు వాల్లకి లాభాలు వచ్చే పెట్టుబడులమీదే పెట్టాలని విన్నాను. మరి శేఖర్‌ గారు ఎమంటారో చూద్దాం.

 5. @ చందుతులసి & తిరుపాలు

  ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ అని ఒక పుస్తకం ఉంది. జాన్ పెర్కిన్స్ అనే అమెరికన్ రచయిత రాసిన “Confessions of an Economic Hit Man” పుస్తకానికి ఇది అనువాదం. హెచ్.బి.టి వాళ్ల ముద్రణ అనుకుంటాను. హృదయం పేరుతో బ్లాగ్ నిర్వహిస్తున్న కొణతం దిలీప్ ఈ అనువాదం చేశారు. (ఈ బ్లాగ్ ను ‘బ్లాగ్ గురించి’ పేజీలో మొట్టమొదట అభినందించి ప్రోత్సహించింది ఆయనే.)

  మూడో ప్రపంచ దేశాలకు ఇచ్చే అప్పులన్నీ ఆ దేశాలను రుణ గ్రస్తంగా మార్చి తమపై శాశ్వతంగా ఆధారపడేట్లు చేసుకోవడానికి ఉద్దేశించినవే అని ఈ పుస్తకంలో జాన్ పెర్కిన్స్ చాలా స్పష్టంగా, ఆధారాలతో చెప్పారు. అమెరికా తరపున ఆయనే అలాంటి పనిని నిర్వహించినందున సాధికారికంగా ఆయన చెప్పగలిగారు, పశ్చాత్తాపంతో. వీలయితే ఒకసారి చదవలరు. అప్పుల పేరుతో మూడో ప్రపంచ దేశాలకు వచ్చే మొత్తం కంటే చెల్లింపులు, వాణిజ్య ఒప్పందాలు, ప్రైవేటీకరణ ఒప్పందాల రూపేణా పశ్చిమ దేశాలకు వెళ్లేది అనేక రెట్లు ఉంటుందని ఆయన వివరించారు. పశ్చిమ దేశాలు మిడిసిపడే అభివృద్ధి, సంపదలు అన్నీ మూడో ప్రపంచ దేశాల ప్రజలు, వనరుల పుణ్యమే.

  కాబట్టి మీరిద్దరు చెప్పినట్లు పశ్చిమ దేశాల అప్పులు రద్దు చేయడం తప్పు కాకపోగా, అదే సరైన నిర్ణయం అవుతుంది. అవసరమైన నిర్ణయం అది. ప్రజా ప్రభుత్వమే వస్తే అప్పులు చెల్లించమని అడగను కూడా అడగరు. ఎందుకంటే వారే అనేక రెట్లు మనకి చెల్లించాల్సి ఉంటుందని వారికి తెలుసు గనక. ఆ విధంగా అప్పు చెల్లించమని ప్రజా ప్రభుత్వాన్ని అడిగితే పోయేది వారి పరువే. ప్రజా ప్రభుత్వ హయాంలో దేశం యొక్క నిజమైన పరువు ఎక్కడ ఉంటుందే ప్రజలకు చక్కగా తెలుస్తుంది. ఆ మేరకు ప్రభుత్వమే ప్రజలకు వివరిస్తుంది. ఇక పరువు పోయేదేముంటుంది?

  అప్పులు రద్దయితే ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలం ఏమీ కాదు. అలా అని పశ్చిమ పత్రికలు ప్రచారం చేసినా నిజం అది కాదు. చందుతులసి చెప్పినట్లు విప్లవం వచ్చిన పదీ, ఇరవై యేళ్లలో అమెరికాకి పోటీగా రష్యా ఎదిగడానికి కారణం సోషలిస్టు వ్యవస్ధే. అనేక శతాబ్దాలుగా అమెరికా సాధించిన సో కాల్డ్ అభివృద్ధి రష్యా రెండు మూడు దశాబ్దాల్లో చేసి చూపింది. శ్రామిక ప్రజలను నమ్ముకున్న దేశం తప్పనిసరిగా అభివృద్ధి సాధిస్తుంది.

 6. ఇన్నిలోటుపాటులు చూస్తుంటే మనదేశవ్యవస్థ మీద చిరాకు కలుగుతుంది.వ్యక్తిగతంగా ఈ దేశాన్ని చూసి గర్వించలేని పరిస్థితిలోఉన్నాను.ఉద్యమాలవలన కాకుండా ఈ వ్యవస్థలో పరివర్తన తీసుకురావడం అసాధ్యమా? ప్రజలలో వ్యక్తిగతం గా మార్పుతీసుకురావడనికి మరో గాంధీ పుట్టాలా? క్షమించాలి నాకు ఇటువంటి పునర్జన్మలమీద నమ్మకంలేదు కానీ జవాబుకై ఆతృత కొద్దీ అలా వ్రాశా!

 7. ప్రజా ప్రభుత్వమే వస్తే అప్పులు చెల్లించమని అడగను కూడా అడగరు. ఎందుకంటే వారే అనేక రెట్లు మనకి చెల్లించాల్సి ఉంటుందని వారికి తెలుసు గనక. ippudu unnadi ye prabhutvam aneka retlu manaki enduku chellistaaru

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s