అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ రహస్య ‘హక్కుల ఉల్లంఘన’ను బైట పెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తమ వద్దే ఉన్నాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ కుండ బద్దలు కొట్టారు. ఆయన స్వేచ్ఛా జీవి అనీ, తాను కోరుకున్న చోటికి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని పుటిన్ స్పష్టం చేశారు. స్నోడెన్ ను అమెరికాకు అప్పగించే ఆలోచనేదీ తమకు లేదని కూడా పుటిన్ తెలిపారు.
“స్నోడెన్ మాస్కో వచ్చిన మాట నిజం. ఆయన రాక మాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ట్రాన్సిట్ పాసింజర్ గా ఆయన వచ్చారు. రష్యన్ వీసా గానీ, ఇంకే ఇతర పత్రాలు గానీ ఆయనకు అవసరం లేదు. ఒక ట్రాన్సిట్ పాసింజర్ గా ఒక టికెట్ కొనుక్కొని ఆయన ఎక్కడికైనా వెళ్లొచ్చు” అని ఫిన్ లాండ్ లో విలేఖరులతో మాట్లాడుతూ పుటిన్ అన్నారని ఆర్.టి తెలిపింది.
మాస్కో లోని షెరెమెట్యెవో విమానాశ్రయంలో స్నోడెన్ ప్రస్తుతం ఉన్నారని పుటిన్ నొక్కి చెప్పారు. రష్యా పైన చేసే ఆరోపణలన్నీ చెత్తగా ఆయన కొట్టి పారేశారు. రష్యా సరిహద్దు ఆయన దాటనప్పుడు రష్యాపై ఎలా ఆరోపణలు చేస్తారనేది పుటిన్ వాదన. రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావరోవ్, ఇతర మంత్రులు, అధికారులు సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. విమానాశ్రయం దాటి రానంతవరకు ఎడ్వర్డ్ స్నోడెన్ రష్యా సరిహద్దు దాటి రష్యా భూభాగం లోకి ప్రవేశించినట్లు కాదని పుటిన్ మాటల ద్వారా అర్ధం అవుతోంది.
రష్యా, అమెరికాల మధ్య నేరస్ధులను అప్పగించుకునే ఒప్పందం (extradition treaty) ఏదీ లేదని చెబుతూ పుటిన్ స్నోడెన్ ను అమెరికాకు అప్పగించడం అసాధ్యం అని తేల్చేశారు. “విదేశీ పౌరులను ఏ దేశానికైనా అప్పగించాల్సి వస్తే, అందుకు అనుగుణమైన అంతర్జాతీయ ఒప్పందాలు మాకు ఆ దేశంతో ఉంటేనే అలా చేయగలం” అని పుటిన్ వివరించారు. “రష్యా నేలపై స్నోడెన్ ఎలాంటి నేరమూ చేయలేదు. రష్యా భద్రతా సంస్ధలు ఆయనతో ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. ఇప్పుడు కూడా చేయడం లేదు” అని ఆయన తెలిపారు.
“స్నోడెన్ ఒక స్వేచ్ఛా జీవి. ఆయన తన అంతిమ గమ్యాన్ని ఎంత త్వరగా ఎంచుకుంటే, అతనికీ, రష్యాకూ అంత మంచిది” అని పుటిన్ తెలిపారు.
వికీలీక్స్ అధినేత జులియన్ ఆసాంజే విషయంలో కూడా పుటిన్ ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. “స్నోడెన్ లాగానే ఆయన కూడా తనను తాను హక్కుల కార్యకర్తగా పరిగణిస్తారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: ఇలాంటి వారిని అప్పగించి ఆ తర్వాత జైలు పాలు చేయాలా?” అని పుటిన్ ప్రశ్నార్ధకం ద్వారా తాను చెప్పదలిచింది చెప్పారు.
అయితే అమెరికా మాత్రం స్నోడెన్ ను తమకు అప్పగించాలని రష్యాను ఇంకా కోరుతూనే ఉంది. నేరస్ధుల అప్పగింత ఒప్పందం లేకపోయినప్పటికీ తగిన చట్టబద్ధమైన అవకాశం ఉన్నదని అమెరికా వాదిస్తోంది.
స్నోడెన్ వీసాను రద్దు చేయడంతో ఆయన మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయారని ఆర్.టి చెబుతోంది. ఈ మేరకు వికీ లీక్స్ నుండి ట్విట్టర్ లో ఒక అవగాహన వెలువడిందని తెలిపింది. స్నోడెన్ పాస్ పోర్ట్ ను రద్దు చేయడం వలనా, మధ్యంతర దేశాలను లొంగదీసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల వలనా స్నోడెన్ శాశ్వతంగా రష్యాలోనే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయని వికీ లీక్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
స్నోడెన్ వెంటపడడానికి ఆయనేమీ టెర్రరిస్టు కాదు. అంతర్జాతీయంగా దేశాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేస్తూ వేట కుక్క తరహాలో మతి లేని ప్రకటనలు ఇవ్వడానికి స్నోడెన్ లాడెన్ తరహాలో (అమెరికా ఆరోపించినట్లు) అమెరికన్లు ఎవరినీ చంపలేదు. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లాగా ఎవరి సోమ్మూ దోచుకోలేదు. ఆయన ఆల్-ఖైదా సభ్యుడు కాదు. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ తో ఆయనకు సంబంధాలు లేవు. అమెరికా, మట్టుపెడతానంటూ బయలుదేరిన తాలిబాన్ సభ్యుడు కూడా కాదు స్నోడెన్. పైగా ఆ తాలిబాన్ తోనే చర్చలు జరుపుతానని బతిమాలుతోంది.
మరెందుకు ఎడ్వర్డ్ స్నోడెన్ ను అమెరికా వేటాడుతున్నట్లు? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పినట్లు అంతర్జాతీయ చట్టాలతో పాటు అమెరికా సమాచారహక్కు చట్టం గ్యారంటీ చేసిన ప్రజాస్వామిక హక్కులలో భాగంగానే స్నోడెన్, తన స్వంత ప్రజలపైనే కాకుండా ప్రపంచ ప్రజలందరిపైనా అమెరికా సాగిస్తున్న దొంగచాటు గూఢచర్యాన్ని వెల్లడించాడంతే. స్నోడెన్ వేట ఒక్కటి చాలదా అమెరికా రాజ్యం అనుసరించేది ప్రజాస్వామ్యం కాదనీ, పరమ నియంతృత్వం అని నిర్ధారించడానికి!?