ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్


N C Babu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం అయినట్లు కనిపిస్తోంది.

భాష వల్ల అయితేనేమీ, రాష్ట్ర ప్రభుత్వ స్పందనారాహిత్యం వల్ల అయితేనేమి తెలుగువారు సహాయ కార్యక్రమాల్లో వివిధ చోట్ల వివక్ష ఎదుర్కొన్నట్లు పత్రికలు, ఛానెళ్లు తెలిపాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి కొందరిని నేరుగా హైద్రాబాద్ తీసుకురావడం, ఢిల్లీలో ఏ.పి భవన్ వద్ద ధర్నా నిర్వహించడం, ఎవరూ వెళ్లని బద్రీనాధ్ కు తెలుగుదేశం నాయకులు వెళ్ళి పలకరించడం… తదితర చర్యలు ఆ పార్టీకి ప్రతిష్ట తెచ్చిందని చెప్పవచ్చు.

బద్రీనాధ్ బాధితులు

ఉత్తర ఖండ్ లో వరదలు ప్రధానంగా కేదార్ నాధ్, దాని చుట్టూపక్కల లో కేంద్రీకృతం అయ్యాయని పత్రికలు తెలిపాయి. కేదార్ నాధ్ తో పోలిస్తే బద్రీనాధ్ లో సాపేక్షికంగా చాలా తక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే రవాణా సౌకర్యాలు తెగిపోవడంతో బద్రీనాధ్ యాత్రీకులు కూడా ఇళ్లకు తిరిగి రాలేని పరిస్ధితిని ఎదుర్కొన్నారు. సహాయ కార్యక్రమాలు ప్రారంభంలో ప్రధానంగా కేదార్ నాధ్ లో కేంద్రీకృతం కావడం వలన బద్రీనాధ్ లో చిక్కుకున్నవారు వారం పైగా తిండీ, తిప్పలు లేక గడపాల్సి వచ్చింది. సుగర్, బి.పి తదితర వ్యాధులు ఉన్న అనేకమంది మందులు నిండుకుని తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు.

సహాయం అందక బద్రినాధ్ లో చిక్కుకుపోయిన వారం రోజుల్లో తెలుగువారు వివక్ష ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అధికారుల నుండి ఎత్తిపొడుపులు, ఆహారం దొరకబుచ్చుకోవడానికి తీవ్ర పోరాటం చేయాల్సి రావడం, ఎమర్జన్సీ మందులు అందుబాటులో లేకపోవడం… ఈ కారణాలతో తాము ప్రత్యక్ష నరకం చవిచూశామని బైటపడ్డవారు చెప్పినట్లు ది హిందు తెలిపింది. బద్రీనాధ్, జోషి మఠ్ ల మధ్య రోడ్డు తెగిపోవడంతో హెలికాప్టర్లలో తప్ప బైటపడలేని పరిస్ధితి. 400కు పైగా ఉన్న తెలుగువారిలో ఈ వారం రోజుల్లో ఎవరికి ఫోన్ చేసినా దుఃఖతో గొంతు పూడుకుపోయి మాట్లాడిన పరిస్ధితి ఎదురైందని పత్రిక తెలిపింది. హెలిపాడ్ వరకు వెళ్ళడం అక్కడ ఆంధ్ర ప్రదేశ్ వారని తెలిసి వెనక్కి పంపించేయడం జరిగిందని పలువురు తెలిపారు.

ఎందుకీ వివక్ష? రామచంద్రాపురం BHEL లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. BHEL లో సీనియర్ టెక్నీషియన్ గా పని చేస్తున్న జె.రామ్ రెడ్డి ప్రకారం సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలుగువారి పట్ల తిరస్కార భావంతో వ్యవహరించారు. దానికి కారణం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. “వారేమంటారంటే, మీది పెద్ద రాష్ట్రం కదా, మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాలు కూడా హెలికాప్టర్లను సరఫరా చేస్తుంటే, మీ ప్రభుత్వం ఎందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేయదు?” అని ప్రశ్నించారాని రామ్ రెడ్డి తెలిపారు.

ఒకసారయితే హెలికాప్టర్ లో కూర్చున్నవారిని కూడా బైటికి నెట్టేశారని రామ్ రెడ్డి తెలిపారు. “వారిని బైటికి నెట్టేశారు. మహిళలు ఏడ్చుకుంటూ వెనక్కి రావలసి వచ్చింది. ఎందువల్ల తమపై వివక్ష చూపుతున్నారో వారికి అర్ధం కాలేదు” అని ఆయన తెలిపారు. BHEL లోని మరో ఉద్యోగి భార్య విజయ లక్ష్మి ఇలా తెలిపారు. “28 మంది ఉన్న మా బృందంలో కనీసం ఆరుగురు సుగర్, గుండే జబ్బులతో బాధపడుతున్నారు. మావద్ద మందులన్నీ అయిపోయాయి. కొత్తగా మందులు కొనుక్కోడానికి మార్గమే లేదు. అనేకమంది అప్పటికే జ్వరంతో నీరసించారు. ఆ వాతావరణం వలన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడ్డారు” అని తెలిపారు.

ఎ.పి భవన్ లో చంద్రబాబు నాయుడు ధర్నా

ఎ.పి భవన్ లో చంద్రబాబు నాయుడు ధర్నా

తెలుగుదేశం ఎం.పి రమేష్ రాధోడ్ బద్రీనాధ్ వచ్చాక తమకు కాస్త నమ్మకం కలిగిందని, తిరిగిరాగలమన్న ఆశ చిగురించిందని రామ్ రెడ్డి చెప్పినట్లుగా ది హిందు తెలిపింది. పత్రిక ప్రకారం ఇంకా 424 మంది తెలుగువారి జాడ ఏమైందీ తెలియలేదు. వారు తమ కుటుంబాలను సంప్రదించనూ లేదు. ఇటు పునరావాస శిబిరాల్లో గానీ, ఏ.పి భవన్ లో గానీ ఉన్నట్లు తేలనూ లేదు. వీరిలో అనేకమంది భద్రమైన చోటికి చేరి ఉంటారని, లేదా ఉత్తర భారత రాష్ట్రాల్లో తమ బంధువుల ఇళ్లకు చేరి ఉంటారని ఆం.ప్ర. ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగినా కుటుంబాలను కాంటాక్ట్ చేసి ఉండేవారు కదా అన్న అనుమానం కలుగుతోంది. కొద్ది మంది కొండల్లోనే ఇంకా దిక్కూ దరీ తెలియక తిరుగుతుండవచ్చన్న అనుమానాలను కూడా కొట్టిపారేయడం లేదు.

డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం వారి ప్రకారం 2544 మంది ఏ.పి నుండి ఉత్తర ఖండ్ రాగా, 1200 మంది ఇళ్లకు తిరిగి వచ్చారు. 920 మంది ఇంకా శిబిరాల్లో ఎదురు చూస్తున్నారు. లేదా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వీరు కాక ఇంకా 424 మంది లెక్క తేలలేదు. ఉత్తర ఖండ్ ప్రభుత్వం, జాడ తెలియనివారి కుటుంబాలు ఇచ్చిన సమాచారం, రాష్ట్ర స్ధాయి కంట్రోల్ రూమ్, జిల్లా కలెక్టర్లు అందించిన సమాచారం… ఇవన్నీ క్రోడీకరించి ఈ లెక్కకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ చేసిన కృషి, అది ఎంత తక్కువైనా, సహజంగానే బాధితులకు ఊరట ఇచ్చింది. తెలుగువారిని విమానంలో వెనక్కి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మాత్రమే సిద్ధపడింది. జూన్ 15 నుండి బద్రీనాధ్, డెహ్రాడూన్, కేదార్ నాధ్ తదితర చోట్ల వారు చిక్కుకుపోగా జూన్ 25న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం బట్టి అది తన బాధ్యతను ఎంత చక్కగా గుర్తించిందో తెలుస్తోంది. ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని సహాయ కార్యక్రమాల్లో ఉన్న ఆర్మీ అధికారులే ఎత్తి చూపారంటే పరిస్ధితి స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే తెలుగువారు హెలికాప్టర్ల వద్ద అవమానం ఎదుర్కోవలసి వచ్చిందని బాధితుల మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఎ.పి భవన్ వద్ద వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన తె.దే.పా బృందాన్ని అక్కడి నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నించారన్న వార్తలు మరింత వెగటు తెప్పిస్తున్నాయి.

‘వ్యవసాయం దండగ’ అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తీవ్ర విమర్శల పాలై రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కాల్పులు జరపడం, అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించడం, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ లాంటి ప్రఖ్యాత రాష్ట్ర కంపెనీలను ప్రైవీటీకరించడం… మొదలయిన చర్యల వలన తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దానితో చివరి నిమిషాల్లో ఫలితాన్ని శాసించగలవారు మరో రాయిని వెతుక్కున్నారు. ఫలితంగా టి.డి.పి తొమ్మిదేళ్ళుగా అధికారానికి దూరమయింది.

ఈ పరిస్ధితుల్లో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తె.దే.పా ఇటువంటి కృషితో ప్రజలను ఆకట్టుకుని పోయిన ప్రతిష్ట తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ వరదల సహాయం, రాష్ట్ర పాలన వేరు వేరు. అధికారంలోకి వచ్చాక ప్రతి పార్టీ ప్రజలకు మొండి చెయ్యి చూపేదే అని ఆయా పార్టీలే స్వయంగా నిరూపించుకున్నాయి. జనాన్ని ఆకట్టుకునే కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కురిపిస్తున్న వాగ్దానాలు, హామీ ఇస్తున్న తాయిలాలు అప్పటి రాజశేఖర రెడ్డి గారి మరో ప్రస్ధానం నాటి వాగ్దానాలను తలపిస్తున్నాయి.

7 thoughts on “ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

 1. ‘వ్యవసాయం దండగ’ ….. నిజంగా చంద్ర బాబు ఈ మాట అన్నారా విశెఖర్ గారు… ఈ మాట చల మంది అనడం నెను విన్నాను… తెలుగుదేశం వాళ్ళు అన్లెదు అంటారు… అయన నిజం గనె అన్నరా ఆ మట … కెవలం తెలుసు కొవడానికి అదుగుతున్నాను..

 2. నాగశ్రీనవాస గారు

  ఆయనా మాట అనగా పత్రికలన్నీ అప్పుడు రాశాయి. కొన్ని పత్రికలు ఇప్పటిలాగా ఖండానాపూర్వకంగా కాకుండా అదొక సుభోధకంగా రాసాయి. అప్పటి వాతావరణం వేరు. రైతులు ప్రభుత్వాల్ని మార్చగలరని అప్పటికి అనుభవం లోకి రాలేదు. కులాల వారిగా ఓట్లు, ఓటర్లను చీల్చి మన కులం వాళ్లంతా మనకే ఓటేస్తారు అన్న నమ్మకంతో ఉన్న కాలం. రాష్ట్ర ప్రజల కంటే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎమ్.ఎఫ్ లలే ఎక్కువ విలువ ఇస్తూ, రాష్ట్ర ప్రజల కంటే ఆ సంస్ధలపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న కాలం అది. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ తదితర మహామహులనుకుంటున్నవారితో వేదికలు పంచుకున్న కాలం అది. రైతులను భూముల నుండి తరిమేసి కూలీలుగా మార్చి వాటిని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడానికి రాష్ట్ర నేతలు కంకణం కట్టుకున్న కాలం అది. సరిగ్గా ఈ కారణం వల్లనే వ్యవసాయాన్ని బలవంతంగా దండగమారిగా మార్చాలనుకున్నారు. ఈ నేల సత్యాలు (ground facts!) లేదా భౌతిక సత్యాలు (physical facts) చంద్రబాబునాయుడుగారిని ఆ మాటలనడానికి ప్రేరేపించాయి.

  కాంగ్రెస్ వాళ్లు ఆ మాటల్ని ఉపయోగించుకున్నారు గానీ, వారు చేసిందీ, చేస్తున్నదీ కూడా అదే. చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలను కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా కొనసాగించింది. జలయజ్ఞం, సెజ్ లు, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ అన్నీ చంద్రబాబు విధానాల కొనసాగింపే. కాకపోతే రూపం కొద్దిగా మారిందంతే. ప్రాజెక్టులు, సెజ్ ల పేరుతో భూములు లాక్కుని రియల్ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు ఇచ్చేశారు. ముందు ప్రభుత్వ అవసరాల కోసం అంటూ తక్కువ పరిహారంతో భూములు బలవంతంగా లాక్కోవడం, అనంతరం డెవలప్ మెంట్ పేరుతో రియల్ కంపెనీలకు అప్పజెప్పి భూముల విలువ అమాంతంగా పెంచడం, దానితో పాటు తక్కువ ధరలకు స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేయడం… ఇదంతా ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. ఇవి కేవలం చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ల విధానాలు అనుకుంటే పొరబాటు. వారు ఉపకరణాలు మాత్రమే. వీరి చేత ఆ పని చేయిస్తున్నది స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీల సామ్రాజ్యవాద వ్యవస్ధ. ప్రధానంగా పశ్చిమ దేశాల కంపెనీల ఒత్తిడితో ఇది జరుగుతోంది.

  కాబట్టి చంద్రబాబుగారు ఆ మాట అన్నారా లేదా అన్న అనుమానం అనవసరం. అదే సమయంలో కాంగ్రెస్ ఆయనకి భిన్నంగా ఆలోచిస్తోంది అనేది కూడా అబద్ధం. వాళ్లంతా ఒక తానులోని ముక్కలే.

 3. thanks for the information Visekhar garu… విశెఖర్ గారు…. ఈ విషయం మీద చాల కాలంగా నాకు సందేహం ఉంది…. చంద్రబాబు మీద ఉన్న కొద్దిపాటి అభిమనం వల్ల కావచు .. ఆ మాట అయన అన్నారంటె నాకు నమ్మబుధి కలేదు … అందుకె మిమ్మల్ని అడిగాను …….

 4. చంద్రబాబు “వ్యవసాయం దండగ” అని అన్నారా?..లేదా..? అన్నది నిజంగానే మనరాష్ట్ర్రంలో చాలా మందికి ఆసక్తికరమైన అంశం. తెలుగుదేశం వ్యతిరేకులకు సదా అందుబాటులో ఉండే అస్త్రం.

  ఇందుకోసం చంద్రబాబు రాసిన ‘మనసులో మాట ‘ పుస్తకంలోని 232, 233 పేజీల్లో మాటలని వారు రుజువుగా చూపిస్తున్నారు.

  చంద్రబాబు ఆ పుస్తకంలో రాసిందేందంటే …” వ్యవసాయం సంపూర్ణ ఉద్యోగితను ఇవ్వలేదు, సంపదను సృష్టించలేదు. ఇప్పటికే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వారు చాలామంది పరిశ్రమలకు, సేవా రంగానికి, ఇతర వ్యవసాయేతర రంగాలకు మారుతున్నారు. కాబట్టి వ్యవసాయ రంగంలోంచి మన దేశంలో చాలామంది పక్కకు పోవాలని…లేదా ఎలాగైనా ప్రభుత్వాలు పక్కకు తప్పించాలి. ఇదీ సంక్షిప్తంగా ఆ పేజీల్లోని సారాంశం.

  దీంతో పాటు చంద్రబాబు ఇంకొన్ని అభిప్రాయాలు కూడా చెప్పారు.
  ప్రజలకు సబ్సిడీలు ఇవ్వరాదని…సబ్సిడీలు ప్రజలను సోమరిపోతులుగా ( ఈ పదం వాడారు.) తయారు చేస్తాయని రాశారు.

  ఆ తర్వాత వైఎస్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినపుడు…ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు ఉండదని, కరెంటు తీగలపై ఉతికిన బట్టలు ఆరేసుకోవాల్నిందేనని ఎద్దేవా చేశారు.

  ఐతే చంద్రబాబు వ్యవసాయం దండగ స్వయంగా నోటితో అన్నారా…లేదా అనే పరిశోధన కన్నా…. ఆయన అధికారంలో ఉండగా అమలు చేసిన విధానాలు ఎలాంటివో చూస్తే మనకు అసలు సంగతి అర్ధమవుతుంది.

  బాబు తన హయాంలో అనేక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించారు.

  ఉదాహరణకు ఆ రోజుల్లో విద్యుత్ అధికారులు…. రైతులు బిల్లులు చెల్లించకుంటే బలవంతంగా విద్యుత్ మోటార్లు తీసుకుపోయేవారు. కొన్ని చోట్ల వేలం పాట కూడా వేశారు. అలా గ్రామంలో బహిరంగంగా వేలం వేయడం…రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. అదీ కాక బాబు పాలించిన సమయంలో రాష్ట్ర్రంలో తీవ్రమైన కరవు వచ్చింది. ఓ వైపు పంటలు పండక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం అనేక రకాలుగా వేధించింది.

  అందుకే ఇప్పటికీ మన రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు అంటే భయం. పచ్చి వ్యతిరేకత.

  ఒక్క రైతులకే కాదు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసించిన ఆందోళన కారులపై జరిపిన కాల్పులు
  ..అంగన్ వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించడం, ఇలా అనేక రకాలుగా చంద్రబాబు ప్రజలకు దూరమయ్యాడు.

  సరిగ్గా దాన్నే వైఎస్ అవకాశంగా మలుచుకున్నాడు. ఉచిత విద్యుత్, ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్లు….ఇలా జనానికి దగ్గరయ్యాడు. ఏకంగా రెండు సార్లు సీఎం అయ్యాడు.

  ఇందులో ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…తన ఆత్మకథలో అనేక ముచ్చట్లు రాసుకున్న
  చంద్రబాబు గారు తీరా ఇప్పుడు మాత్రం తన విధానాలు…ఆలోచనలు తనను అధికారంలోకి తీసుకురాలేవని గ్రహించారు. అందుకే రూటు మార్చాడు.

  రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏది తోస్తే అది వాగ్దానం చేస్తున్నాడు.

  రైతులకు లక్ష కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు సైతం మాఫీ చేస్తాననే సాహసమూ చేస్తున్నాడు.

  కనుక రైతు వ్యవసాయం దండగ అన్నారా…లేదా అన్న ఆధారాలు వెతక్కుండానే ఆయన ఒక్క వ్యవసాయంలోనే కాదు…. అనేక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించారన్నది పచ్చి నిజం.
  ప్రజల్లో ఆ రోజు కలిగిన భయమే….ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై ఇంత వ్యతిరేకత ఉన్నా, జనం చంద్ర బాబు కన్నా జగన్ వైపు చూసేలా చేస్తోంది.

  బాబుపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే….జగన్ చేసిన అవినీతి సైతం వారికి పెద్ద విషయంలాగ తోచడం లేదు.

 5. చంద్రబబు పై వ్యతిరేకత మీరు చెప్పిన స్థాయిలో ఉందని నెను అనుకొవట్లెదు. గత ఎన్నికలలొ అయన 90 కి పైగ సీట్లు సాధించారు. ఛిరంజీవి చీల్చకుండ ఉంతె అయన కచితంగ అధికరం లోకి వచెవరని చాలమంది అభిప్రాయం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s