–
నాయకుడు: దారుణం! నా హృదయం ఈ అభాగ్యుల కోసం విలపిస్తోంది…
పైలట్: ఇది మీ సొంత రాష్ట్రమే సార్, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మనం వెనక్కి వచ్చేశాం!
———000———
ఉత్తర ఖండ్ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంభవించిన మేఘ ప్రళయం (cloud bursts), హఠాత్ వరదల (flash floods) ను సృష్టించింది. ఈ వరదల్లో అనేకమంది తప్పించుకోవడానికి కూడా తగిన వీలు, సమయం లేక అసువులు బాసారు. ఇప్పటివరకు 800 చిల్లర మృతులు తేలినట్లు అధికారులు లెక్క చెబుతున్నప్పటికీ వాస్తవ సంఖ్య 5,000 పైనే ఉంటుందని భయపడుతున్నారు. ఈ మేరకు ఉత్తర ఖండ్ రాష్ట్ర మంత్రి ఒకరు పత్రికలకు తెలిపారు.
బైట పడే మార్గం లేక, హెలికాప్టర్లు వచ్చే అనుకూల వాతావరణం లేక వివిధ చోట్ల కొండలపై ఇరుకున్నవారు ఇంకా 8,000 మంది ఉన్నారని ఆర్మీ చెబుతోంది. వీరు కాకుండా గల్లంతైన వారి లెక్క ఇంకా పూర్తిగా తేలలేదు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారే తిరిగిరానివారు, శిబిరాల్లోనూ లేనివారూ మొత్తం 424 మంది ఉన్నారని ది హిందు బుధవారం తెలిపింది. ఈ లెక్కన అన్ని రాష్ట్రాల వారిని కలిపితే ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా.
ఈ నేపధ్యంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రక్షణ ఏర్పాట్లు కొన్ని చోట్ల ప్రశంసలు పొందుతుండగా, మరికొన్ని చోట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడంతో తెలుగు ప్రజలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని పత్రికలు, ఛానెళ్లు చెబుతున్నాయి. విమానాల్లో ఏరియల్ సర్వే చేసి సానుభూతి ప్రకటించడంలో ఉన్న శ్రద్ధ వాస్తవంగా రక్షణ ఏర్పాట్లు, ఇళ్లకు తిరిగి తేవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో లేదని విమర్శలు వినవస్తున్నాయి.
ప్రకృతి ప్రళయం నుండి బతికి బైటపడినవారిని కాపాడడం మాని ప్రళయం ఎంత దారుణమో అభివర్ణిస్తూ సానుభూతి ప్రకటనలు ఇవ్వడం తద్వారా జనం కోసం శ్రమించినట్లు ఫోజులివ్వడం ఎంత అపహాస్య పూరితంగా మారిందో ఈ కార్టూన్ తెలియజేస్తోంది. ఉత్తర ఖండ్ కు వరుస కట్టిన నాయకులు సొంత రాష్ట్రాల్లో ఉపద్రవంలో వచ్చినపుడు ఏ మేరకు స్పందిస్తారో కూడా ఈ కార్టూన్ పరోక్షంగా ఎత్తి చూపుతోంది.