అమెరికా రాజ్యాధినేతల అక్రమ గూఢచర్యాన్ని లోకానికి తెలిపిన స్నోడెన్ లిబర్టీ ఇప్పుడు భద్రమైన తావు కోసం ఖండాంతరాలు దాటి పరుగులు పెడుతోంది. స్నోడెన్ లిబర్టీ ఇప్పుడు ఘనత వహించిన అమెరికన్ లిబర్టీకి సైతం కంటగింపుగా మారిపోయింది.
ప్రఖ్యాత లిబర్టీ విగ్రహాన్ని కేవలం విగ్రహ పాత్ర వరకే పరిమితం చేసింది అమెరికా రాజ్యమైతే, దానికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నది ఎడ్వర్డ్ స్నోడెన్. అమెరికన్ లిబర్టీ అమెరికన్ రాజులకు ఎంతగా దాసోహం అయిందంటే, ప్రాణం పోసుకున్న లిబర్టీ పైన తానే కన్నెర్ర చేసేంత! స్నోడెన్ పై ఆగ్రహిస్తూ లిబర్టీ విగ్రహం తన కిరణాల వెలుగును కోల్పోతోందని కార్టూనిస్టు చెబుతున్నారు. లిబర్టీ ప్రాణ ప్రదాత ఎడ్వర్డ్ స్నోడెన్, నేడు ఎదుర్కొంటున్న పరిస్ధితిని ఇంతకంటే శక్తివంతంగా వ్యక్తీకరించడం అసాధ్యమేనేమో!
అమెరికా రాజ్యానికి, దానికి సేవ చేసే పశ్చిమ కార్పొరేట్ పత్రికలకు స్నోడెన్ ఆచూకీ అలవిగాని మిస్టరీయే అయింది. స్నోడెన్ కోరితే రాజకీయ ఆశ్రయం ఇవ్వడాన్ని పరిశీలిస్తామని చెప్పిన రష్యా అమెరికా హెచ్చరికలకు సమాధానం చెప్పుకునే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ హాంగ్ కాంగ్ దాటి రష్యా రావడానికి చైనా, రష్యాలు సహకరించలేదని వికీ లీక్స్ ప్రతినిధి, ఐస్ లాండ్ విలేఖరి క్రిస్టిన్ రాఫీన్సన్ చెప్పడం విశేషం (ఆర్.టి)
స్నోడెన్ కు రష్యా వీసా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన మాస్కో లోని షెరెమెట్యేవో విమానాశ్రయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన కోసం కాపు కాస్తున్న విలేఖరులకు మాత్రం ఆయన కనపడలేదు. మాస్కో నుండి హవానాకు స్నోడెన్ తో వెళ్లవలసిన విమానం స్నోడెన్ లేకుండానే వెళ్ళినట్లు తెలుస్తోంది. స్నోడెన్ తో మాట్లాడడానికి ఆయన ప్రయాణిస్తాడని చెప్పిన విమానంలో సగం సీట్లు బుక్ చేసుకున్న విలేఖరులు స్నోడెన్ లోకపోవడంతో ఉసూరుమన్నారట!
వికీ లీక్స్ అధినేత జులియన్ అసాంజే ప్రకారం ఎడ్వర్డ్ స్నోడెన్, ఆయనతో ఉన్న వికీలీక్స్ ప్రతినిధి సారా హారిసన్ క్షేమంగానే ఉన్నారు. రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ప్రకారం స్నోడెన్ ఇంకా రష్యా సరిహద్దు దాటలేదు. ఈక్వడార్ ప్రభుత్వం స్నోడెన్ కు శరణార్ధి వీసా మంజూరు చేసినట్లు తెలుస్తోంది. దాని ద్వారా ఆయన రష్యా దాటి వెళ్లవచ్చో లేదో తెలియలేదు.
మొత్తం మీద స్నోడెన్ అంతిమంగా ఈక్వడార్ చేరవలసి ఉండగా, ఇంకా రష్యాలోనే ఉన్నారు. ఆయన కోసం అమెరికా గూఢచారులు ప్రపంచంలోని విమానాశ్రయాల్లో కాపు గాసి తిండీ తిప్పలూ లేకుండా పడి ఉన్నారు. స్నోడెన్ మాత్రం హాయిగా మాస్కో విమానాశ్రయంలో ట్రాన్సిట్ లాంజ్ లో చిద్విలాసంగా రెస్టు తీసుకుంటున్నారు.
అంతిమంగా గెలిచ్చేదీ, గెలవాల్సిందీ విగ్రహ సమాన లిబర్టీ కాదు, నిత్య యవ్వనంతో ఉత్సాహంగా పరవళ్ళు తొక్కుతూ అణచివేతలను గేలిచేసే వాస్తవ లిబర్టీయే!
- సారా హారిసన్ -లండన్ లో ఈక్వడార్ ఎంబసీ వద్ద…
- ఎడ్వర్డ్ స్నోడెన్ తో మాస్కో విమానాశ్రయంలొ ఉన్న వికీలీక్స్ ప్రతినిధి ఈమెయే
- లండన్, ఈక్వడార్ ఎంబసీ ముందు ఆందోళనకారులతో
http://www.thehindu.com/todays-paper/tp-opinion/dangerous-games-with-devolution/article4847983.ece
వి. శేఖర్ గారు ఈ ఆర్టికల్ అనవదించమని మనవి .