అమెరికాకు చైనా ఝలక్, హాంగ్ కాంగ్ వీడిన స్నోడెన్


ఎడ్వర్డ్ స్నోడేన్ -ఫొటో: సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్

ఎడ్వర్డ్ స్నోడేన్ -ఫొటో: సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్

అమెరికాకు చైనా దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చింది. స్నోడెన్ ను తమకు అప్పగించాలని అమెరికా చేసిన విన్నపాన్ని పక్కకు నెట్టి ఆయన హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడానికి అనుమతి ఇచ్చేసింది. ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్, సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ దేశ విదేశీ గూఢచర్యం నేరానికి పాల్పడ్డాడని, ఆయన్ని తమకు అప్పగించాలని అమెరికా, చైనాను కొద్ది రోజుల క్రితం కోరింది. తమ నేరారోపణలకు రుజువుగా కొన్ని పత్రాలను చైనా ప్రభుత్వానికి అందజేసింది. అయినప్పటికీ అమెరికా విన్నపాన్ని చైనా మన్నించలేదు.

ఎడ్వర్డ్ స్నోడెన్ ఆదివారం మాస్కో వెళ్ళే విమానం ఎక్కాడని హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. “తన సొంత పూచీ మీదనే మూడో దేశానికి వెళ్లేందుకు వీలుగా చట్ట బద్ధంగానే, సాధారణ మార్గం లోనే మాస్కోకి బయలుదేరి వెళ్లారు” అని హాంగ్ కాంగ్ ప్రభుత్వం తెలిపిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్.సి.ఎం.పి)పత్రిక తెలిపింది. 30 యేళ్ళ స్నోడెన్ స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు చెప్ లాప్ కోక్ విమానాశ్రయంలో ఏరో ఫ్లాట్ విమానం ఎక్కి వెళ్లారని మాస్కో లోని షెరెమెట్యోవో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన సాయంత్రానికి చేరుకుంటారని తెలుస్తోంది.

మాస్కో విమానం ఎక్కినప్పటికీ స్నోడెన్ లక్ష్యం రష్యా కాదని తెలుస్తోంది. మాస్కో నుండి స్నోడేన్ క్యూబా రాజధాని హవానా చేరుకుంటారని, అక్కడి నుండి వెనిజులా రాజధాని కారకాస్ వెళ్తారని ఎస్.సి.ఎం.పి తెలిపింది. స్నోడెన్ కు హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఎలాంటి రక్షణ అందించలేదని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. నగర ప్రభుత్వం స్నోడెన్ కు సేఫ్ హౌస్ సౌకర్యం కల్పించిందన్న వార్తలను కొట్టిపారేసింది. నిజానికి స్నోడెన్ వెళ్లిపోవడం హాంగ్ కాంగ్ ప్రభుత్వానికి పెద్ద భారం దిగినట్లయిందని పత్రిక తెలిపింది.

స్నోడెన్ మాస్కో నుండి హవానాకు సోమవారం బయలుదేరి వెళ్తారని రష్యా వార్తా సంస్ధలు ఇటార్-టాస్, ఇంటర్ ఫాక్స్ తెలిపాయి. అక్కడి నుండి ఆయన వెనిజులా రాజధాని కారకాస్ వెళ్తారని ఇటార్-టాస్ తెలిపింది.

స్నోడెన్ ప్రయాణం గురించి తాము అమెరికాకు తెలిపామని హాంగ్ కాంగ్ ప్రభుత్వం తెలిపింది. స్నోడెన్ పైన విదేశీ గూఢచర్యం (espionage), దొంగతనం నేరాలను నమోదు చేసి విచారణ ప్రారంభించిన అమెరికా అతన్ని వెంటనే తమ దేశానికి పంపించాలని చైనాను కోరింది. అయితే అమెరికా పంపిన సమాచారం తమ న్యాయ ప్రక్రియకు సరిపోదని చెప్పిన హాంగ్ కాంగ్ మరింత సమాచారం ఇవ్వాలని అమెరికాను కోరినట్లు తెలిపింది.

“స్నోడెన్ ను అరెస్టు చేసేందుకు తగిన సమాచారం ‘హాంగ్ కాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్’ ప్రభుత్వం వద్ద లేదు. హాంగ్ కాంగ్ నుండి స్నోడెన్ వెళ్లిపోకుండా అడ్డగించేందుకు తగిన చట్టబద్ధ ప్రాతిపదిక మా వద్ద లేదు” అని హాంగ్ కాంగ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

వికీ లీక్స్ సహాయం

Printకాగా, స్నోడెన్ భద్రంగా హాంగ్ కాంగ్ నుండి వెళ్లిపోవడానికి వికీ లీక్స్ సంస్ధ సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వికీలీక్స్ సంస్ధ అధిపతి జులియన్ అసాంజే ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఒక ‘ప్రజాస్వామిక దేశం’లో స్నోడెన్ రాజకీయ ఆశ్రయం పొందేలా తాము సహాయం చేశామని ఆసాంజే తెలిపారు. స్నోడెన్, హాంగ్ కాంగ్ వదిలి పోవడానికి అవసరమైన ప్రయాణ పత్రాలు, ‘సేఫ్ ఎగ్జిట్’ లను తాము సమకూర్చామని వికీ లీక్స్ నేత తెలిపారు. వికీ లీక్స్ న్యాయ సలహాదారులు స్నోడెన్ తో పాటు ఉన్నారని తెలుస్తోంది.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం హారిసన్ అనే వ్యక్తి స్నోడెన్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారు. సదరు వ్యక్తి జులియన్ అసిస్టెంట్ మరియు ప్రతినిధి అయిన సారా హారిసన్ అయి ఉండవచ్చని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఊహిస్తోంది.

ఐస్ లాండ్ గానీ, ఈక్వడార్ గానీ స్నోడెన్ వెళ్లవచ్చని గతంలో పత్రికలు తెలిపాయి. ఐస్ లాండ్ వెళ్లడానికి స్నోడెన్ సుముఖత చూపారు. లండన్ లోని ఈక్వడార్ రాయబార కార్యాలయంలో జులియన్ ఆసాంజే రాజకీయ ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలు కాకుండా స్నోడెన్ వెనిజులా వెళ్లడానికి నిశ్చయించుకున్నారని స్పష్టం అవుతోంది.

మానవ హక్కుల గురించి ప్రపంచానికి బోధించే అమెరికా జులియన్, స్నోడెన్ లాంటి హక్కుల పోరాట కార్యకర్తలను వెంటాడి వేధిస్తుండగా, హక్కులకు స్ధానమే లేదని పశ్చిమ పత్రికలు ప్రచారం చేసే ఈక్వడార్, వెనిజులాలు వారికి ఆశ్రయం ఇవ్వడం బట్టి హక్కులు నిజంగా ఎక్కడ వర్ధిల్లుతున్నాయో అర్ధం అవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s