“నిజాలు బైటికి రావడం మొదలైంది. మరిన్ని నిజాలు వెలువడకుండా ఎవరూ అడ్డుకోలేరు” అని ప్రకటించిన సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్, ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పినట్లుగానే మరొక నిజం వెల్లడి చేశాడు. హాంగ్ కాంగ్ లోని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ (లేదా ది పోస్ట్) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చైనా లోని మొబైల్ ఫోన్ కంపెనీలను, సాంకేతిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన ఒక యూనివర్సిటీని అమెరికా హ్యాకింగ్ చేసి సమాచారం దొంగిలించిందని స్నోడెన్ వెల్లడి చేశాడు. తమ మిలట్రీ రహస్యాలను చైనా దొంగిలించిందని ఆరోపిస్తూ ప్రపంచ దేశాల కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి అధికారికంగానే అనుమతి ఇచ్చిన అమెరికా ప్రభుత్వం స్నోడెన్ తాజా వెల్లడికి ఇంకా బదులివ్వలేదు.
“ఎన్.ఎస్.ఐ అన్ని రకాల పనులూ చేస్తుంది. ఉదాహరణకి చైనా సెల్ ఫోన్ కంపెనీలను హ్యాకింగ్ చేసి మీ ఎస్.ఎం.ఎస్ డేటా అంతా దొంగిలించింది” అని జర్మనీ వార్తా సంస్ధ డి.పి.ఎ ను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. చైనా, హాంగ్ కాంగ్ లలో జనం ఎస్.ఎం.ఎస్ లపైనే ఎక్కువగా ఆధారపడతారని ది పోస్ట్ తెలిపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క 2012 సంవత్సరం లోనే చైనా ప్రజలు 900 బిలియన్ల (90 వేల కోట్లు) ఎస్.ఎం.ఎస్ లు పంపుకున్నారు. ఇది 2011 కంటే 2.1 శాతం ఎక్కువట.
చైనా మొబైల్ కంపెనీలు ప్రపంచంలోనే భారీ నెట్ వర్క్ కేరియర్లుగా ప్రసిద్ధి చెందాయి. ఈ సంవత్సరం మే నెల నాటికి చైనాలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 735 మిలియన్లు (73.5 కోట్లు). యూనికాం, జెడ్.టి.ఇ, చైనా టెలికాం కంపెనీలు పెద్ద మొత్తంలో ఈ సేవలను అందజేస్తున్నాయి. అమెరికా గూఢచారులు ఈ కంపెనీలను హ్యాక్ చేసి ఎస్.ఎం.ఎస్ సమాచారాన్ని దొంగిలించారని ఎడ్వర్డ్ స్నోడెన్ తెలిపారు.
విదేశీ టెక్నాలజీ పరికరాల వినియోగం వలన చైనాలో సైబర్ సెక్యూరిటీ బలహీనంగా ఉన్నదని అక్కడి నిపుణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేశారని ది పోస్ట్ తెలిపింది. ఈ బలహీనతకు కారణమైన విదేశీ (పశ్చిమ దేశాల) కంపెనీల పరికరాల వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని పత్రిక తెలిపింది. అంతర్జాతీయ పోటీదారులతో స్ధానిక టెక్నాలజీ కంపెనీలు పూర్తి స్ధాయిలో అందుకోలేక పోవడంతో ఈ పరిస్ధితి కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే హువి, డటాంగ్, జెడ్.టి.ఇ కంపెనీలు ఇప్పుడు క్రమంగా తమ పరికరాలను అభివృద్ధి చేస్తున్నాయని తద్వారా విదేశీ పరికరాలపై ఆధారపడడం సాపేక్షికంగా తగ్గిపోయిందని ది పోస్ట్ తెలిపింది.
PACNET హ్యాకింగ్
హాంగ్ కాంగ్ లో Pacnet కంపెనీకి హెడ్ క్వార్టర్ లోని కంప్యూటర్లను కూడా అమెరికా ప్రభుత్వ గూఢచారులు హ్యాక్ చేశారని స్నోడెన్ తెలిపాడు. 2009లో Pacnet కంప్యూటర్లపై గూఢచారులు దాడి చేశారని అయితే ఆ తర్వాత మళ్ళీ దాడి చేయలేదని స్నోడెన్ తెలిపాడు. స్నోడెన్ వెల్లడితో హాంగ్ కాంగ్ పోలీసులు Pacnet కార్యాలయం వద్ద 24 గంటల కాపలా విధించినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న కంప్యూటర్లన్నింటినీ నిపుణులు తనిఖీ చేసినట్లు కూడా తెలుస్తోంది. అమెరికన్ ఎన్.ఎస్.ఎ, బ్రిటిష్ జి.సి.హెచ్.క్యూ గూఢచారులు ఈ దాడులకు పాల్పడ్డారని స్నోడెన్ తెలిపారు. చైనా, హాంగ్ కాంగ్ లలోని వందలాది కంప్యూటర్లను ఎన్.ఎస్.ఎ హ్యాక్ చేసిందని స్నోడెన్ గత వారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించిన భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ నిర్మాణాలకు సొంతదారు. దీనికి హాంగ్ కాంగ్, సింగపూర్ లలో గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కంపెనీ ఆధీనంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్సు సముద్రం అడుగున దాదాపు 46,000 కి.మీ విస్తరించి ఉన్నాయని ఎస్.సి.ఎం.పి తెలిపింది. ఆసియా-పసిఫిక్ దేశాలలో విస్తరించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు ఈ కేబుల్స్ ను వినియోగిస్తాయి. ఈ కేబుల్స్ ను హేక్ చేయగలిగితే ఆసియా-పసిఫిక్ దేశాలన్నింటి కమ్యూనికేషన్లను తెలుసుకోవచ్చు. అమెరికా, బ్రిటన్ గూఢచార కంపెనీలు చేసింది అదే. చైనా, హాంగ్ కాంగ్, కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు ఈ నెట్ వర్క్ ను వినియోగిస్తున్నాయి.
చింఘువా యూనివర్సిటీ హ్యాకింగ్
బీజింగ్ లోని చింఘువా యూనివర్సిటీ చైనాలో అత్యున్నత విద్యా, పరిశోధనా సంస్ధగా ప్రసిద్ధి చెందింది. చైనా దేశపు ఆరు ప్రధాన ఇంటర్నెట్ బ్యాక్ బోన్ నెట్ వర్క్ లలో ఒకటయిన CERNET (China Education and Research Network) ప్రధాన కేంద్రం ఈ యూనివర్సిటీలో ఉన్నది. ఈ నెట్ వర్క్ గుండా మిలియన్ల మంది చైనీయుల ఇంటర్నెట్ డేటా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే అమెరికా ఎన్.ఎస్.ఎ గూఢచారులు దీనిని లక్ష్యంగా చేసుకున్నారని స్నోడెన్ తెలిపాడు. ఎన్నాళ్లనుంచి ఈ యూనివర్సిటీ కంప్యూటర్లను హ్యాక్ చేస్తున్నదీ తెలియనప్పటికీ అత్యంత తాజా దాడి జనవరి 2013లో జరిగిందని స్నోడెన్ ను ఉటంకిస్తూ ది పోస్ట్ తెలిపింది.
చింఘువా యూనివర్సిటీ కంప్యూటర్ల పై జరిగిన దాడి తీవ్ర స్ధాయిలో, స్ధిరంగా జరిగిందని స్నోడెన్ తెలిపారు. గత జనవరిలో కనీసం 63 కంప్యూటర్లు మరియు సర్వర్లను హ్యాక్ చేశారని, బాహ్య మరియు అంతర్గత ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్లతో సహా వివరాలు సేకరించారని స్నోడెన్ తెలిపారు. చైనా దేశానికి మొదటి ఇంటర్నెట్ బ్యాక్ బోన్ ఈ చింఘువా యూనివర్సిటీలోనిదే కావడం గమనార్హం. అనంతర కాలంలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ పరిశోధనా కూడలిగా అవతరించిందని ది పోస్ట్ తెలిపింది. విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ బ్యాక్ బోన్ నెట్ వర్క్ లోని డేటా మామూలు వ్యక్తిగత హ్యాకర్లకు అలవిగాని భారీ స్ధాయిలో ఉంటుందని, కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అంత భారీ డేటాను విశ్లేషించగల ఉపకరణాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా చైనా హ్యాకింగ్ పై తీవ్ర స్ధాయిలో దాడి చేస్తూ వచ్చారు. అమెరికా సివిల్, మిలట్రీ కంప్యూటర్లను చైనా మిలట్రీ హ్యాకర్లు హ్యాక్ చేసి భారీ స్ధాయిలో డేటా దొంగిలిస్తున్నారని ఆయన ఆరోపించగా పశ్చిమ పత్రికలు ఆయన ఆరోపణలను అట్టహాసంగా ప్రచారం చేశాయి. తామే హ్యాకింగ్ బాధితులమని చైనా బదులిచ్చింది. స్నోడెన్ వెల్లడితో అమెరికా హిపోక్రసీ మరోసారి బహిర్గతమయింది.