సెప్టెంబర్ 11, 2001 తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్ల పైన దాడి చేసింది ఒసామా బిన్ లాడేన్ నేతృత్వం లోని ఆల్-ఖైదా యేనని దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్ధాన్ లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. ‘లాడెన్ ని అప్పగించారా సరే సరి, లేదా దాడి చేస్తాం’ అని అధ్యక్షుడు జార్జి బుష్ తాలిబాన్ ని హెచ్చరించాడు. ‘లాడేనే దాడి చేయించాడని ఒక్క సాక్ష్యం చూపండి అప్పగిస్తాం’ అని తాలిబాన్ బదులిచ్చింది.
కానీ అమెరికా దగ్గర సాక్ష్యం లేదు, ఇప్పటికీ కూడా. సాక్ష్యం ఇవ్వకుండా యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించింది అమెరికా. ‘మాకు మద్దతు ఇవ్వండి, లేదా తాలిబాన్ కి మద్దతు ఇచ్చినట్లే’ అని జార్జి బుష్ ప్రపంచాన్ని హెచ్చరించాడు. తద్వారా తటస్ధత అనేదే లేకుండా చేశాడు. అనంతరం మన్నూ, మిన్నూ ఏకం చేస్తూ అమెరికా, ఐరోపా రాజ్యాల సూపర్ సోనిక్ లోహ విహంగాలు, ట్యాంకర్లు, ఫైటర్ జెట్లు, కార్పెబ్ బాంబింగ్ లు, విమాన కేరియర్ నౌకలు, సి-13 విమాన కేరియర్లు ఇత్యాది లోహ రాకాసులు ఆఫ్ఘనిస్ధాన్ ని మరోసారి మరుభూమిని కావించాయి. అప్పటి నుంచి ఇప్పటికి లక్షల మంది అమాయక ఆఫ్ఘన్లు కనీసం చనిపోయారన్న గుర్తింపుకు కూడా నోచుకోకుండా అదృశ్యమైపోయారు. ఇదంతా తాలిబాన్ దాచిపెట్టిన ఒక్క ఒసామా బిన్ లాడెన్ కోసమే అని అమెరికా చెప్పింది.
ఇప్పుడు అదే అమెరికా, అదే తాలిబాన్ తో చర్చలు ప్రారంభిస్తోంది. అందుకోసం తాలిబాన్ పెట్టిన షరతుకు అనుగుణంగా కతార్ రాజధాని దోహాలో ఒక కార్యాలయాన్ని కూడా అమెరికా ఏర్పాటు చేసింది. కార్యాలయం పైన తాలిబాన్ జెండాను ఎగరవేసింది. కార్యాలయ భవనం ముందు ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’ (ఇది ఆఫ్ఘనిస్ధాన్ కి తాలిబాన్ పెట్టుకున్న పేరు) అనే బోర్డు తగిలించింది. అంటే తాలిబాన్ కి రాయబార హోదా దాదాపు కల్పించినట్లు! ఒక పక్క ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ మిలిటెంట్ల ఆత్మాహుతి దాడులు, పేలుళ్లు కొనసాగుతుండగానే మరో పక్క అదే తాలిబాన్ తో అమెరికా చర్చలు!
తన ప్రమేయం లేకుండా తాలిబాన్ తో చర్చలు జరపడాన్ని మొదటినుండి వ్యతిరేకిస్తున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అమెరికా తీసుకున్న ఈ చర్యలతో ఆగ్రహం ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం లేకుండా ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులతో విదేశాలు చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా బలగాలు 2014 సైనిక ఉపసంహరణ గడువు ముగిశాక కూడా ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగడానికి వీలుగా అమెరికా-ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అసలు శాంతి చర్చల నుండే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తాలిబాన్ తిరుగుబాటుదారులకు రాయబార హోదా ఇచ్చే విధంగా వారికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం తగదని ప్రకటించాడు. దీనితో తాలిబాన్ చర్చల ప్రహసనం కాస్తా మళ్ళీ మొదటికి వచ్చేసింది.
“అది (దోహా కార్యాలయం) తాలిబాన్ ప్రభుత్వం తరహాదే. మాకది ఇష్టం లేదు” అని ఆఫ్ఘన్ ఉన్నత శాంతి కౌన్సిల్ (Afghan High Peace Council) సభ్యుడు ముహమ్మద్ ఇస్మాయెల్ ఖాసేమ్యార్ అన్నారని బి.బి.సి తెలిపింది. శాంతి చర్చల కోసమే కార్యాలయం తెరుస్తున్నామని తమకు చెప్పారని కానీ వాస్తవం చూస్తే మరో ఆఫ్ఘన్ (ప్రవాస) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగానే ఉందని పీస్ కౌన్సిల్ సభ్యులు వ్యాఖ్యానించారు. తాలిబాన్ నాయకులు కూడా ఇక తమదే రాజ్యం అన్నట్లుగా చేస్తున్న ప్రకటనలు కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సహజంగానే కంటగింపుగా మారాయి. తమను విస్మరించి, అమెరికా, తాలిబాన్ ను భుజాలకు ఎత్తుకుంటున్నట్లు వారు అనుమానిస్తున్నారు.
ఈ నేపధ్యంలో అమెరికా విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) జాన్ కెర్రీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కి ఫోన్ కలిపారు. దోహా లోని కార్యాలయం పైన ప్రతిష్టించిన తాలిబాన్ జెండాను తొలగిస్తున్నామని ఆయన హమీద్ కి చెప్పినట్లు బి.బి.సి తెలిపింది. సదరు భవనం ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్ధాన్’ కార్యాలయం అని చెబుతున్నట్లు ఉన్న బోర్డు తొలగిస్తామని చెప్పారు. దాని బదులు ‘బ్యూరో ఆఫ్ పీస్ టాక్స్’ అని బోర్డు తగిలిస్తున్నట్లు చెప్పారు.
దాదాపు 12 యేళ్లుగా తాలిబాన్ పై నిరంతరాయంగా యుద్ధం చేస్తూ ఆఫ్ఘన్ ప్రజలకు నరకం చవి చూపిస్తున్న అమెరికాకు ఇప్పటి పరిస్ధితి ఇది! నువ్వు నా పక్క లేకపోతే తాలిబాన్ పక్క ఉన్నట్లే అని హుంకరించిన అమెరికా ఇప్పుడు అటు తాలిబాన్ ని చర్చల బల్ల వద్దకు తేలేక, ఇటు తన కీలుబొమ్మ కర్జాయ్ కి సైతం సర్ది చెప్పుకోలేక మధ్య ప్రాచ్యంలో తన భవిష్యత్తు ఏమిటా అని తీవ్ర జంఝాటంలో పడినట్లు కనిపిస్తోంది.
దోహాలో కార్యాలయం ప్రారంభించినాక తాము ఐక్యరాజ్యసమితి లాంటి సంస్ధలతో సంబంధాలు పెట్టుకోనున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. ఇది కర్జాయ్ కి పుండు మీద కారం రాసినట్లే అయింది. అసలు కార్యాలయం ప్రారంభించడమే కర్జాయ్ కి ఇష్టం లేదు. మరోవైపు శాంతి చర్చలలో కర్జాయ్ ప్రభుత్వం పాల్గొనడానికి ఒప్పుకోబోమని తాలిబాన్ షరతు విధించింది. హమీద్ కర్జాయ్ అమెరికా తొత్తు అని కూడా తాలిబాన్ ప్రకటించింది. అమెరికా తొత్తులతో తాము చర్చించేదేమిటని అది ప్రశ్నిస్తోంది.
ఐనప్పటికీ తాలిబాన్ తో చర్చలు జరపవలసిన దీన పరిస్ధితిలో అమెరికా ఉందని దాని చర్చ(ర్య)లు స్పష్టం చేస్తున్నాయి. తాలిబాన్ ని దువ్వుతున్న అమెరికాకి వ్యతిరేకంగా కర్జాయ్ రష్యా, చైనా లతో సంబంధ బాంధవ్యాలు పెంచుకునే పనిలో గత రెండు, మూడేళ్లుగా నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో తాలిబాన్ చేసిన ప్రకటన ఆ సంస్ధకు పోరాట సంస్ధగానే కాక రాజకీయ సంస్ధగా కూడా హోదా ఇచ్చినట్లేనని వివిధ అంతర్జాతీయ పరిశీలకులు, పత్రికలు వ్యాఖ్యానించారు. దీనితో కర్జాయ్ కు అరికాలి మంట నెత్తికెక్కింది.
మరి కొద్ది రోజుల్లో అమెరికా-తాలిబాన్ ల మధ్య చర్చలు ప్రారంభం కానున్నట్లు వివిధ పత్రికలు చెబుతున్నాయి. పశ్చిమ పత్రికలు ఈ చర్చలను ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పత్రికలన్నీ తాలిబాన్ ను టెర్రరిస్టు సంస్ధగా తిట్టిపోసినవే. తాలిబాన్ నాయకుడు ముల్లా ఒమర్ ను హంతకుడుగా, ఒంటి కంటి దెయ్యంగా, మహిళా హక్కుల అణచివేతదారుగా తిట్టిపోసినవే. ఇప్పుడు అదే తాలిబాన్, అదే ముల్లా ఒమర్ వీరికి శాంతి దూతగా కనిపించడం చరిత్ర అసహ్యించుకునే విపరిణామం. పశ్చిమ రాజ్యాల ద్వంద్వ నీతి, హిపోక్రసీ, దగాకోరుతనం తాలిబాన్ చర్చల్లో మరోసారి వ్యక్తీకృతం అవుతోంది.
చర్చలకు ముందు అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా ఆఫ్ఘన్ ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్నలు, నీచ కార్యాలు, యుద్ధ నేరాలు, మానవతా వ్యతిరేక నేరాలు ఎన్నో ఉన్నాయి. కనీసం తాలిబాన్ పట్ల తన రాజకీయ వైఖరి ఎందుకు మారిందో అయినా చెప్పాల్సి ఉంది. అసలు కర్జాయ్ ని అమెరికా తొత్తు అని చెప్పేంతగా అమెరికాను ద్వేషిస్తున్న తాలిబాన్ తో చర్చలు ఎలా సాధ్యమో కూడా అమెరికా చెప్పాల్సి ఉంది.
‘నువ్వు నా పక్క లేకపోతే తాలిబాన్ పక్క ఉన్నట్లే ” అన్న ‘ పెద్ద అన్నా’ అమెరికాకు జవాబు దారి తనం వుంటే గదా జవాబు చెప్పటానికి? కర్జాయి కావలిసినంతవరకు కర్జాయి ఆట వస్తువు,లేక పోతే తాలిభన్ లు ఆటవస్తువులు. “సింహాన్ని అడవికి రాజును చేసిందెవరు? ఒకరు కిరీటం పెడితే రాజు అయ్యేదా సింహం?” ఇది మనదేశ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుని ఉహచా! ఈ పాసిస్ట్ భావం ప్రజాస్వామయమట! ప్రపంచ ప్రజల్ని పావులుగా ఉపయోగించుకొనే అమెరికా పాసిస్ట్ జవాబు చెప్పె కాలం ఒకటి వస్తుందని ఎదురు చూద్దాం!
naaku vomiting vasthondhi….george bush paina vaamthi chaesukovali… mari meeku…. alaa anipinchadam laedaaa?
ఏమో అలా అనే ఎందుకు అనుకోవాలి?.
ఆ కార్యాలయ్యాని దేనికి ఇన ఉపయోగించు కోవచ్చు.
ఎక్కడ కాథర్(దోహా)? ఎక్కడ ఆఫ్గనిస్తాన్?
ఈ కీలు బొమ్మల ప్రబూత్వాలు ఉన్నత కాలం, అమేరిక ఏమీనా చేయగలదు..
ఇంకా నయం, మన నాయకులని అడగలేదు…
లేక పోతే, వాల్లే ఇక్కడ ఒక కార్యాలయం కట్టించే వారు..
ఇన దేనికి ఈ బవనమ్? , ధ్వంస రచనలు చేసుకోవడానికా ? లేక మిడ్ల్-ఈస్ట్ లో మిగత
దెశాల్ని హస్టగతం చేసుకోవడానిక?