దేశంలో మోడి వేవ్ అనేదేమీ లేదని అది కార్పొరేట్ కంపెనీలు సృష్టించింది మాత్రమేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చేశారు. అనేకమంది బి.జె.పి కార్యకర్తలు దేశంలో మోడి వేవ్ ఉందని భావిస్తున్నారనీ, 2014 ఎన్నికల్లో అది ఒక ఊపు ఊపేస్తుందని నమ్ముతున్నారనీ కానీ అది వాస్తవంగా లేదని వారు గ్రహించాలని నితీష్ కోరారు. కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన ఈ వేవ్ త్వరలోనే సమసిపోతుందని, అదేమీ మాజిక్కులు చేయబోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
బీహార్ శాసన సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “బీహార్ కార్యకర్తలు తమ నాయకుడొకరు ఒక ఊపు తేనున్నారని ఉత్సాహంగా ఉన్నారు… కానీ అది కేవలం కార్పొరేట్ కంపెనీలు సృష్టించినది మాత్రమే. అది ఉండేది కొద్దిసేపే. 2014 ఎన్నికల్లో అదేమీ మేజిక్కు చేయదు” అని నితీష్ అన్నారని ది హిందు తెలిపింది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఒబిసిల నాయకుడుగా చూపడానికి బి.జె.పి చేస్తున్న ప్రయత్నాలను నితీష్ విమర్శించారు. “ఒబిసి కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవరూ వారి నాయకుడు కాలేరు. వెనుకబడిన కులంలో పుట్టినంత మాత్రాన కార్పొరేట్ కంపెనీల మేలు కోరే వ్యక్తి ఒబిసిలకు నాయకుడు కాలేరు” అని నితీష్ పేర్కొన్నారు. “చౌదరి చరణ్ సింగ్, మధు లిమాయే, వి.పి.సింగ్ వీరంతా ఒబిసి కుటుంబాల్లో పుట్టినవారు కారు. కానీ వెనుకబడిన కులాలకు నాయకులుగా వారు గుర్తింపు పొందారు. ఎందుకంటే సమాజంలో అత్యంత వెనుకబడిన, పెద ప్రజల సంక్షేమం కోసం వారు నిజాయితీగా నిబద్ధత కలిగి ఉన్నారు” అని ఆయన అన్నారు.
విశ్వాస తీర్మానం గెలుపు
బీహార్ శాసన సభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గింది. విచిత్రంగా బి.జె.పి వాకౌట్ చేసింది. బి.జె.పి వాకౌట్ ఫలితంగా తీర్మానానికి ఫలితంగా 126 ఓట్లు రాగా వ్యతిరేకంగా 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. 91 మంది శాసన సభ్యులు ఉన్న బి.జె.పితో పాటు ఇద్దరు శాసన సభ్యులు ఉన్న ఎల్.జె.పి కూడా వాకౌట్ చేసింది. అంటే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 117 ఓట్లు రావలసి ఉండగా 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. దరిమిలా బి.జె.పి వాకౌట్, నితీష్ కుమార్ కి అనుకూలంగా మారింది.
చట్ట సభల్లో ఓటింగ్ లాంటి సందర్భాలు వచ్చినపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేక అలాగని అనుకూలంగా వ్యవహరించి ప్రజల దృష్టిలో పలుచన కాలేక రాజకీయ పార్టీలు వాకౌట్ మార్గం ఎంచుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐలను అనుమతించే విషయంలో ఎస్.పి, బి.ఎస్.పి లు అనుసరించింది ఈ ఎత్తుగడే. ఈ నేపధ్యంలో బి.జె.పి వాస్తవంగా నితీష్ కుమార్ కి సహకరించిందా లేక వ్యతిరేకించిందా అన్న అనుమానం కలుగుతోంది.
తీర్మానానికి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ (22), ఇద్దరు ఇండిపెండెంట్లు వ్యతిరేకంగా ఓటు వేశారు. 4గురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. సి.పి.ఐ పార్టీకి ఉన్న ఒక సభ్యుడు కూడా తీర్మానానికి అనుకూలమే. నలుగురు ఇండిపెండెంట్లతో కలుపుకుని 126 ఓట్లు తీర్మానానికి అనుకూలంగా పడ్డాయి. కాంగ్రెస్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినంత మాత్రాన తమ మధ్య ఒప్పందం ఏదీ జరిగినట్లు కాదని నితీష్ కుమార్ భుజాలు తడుముకోవడం విశేషం.
సభలో ఇంత నాటకీయంగా వ్యవహరించిన బి.జె.పి వీధుల్లో వీరంగమే సృష్టించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర బంద్ లో బి.జె.పి, జె.డి(యు) కార్యకర్తలు పలు చోట్ల కొట్టుకున్నారని పత్రికలు ఛానెళ్లు తెలిపాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పాట్నా వీధుల్లో కర్రలతో కొట్టుకుంటున్న దృశ్యాలను, రక్తం కారుతున్న తలలను వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను సైతం ఎంతగా మోసాగిస్తాయో బీహార్ రాజకీయ నాటకం స్పష్టం చేస్తోంది.