సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్


Syria - Golan Heights -RT

Syria – Golan Heights -RT

సిరియా కిరాయి తిరుగుబాటులో స్టేక్స్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సిరియా తిరుగుబాటులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ దేశాల మద్దతుతోనే ఆల్-ఖైదా టెర్రరిస్టులు సిరియా ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున ధన, ఆయుధ సహాయంతో అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ కూల్చివేతకు రెండేళ్లుగా సాయుధంగా తలపడుతున్నారు. ఇరాన్, రష్యాల మద్దతుతో కిరాయి తిరుగుబాటును ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించడానికి ఇప్పుడు ఇరాన్ సైనికులే రంగంలోకి దిగనున్నారు.

4,000 మంది ఇరానియన్ రివల్యూషనరీ గార్డులు సిరియాకి రానున్నారని బ్రిటన్ పత్రిక ది ఇండిపెండెంట్ ఆదివారం తెలిపింది. సిరియా దేశంపై లిబియా తరహాలో ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయడానికి అమెరికా పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇరాన్ నిర్ణయం వెలువడడం గమనార్హం. ఈ నిర్ణయంతో సిరియా ప్రభుత్వం తరపున యుద్ధరంగంలోకి దూకినవారిలో హిజ్బొల్లా (లెబనాన్) తర్వాత ఇరానే అవుతుంది.

అగ్నికి ఆజ్యం

సిరియా ప్రజల కోసం అంటూ కబుర్లు చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ కబుర్లకు కూడా కట్టుబడి లేదు. మధ్య ప్రాచ్యంలో షియా, సున్నీల మధ్య మరిన్ని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి తన ప్రయోజనాలను నేరవేర్చుకోడానికి దూకుడుగా చర్యలు చేపట్టింది. షియా, సున్నీల మధ్య ఉన్న అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఇందులో భాగంగా ఈజిప్టులో తన కీలు బొమ్మ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సి చేత సున్నీ సంస్ధల సమావేశం ఏర్పాటు చేసింది. దాదాపు 70కి పైగా సున్నీ మత సంస్ధలు ఈజిప్టులో సమావేశమై అసద్ కి వ్యతిరేకంగా జీహాద్ చేయాలంటూ పిలుపు ఇచ్చారు. ప్రపంచంలోని అన్నీ మూలల నుండి సున్నీలు పెద్ద సంఖ్యలో సిరియాకు తరలివెళ్లాలని సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పిలుపు ఇచ్చారు.

ఈ పిలుపుకు ఈజిప్టు అధ్యక్షుడు మోర్శి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఈజిప్షియన్లు ఎవరైనా సిరియా వెళ్ళి ‘పవిత్ర యుద్ధం’ లో పాల్గొనదలిస్తే తాను అడ్డుకోబోనని ప్రకటించాడు. నైతికంగానే కాక ఆయుధ పరంగా (మెటీరీయల్) కూడా తాను తిరుగుబాటుదారులకు సహాయం అందిస్తానని ప్రకటించాడు. అయితే మోర్సి ఆయుధపరంగా తిరుగుబాటుదారులకు సహాయం అందించడం కొత్తేమీ కాదు. అమెరికా, ఐరోపాలు అందించిన ఆయుధాలను టర్కీ ద్వారా సిరియాకు చేరవేసింది లిబియా, ఈజిప్టులే.

అమెరికా ఏర్పాట్లు

మిలట్రీ డ్రిల్లు కోసం అని చెప్పి అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను, పేట్రియాట్ మిసైళ్లను జోర్డాన్ కు గత కొన్ని నెలలుగా చేరవేసింది. వాటిని అక్కడే శాశ్వతంగా ఉంచనున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం ప్రకటించింది. జోర్డాన్ సరిహద్దులో సిరియా భూభాగం పైన ‘నో-ఫ్లై జోన్’ అమలు చేసే ఉద్దేశ్యంతోనే జోర్డాన్ లో తమ ఆయుధ సంపత్తిని కొనసాగిస్తున్నట్లు వైట్ హౌస్ అధికారులు చెప్పినట్లు రష్యా టుడే లాంటి పత్రికలు  తెలిపాయి.

ఈ విధంగా సిరియా యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోడానికి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రసాయనిక ఆయుధాలు సాకుగా ఇప్పటికే ప్రకటించారు. సిరియా ప్రభుత్వం తాను గీసిన ఎర్ర గీతను దాటిందని కాబట్టి తిరుగుబాటుదారులకు తాము ప్రాణాంతక ఆయుధాలు సరఫరా చేస్తామని ఆయన కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే వాస్తవానికి సిరియాలో రసాయన ఆయుధాలు ప్రయోగించింది తిరుగుబాటుదారులేనని ఐరాస కమిటీ గత నెలలో ప్రకటించింది. ఈ రసాయన ఆయుధాలను వారికి సరఫరా చేసింది అమెరికాయేనని వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చింది అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లేనని వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికలు కొన్ని నెలల క్రితమే తెలిపాయి.

మరోవైపు అమెరికా యుద్ధకాండకు మద్దతుగా పశ్చిమ దేశాల విశ్లేషకులు పత్రికల్లో వ్యాసాలు గుప్పిస్తున్నారు. ప్రపంచ వ్యాపితంగా అమెరికా మిత్రులందరూ ‘అమెరికా బలహీనపడింది’ అని భావిస్తున్నారనీ, ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రాభవం క్షీణించిందని భావిస్తున్నారనీ, కాబట్టి ఎంత విధ్వంసం జరిగినా సరే ప్రత్యక్ష పోరులోకి అమెరికా దూకాలని ఆంధోని కార్డ్స్ మేన్ (Center for Strategic and International Studies) లాంటి అమెరికా వ్యూహకర్తలు ప్రతిపాదిస్తున్నారు. వారి ఉద్దేశ్యంలో సిరియాలో తిరుగుబాటు చేస్తున్నది ఆల్-ఖైదా టెర్రరిస్టులే అయినప్పటికీ, అసద్ కూల్చివేత అనంతరం వారి వల్ల పెను ప్రమాదం ఉన్నప్పటికీ దానికంటే ‘అమెరికా బలహీనపడింది’ అన్న ముద్రను చెరిపేసుకోవడమే ఇప్పుడు తక్షణ అవసరం. అందుకోసం సిరియా ప్రజలు ఎన్ని వందలవేలమంది బలయినా ఆమోదనీయమేనని వారు నూరిపోస్తున్నారు.

ఐరోపా కూడా

బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. విమాన వ్యతిరేక మిసైళ్లను సౌదీ అరేబియా ద్వారా సిరియా టెర్రరిస్టులకు అందజేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని జర్మనీ పత్రిక డెర్ స్పీగెల్ చెప్పిందని గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తెలిపింది. రష్యా కలిసి వచ్చినా రాకపోయినా సిరియా టెర్రరిస్టులకు తాము సహాయం చేసి తీరుతామని లండన్ లో జి8 సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సిరియా తిరుగుబాటుదారుల్లో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత తీవ్రవాదంతో కూడుకుని ఉన్న శక్తులు ఉన్నప్పటికీ అసద్ కూల్చివేత జరగాల్సిందేనని కెమెరాన్ అన్నట్లు తెలుస్తోంది. ఐరాసలో రష్యా, చైనాలు ఎన్నిసార్లు వీటో చేసినా తిరుగుబాటుదారులకు మరిన్ని ఆయుధాలు అందకుండా వీటో చేసే అవకాశం వారికి లేదని కెమెరాన్ వ్యాఖ్యానించడం విశేషం.

వీరంతా సిరియా ప్రజలను అడ్డం పెట్టుకోవడమే అసలు విషాధం.

ఈ నేపధ్యంలోనే ఇరాన్ అనివార్యంగా యుద్ధరంగంలోకి ప్రవేశిస్తోందని భావించవచ్చు. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోతే పశ్చిమ దేశాల తదుపరి లక్ష్యం ఇరానే. సిరియాలో జరుగుతున్నది పశ్చిమ దేశాలు మరియు ఇరాన్ + రష్యా ల ప్రాక్సీ యుద్ధమే. రష్యాకు మధ్య ప్రాచ్యంలో చివరి ఆశ్రయం ఇరాన్. కాబట్టి ఇరాన్ ని కాపాడుకోవడం రష్యా అవసరం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రతిఘటన కొనసాగుతున్నంతవరకూ ఇజ్రాయెల్ కు నిద్ర కరువు. ఇరాన్ లక్ష్యంగా సిరియాలో కిరాయి తిరుగుబాటును ఇజ్రాయెల్ చురుకుగా ఎగదోసిందని విశ్లేషకుల అభిప్రాయం.

యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్

రష్యా టుడే (ఆర్.టి) ప్రకారం సిరియా ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఇరాన్ కృత నిశ్చయంతో ఉన్నది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా గోలన్ హైట్స్ (ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న సిరియా భూభాగం) వద్ద మరో యుద్ధ ఫ్రంట్ ను ఇరాన్ సైనికులు ప్రారంభించవచ్చని ఆర్.టి సూచించింది. గోలన్ హైట్స్ నూ, సిరియాను విడదీసే సరిహద్దును ఇటీవల వరకూ ఐరాస ఆధ్వర్యంలోని ఆస్ట్రియా సైనికులు కాపలా కాశారు. వీరిపైన కూడా సిరియా తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో వారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దానితో ఇక్కడ తిరుగుబాటుదారులకు, సిరియా ప్రభుత్వ బలగాలకూ ఘర్షణ నడుస్తోంది. ఈ ఘర్షణ ద్వారా తాను చొరబడడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఒక అంచనా. దానితో ఇరాన్ సైన్యం ఇక్కడ కేంద్రీకరించవచ్చని చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే మూడుసార్లు సిరియా పైకి యుద్ధ విమానాలతో దాడి చేసిన సంగతి ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.

సిరియా యుద్ధరంగాన్ని పరిశీలిస్తే పశ్చిమ సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తున్న కొద్దిపాటి శక్తులకు వ్యతిరేకంగా మధ్యప్రాచ్యంలో అనేక శక్తులను అమెరికా కూడగట్టినట్లు స్పష్టం అవుతోంది. సౌదీ అరేబియా, టర్కీ, కతార్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు తిరుగుబాటుదారుల తరపున చురుకైన పాత్రను పోషిస్తున్నాయి. జోర్డాన్, యు.ఎ.ఇ, బహ్రెయిన్, ఈజిప్టు, గాజా దేశాలు పరోక్ష పాత్ర పోహిస్తున్నాయి. సిరియా ప్రభుత్వం వైపు నుండి చూస్తే లెబనాన్, ఇరాన్ లు మాత్రమే చురుకైన పాత్ర పోహిస్తున్నాయి. ఇరాక్, రష్యా లది పరోక్ష పాత్ర కాగా చైనా పాత్ర వీటో లకు మాత్రమే పరిమితంగా కనిపిస్తోంది.

లెబనాన్ (హిజ్బొల్లా), సిరియా, ఇరాన్ లను అమెరికా-ఐరోపా-ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద కూటమికి ప్రతిఘటనా అక్షంగా (axis of resistance) పరిశీలకులు పేర్కొంటారు. ఈ ప్రతిఘటనను నాశనం చేసి తమకు ఎదురు లేకుండా చేసుకోవడమే అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ దేశాల అంతిమ లక్ష్యం. ఇరాన్, ఇరాక్, సిరియాలతో ఇండియాకు చారిత్రక సంబంధాలు ఉన్నాయి. చారిత్రక ప్రాచీన నాగరికతలు విలసిల్లిన మెసపోటేమియా, యూఫ్రటీస్, టైగ్రిస్ ప్రాంతం భారతీయ ప్రాచీన నాగరికతలైన హరప్పా, మొహంజొదారో లకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆరు మిలియన్ల మంది భారతీయులు మచ్య ప్రాచ్యంలో వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. ఇది కొనసాగాలంటే మధ్య ప్రాచ్యం ప్రశాంతంగా ఉండడం భారత దేశ అవసరం.

కాబట్టి రానున్న కాలంలో సిరియాపై జరగనున్న హంతక దురాక్రమణ దాడిలో ప్రతిఘటన అక్షానికి విజయం చేకూరాలని పశ్చిమ సామ్రాజ్యవాదం మట్టి కరిచి ‘బహుళ ధృవ ప్రపంచం ఆవిష్కరించబడాలని’ (ఇది మన ప్రధాని ఆకాంక్ష కూడా) భారతీయులు కోరుకోవాలి.

One thought on “సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s