జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్


GCHQ

GCHQ

తమ దేశంలో జి20 సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలకు హాజరయిన సభ్య దేశాల నాయకులపై కూడా నిఘా వేసిన దురాగతానికి బ్రిటన్ పాల్పడింది. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత, సంక్షోభ పరిష్కారానికి జి20 కూటమి వరుస సమావేశాలు నిర్వహించింది. 2009లో లండన్ లో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అధునాతమైన టెక్నిక్ లను ఉపయోగించి సభ్య దేశాల తరపున హాజరైన మంత్రులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు వారీ మందీ మార్బలం అందరి ఫోన్ లను, ఈ మెయిళ్లను బ్రిటిష్ గూఢచారులు ట్రాక్ చేశారని ఎడ్వర్డ్, స్నోడెన్ వెల్లడించిన పత్రాల ద్వారా తెలిసిందని బ్రిటన్ పత్రిక ది గార్డియన్ తెలిపింది.

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా వివిధ దేశాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నాయి. సంక్షోభానికి కారకులు ఎవ్వరూ అనే విషయంలో పైకి ఒకే అభిప్రాయం చెప్పినప్పటికీ ప్రత్యర్ధి దేశాల కంపెనీల పైకి బాధ్యత నెట్టడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నించాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపాలు తమ తమ కంపెనీలను కాపాడుకుంటూ ఎదుటివారి కంపెనీలను బాధ్యులను చేయడానికి ప్రయత్నించాయి. అమెరికాలోని వాల్ స్ట్రీట్ కంపెనీలే సంక్షోభానికి ప్రధాన కారణం అని చెప్పినా, ఐరోపా కంపెనీలు ఏమీ తక్కువ తినలేదు.

ప్రపంచం మొత్తం విస్తరించిన అమెరికా, ఐరోపా బ్యాంకులు, ఇతర కంపెనీలు పరస్పరం ఒకదానికొకటి పెనవేసుకుని పరస్పరం ప్రభావితం చేసుకునే పరిస్ధితిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఈ నేపధ్యంలో ఎదుటి కంపెనీ లేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేదా దేశం ఏం చేయబోతోందీ సమాచారం తెలుసుకోవడం వారికి అవసరంగా ముందుకొచ్చింది. ఈ క్రమంలో జి20 లాంటి ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశాల్లో సైతం ఏకంగా దేశాధినేతల కంప్యూటర్లు, ఫోన్ల పైన కూడా బ్రిటన్ ప్రభుత్వం నిఘా వేసినట్లు వెల్లడి కావడం సంచలనం సృష్టిస్తోంది.

గవర్న్ మెంట్ కమ్యూనికేషన్స్ హెడ్ క్వార్టర్స్ (జి.సి.హెచ్.క్యూ) కి చెందిన గూఢచారాలు ఈ నిఘా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారని ది గార్డియన్ వెల్లడి చేసింది. 2009లో రెండు సార్లు (ఏప్రిల్, సెప్టెంబర్) లండన్ లో జి20 సమావేశాలు జరిగాయి. సమావేశాల సమయంలో అతిధేయ నేతలు, వారి సిబ్బంది ఎవరికి ఫోన్లు చేస్తున్నదీ. ఎవరికి ఈ మెయిల్ పంపుతున్నదీ, ఆ సంభాషణల సారాంశం ఏమిటీ… మొదలైన అంశాలు తెలుసుకోవడానికి కంప్యూటర్లు, ఫోన్ల పైన జి.సి.హెచ్.క్యూ గూఢచారులు నిఘా పెట్టారు. ఈ నిఘా కోసం అత్యంత అధునాతనమైన సాంకేతిక వనరులను వినియోగించారని పత్రిక తెలిపింది.

G20 2009కొంతమంది డెలిగేట్స్ ఇంటర్నెట్ కేఫ్ లు వినియోగించేలా ఎత్తుగడలకు గూఢచారులు పాల్పడ్డారని, వాస్తవానికి సదరు ఇంటర్నెట్ కేఫ్ లు జి.సి.హెచ్.క్యూ సంస్ధ నెలకొల్పినవేనని ది గార్డియన్ వెల్లడించింది. తద్వారా వారి ఈ మెయిల్ ట్రాఫిక్ ను గూఢచార సంస్ధలు చదవగలిగారని తెలిపింది. సభ్య దేశాల ప్రతినిధుల మొబైల్ ఫోన్లకు ఏర్పాటు చేసుకున్న భద్రతా సాఫ్ట్ వేర్ ను కూడా చొచ్చుకునిపోయేలా టెక్నాలజీని గూఢచర్యం చేసినవారు వినియోగించారని తెలిపింది. ఈ టెక్నాలజీ ద్వారా సమావేశాల్లో ప్రతినిధులు చేసిన ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్, పాఠ్య సందేశాలు (text messages) తదితర ట్రాఫిక్ ను రికార్డు చేశారని తెలిపింది.

ది గార్డియన్ వెల్లడించిన పత్రాల ప్రకారం జి.సి.హెచ్.క్యూ, సమావేశాలకు 45 మంది ఎనలిస్టులను నిఘా కోసం వినియోగించింది. సమావేశాల ప్రతినిధులు సమావేశాల రోజుల్లో ప్రతి రోజు 24 గంటల పాటు ఏమేమి చేసిందీ, మాట్లాడిందీ, సందేశాలు పంపుకున్నదీ పూర్తి వివరాలను సేకరించేలా వారిని పురి కొల్పింది. బ్రిటన్ కు చిరకాల మిత్రులైన దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల ప్రతినిధులను సైతం వారు వదలలేదు. టర్కీ ఆర్ధిక మంత్రి మెహ్మెట్ సిమ్సెక్, ఆయన పార్టీకి చెందిన 15 మంది ప్రతినిధులు అందరినీ టార్గెట్ చేసుకుని గూఢచారులు నిఘా వేశారు.

జి.సి.హెచ్.క్యూ ఒకవైపు ఈ పనిలో ఉండగానే అమెరికా గూఢచార సంస్ధ (ఎన్.ఐ.ఏ) రష్యా దేశాధ్యక్షుడు మెడ్వెడేవ్ పైన నిఘా పెట్టింది. ఆయన ఫోన్ కాల్స్ సమాచారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వారు సంపాదించారని స్నోడెన్ వెల్లడి చేసిన పత్రాలు తెలిపాయి. బ్రిటన్ లో ప్రస్తుతం జి8 దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. దీనికోసం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

(జి20 దేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యు.కె, అమెరికా, యూరోపియన్ యూనియన్.)

జి20 దేశాధినేతల కంప్యూటర్లు, టెలీ ఫోన్లపై నిఘా వేయడానికి జి.సి.హెచ్.క్యూ గూఢచారులకు బ్రిటిష్ ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయి నుండి అనుమతి లభించిందని ది గార్డియన్ తెలిపింది. ఈ నిఘా ద్వారా సంపాదించిన సమాచారం సహాయంతో చర్చల్లో ప్రత్యర్ధిపై పై చేయి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపింది. బూటకపు ఇంటర్నెట్ కేఫ్ లలో కంప్యూటర్లలో ముందే కీ లాగర్స్, ఈ మెయిల్ ట్రాకర్స్ ను నెలకొల్పి దేశాధినేతలు, ఇతర ప్రతినిధులు సాగించిన సంభాషణలను గూఢచారులు చూశారనీ, బ్లాక్ బెర్రీ ఫోన్లను కూడా వారు హేక్ చేశారని పత్రిక తెలిపింది. ఈ నిఘా ద్వారా వివిధ ప్రతినిధులకు వచ్చిన సందేశాలను వారు చూడకముందే గూఢచారులు తద్వారా బ్రిటిష్ అధికారులు చూడగలిగారని తెలిపింది.

కీ లాగర్స్ ద్వారా ప్రతినిధుల యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను కూడా గూఢచారులు సంపాదించారు. జి.సి.హెచ్.క్యూతో కలిసి పని చేస్తున్న ఎన్.ఎస్.ఏ కూడా ఈ నిఘాలో పాల్గొన్నదని పత్రిక తెలిపింది. ఏప్రిల్ నెలలో దేశాధినేతలు సమావేశం కాగా సెప్టెంబర్ లో జి20 దేశాల ఆర్ధిక మంత్రులు సమావేశం అయ్యారు. ఏప్రిల్ సమావేశంలోనే నిఘా పరికరాలు అభివృద్ధి చేసిన జి.సి.హెచ్.క్యూ అప్పటి అనుభవం ద్వారా సెప్టెంబర్ సమావేశాల నాటికల్లా మరిన్ని నిఘా సౌకర్యాలను అభివృద్ధి చేసుకున్నారని ది గార్డియన్ తెలిపింది. మంత్రులు, వారి సహాయకుల ఫోన్ సమాచారం ఆధారంగా తమ కార్యాలయంలో ఒక పెద్ద గోడపై భారీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని అందులో వారి సంభాషణలు, సందేశాలు చూశారని స్నోడెన్ పత్రాల ద్వారా తెలుస్తున్నదని ది గార్డియన్ తెలిపింది.

తమ ప్రయత్నాలు భలే విజయవంతం అయ్యాయని సమావేశాల అనంతరం గూఢచారులు, బ్రిటన్ నేతలు అభిప్రాయపడినట్లుగా పత్రాలు తెలిపాయి. ప్రతినిధుల కార్యకలాపాలపై నిఘా వేయడంలో తాము పక్కాగా విజయం సాధించామని వారు సంబరపడ్డారని పత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ 6 నెలలు ఉపయోగించారని తెలుస్తోంది. అనంతరం మరింత మెరుగైన ప్రోగ్రామ్ ను వారు రూపొందించుకున్నారా అన్నది మునుముందు తెలియవచ్చు.

One thought on “జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s