ప్రతి చారిత్రక క్షణమూ కొద్ది మంది వ్యక్తులను పతాక శీర్షికల్లో ఉంచుతుంది. ప్రభుత్వము, అధికారాల దుర్వినియోగం.. అలాంటి వారి నుండే అసాధారణ సాహసకృత్యాలను ప్రేరేపించి వెలికి తీస్తాయి. ప్రభుత్వాల ఉద్దేశ్యపూర్వక దుష్ట కార్యాల పట్ల –తమ పౌరులకు అబద్ధాలు చెప్పడం కావచ్చు, వారి ప్రైవేటు వ్యవహారాల్లోకి చొరబడడం కావచ్చు లేదా స్వార్ధ ప్రయోజనాలతో కుమ్మక్కవ్వడం కావచ్చు– విజిల్ ఊదడం ద్వారా ఈ దృఢచిత్తులు ప్రజలకు మంచి జరగడం కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టేస్తారు.
ఒక డేనియల్ ఎల్స్ బర్గ్, బ్రాడ్లీ మ్యానింగ్, షణ్ముగం మంజునాధ్, సతేంద్ర దూబే తదితరుల ఉదాహరణలను బట్టి విజిల్ బ్లోయర్లు పీడన, ఏకాంత కారాగారవాస నిర్బంధంలతో పాటు చావుని కూడా ఎదుర్కొనే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఐనా వారు కవాతు చేస్తూనే ఉంటారు.
అమెరికన్ ఎన్.ఎస్.ఎ, ఫోన్ మరియు ఇంటర్నెట్ రికార్డులపై విస్తృత ప్రాతిపదికన గూఢచర్యం నిర్వహిస్తున్న తీరును ఎండగడుతూ రహస్య పత్రాలను వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటువంటి కధానాయకుల సర్వదేవమందిరంలో (pantheon) ఆసీనులయ్యారు. ఈ యువ అమెరికన్ ఎటు వెళ్లాలో తేల్చుకోవాల్సిన ఒక కూడలిలో నిలబడిన పరిస్ధితి: ఎన్.ఎస్.ఎ విశ్లేషకుడుగా విలాసవంతమైన ఉద్యోగంలో కొనసాగడమా లేక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజ్యానికి ఎదురొడ్డి నిలవడమా? (స్నోడెన్ మాటల్లోనే) “వారు నిన్ను పట్టుకోవాలని నిర్ణయించుకుంటే, ఏనాటికైనా పట్టుకుని తీరుతారు” మరి!
అతి తక్కువ మంది తొక్కిన దారినే ఆయన ఎన్నుకున్నారు. అమెరికా ప్రభుత్వ గూఢచార అత్యాచారాలపై కఠినమైన కాంతిని ప్రసరింపజేయడానికి వీలుగా ఆయన అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు.
అన్నింటికంటే మించి, తన సహచర పౌరుల విమర్శలను, నిశిత పరిశీలనను భరించడానికే నిర్ణయించుకున్నందుకు ఆయన బహుధా ప్రశంసనీయులు. వారి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరించివేయడం అనామోదనీయంగా ఆయన చూశారు.
మానవ హక్కులకు కాగితం పైన మాత్రమే నిబద్ధుడై దేశం లోపలా, బయటా వాటిని ఒక పద్ధతి ప్రకారం అణగదొక్కడానికే మొగ్గు చూపే ఒక అమెరికా అధ్యక్షుడు అందించిన కూల్-ఎయిడ్ (సాఫ్ట్ డ్రింక్ పౌడర్) మత్తులో జోగుతున్న దూషకులు ఆయనను ‘ద్రోహి’ గానూ, ‘అమెరికన్ వే ఆఫ్ లైఫ్’ కు మోసం తలపెట్టినవాడిగానూ ముద్ర వేస్తున్నారు. అతని ప్రవర్తనకు దురుద్దేశాలను అంటగట్టే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి కూడాను: ఎన్.ఎస్.ఎ పత్రాలను లీక్ చేయడానికి విదేశీ పత్రికను (ది గార్డియన్) మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు, హై-స్కూల్ చదువు మానేసిన వాడికి టాప్-సీక్రెట్ పత్రాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి, హాంగ్ కాంగ్ లోనే శరణు వేడడానికి ఆయనను పురిగొల్పిన దురుద్దేశాలు ఏమై ఉంటాయి, ఇలా. నిపుణులుగా అవతరించిన అంతర్జాతీయ చట్టాల వ్యాఖ్యాతలు కొందరు అమెరికా అధికారులు ఆయనను కిడ్నాప్ చేసి తెచ్చినా చట్టబద్ధమే అవుతుందనేవరకూ వెళ్లారు.
ఆయనకు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ వెల్లువెత్తుతున్న ప్రచార సంరంభం అనివార్యమే. కానీ ఆయన అత్యంత (మీడియా) కేంద్రీకరణకు దూరంగా ఉండడం ద్వారా ఆయన మెళుకువతోనే వ్యవహరిస్తున్నారు. “ప్రజల దృష్టి నాపై ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే ఈ కధకు కేంద్రం నేను కావాలని నాకు లేదు. అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నదో దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి” అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన అప్పగింతకూ, అనంతరం జరిగే దేశ ద్రోహం నేర విచారణకూ వ్యతిరేకంగా సుదీర్ఘ న్యాయ పోరాటానికి ఒక పక్క సిద్ధపడుతూనే ఎడ్వర్డ్ స్నోడెన్, మరో పక్క తన వెల్లడింపుల ద్వారా అవుధులు లేని అధికార శక్తి వలన ఏర్పడే ప్రమాదాల గురించి నమ్మశక్యమైన రీతిలో నొక్కి చెబుతున్నారు.
కఠిన కష్టాల ఎదుట ఆయన ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు, నైతిక ధృతి ప్రపంచం నలుమూలలా పౌర హక్కులకు రక్షణగా నిలిచేవారికి స్ఫూర్తిగా నిలుస్తాయి. పీడనకు బాధితుడు కాకుండా ఆయనను వాళ్ళంతా కాపాడుకోవాలి.
బాగుంది సంపాదకీయం. అంతర్జాల స్వేచ్ఛ, పౌరుల ప్రైవసీలకు స్నోడెన్ ఇచ్చిన విలువకూ, చూపిన తెగువకూ సముచిత గౌరవం!
వీరుల త్యాగాలు ఎన్నటికీ వృధా కావు. ఆదిమ సమాజం నుంచి నేటి దాకా…ఎందరో వీరుల త్యాగాలే మానవ సమాజం వికాసానికి కొత్త దారులు చూపించాయి.
సోక్రటీస్, చార్వాక, గెలీలియో, జొహన్నీస్ కెప్లర్, పైథాగరస్….చేగువేరా ఇలా ఎందరో తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నందించారు.
అసాంజే స్ఫూర్తిని అందుకున్న స్నోడెన్….తన పరిధికి మించిన సాహసమే చేశాడు.
అహంకారానికి నిలువెత్తు నిదర్శనమైన అమెరికాకు ( దోపిడిపై మాత్రమే.అమెరికన్లపై వ్యతిరేకత కాదు ) వ్యతిరేకంగా ఎన్నోఏళ్లుగా అనేక మంది తమ గొంతు విప్పుతూనే ఉన్నారు.
అసాంజే తన వీకీలీక్స్ సాయంతో సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో అమెరికా దోపిడీపై ఇంకా ఎవరికైనా సందేహాలుంటే అవన్నీ పటాపంచలయ్యాయి. అగ్రరాజ్యం గుంటనక్క స్వరూపం ప్రపంచం ముందు బట్టబయలైంది.
నా అంచనా ప్రకారం భవిష్యత్ లో అమెరికా దాష్టీకాలకు వ్యతిరేకంగా మరింత మంది గళం విప్పుతారు.
అరబ్ విప్లవం లాగే ప్రపంచ వ్యాప్తంగా యువత అమెరికా దోపిడీపై పోరాటం చేస్తారు.
అసాంజే, బ్రాడ్లీ మానింగ్, స్నోడెన్…వీరంతా రాబోయే ఆ విప్లవాన్ని సూచిస్తున్న వేగుచుక్కలు.
వేగు చుక్క వచ్చిన తర్వాత సూర్యుడు రావడం ఖాయం.
వంద గొడ్లను తిన్న రాబందు కుప్పకూలడం కూడా అంతే ఖాయం.
స్నోడేన్ నీ లాంటి వారిని కాపాడుకోవటానికి శక్తి లేని ఇన్నినపుంసక ప్రభుత్వాల మధ్య జీవిస్తున్నామా?