పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం.
బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించి, యూనివర్శిటీలను యుద్ధ రంగాలుగా మార్చివేసి, రాజధానిలో పది గజాలకు ఒక పోలీసు గుంపును నిలబెట్టి, రోడ్లపై కార్లు, స్కూటర్లు, బైక్ లు కూడా తిరగనివ్వకుండా అడ్డుకుని, ప్రయాణీకుల వ్యక్తిగత బ్యాగ్ లు, సూట్ కేసులు కూడా బలవంతంగా తెరిపించి తనిఖీలు చేసి… ఎందుకిదంతా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పునరుద్ఘాటించడానికి పార్లమెంటరీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ హక్కుకు అనుగుణంగా నిర్వహించ తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ పిలుపును అడ్డుకోడానికి!? అంటే రాజధాని వీధుల్లో ఒక ఊరేగింపు జరగకుండా అడ్డుకోవడానికి? ఇదా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?
ఇన్ని కట్టుదిట్టాల మధ్య ఊరేగింపు జరగనివ్వకుండా అడ్డుకుంటే ఆ ఊరేగింపు జరిగినట్లే కాదా?
70-80ల్లో ఐదో తరగతి తెలుగు వాచకంలో ‘ఈశ్వరుడు-శనైశ్వరుడు’ అని ఒక పద్య పాఠం ఉండేది. శనిగారు ఒక సారి ఈశ్వరుడి దగ్గరికి ఏతెంచి ‘నేను నీకు పడతాను, కాచుకో గలవా’ అని సవాలు విసిరాడట. ‘లేదు, నేను సర్వ శక్తిమంతుడను, నువ్వు నాకు పట్టడం అసంభవం.’ అని ఈశ్వరుల వారు ప్రతి సవాలు విసిరారట. ‘అయితే ఫలానా ఘడియ నుండి ఫలానా ఘడియ వరకు నేను నిన్ను పట్టి పల్లారుస్తాను’ అన్నాట్ట శనీశ్వరుల వారు.
ఇంకేం, క్లూ ఇచ్చేశాడు గదాని ఈశ్వరుల వారు, శనీశ్వరుడు చెప్పిన సమయానికి కైలాసం వదిలి ఎవరూ సంచరించలేని తావుకి వెళ్ళి ఒక మడుగులో అట్టడుగున దాక్కున్నారట. శనీశ్వరుడు నిర్దేశించిన గడువు ముగిశాక ఈశ్వరుడు కులాసాగా బైటికి వచ్చి కైలాసానికి తిరిగి వచ్చారట.
అనంతరం శని గారు వచ్చి ‘చూశావా నా తడాఖా’ అన్నాట్ట. ‘నువ్వసలు నన్ను చేరనేలేదు. ఇక నీ తడాఖా ఎక్కడిది?’ అని ప్రశ్నించిన శంకరునికి “ఓరి పిచ్చి శంకరయ్యా, ప్రమధ గణాలను వీడి, భార్యలను వీడి, కైలాసమే వీడి, ఎవరూ సంచరించలేని తావుకి వెళ్ళి, నీటి మడుగులో అట్టడుగున దాక్కోవలసిన పరిస్ధితిని నీకు కల్పించాను. ఇంతకంటే శని ఎవరికి పడుతుంది?” అని ప్రశ్నించిన శనైశ్వరుడి మాటలు విని నెత్తి గోక్కోవడం (గంగమ్మకు గాయం కాకుండానే లెండి) ఈశ్వరుల వంతయిందట!
అలా వుంది, మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి శూరత్వం!
ది హిందూ ప్రకారం ‘ఛలో అసెంబ్లీ’ ఊరేగింపు జరగకుండా నిరోధించడానికి వివిధ పారా మిలట్రీ బలగాలతో పాటు మిలట్రీతో సమానమైన బి.ఎస్.ఎఫ్ బలగాలను కూడా దించింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు 25,000 మందిని ఒక్క రాజధానిలోనే మోహరించారు. అసెంబ్లీకి దారి తీసే ప్రతి మార్గంలోని ప్రతి పది గజాలకూ ఒక పోలీసు పికెట్ ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టూ మూడు అంచెల్లో పోలీసు బలగాలను మోహరించి అప్పటికీ నమ్మకం లేక ఉక్కు బారికేడ్లు కూడా నిర్మించారు.
ఒక్క సైబరాబాద్ లోనే 4గురు డి.ఐ.జిలు, 7 గురు ఎస్.పిలు, 40 మంది డి.ఎస్.పి లు, 100 మంది ఇనస్పెక్టర్లు, 400 మంది సబ్-ఇనస్పెక్టర్లను నియమించారు. సైబరాబాద్ లో వివిధ చోట్ల మొత్తం 58 చెక్ పోస్టులు నిర్మించి వాహనాలను తనిఖీ చేస్తూ, చీమ గూడా తమను మీరీ దాటిపోకుండా కాపలా కాశారు.
ఇన్ని చేసి కూడా విద్యా సంస్ధలన్నింటికీ సెలవు ప్రకటించేశారు. ప్రతి ఒక్క ఫ్లై ఓవర్ రహదారిని మూసేశారు. ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులను రద్దు చేసేశారు. ఒక సికింద్రాబాద్-లింగంపల్లి రూట్ లో మాత్రమే అనుమతించారు.
ఇన్ని చర్యలు తీసుకున్నా మూడు గుంపుల్లో విద్యార్ధులు, యువకులు అసెంబ్లీని చేరుకోవడం, కట్టుదిట్టమైన పోలీసు కాపలా, డేగల్లా పరిశీలించే సి.సి కెమెరాల మధ్య టి.ఆర్.ఎస్ ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకెళ్లి మరీ దగ్ధం చేయడం ఏమి సూచిస్తోంది?
ఛలో అసెంబ్లీ పిలుపు దిగ్విజయంగా విజయవంతం అయిందని సూచిస్తోంది. మీదు మిక్కిలి ఆ పిలుపును అమలు చేసింది పోలీసులు, పారా మిలట్రీ బలగాలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలే కావడం గమనార్హం. వీరంతా నిన్నటివరకూ అసెంబ్లీ వద్ద లేరు. ఛలో అసెంబ్లీ పిలుపు కోసమే అసెంబ్లీ వద్దకు వచ్చారు. హైద్రాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్ రహదార్లన్నింటిని నింపేశారు. సాధారణ జనానికి బదులు పోలీసు బలగాలే ‘ఛలో అసెంబ్లీ’ పిలుపును అమలు చేసేశారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండు అనేది ఏమీ దేశాన్ని చీల్చేది కాదు. పాకిస్ధాన్ కి మద్దతుగా కాదు. కమ్యూనిస్టు పార్టీల్లో సి.పి.ఎం ఆ డిమాండ్ కి మద్దతే ఇవ్వడం లేదు. భద్రత కారణం చెప్పడానికి పోలీసులు ఎప్పుడూ చూపే సాకు ఐన మావోయిస్టులు ఈ ఉద్యమంలో లేరు. మద్దతు ఇస్తే ఇవ్వొచ్చు గానీ వారిని రాష్ట్రం నుండి తుడిచిపెట్టేశామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే సగర్వంగా దేశం అంతా చాటుకుంటోంది. మరెందుకింత నిర్బంధం? ప్రభుత్వానికి ఎందుకిన్ని ఆపసోపాలు?
‘హమ్మయ్య పోలీసులు అడ్డుకున్నారు’ అని సమైక్యవాదులు ఎవరైనా సంతసిస్తున్నట్లయితే వారు తమకు తాము ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ అడ్డుకోడానికి పోలీసు నిర్బంధం సరైందే అయితే, రేపు విద్యుత్ ఛార్జీల పింపుదలకు వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనలపై మోపబడే పోలీసు నిర్భంధం సైతం సరైందే అవుతుంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం పైన కేంద్ర ప్రభుత్వం మోపిన అణచివేత కూడా సరైందే అవుతుంది. నిర్భయ అత్యాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజానీకం పై ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన అమానుష నిర్బంధం కూడా సరైందే అవుతుంది.
అప్పుడీ దేశం కనీసం సోకాల్డ్ ప్రజాస్వామ్య దేశం కూడా కాజాలదు. అచ్చంగా పోలీసు రాజ్యం లేదా, నియంతృత్వ రాజ్యం అవుతుంది. ఫర్వాలేదా?
పోలీసులూ, తుపాకులని ఉపయోగించి ప్రజా ఉద్యమాలని అణచి వేసి, మేము శాంతి భద్రతలని పరిరక్షించామని చెప్పుకోవడం గాంధేయవాద ముసుగు వేసుకున్న పాలకుల నైజం.
inka ekkadi prajaswamyam.chalo asembly ni inta prajadhananni vruda chesi CM garu sadinchidi yemiti.
భావ ప్రకటనా స్వేచ్చ తమ భావాలు వెల్లడించుకోటానికి గాని, బస్సులు తగలబెట్టడానికి, విధ్వంసం సృష్టించడానికి కాదు. ఉద్యమం పేరిట ఇలాంటి వెధవ పనులు చేస్తే ప్రభుత్వానికి ఆయా సంఘాలమీద నమ్మకం ఎలా ఉంటుంది?
నిన్నటి నుంచి చూస్తున్నాను, ట్రైన్ పై నక్సల్ దాడి గురించి ఎలా సమర్దిస్తారో అని.
(మీకు అసద్ వ్యాఖ్యల గురించి,చైనా ఏకపక్ష దాడుల గురించి,మావొయిస్టుల రాజ్య అధికార కాంక్ష గురించిన న్యూస్ కనపడవనుకుంటాను.)
మనకు నచ్చిందే కర్రెక్ట్ అనుకుంటే అందరూ సత్రువులే, మన అసంత్రుప్తి సమాజంలో అశాంతి రేకెత్తించగలదు. వినే ఓర్పు, ఒక్క క్షణం బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తే అన్ని సమస్యలకి సులువైన పరిష్కారం దొరుకుతుంది.
తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే కన్నా మనసుంటే వంద మార్గాలు కనిపిస్త్తాయి.
కొంచెం పట్టు విడుపు ఉండాలంతే.
ప్రజాస్వామ్యం లో అందరి ఆకాంక్షలనూ తీర్చాల్సిందే. కాని అది మెజారిటి అభిప్రాయాన్నే ప్రతిబింబిస్తుంది.
ప్రజాస్వామ్య పద్దతి లోనే సాధించాలి.
కాని ఈ దేశంలొ కొంత మందసెంబ్లీఇకి నచ్చనంత మాత్రాన లేదా నస్టం కలిగించినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని మార్చి మాఓఇజం పెట్టలేము. రిజర్వేషన్లు తీసేయలేము.
కొన్ని కఠిన వాస్తవాలు భరించాలి.
కాని ఈ దేసం గొప్పతనం స్వెచ్చ బహుసా ఇక్కడున్నన్నాళ్ళు తెలియవేమొ. విమర్సించడం తేలిక. కాని ఆ విమర్సకులు 100 శాతం అందర్ని మెప్పించగల పరిష్కారం చూపించగలరా. (కాష్మీర్ లాంటి సమస్యలతో సహా)
ఇక పై విషయానికొస్తే అసెంబ్లీ పై దండయాత్ర కి నిరసన కీ చాలా తేడా ఉంది. అసెంబ్లీ ముందు నిరసన అందరి హక్కు.అది అన్ని ప్రాంతాల వారికీ ఉంటుంది. రాష్ట్రసార్వభౌమాదికార నిలయానికి టాంక్ బండ్ విగ్రహాల గతి పట్టదని హామి ఏముంది.
ప్రభుత్వం తన ధర్మం నిర్వర్తించింది. నిరసనకారుల ప్రాణాల రక్షణ కూడా తీసుకుంటుందన్న ధైర్యం కేసులు ఎత్తేస్తారన్న ధీమా కూడా ఉంది కదా.
మొత్తం టపాలో ’కమ్యూనిస్టు పార్టీల్లో సి.పి.ఎం ఆ డిమాండ్ కి మద్దతే ఇవ్వడం లేదు‘ అనే వాక్యం అవసరమా? అవకాశం కల్పించుకొన సిపిఎం మీద బురద చల్లడం అవుతుందని నేననుకుంటున్నాను. సిపిఎం సమైక్యతనే బలపరుస్తుంది. అయినప్పటికీ మీరనుకుంటున్నట్లు ‘హమ్మయ్య పోలీసులు అడ్డుకున్నారు’ అని సమైక్యవాదులెవరూ అనుకోవట్లేదు. సిపిఎం కూడా బహుషా అనుకోదు. వాల్లేమంటారో చూద్దాంలెండి. నేననుకునేది చలో అసెంబ్లీని ఈ విధంగా అడ్డుకొని తెలంగాణా వాదులకు మేలే చేసారు ముఖ్యమంత్రి కిరణ్. ఈ నిర్బంధం అవసరం లేదు. ఇందులో 100 వవంతు చర్యలు తీసుకున్నా టాంక్ బండ్ మీద విగ్రహాలకు అంత హాని జరిగి ఉండేది కాదేమో. పోలీసులనెంతమందినయినా పెట్టుకొని హింసకు తావు లేకుండా చూసుకోవాలి ప్రభుత్వం. అంతే కాని నిరసనకు అవకాశం లేకుండా చేయాలని ఎవరూ అనుకోరు.
aaa గారూ, మీరు చూళ్లేదనుకుంటాను, అసద్ వ్యాఖ్యల గురించి మీలాగే కొందరు మిత్రులు అడిగితే రాశాను. చైనా ఏకపక్షంగా ఇండియాపై ఎప్పుడు దాడి చేసిందో నిజంగా నాకు తెలియదు. పత్రికల్లోనూ చదవలేదు. బహుశా మీ ఉద్దేశం ఎల్.ఎ.సి చొరబాటు గురించయితే అది కూడా రాశాను.
మావోయిస్టులు తమకు రాజ్యాధికార కాంక్ష ఉందని ఎప్పుడూ చెప్పలేదు. పత్రికల్లో చదివినంతవరకూ వారు శ్రామికుల రాజ్యాధికారం గురించే చెప్పారు తప్ప తమకు కావాలని చెప్పలేదు. ప్రజలకు రాజ్యాధికారం రావడానికి వారు ఒక మార్గాన్ని నమ్మారు. దాని ప్రకారం వాళ్లు పోతున్నారు. మీకు వీలయితే ఆ మార్గం ఏమిటో తెలుసుకుని చర్చించండి. వాళ్లది ఏ మార్గం నన్ను కొత్తగా అడిగితే ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే నాలుగు మాటల్లో చెప్పేది కాదది. మావో ధాట్ గురించి ఒక ఆర్టికల్ రాశాను. అది చదివితే మీకొక ఐడియా రావచ్చు.
నేను గతంలో కొందరికి చెప్పాను. మీకు మరోసారి చెబుతాను. నేను రాయని వార్తలు అనేకం ఉన్నాయి. రాయాలనుకుని రాయలేని విశ్లేషణలూ చాలా ఉన్నాయి. చైనా గురించే చందుతులసి లాంటివారు ఒక ప్రశ్న వేశారు. సలహా కూడా ఇచ్చారు. ఆయనకి ఆ సలహా పాటిస్తానని హామీ కూడా ఇచ్చేశాను. కాని కుదరడం లేదు.
భారతదేశం గొప్పతనం కేవలం రాజ్యాంగంలో ఉంటే మాత్రమే సరిపోదు. అది ప్రజలకి అందుబాటులోకి వస్తెనే అది గొప్పదవుతుంది. చిట్టచివరి సామాన్యుడికి కూడా స్వాతంత్ర్య ఫలాలు దక్కితేనే నిజమైన స్వాతంత్ర్యం అని మావోయిస్టులు కాదు, మన ప్రధాన మంత్రులే ప్రతి సంవత్సరం చెబుతారు. అది ఇంకా దక్కలేదనీ, ఇంక్లూజివ్ గ్రోత్ జరగడం లేదనీ వాళ్లే చెబుతారు. ఎన్నికలొస్తే ప్రజల సమస్యలన్నీ వాళ్లే వల్లిస్తారు. ఇంకెక్కడి గొప్పతనం?
ఛలో అసెంబ్లీ పిలుపుని దండయాత్ర అని మీరంటున్నారు. కాని నాకా అభిప్రాయం లేదు. చంద్రబాబు పాలనలో ఈ కాంగ్రెస్ పాలకులే విప్లవ పార్టీలతో సహా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన కబుర్లే తెలుగు దేశం ప్రభుత్వం చెప్పింది. కాని ఇప్పుడు వాళ్లే కాంగ్రెస్ దమన నీతిని తీవ్రంగా ఖండిస్తున్నారు. రేపు బంద్ లో వాళ్లు కూడా ఉన్నారనుకుంటాను.
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ, మైనారిటీ విభజన కాదు. ఓట్ల గెలుపు అసలే కాదు. ప్రజాస్వామ్యం అంటే దేశంలో ప్రతి ఒక్కరికీ చేయడానికి పని, ఉండడానికి ఇల్లు, ధరించడానికి గుడ్డ, జబ్బొస్తే వైద్యం, అనుభవించడానికి సంతోషం…. ఇవన్నీ దక్కడం. అవి లేకపోతే పుస్తకాల్లో ఎన్ని నీతులు రాసుకున్నా, ఉపన్యాసాలు ఎన్ని దంచుకున్నా అన్నీ వృధాయే.
వంద శాతం ఎవరు? కాశ్మీరు గురించి ఎవరు నిర్ణయిస్తారు? భారత దేశం గురించి భారత ప్రజలు నిర్ణయిస్తారా లేక అమెరికా, ఐరోపాలు నిర్ణయిస్తాయా? బ్రిటన్ నిర్ణయించడానికి వీల్లేదనే కదా వారిని తరిమికొట్టింది? కాశ్మీరు ప్రజలదీ అదే సమస్య. కాశ్మీరు ప్రజలు ఎలా ఉండాలన్నది నిర్ణయించేది మీరూ నేనూ కాదు, కాంగ్రెస్, బి.జె.పి, కమ్యూనిస్టులు, మావోయిస్టులు వీళ్లు కూడా కాదు. అక్కడి ప్రజలు నిర్ణయించాలి.
తెలంగాణ కూడా అంతే. వాళ్లు ఒక రాష్ట్రంగా ఉండాలా లేదా అన్నది అక్కడి ప్రజలు నిర్ణయించుకోవాలి తప్ప సీమాంధ్ర ప్రజలు కాదు. ఈ సూత్రాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా అంతా అంగీకరిస్తారు. (సిరియా భవిష్యత్తు నిర్ణయించేది సిరియా ప్రజలే గానీ బైటివాళ్లు కాదని మన ప్రభుత్వం చెబుతోంది.) కానీ ఆచరణలో తమ వరకి వస్తే మొఖం చాటేస్తారు.
పోయినేడు సూడాన్ రెండు దేశాలుగా విడిపోయింది సూడాన్, దక్షిణ సూడాన్ లుగా. సూడాన్ నుండి దక్షిణ సూడాన్ విడిపోయింది. దానికోసం మొదట ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. దక్షిణ సూడాన్ విడిపోవాలా లేదా అని సూడాన్ ప్రజలందర్నీ అడగలేదు. కేవలం దక్షిణ సూడాన్ ప్రజలను మాత్రమే అడిగారు. వారు విడిపోవాలి అన్నారు. అలా విడిపోయింది. దీనికి ఐరాస, అమెరికా, ఐరోపా అన్నీ దగ్గరుండి మంత్రసానిపని చేసాయి. ఇధియోపియా నుండి ఎరిట్రియా విడిపోయినప్పుడూ ఇదే జరిగింది. ఇంగ్లండ్ నుండి ఉత్తర ఐర్లండ్ విడిపోయినప్పుడూ ఇదే జరిగింది. సోవియట్ రష్యా నుండి మధ్య ఆసియా దేశాలు విడిపోడానికి అక్కడి ప్రజల ప్రకారం నిర్ణయించారు తప్ప రష్యాని అడగలేదు. బాల్టిక్ రిపబ్లిక్కులు, బాల్కనీకరణ ఇలా చరిత్ర నిండా ఇలాంటి ఉదాహరణలే కనిపిస్తాయి.
కాబట్టి మీకు అది కనపడదు, ఇది కనపడదు అనేకంటే చర్చించడానికి ప్రయత్నించండి. మీకు తెలిసింది ఏమన్నా ఉంటే నాకు చెప్పడానికి ప్రయత్నించండి. మీకు తెలియంది ఏమన్నా ఉంటే తెలుసుకోడానికి ప్రయత్నించండి.
అశోక్ గారూ, ఈ టపా వరకు చూసుకుంటే సి.పి.ఎం గురించి నేను రాసింది ఆ పార్టీ అవగాహనపై విమర్శ కోసం కాదు. సాధారణంగా ఆందోళనలు చేసేది కమ్యూనిస్టు పార్టీలు. వాటిపైన నిర్బంధం అమలు చేసేది బూర్జువా పార్టీలు. అలాంటి ఆందొళన కూడా కాదు కదా ఇది అన్న అర్ధంలో ఆ పార్టీ ప్రస్తావన చేసాను. ఆ విధంగా అది సి.పి.ఎం కి పొగడ్తే తప్ప తెగడ్త కాదు. సమైక్యవాదులు అన్నప్పుడు కూడా సి.పి.ఎం నా అవగాహనలో లేదు.
తెలంగాణకు సంబంధించి సి.పి.ఎం పార్టీ పై నా అవగాహన ఇది: ఆ పార్టీ సమైక్య అవగాహన సరికాదు. కాని తెలంగాణ ఉద్యమం పట్ల ఆ పార్టీ గౌరవనీయంగా వ్యవహరిస్తోంది. విద్వేషం వెళ్లగక్కడం లేదు. మేము అడ్డుకోవడం లేదు కదా అని కూడా అంటోంది గనుక సి.పి.ఎం వ్యతిరేకత పెద్ద విషయం కాదు.
పోతె సి.పి.ఎం గురించి రాసినప్పుడల్లా లేక విమర్శించినప్పుడల్లా మీరు ‘అది అవసరమా’ అని అడుగుతున్నారు. అవసరం అనుకునే నేను రాస్తాను. రాసిన విషయంలో నేనేమన్నా అసత్యం రాశాననిపించినా, తప్పు అవగాహనతో ఉన్నాననిపించినా మీరు ఎత్తి చూపండి. లేదా చర్చించండి. కానీ రాయొద్దు అని మాత్రం మీరు అనకూడదు. నా అభిప్రాయాలు చెప్పుకోవడానికే కదా ఈ బ్లాగ్. రాయొద్దంటే ఎలా?
విశెఖర్ గారు,
మీ ఆర్టికల్స్/బ్లాగ్ నేను ఈ మధ్య నె చదవటం మొదలు పెట్టాను. చాలా బాగుంది మీ విశ్లేషణ.
కాని కొన్ని విషయాల లొ మీ ఆర్టికల్స్ పార్షియల్ గా అనిపించాయి. ఉదాహరణ కి అమెరికా అగ్ర రాజ్య పెతనం మీద ఇంకా బి. జె. పి. పార్టి కి వ్యతిరేకంగా. మీరు పర్సనల్ గా ఒక విదానానికి ముందే ఫిక్స్ అయి రాసారు అనిపించింది బట్ ఓవరాల్ గా చాలా బాగుంది మీ ఎంపిక.
ఒక సారి TRS నాయకుడు ప్రకాశ్ అన్నాడు “CPMవాళ్ళు మొదట్లో గతితార్కిక-చారిత్రక భౌతికవాదం తమ అజెండా అని చెప్పుకుని ఇప్పుడు గతితారిక భౌతికవాదంతో ఏమాత్రం సంబంధం లేని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు” అని. రాష్ట్రం విడిపోతే సాధారణ ప్రజలకి వచ్చే నష్టం ఏమీ లేదు. హైదరాబాద్ మీద అనుబంధం పెంచుకున్నవాళ్ళని దాని వల్ల బాధ కలుగుతుంది, అంతే. ఒక వర్గంవాళ్ళ vital interests (కీలక ప్రయోజనాలు) తో కూడా సంబంధం లేని సమైక్యాంధ్ర ఉద్యమానికి CPM ఎలా మద్దతు ఇచ్చిందో అని సందేహించేంత సంశయ జ్ఞానం మార్క్సిజం గురించి కొద్దికొద్దిగా తెలిసిన పాలకవర్గంవాళ్ళకి కూడా ఉంటుంది.
ప్రాక్టికల్‌గా అయితే CPM నాయకులు పచ్చి మోసగాళ్ళు. “మేము తెలంగాణా ఏర్పాటుకి మద్దతు ఇవ్వము కానీ ఆ రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకోము” అని ప్రకటించిన బి.వి.రాఘవులు నాగర్‌కర్నూల్ తదితర స్థానాలలో జరిగిన ఉప ఎన్నికల విషయంలో మాట మార్చి, మేము ఆ స్థానాలలో పోటీ చేసి తెలంగాణాలో సమైక్యవాదం ఉందని నిరూపిస్తామని అన్నాడు. ఆ స్థానాలలో CPMకి అల్ప సంఖ్యలో పడిన వోట్లని చూపించి, తెలంగాణాలో ఇంత మంది సమైక్యవాదులు ఉన్నారంటూ తన బ్లాగ్‌లో వ్రాసాడు తెలకపల్లి రవి అనే CPM మేతావి. ఆ పార్టీ నాయకులు ప్రజలని ఫూల్ చేసేది ఇలాగే. రెండు కళ్ళ సిద్ధాంతం పేరు చెప్పుకునే తెలుగు దేశానికి పడిన వోట్లని కూడా సమైక్యవాదానికి పడిన వోట్లుగా చూపించే పరకాల ప్రభాకర్ లాంటి విష కంఠుల కంటే మన CPM నాయకులు గొప్పవాళ్ళేమీ కాదు.
తెలంగాణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోబాటుగా తెరాస అనుసరిస్తున్న వైఖరికూడా సరైనదికాదు. వాళ్ళ పరుషవ్యాఖ్యలు, హింసాపూరిత పోకడలతో ప్రభుత్వపు అణచివేతను సమర్ధించుకొనే అవకాశాన్ని ప్రభుత్వానికి వారే ఇచ్చారు. ప్రభుత్వం ఇలా బలగాలను మొహరించడాన్ని అణచివేత చర్యగానేకాక గతానుభవాల నేపధ్యంలో ముందుజాగ్రత్తగా చర్య్గాకూడా చూడాలని చెప్పదలచుకున్నాను. మొత్తం ఉద్యమాన్ని ప్రజల మధ్య జరుగుతున్న యుధ్ధంగా చిత్రించే స్థ్యాయిలో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో ఇద్దరిదీ ప్రముఖ పాత్రే.
విశేషజ్ఞ గారు, హింస లేకుండా ప్రత్యేక రాష్ట్రం వస్తుందనుకుంటే అది నిప్పు లేకుండా పొగ వస్తుందనుకోవడం లాంటిది.
శేఖర్ గారికి ,
ప్రజా స్వామ్య బద్ధం గా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకునే చర్యల మీద మీ టపా ఉన్నా , చర్చ మాత్రం ఇంకో దోవలో పోతూ ఉంది !కలిసి ఉండడం , విడిపోవడం స్థానికం గా ఉండే ప్రజల మీద ఆధారపడి ఉంటుందనే వాదన సహేతుకం గా ఉంది ! అందుకు మీరు, వివిధ దేశాలు విడిపోవడం ఉదహరించడం మాత్రం సమంజసం గా లేదు !
ప్రతి దేశం నుంచీ ,ఒక అంతర్భాగం , ఇంకో దేశం గా విడిపోవడానికి , అనేక , భౌగోళిక ,చారిత్రక , సాంస్కృతిక , భాషా తారతమ్యత లే కాకుండా , ముఖ్యం గా ,ఒక వర్గం వారు , ఇంకో వర్గం వారిని, దోచుకోవడం , లేదా హింసించడం , లేదా సామాజిక అసమానతలకు గురిచేయడం కూడా కారణాలు గా కనబడుతున్నాయి !
కాశ్మీరు విషయం ప్రస్తావించినపుడు ,ఉగ్ర వాదుల చర్యలతో , బెదిరింపులతో , ప్రాణ భయం , ఉన్న ఆస్తులూ , ఆదాయాలూ వదులుకుని తో ఢిల్లీ కి వలస వచ్చి ఇంకా ఢిల్లీ రోడ్ల మీద ఉంటున్న అనేక లక్షల మంది హిందువుల సంగతి ఎవరికీ పట్టడం లేదు ! కాశ్మీరు లో, ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజల మీద ఇది ఆధార పడితే , ‘జనా’భిప్రాయాలు , సహజం గానే, ఏక పక్షం గా ఉంటాయి !
ఎరిత్రియా, ఇథియోపియా నుంచి విడిపోవడానికి కూడా , ఇటలీ వలస వాదులు ఆక్రమించుకున్న ఎరిత్రియా ను తిరిగి ఇథియోపియా రాజు ( సామ్రాజ్య కాంక్ష తో ! ) స్వాధీనం చేసుకోవడం , ఇథియోపియా భాషను, ఎరిత్రియా ప్రజల మీద బలవంతం గా రుద్దాలని , ప్రయత్నించడం కూడా దోహద పడ్డాయి!
సూడాన్ విభజన కూడా వివిధ జాతుల , మతాల మధ్య వైరం కొన్ని లక్షల మంది, వివిధ జాతుల వారు అతర్యుద్ధం లో ప్రాణాలు కోల్పోయాక, పొరుగు దేశాలలో నిరాశ్రయులు అయినాక , జరిగింది !
ఐర్లాండ్ విడిపోవడానికి కూడా , జాతీయ వాదం తో పాటుగా ,భాషా ( ఐరిష్ భాష ఇంగ్లీషు భాష కాదు ! ) , మతాలూ తేడా అవడం వల్ల ( ప్రొ టె స్టెంట్ లూ కాథలిక్ లూ ) !
రష్యా ముక్కలవడానికి కూడా , వివిధ భాషా సాస్కృతిక భేదాలతో పాటుగా , గోర్బచేవ్ సంస్కరణల ఫలితం గా వచ్చిన స్వేచ్ఛ ఫలితం గానే !
ప్రస్తుత సమస్య , పైన ఉన్న చారిత్రిక వాస్తవాలకన్నా భిన్నమైనది ! ఇక్కడ భాష లో తేడా లేదు ! మత భేదం కూడా విషయం కాదు ! ప్రాంతీయ అసమానతలు లేనివి ఎక్కడ ? ఏ దేశం లోనైనా ఒక ప్రాంతం లో వనరులు ఎక్కువ గా ఉంటే , ఆ ప్రాంతం మీద దృష్టి కేంద్రీకరించ డమూ , ఎక్కువ అభివృద్ధి చేయడమూ కూడా జరుగుతుంది !
నేను పై విషయాలు ప్రస్తావించడం లో ముఖ్య ఉద్దేశం , అవినీతీ , స్వార్ధం , మోసం , పదవీ వ్యామోహం, ఇవి ప్రధాన సమస్యలు ! ఇప్పుడు విభజన తో అత్భుతం జరుగుతుందనుకోవడం, అత్యాశే అవుతుంది, ఎవరికైనా ! ముఖ్యం గా సామాన్య మానవులకు ! ఇన్ఫెక్షన్ సోకితే , అసలు ఇన్ఫెక్షన్ కు మందు వేయకుండా , కేవలం జ్వరం తగ్గడానికి మందు వేయడం లా ఉంటుంది, ఈ పరిష్కారం !
కనీసం ఓ యాభై ఏళ్ల క్రితం అనుకుంటా, మహాకవి శ్రీ శ్రీ రాశారు !
పదవీ వ్యామోహాలూ , కులమత భేదాలూ ,
భాషా ద్వేషాలూ చెలరేగే నేడూ ,
ప్రతి మనిషీ , మరి ఒకరినిని దోచుకునే వాడే !
తన సౌఖ్యం , తనభాగ్యం చూసుకునే వాడే !
స్వార్ధమే అనర్ధ దాయకం , అది చంపు కొను టె క్షేమ దాయకం !
పాడవోయి భారతీయుడా !
యాభై ఏళ్ల క్రితం రాసినా ఈ పాట, ఇంకో వందేళ్లయినా అప్పటికి యదార్ధం గానే ఉంటుంది !
ప్రవీణ్ గారూ,
మరప్పుడు ప్రభుత్వంచేసిన ‘ద్వంసనణచ హించరచన’ని మాత్రం ఎలా తప్పుపట్టగలం?
సుధాకర్ గారూ అవును శ్రీ శ్రీ పాట ఇప్పటికీ యదార్ధమే. కాని ఆ యదార్ధం కూడా మీ దృష్టిలోనూ, నా దృష్టిలోనూ తేడాగా ఉండొచ్చు. నిజానికి శ్రీ శ్రీ ప్రాపంచిక దృక్పధంలోనే నేను పైన రాశాను.
నేను ఒకందకు సమాధానం ఇచ్చాను. మీరు మరొకందుకు దాన్ని తీసుకున్నారు.
వంద శాతం అందరినీ మెప్పించగల పరిష్కారం చూపగలరా అని వ్యాఖ్యాత అడిగారు. ఆ వందశాతానికి ప్రాతిపదిక ఏమిటో వివరించడానికి పై ఉదాహరణలు చెప్పాను. ఎరిత్రియా, ఐర్లండ్ తదితరాలు విడిపోయాయి కాబట్టి కాశ్మీర్ విడిపోవచ్చనో లేదా తెలంగాణ రాష్ట్రం కావచ్చనో కాదు. ప్రజాభిప్రాయ సేకరణకు గానీ లేదా ఎవరిని మెప్పించాలి అనేదానికి గానీ ఏమిటి ప్రాతిపదిక? అన్న ప్రశ్నకు సమాధానంగా రాశాను.
తెలంగాణ విభజనతో అద్బుతాలు జరగవు. సందేహం లేదు. కానీ వనరుల విభజనలో “కనీస” న్యాయం జరగడానికి మార్గం ఏర్పడుతుంది. వీలయితే ఈ కింద లింక్స్ చూడండి.
http://wp.me/p1kSha-Id
http://wp.me/p1kSha-1mR
కాశ్మీరు పండిట్ ల సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారమే (వారు అక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నపుడే) రెండు, మూడు లక్షలకు మించలేదు. కాని మిలియన్ల కొద్దీ తరిమివేయబడ్డారు అని చెప్పడం పరిపాటి అయింది. అన్ని ఉద్యమాలకు మల్లే కాశ్మీరు జాతీయోద్యమంలో కూడా అనేక స్వార్ధ శక్తులు జొరబడ్డాయి. ఐనంత మాత్రాన వారి జాతీయ కాంక్షలు అచారిత్రకం కాబోవు.
జాతుల స్వయం పాలనా ఆకాంక్షలు సహజమైనవి. వీటిని ఐరాస కూడా గుర్తిస్తుంది. అమెరికా, ఐరోపాలు తమకు అనుకూలంగా ఉన్నచోట వాటిని పాటిస్తాయి. వ్యతిరేకంగా ఉంటే ఉగ్రవాద ముద్ర వేస్తాయి. ఇవి కాదు ప్రధానం. పైన చెప్పినట్లు స్ధానిక ప్రజలు ఏమి కోరుతున్నారన్నదె ముఖ్యం. కాశ్మీరు పండిట్ లు తిరిగి రావాలని కాశ్మీరులోని ప్రధాన పోరాట శక్తులు అనేకసార్లు విజ్ఞప్తి చేసాయి. కాని అక్కడ సైనిక నిర్బంధం ఉన్నన్నాళ్లూ ప్రజల ఆగ్రవేశాలు వీలు దొరికినవైపుకి వ్యక్తం అవుతాయి. అది ఒక్కోసారి పక్కనే ఉన్న పండిట్ లపైకి వ్యక్తం కావచ్చు. వారిని మతపరంగా టార్గెట్ చేసుకునే స్వార్ధ శక్తులు ఎలాగూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా కాశ్మిరు సమస్యను అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించడానికి ఇండియా, పాకిస్ధాన్ లు సిద్ధపడితే పండిట్ ల సమస్య పరిష్కారం కావడం ఎంతో కాలం పట్టదు. అసలు సమస్య అలానే ఉండగా పండిట్ ల సమస్యను ఎత్తి చూపడం అసలు సమస్యను పట్టించుకోకపోవడమే.
మీరు కారణం సరిగ్గా చూస్తున్నారు గానీ, పరిష్కారం వద్దకు వచ్చేసరికి తడబడుతున్నట్లు నాకనిపిస్తోంది. ( నా అభిప్రాయం మాత్రమే).
nenu chala rojulanunchi blogs chaduvuthuntanu ….. ekkada andhra blogger su telangana ku support chesinattu kanipinchadu kanipinchina dantlo enno donka thirugullu vuntai … ee vishaymilo meenahaimpu vshekar garu and praveen garu …… ikkada maa nanna garu cheppe oka vishyam gurthuku vasthuntundhi communistle nijamain manavali premikulu raa ani …….
శేఖర్ గారూ ,
మీరు ఇచ్చిన లింకులలోని రెండు టపాలూ చూశాను. చాలా వివరం గా రాశారు. చర్చ కూడా ” దీర్ఘం ” గా జరిగింది.
వనరుల విభజనలో న్యాయం జరుగుతుంది అన్నారు. అందుకు రాష్ట్ర విభజన అవసరం లేదు. అందుకు కావలసినది కార్య దక్షత ! క్రియాశీలత ! రాజకీయ’ నాయకుల ‘ నిష్పక్ష పాత వైఖరీ ! ఇక్కడ ఆమోదించ వలసినది , రక రకాలు గా అసమానతలు రాష్ట్రమంతా , ఆమాటకొస్తే, దేశమంతా ఉన్నాయి, ఉంటాయి కూడా ! అందుకు పరిష్కారం విడిపోవడం కాదని నాకనిపిస్తుంది ! ఎందుకంటే , చిన్న రాష్ట్రాలు గా విడిపోయిన రాష్ట్రాలలో కూడా, అభివృద్ధి రాష్ట్రమంతా విస్తరించి, జరుగుతూ ఉందని అనుకోవడం ఒక భ్రమే కదా !అప్పుడు కూడా, ఈ ప్రాంతీయ వాదం ఇంకా వేళ్ళూనుకొని , ” ఆ జిల్లాలో ఎక్కువ అభివృద్ధి జరిగింది , మా జిల్లా కంటే ” లాంటి వాదనలు కూడా వస్తాయి ! అంటే, అంతు లేని ప్రాంతీయ వాదం ! క్రితం టపాలో ప్రస్తావించినట్టుగా, మానవ లక్షణాలు , ( ఇతరులను ముంచే , అవినీతీ , స్వార్ధం, మోసం ) ఇంధనం గా ఉన్నంత కాలం అసమానతలూ , కులమత ద్వేషాలూ , కుటిల రాజకీయాలూ , ‘ రావణ కాష్టాలు గా ” కాలుతూ ఉంటాయి, నిరంతరం , పెద్ద రాష్ట్రాలలోనైనా చిన్న రాష్ట్రాల లోననైనా ! మీరన్నట్టు నేను పరిష్కారాలు సూచించేందుకు తడబడుతున్నందుకు కారణం, రాజకీయ విశ్లేషకుడిని కాక పోవడమే !
సుధాకర్ గారూ, నేను కూడా రాజకీయ విశ్లేషకుడిని ఎమీ కాదు. నా ఉద్దేశ్యంలో తడబడడం అంటే వివిధ అంశాలను కనెక్ట్ చెయ్యాల్సిన పద్ధతిలో కనెక్ట్ చెయ్యడంలో తడబడడం అని. ఏమైనా తప్పు అర్ధం వస్తుందేమో తెలియదు.
మీరు చెబుతున్న అంశాలు అనేకం వాస్తవాలు. అవి చాలావరకు స్పష్టంగా కనపడేవి. పైకి కనపడేవాటిలో అనేకం ఫలితాలే తప్ప కారణాలుగా ఉండడం తక్కువ. కారణాలు తెలియాలంటే ప్రజల ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్ధితిగతులు పరిశీలించడం తప్పనిసరి.
రాజకీయ నాయకుల వైఖరి అలా ఎందుకుంది అనేదానికి కూడా కారణం ఉంటుంది. వారి ఆర్ధిక అవసరాలే వారిని అలా నడిపిస్తాయి. ఆర్ధిక అవసరాలు వివిధ వర్గాల ప్రజలను నడిపిస్తాయి అని అంగీకరిస్తే, ఆర్ధిక అసమానతలే వివిధ వర్గాల మధ్య సామాజిక, సాంస్కృతిక విభేదాలను కూడా సృష్టిస్తాయి. కాబట్టి ఆర్ధిక అసమానతలు లేని సమాజం నేటి అవసరం. అది ఎలా వస్తుంది అన్నది సమస్య. అసమానతలు లేని సమాజం కోసం కింది వర్గాలు ప్రయత్నిస్తే ఆర్ధికంగా ఉన్నవారు ఊరుకోరు. వారి అధికారం అండతో అణచివేస్తారు. ఆ అణచివేతను కింది వర్గాలు ప్రతిఘటిస్తాయి. ఈ ఘర్షణే ప్రపంచం అంతా వివిధ రూపాల్లో కనిపిస్తుంది. అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాల నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకూ ఈ ఘర్షణకు రూపాలే. కొన్ని స్పష్టంగా ఉంటే మరికొన్ని అస్పష్టంగా ఉంటాయి. లోతుల్లోకి వెళ్లి పరిశీలించి అసలు నిజం తెలుసుకోవడం మానవాళి అవసరం. ఆ పని కారల్ మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో తదితరులు చేసారని నా అభిప్రాయం. వాటిని మన దేశానికి తగ్గట్లు అన్వయించుకోవడమే మిగిలింది.
తెలంగాణ రాష్ట్రం అనేది నిజానికి పరిష్కారం కాదు. ఒక స్వాంతన మాత్రమే. అసలు పరిష్కారం వ్యవస్ధ మార్పులోనే ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న అనేక సమస్యలు వారి రాష్ట్ర ఆకాంక్షల రూపంలో వ్యక్తం అవుతున్నాయి. దానిని ధనికుల పార్టీలు సొమ్ము చేసుకుంటున్నాయన్న విషయం మరువరాదు.
ashok గారు, మీకు సమాధానం ఇవ్వడం మరిచాను.
అమెరికా అగ్ర రాజ్య పెత్తనం గురించి చెబితే పార్షియల్ అని మీకు ఎందుకు అనిపిస్తోంది. అమెరికా పెత్తనం చేయడానికి కూడా సహేతుకమైన కారణాలు ఉంటాయనా మీ ఉద్దేశ్యం? లేక అమెరికా అసలు పెత్తనమే చేయడం లేదనా?
బహుశా మీ ఉద్దేశాలు పైవి కాకపోవచ్చు. నా అభిప్రాయం ఏమిటంటే, పెత్తనాన్ని పెత్తనం అనే చెప్పాలి. చెప్పడమే కాకుండా దాన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించకుండా పెత్తనం అని చెప్పి ఊరుకుంటే సరిపోదు కదా. వ్యతిరేకించడంతో సరిపోదని కూడా నా అభిప్రాయం. ఆ పెత్తనాన్ని తిప్పి కొట్టడానికి ఏమి చెయ్యాలో కూడా ఆలోచించాలి. ఆ పెత్తనం వల్ల ఇతర దేశాల ప్రజలపైన నేరుగా ప్రభావం పడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ పెత్తనాన్ని తిప్పి కొట్టాల్సిందే. ఎలా అన్నది వేరే చర్చ.
బి.జె.పి అనేది ఒక రాజకీయ పార్టీ. అది ఈ దేశ ప్రజల కోసం అని చెబుతూ కొన్ని చర్యలు చేపడుతోంది. ఒక భావజాలాన్ని ప్రచారం చేస్తోంది. ఐదేళ్లు దేశాన్ని పాలించింది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ పట్ల ఏ పౌరుడైనా ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. అది అనుకూలమా, వ్యతిరేకమా అనేది వారి వారి అవగాహనకు సంబంధించినది.
‘అలా కాదు, నాకు బి.జె.పి అంటే అభిమానం. మీ విశ్లేషణలు అన్నా అభిమానమే. కానీ మీ బి.జె.పి వ్యతిరేకతే నాకు ఇబ్బందిగా ఉంది’ అని మీరు చెప్పదలిచినట్లు కనిపిస్తోంది. (ఊహ మాత్రమే). అదే నిజం అయితే నా సూచన ఏమిటంటే నా విశ్లేషణల్లో వాస్తవ విరుద్ధం ఏమాన్నా ఉన్నాయేమో చూడండి. ఉంటే ఎత్తి చూపండి.
రాజకీయ అభిప్రాయాలు స్పష్టంగా ఉండాలి. నసుగుడు పనికి రాదు. వ్యక్తులం అయితే మొహమాటం పడవచ్చు. కానీ రాజకీయ అభిప్రాయాల్లో అది పనికిరాదు. ప్రజలకు సంబంధించినంతవరకు వారికి ఏది సరైందని నేను అనుకుంటానో దానిని సమర్ధిస్తాను. సరైంది కాకపోతే వ్యతిరేకిస్తాను. ఇందులో మధ్యే మార్గం అంటూ ఏమీ ఉండదు. ఉంటే అది రెండు పడవల ప్రయాణం అవుతుంది. అలాంటి ప్రయాణం వల్ల గమ్యం చేరుకోకపోగా మునిగిపోతాము.
పర్సనల్ గా ఒక విధానానికి ఫిక్స్ అయ్యానా లేదా అన్నది కాదు సమస్య. నేను ఎక్కడ దేనికి ఫిక్స్ అయ్యానో మీరు గ్రహిస్తే, అందులో ‘ఇది సరైంది కాదు’ అని మీకు అనిపిస్తే దానిని ఎత్తి చూపి చర్చించాలి. అది మీకూ, నాకూ కూడా ఉపయోగం. అలా కాకుండా మీరు ముందే ఫిక్స్ అయ్యి రాస్తున్నారు అని ఒక స్వీపింగ్ స్టేట్ మెంట్ ఇవ్వడం వలన ఫలితం ఉండదని నా అభిప్రాయం.
చర్చను ఇంకో వేవ్ లెంత్ కు తీసుకు వెళితే ,
వేదాంత రీత్యా , లేదా యదార్ధం గా చూసినా కూడా , ఈ తనువనిత్యము , నిత్యము ఆత్మ ఒక్కటే !
( అదీ నమ్మే వారికే ! ), అంటే తనువు శాశ్వతం కాదు ! దేశాలూ, రాష్ట్రాలూ , ప్రాంతాలూ అన్నీ కూడా ఉన్నా , ఒక కవి అన్నట్టు ” ఎవడు బతికాడు మూడు యాభైలు”? !
పరిణామ దృష్ట్యా ,ముందు ముందు యుద్ధాలు , ఘర్షణ లూ, నేల కోసం , నీటి కోసం జరుగుతాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం ! ఇందులో శాస్త్రజ్ఞులు, మానవులను కేవలం ఈ భూమి మీద ఉన్న ఒక జీవి గా చూస్తున్నారు తప్పితే , అత్యధికం గా పరిణామం చెంది , విజ్ఞత తెలిసిన మానవుడి గా చూడట్లేదు ! అందులో అనుమానం కూడా ఏమీ లేదు కదా ! ఏ వ్యవస్థ లైనా, మనుషుల ప్రవర్తన తో కూడినదే ! నేటి ఇంటర్నెట్ యుగం లో, మనుషుల ప్రవర్తనకు,వారే భాధ్యులు కావాలి ! కేవలం వ్యవస్థలో మార్పులకోసం ఎదురు చూడకుండా ! మానవుల ప్రవర్తనలో సమూలమైన మార్పులు వస్తే , వ్యవస్థ దానంతట అదే మారుతుంది ! కానీ , అది జరగని పని, ఎందుకంటే, మానవులకు , మానవులే శత్రువులు ! అంటే స్వజాతి వైరం !
బ్రిటిష్‌వాళ్ళ కాలంలో ఇండియాలో పట్టణీకరణ కేవలం 17% ఉండేది. బ్రిటిష్‌వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళిన 33 ఏళ్ళకే ఆ శాతం 25కి పెరిగింది. ఇండియా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విడిపోతే ఇండియన్‌లకి ఏమొస్తుందిలే అని అప్పటి “థి మార్నింగ్ పోస్త్” లాంటి సామ్రాజ్యవాద అనుకూల పత్రికలు ఎగతాలిచేసేవి. అద్భుతాలు జరగకపోయినా పట్టణీకరణలో మాత్రం ప్రగతి కనిపించలేదా? తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రాంతానికి నాలుగు కొత్త ఇరిగేషన్ ప్రోజెక్ట్‌లు వస్తాయి, స్థానికులకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణా రాష్ట్రం వల్ల ఇంత కంటే అద్భుతాలు జరిగిపోవు. కానీ పాలక వర్గానికి ఇది కూడా చెయ్యడం ఇష్టం లేదు. హైదరాబాద్ యొక్క ప్రాధాన్యత తగ్గడం గ్లోబలైజేషన్‌వాదులకి ఇష్టం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయం చెప్పకుండా ఏకాభిప్రాయం అంటూ తప్పించుకుంటోంది.
meeru prayatna uddesapoorvakamgaane konni vishayalu vismaristaarani chaalaakaalam nunchi gamaninchaanu.anduke chaalaa kaalamtaruvaata raasanu.
anni angleslo balanced gaa unte vidyaardhulaki upyogam.eenadu laanti patrikallo raavadam valana choostunnam.kaani idi vere vidhamgaa undi.
nijaaniki mee knowledge,opika meeda gouravam naaku.
deenivalana ee charchalakosam anavasaramgaa time spend cheyalemu.
thanku.
meerannatlugaane hyd nirnayam hyderaaadeele telchukonivvaalaa? (ike in ur ex)
indulo paatabasti [prajalu oka pratyeka bhasha,samskruti, pedarikam,vivaksha aneka samasyalunnayi,chaaritrika kaaranalavalla veregaa untaamante oppukuntaara,akkadi prajala ahipraayam prakaarame?
prati vyaktiki tanaku nachinatlugaane vadileyyaalaa? imagine it.
ప్రవీణ్ గారూ ,
తెలంగాణా వారికి , ఉద్యోగాలూ , ఆ ప్రాంతం లో ఇరిగేషన్ ప్రాజెక్టులూ , రాష్ట్ర విభజన తోటే రానవసరం లేదు కదా ! అవి రాలేదు అంటే కారణం, సమైక్యం గా ఉండడం కాదు కదా ! మీరు ప్రస్తుత పరిస్థితిని బ్రిటిష్ కాలం తో పోలుస్తున్నారు అది చాలా అసమంజసం ! ఎందుకంటే , పద్దెనిమిదవ శతాబ్దం మొదటి నుంచీ , తెలంగాణా ప్రాంతం నిజాం పాలన లోనే ఉంది ! అప్పుడూ అభివృద్ధి జరగలేదు ! మరి స్వతంత్రం వచ్చినా కూడా అభివృద్ధి జరగలేదంటే , కారణం ” మన వాళ్ళ లోపమే ” కదా ! అంటే , ఇక్కడ కధ మొదటికి వస్తుంది ! అంటే,మానవులకు మానవులే శత్రువులు ! దానికి పరిష్కారానికి ప్రత్యేక వాదం ఎంతవరకూ అవుతుందో నాకు తెలియదు ! మూల కారణాల ప్రాతిపదిక మీద సమస్యా పరిష్కారం జరగాలి !
aaa గారూ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ఉపయోగపెట్టుకొండి. లేదంటే వదిలేయండి. బలవంతం ఎమీ లేదు.
హైద్రాబాద్, పాత బస్తీ … ఇలా మీరు ఆలోచించిన విధానం ప్రత్యేకంగా ఉంది. అలాంటి సమస్యలు వచ్చినపుడు ఆలోచించాల్సిందే మరి. రాకూడదని కోరుకుందాం.
aaa గారు…..మన దేశం ముక్కలుగా విడిపోకూడదన్న తాపత్రయం మీరు చెప్పే అభిప్రాయాల ద్వారా తెలుస్తూనే ఉంది. కానీ రాష్ట్రాలు ఏర్పడటం దేశం ముక్కలు కావడం లేదా వేర్పాటు వాదం ఒకటే కాదని గమనించాలి.
మన దేశంలో ఇప్పటికే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 35 వరకూ ఉన్నాయి కదా… అందువల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్లిందా…?
ఇంకా ఓ ఐదో, పదో రాష్ట్ర్రాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడితే నష్టం ఏముంది.
తెలుగు ప్రజలకు ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి. 49 ఎంపీ స్ధానాలున్నాయి. 294 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. పదకొండు వందల మండలాలున్నాయి. వేలకొద్దీ గ్రామాలున్నాయి. రెండంటే రెండు రాష్ట్ర్రాలున్నంత మాత్రాన వచ్చేదేముంది..? పోయేదేముంది…?
కొంతమందికి తెలంగాణ ఇష్టం లేకపోవచ్చు…ఇంకొంత మందికి ఇష్టం ఉండొచ్చు, ఇంకా కొంత మందికి ఏ అభిప్రాయమూ లేకపోవచ్చు.
కానీ మన అభిప్రాయాలు కాదు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న దాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర్రం డిమాండ్ ఇంతగా ఉండడానికి కారణం….గతంలో తెలంగాణ ప్రాంతం కొంత కాలం రాష్ట్ర్రం గానే ఉండేది. తెలంగాణ, ఆంధ్ర్ర కలిపి ప్రస్తుత రాష్ట్ర్రం ఏర్పడ్డాక…తమ పట్ల వివక్ష చూపుతున్నారు కనుక మా పూర్వ రాష్ట్రం మాకు కావాలని అంటున్నారు .
ఇప్పుడు చెప్పండి aaa గారు..
వాస్తవమైన తెలంగాణ ప్రజల వాదన… మీరు ప్రతిపాదించే ఊహాత్మక పాతబస్తీల వాదన ఒకటేనంటారా…?
సుధాకర్ గారు, రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే రాష్ట్రంలో కేవలం పోలవరం & పులిచింతల ప్రోజెక్ట్‌లు తప్ప వేరే ఏ ప్రోజెక్ట్‌నీ పూర్తి చెయ్యడానికి ప్రయత్నించలేదు. ఖమ్మం జిల్లాలో కట్టాల్సిన దుమ్ముగూడెం ప్రోజెక్ట్ నుంచి కడప జిల్లాకి కాలువలు తవ్చడం సాధ్యం కాదని ఇంజినీర్‌లు నివేదిక ఇచ్చిన తరువాత ఆ ప్రోజెక్ట్‌ని వదులుకుంటున్నట్టు రాజశేఖరరెడ్డి బహిరంగంగానే ప్రకటించాడు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకు అందే న్యాయం ఇదే. 2004 తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ బలహీనపడి తెలుగు దేశం బలపడడానికి కారణం ఆ ప్రాంత విషయంలో రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలే.
మానవులకి మానవులే శతృవులనేది ఒక పచ్చి మెటాఫిజికల్ వాదన. ఆర్థికంగా ఏమీ లేని ఒక బైరాగికి శతృవులెవరూ ఉండరు. ఆర్థికంగా కొంచెమైనా ఉన్నవాళ్ళ మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతాయి. ఈ మాత్రం దానికి సిగ్మండ్ ఫ్రాయిడ్‌లాగ సమాజానికి మానవులే శతృవులు అని అంటూ మెటాఫిజికల్ తీర్మానాలు చెయ్యాల్సిన అవసరం లేదు.
ప్రవీణ్ గారూ ,
తెలంగాణా ప్రాంతానికి , అభివృద్ధి విషయాలలో , అన్యాయం జరిగిందనేది నిర్వివాదాంశం ! ఆంధ్రా ,రాయల సీమ లలో కూడా ,అభివృద్ధి కి నోచుకోని ప్రాంతాలు చాలా వున్నాయి కదా ! అది కూడా నిర్వి వాదాంశమే ! దానికి కారణం ( ఏ ముఖ్య మంత్రి అయినా ) నిష్పాక్షిక నాయకత్వం , చిత్త శుద్ధి లోపించడమే కదా !
ఆర్ధికం గా ఏమీ లేని వారికి శత్రువులు ఎవరూ ఉండరనే విషయం కూడా నిర్వివాదాంశమే ! అట్లాంటి పేద వారు రాష్ట్రమంతటా ఉన్నారు ! కేవలం తెలంగాణా ప్రాంతానికే పరిమితం కాలేదు ! వారందరికీ పేదరికమే శత్రువు ! వారు పేదరికం తో నే తమ జీవితాలను వెళ్ళ బోస్తున్నారు ! కారణం: రాజకీయ నాయకుల, ధనవంతుల అవినీతీ, స్వార్ధమే ! కేవలం ప్రాంతాలుగా విడిపోయినంత మాత్రాన ! ఈ పరిస్థితులు మారుతాయనుకోను !
( మానవులకు మానవులే శత్రువులు అనే నా మాటను మీరు లిటరల్ గా తీసుకున్నట్టున్నారు ! )
ప్రపంచం లో అత్యంత ధనవంతులైన బిల్ గేట్స్ , వారెన్ బఫెట్, తమ సంపాదన ( లాభార్జన ) లో అక్షరాలా యాభై శాతం సామాజిక అభివృద్ధి , రోగ నిర్మూలనా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు ! ప్రతి సంవత్సరమూ ! అట్లాంటి ధనవంతులు, మన దేశం లో( భారతీయులే ! ) చాలా మంది ఉన్నారు ! కానీ చేస్తున్నది ఏమీ పెద్దగా కనిపించడం లేదు !
తీర్మానాలు చేసి, వాస్తవాన్నిదాట వేసే ఉద్దేశం నాకు ఏమీ లేదు.( నేను రాజకీయ నేత ను కాను! )ఎవరికీ ఉందో, కాలమే చెబుతుంది కదా! , అందరికీ ! ప్రస్తుత పరిస్థితి ని, మీ , నా , అభిప్రాయాలు ఇసుమంతైనా ప్రభావితం చేయలేవనే వాస్తవాన్నీ నేను విస్మరించడం లేదు !
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసినదే కేవలం ఒక నగరంపై ఉన్న వ్యామోహం వల్ల. రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత కాలం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేది ఒక గాలి కబురుగానే ఉంటుంది. ఎందుకంటే సమైక్య రాష్ట్ర ఏర్పాటు అనేది నిజంగా ప్రజల సమైక్యత కోసం ఏర్పడినది కాదు. అభివృద్ధి గురించి తెలంగాణా ప్రజలు తమ ప్రాంత నాయకులని నిలదీసే ముందు కోస్తా ఆంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఆ పని చెయ్యొచ్చు. తమకి ప్రాంతీయ అభివృద్ధి అవసరం లేదనీ, కేవలం తమ ఇల్లు చక్కబెట్టుకుని, హైదరాబాద్‌ని చూసి మురిసిపోతామనీ అనుకునేవాళ్ళకి ఎవరూ, ఏమీ చెప్పలేరు.
హైదరాబాదు నగరం మీద ఉన్న వ్యామోహం అవుతే , ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సమయం లో కర్నూలు ఎందుకు రాజదాని అయింది ? ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల ! మద్రాసు ను కోల్పోయింది కూడా అదే కారణం వల్ల ! నిజాం కాలం ముందు నుంచీ తెలంగాణా ప్రాంత ప్రజలు, తెలుగే మాట్లాడే వారు !
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ , ఇప్పటి వరకూ , తెలంగాణా ప్రాంతాలలోనూ , ఆంధ్రా , రాయలసీమ ప్రాంతాలలోనూ , ప్రజాస్వామికం గా ఎన్నుకోబడ్డ ప్రతినిధులు, మంత్రులు, వారి వారి ప్రాంతాలకు ఏమి చేశారో అందరికీ తెలుసు ! ఇంకో నాలుగు రాష్ట్రాలు ఏర్పడినా అదే చేస్తారు ! ఇక్కడ లోపిస్తున్నది ……… ( ఇదీ అందరికీ తెలుసు ! )
హైద్రాబాద్ వ్యామోహం వల్లనే ఎ.పి ఏర్పడింది అనడం కరెక్టు కాదు. సుధాకర్ గారు చెప్పినట్లు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అప్పట్లో దేశం అంతా వివిధ చోట్ల పోరాటాలు జరిగాయి. దాని ఫలితమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. అయితే కేవలం భాష కోసమే రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమించారు అనడం కూడా పొరబాటు అవుతుంది. భాష, మతం, కులం ఇవన్నీ ఉపరితల రూపాలు. వాటి వెనుక ప్రజల ఆర్ధిక సమస్యలు, అవి తీరాలన్న ఆకాంక్ష ఉంటుంది.
సుధాకర్ గారూ మీకు మరొక లింక్ ఇస్తున్నాను. వీలయితే చూడగలరు. (ఆ కింద చర్చ కూడా.)
http://wp.me/p1kSha-1mZ
అలాగే సమైక్య రాష్ట్రం అనేది నిజంగా ప్రజల సమైక్యత కోసం ఏర్పడింది కాదు అన్న ప్రవీణ్ వాదన ఒక నగ్న సత్యం. సమైక్యాంధ్రలో ఆంధ్ర ధనికులు లబ్ది పొందినట్లే, రేపు తెలంగాణ ఏర్పడితే అక్కడ కూడా తెలంగాణ ధనికులే ప్రధానంగా లబ్ది పొందుతారు. కాని వారితో పాటు నీటి వనరుల పంపకం తప్పనిసరి అవుతుంది. ఆ విధంగా తెలంగాణ రైతులు, కూలీలు, వీరిద్దరి ద్వారా వ్యాపారులు, పరిశ్రమలు లాభపడతారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎ.పి బడ్జెట్ లో ప్రధాన భాగం సీమాంధ్ర ధనికులకు వెళ్లడం దానికి కారణం.
తాము హైదరాబాద్ కోసమే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తున్నట్టు నీలం సంజీవరెడ్డే బహిరంగంగా చెప్పుకున్నాడు. తాము హైదరాబాద్ కోసమే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటి సమైక్యవాదులు మోహన్ బాబు, టి.జి. వెంకటేశ్‌లు కూడా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వాళ్ళ నోటితో వాళ్ళే నిజం చెప్పుకుంటోంటే ఆ నిజాన్ని అబద్దం అని భ్రమపడేంత అమాయకులు ఎవరున్నారు?
ముల్కీ నిబంధనలు ఉంటే జై ఆంధ్రా, అవి లేకపోతే సమైక్యాంధ్ర అనేవాళ్ళు ఉన్న చోట సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమా?
Read it: http://missiontelangana.com/seemandhra-cinema-1972/
సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకి అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకున్నా జరిగేది ఇది.
Do you remember how riots were staged against mulki rules in the united state?
తెలంగాణ అంతే. వాళ్లు ఒక రాష్ట్రంగా ఉండాలా లేదా అన్నది అక్కడి ప్రజలు నిర్ణయించుకోవాలి తప్ప సీమాంధ్ర ప్రజలు కాదు blog owners, farm house owners kadu
ikkada separate state evariki kaavaali prajalakaa mla lu ministerskaaa
vshekar gaaru maar blog chaalaa baagundi.
చందుతులసి గారూ
“తెలుగు ప్రజలకు ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి. 49 ఎంపీ స్ధానాలున్నాయి. 294 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. పదకొండు వందల మండలాలున్నాయి. వేలకొద్దీ గ్రామాలున్నాయి. రెండంటే రెండు రాష్ట్ర్రాలున్నంత మాత్రాన వచ్చేదేముంది..? పోయేదేముంది…?”
భేషుగ్గా చెప్పారు. పాలనా విభజనకే ఇంతగా ఆందోళన చెందుతున్నారు. ఇక పశ్చిమ రాజ్యాలు కక్ష గట్టి సూడాన్ లో తగువులు పెట్టి విడిపోయేదాకా తీసుకెళ్లారనీ, సిరియాను కూడా మూడు ముక్కలు చేయడానికి పధకాలు రచించాయనీ, అరబ్ స్ప్రింగ్ కు రెండేళ్ల ముందే సిరియా యుద్ధాన్ని పశ్చిమ దేశాలు ప్లాన్ చేసాయని (ఇది ఫ్రాన్స్ మాజీ విదేశీ మంత్రి స్వయంగా అంగీకరించాడు) తెలిస్తే పశ్చిమ దేశాలపైన ఎంత ద్వేషం రావాలి? చిత్రం ఏమిటంటే అమెరికా దాష్టీకంపై ఎన్ని వార్తలు రాసినా, అమెరికా పత్రికలే ఎన్ని వాస్తవాలు వెళ్లగక్కినా, ఆ వాస్తవాలు వదిలేసి నాకు అమెరికా వ్యతిరేకత అన్వయించడం!
నాకూ అదే అర్థం కావడం లేదు శేఖర్ గారూ..
మనలో చాలా మందికి మొట్టమొదట ఎవరో చెబితేనో…లేదా ఎక్కడైనా చదివితేనో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తర్వాత కాలంలో దానితో విభేదించే విషయాలు లేదా అది తప్పని తేలితేనో దాన్ని ఒక పట్టాన జీర్ణించుకోవడం కష్టం. అటువంటి పరిస్థితిలో కొందరు ఆ కొత్త సంగతులు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఆ కొత్త విషయాలే తప్పని తమకు తామే నిర్ధారించుకుని పాత అభిప్రాయాల్లోనే జీవిస్తారు.
ఇంకొందరు ఏది చదివితే అదే… అప్పటికప్పుడు ( మరోటి చదివేదాకా ) తమ అభిప్రాయంగా భావిస్తుంటారు. వీళ్లకి ఎటు మొగ్గాలో తెలీదు. సందర్భాన్ని బట్టి ఎటువైపైనా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.
ఇక చాలా తక్కువగా మాత్రమే మూడో రకం వాళ్లు ఉంటారు. వీళ్లు కొత్త సంగతులు తెలుసుకోవడమే కాదు. పాత సంగతితో కొత్త సంగతుల్ని బేరీజు వేసుకుంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో…ఏది మెజారిటీ సమాజానికి అవసరమో తేల్చుకుని ఒక అభిప్రాయానికి వస్తారు.
ఇక అసలు సమస్యల్లా మొట్టమొదటి అభిప్రాయం ఏర్పడడంలోని ఉంది.
ప్రస్తుత ప్రపంచంలో అన్ని వ్యవస్థలూ దోపిడీ దారుల చేతుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా సమాచార వ్యవస్థను కూడా తమకు అనుకూలంగా మల్చుకున్నారు. కేజీ నుంచి పీజీ దాకా పుస్తకాలన్నింటిలోనూ ప్రశ్నించడం నేర్పని, దోపిడీ అనుకూల పాఠాలే బోధిస్తున్నారు. ఆ తర్వాత చుట్టూ ఉండే ఇతర టీవీ, సినిమా…ఇలా సమస్త మాధ్యమాల్ని తమ దోపిడీకి అనుకూలంగా మార్చుకుని విష ప్రచారం చేస్తున్నారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అనేక మంది ఆ విష ప్రచారమే నిజమని నమ్ముతున్నారు. వీరికి ప్రపంచంలోని అసలు నిజాల్ని చూసే అవకాశం ఎక్కడుంది.
ఎక్కడో ఒక చోట అసలు వాస్తవాన్ని చూపించే ఒకరిద్దరు మీలాంటి వారు చెప్పే విషయాలు వారికి చేదు మాత్రలుగా కనిపిస్తున్నాయి. వారిలోని కొందరు మీరు చెప్పేవన్నీ అబద్దాలుగా …. మిమ్మల్ని ఆజన్మ అమెరికా వ్యతిరేకులుగా ప్రచారం చేస్తున్నారు.
అభిప్రాయాలు కలిగి ఉండడమే కాదు. తమ అభిప్రాయాలు తప్పని తెలిసినప్పుడు కొత్త నిజాన్ని అంగీకరించడానికి చాలా గుండె ధైర్యం కావాలి.
అది లేని వాళ్లు సత్యాన్ని చూడడానికి భయపడి ఉష్ట్ర్రపక్షుల్లా…. అజ్ఞానపు ఇసుకలో తల దూర్చుకుని జీవిస్తారు.
లోకాన్ని తలకిందులుగా చూసే అటువంటి గబ్బిలాల విమర్శలను మీ లాంటి వారు పట్టించుకోకపోవడమే మేలు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అభిప్రాయం నిజమని మీరొక్కరు విశ్వసించినా చాలు.
మీ దీనజన పక్షపాత అసిధారావ్రతాన్ని యధావిధిగా కొనసాగించండి.