స్నోడెన్ ఒక హీరో -జులియన్ అసాంజే


లండన్ లో ఈక్వడార్ ఎంబసీ వద్ద రోజులో 24 గంటలూ ఈ కాపలా కొనసాగాల్సిందే -ఫొటో: వాయిస్ ఆఫ్ రష్యా

లండన్ లో ఈక్వడార్ ఎంబసీ వద్ద రోజులో 24 గంటలూ ఈ కాపలా కొనసాగాల్సిందే -ఫొటో: వాయిస్ ఆఫ్ రష్యా

ప్రపంచ ప్రజల అంతర్జాల కార్యకలాపాల పైనా, టెలిఫోన్ సంభాషణల పైనా అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిన సంగతిని లోకానికి వెల్లడి చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను ‘హీరో’ గా వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే అభివర్ణించారు. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధంలో వేలాది అమాయక పౌరులను అమెరికన్ బలగాలు చిత్రహింసలు పెట్టి చంపిన వైనాన్ని, వివిధ దేశాలలో నియమితులైన తమ రాయబారుల ద్వారా ఆ దేశాల్లో అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్న మోసాన్ని ‘డిప్లోమేటిక్ కేబుల్స్’ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన అసాంజే, తాను స్నోడెన్ తో పరోక్ష మార్గాల్లో సంబంధంలో ఉన్న సంగతిని వెల్లడించి అమెరికా అహంకారం పైన చావుదెబ్బ కొట్టాడు.

తడిసి మోపెడు

బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్న మందీ మార్బలంతో అమెరికా సాగిస్తున్న అక్రమ నిఘా గురించి, బ్రిటన్ లోని ఈక్వడార్ రాయబార్ కార్యాలయంలో నాలుగు గోడల మధ్య బందీగా ఉన్న అసాంజే ఎటువంటి అనుమానం రాకుండా తెలుసుకోగలిగాడంటే అగ్ర రాజ్యాధినేతల ఆహానికి అంతకంటే చావు దెబ్బ ఏముంటుంది? అసాంజే తమ కళ్ళు గప్పి ఎక్కడ రాయబార కార్యాలయం వదిలి వెళ్లిపోతాడోనన్న భయంతో బ్రిటన్ ప్రభుత్వం మే నెల వరకు దాదాపు 3.2 మిలియన్ పౌండ్లు (5 మిలియన్ డాలర్లు) ఖర్చు పెట్టి కాపలా కాసినట్లు ఎ.బి.సి న్యూస్ (ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్), ప్రెస్ టి.వి, రష్యన్ వాయిస్ లాంటి సంస్ధలు తెలిపాయి. అంటే రోజుకి దాదాపు 11,000 పౌండ్లు (17,200 డాలర్లు).

ఈ కాపలా ఇంకా కొనసాగుతోంది. ఫిస్కల్ లోటు పూడ్చే పేరుతో ఉద్యోగాలు, సదుపాయాలు రద్దు చేస్తూ, అదనపు పన్నులను బ్రిటిష్ ప్రభుత్వం తన ప్రజలపై మోపుతున్న నేపధ్యంలో ఈ ఖర్చు ఎంత పనికిమాలినదో చెప్పనవసరం లేదు. జులియన్ ను స్వీడన్ కి పంపించిన తర్వాత మరే దేశానికీ (అమెరికా అని చదువుకోవాలి) అక్కడి నుండి పంపించబోమని హామీ ఇస్తే ఈ ఖర్చును తప్పించుకోవచ్చని, తామే జులియన్ ను బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగిస్తామని ఈక్వడార్ ప్రభుత్వం రెండు వారాల క్రితం ప్రకటించినా బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆఫర్ ను స్వీకరించడానికి సిద్ధంగా లేదు.

అమెరికాకు అప్పగించడానికే అసాంజేను స్వీడన్ కి అప్పజెప్పడానికి బ్రిటన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని ఇక్కడే స్పష్టం అవుతోంది. తడిసి మోపెడైన ఖర్చును భరించడానికి బ్రిటన్ సిద్ధమే గాని అసాంజేను అమెరికాకి అప్పగించకుండా మాత్రం ఊరుకోదు.

జులియన్ ను అక్రమ కేసులో ఇరికించారని బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య గూఢచార సంస్ధ జి.సి.హెచ్.క్యు (Government Communications Head Quarters) -ఇది అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీకి సమానం- గూఢచారులు ఇద్దరు జరుపుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా గత మే నెలలో పత్రికలు బైటపెట్టాయి. ఈ వాస్తవాన్ని పరోక్షంగా జి.సి.హెచ్.క్యు అంగీకరించింది కూడా. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం బింకాన్ని ప్రదర్శిస్తోంది.

హీరో!

“నేను అనేక సంవత్సరాలుగా చెబుతున్నదానినే స్నోడెన్ వెల్లడించాడు. అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, దాని మిత్ర రాజ్యాలు, గూగుల్, ఫేస్ బుక్ లతో పాటు వివిధ టెలికమ్యూనికేషన్ సంస్ధల నుండి భారీ మొత్తంలో డేటా తస్కరించే పనిలో నిమగ్నమై ఉన్నాయని నేను అనేక యేళ్లుగా చెబుతున్నాను” అని ఎ.బి.సి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసాంజే తెలిపాడు.

TOPSHOTS-HONG KONG-US-SECURITY-INTELLIGENCEఅమెరికా రాజకీయ చరిత్రలోనే అత్యంత భారీ అక్రమ రహస్యాల లీకేజీకి స్నోడెన్ పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రిజమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాం వ్యవస్ధను ఉపయోగించి అంతర్జాలంలోని ప్రముఖ కంపెనీలన్నింటి సర్వర్లలోకి ప్రవేశించి ప్రపంచ ప్రజల సమస్త కమ్యూనికేషన్ల పైనా అమెరికన్ ఎన్.ఎస్.ఎ నిఘా వేసి రికార్డు చేస్తోన్న సంగతిని స్నోడెన్ ప్రపంచానికి వెల్లడించాడు. వెల్లడి చేయడానికి ముందు మే 20 తేదీన హాంకాంగ్ కి వెళ్ళిపోయిన స్నోడెన్ కోరితే తాము రాజకీయ ఆశ్రయం ఇవ్వగలమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ ప్రకటించారు. అయితే తాను ఆషామాషీగా హాంకాంగ్ కి రాలేదని స్నోడెన్ చెప్పినట్లు తెలుస్తోంది. మరో పక్క చైనా గూఢచారిగా స్నోడెన్ పని చేస్తున్నాడని సి.ఐ.ఎ ఆరోపిస్తోంది. కుట్రలకు, కుతంత్రాలకు పుట్టినిల్లయిన సి.ఐ.ఎ కు గూఢచర్యం పై ఆరోపణలు చేసే నైతిక హక్కు ఎక్కడిది?

అత్యంత రహస్య పత్రాలను లోకానికి వెల్లడి చేసి అమెరికా అక్రమ గూఢచర్యాన్ని లోకానికి తెలిపిన స్నోడెన్ కు అసాంజే పూర్తి మద్దతు ప్రకటించాడు. “ఈ దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ఘటనలను ప్రపంచ ప్రజలకు వెల్లడి చేసిన హీరో ఆయన. విశాల ప్రజా రాశులపై నిఘా పెట్టిన రాజ్యం యొక్క నిజ స్వరూపం అది” అని అసాంజే, స్నోడెన్ ను కీర్తించాడు. ఈ సంవత్సరం చివర జరగనున్న ఆస్ట్రేలియా ఎన్నికల్లో అసాంజే స్ధాపించిన ఆస్ట్రేలియన్ వికీ లీక్స్ పార్టీ పోటీ చేస్తోంది. వారంట్ లేకుండా గూఢచర్యానికి పాల్పడే చర్యలకు తమ పార్టీ వ్యతిరేకమనీ, స్నోడెన్ కూడా ఇవే భావాలను కలిగి ఉన్నాడని అసాంజే తెలిపారు.

రెండు వ్యవస్ధలు

“రెండు వ్యవస్ధలు ఉండే ప్రమాదకరమైన స్ధితి లోకి పశ్చిమ రాజ్యాలు కొట్టుకొనిపోతున్నాయి. అక్కడ సామాన్య వ్యక్తికోసం ఒక చట్టం ఉంటే, జాతీయ గూఢచార వ్యవస్ధలో పని చేసే వ్యక్తికి మరో చట్టం పని చేస్తుంది… (గూఢచార వ్యవస్ధలో ఉంటే) నువ్వు కోరుకున్నదల్లా అడ్డగించి వినవచ్చు. నీ చర్యలకు నువ్వు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఏమీ ఉండదు. న్యాయ వ్యవస్ధ కూడా నీ చర్యలను సమీక్షించదు.” అని పశ్చిమ రాజ్యాల గూఢచార సంస్ధల ఆక్టోపస్ హస్తాల విస్తృతిని అసాంజే వివరించారు.

ఆస్ట్రేలియన్లు కానీ, అమెరికన్లు కానీ ఎవ్వరూ ఇలాంటి చొరబాటును తమ వ్యక్తిగత జీవితాల్లోకి అనుమతించబోరని ఆసాంజే వ్యాఖ్యానించారు. “అది అంగీకార యోగ్యం కాదని స్నోడెన్ స్పష్టంగా గుర్తించారు. ఆయన ఆ వ్యవస్ధలో స్వయంగా ఒక సభ్యుడు కూడా” అని అసాంజే తెలిపారు. తనకు స్నోడెన్ తో పరోక్ష సంబంధాలు ఉన్నాయని అసాంజే అంగీకరిస్తూనే ఆ సంబంధాల వివరాలను చెప్పడానికి నిరాకరించారు. స్నోడెన్ వెల్లడించిన అంశాల పైన కేంద్రీకరించాలి తప్ప తనకూ, స్నోడెన్ కు మధ్య ఉన్న సంబంధాల పైన కాదని ఆయన వ్యాఖ్యానించారు. “ఆ కేసు ఎలాంటిదో, ఆయన వెల్లడించిన అంశాలు ఏమిటో, మొదట వాటిపై దృష్టి సారిద్దాం” అని ఆయన అన్నారు.

అమెరికా గూఢచార సంస్ధలు తమ ప్రిజమ్ ప్రోగ్రామ్ వాస్తవమేనని అంగీకరించాయి. కోర్టు ఆర్డర్ ద్వారా వెరిజాన్ టెలిఫోన్ సంస్ధ నుండి మిలియన్ల కొద్దీ అమెరికన్ల సంభాషణలపైనా నిఘా పెట్టిన సంగతి కూడా అవి అంగీకరించాయి. అంతెందుకు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా యే ప్రిజమ్ ను గట్టిగా సమర్దించుకుంటూ ప్రకటన ఇచ్చారు. పౌరుల ప్రైవేటు సందేశాలను రహస్యంగా రికార్డు చేస్తున్నామని, నిఘా పెట్టామని అయితే అమెరికా ప్రజలను టెర్రరిజం నుండి కాపాడాలంటే ఇది అవసరమని ఒబామా సమర్ధించుకున్నారు. వంద శాతం భద్రత, వంద శాతం ప్రైవసీ పొందడం అసాధ్యం అని ఆయన కుండబద్దలు కొట్టారు. భద్రత కావాలంటే ప్రైవసీ త్యాగం చేయగా తప్పదని సుద్దులు చెప్పారు.

కానీ గూగుల్, ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్, యాహూ, యాపిల్ తదితర అంతర్జాల కంపెనీలు మాత్రం తమకు ఏపాపం తెలియదని ఇప్పటికీ బుకాయిస్తున్నాయి. అసలు ‘ప్రిజమ్’ అన్న పేరే తాము వినలేదని అవి చెబుతున్నాయి. ఎవరు అబద్ధం ఆడుతున్నట్లు? అమెరికా కంపెనీలా, అమెరికా అధ్యక్షుల వారా?

2 thoughts on “స్నోడెన్ ఒక హీరో -జులియన్ అసాంజే

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s