జియా ఖాన్! తన మొదటి సినిమాతోనే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం దొరకబుచ్చుకున్న నటి. బ్రిటన్ లో పుట్టి, అక్కడే పెరిగి రామ్ గోపాల్ వర్మ సినిమా ‘నిశ్శబ్ద్’ లో నటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువతి. తన హృదయాన్ని మనస్ఫూర్తిగా, అమాయకంగా ఒక తిరుగుబోతుకి కానుకగా సమర్పించుకుని, మోసపోయి, విరక్తి చెంది, జూన్ 3 తేదీన, ముంబై జూహు లోని తమ నివాసంలో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.
సినిమాలు లేకపోవడంతో ‘డిప్రెషన్’ కు లోనై ఆత్మహత్య చేసుకుందని మొదట పత్రికలు తెలిపాయి. కానీ ఆరు పేజీల ఆమె చివరి ఉత్తరాన్ని ఆమె చెల్లెలు వెలుగులోకి తేవడంతో, విషాధకరమైన ఆమె ప్రేమ వృత్తాంతం, నమ్మి మోసపోయిన ఆమె అమాయక హృదయం లోకానికి తెలిసి వచ్చింది.
25 సంవత్సరాల జియా ఖాన్ అసలు పేరు నఫీసా. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడైన 21 యేళ్ళ సూరజ్ పంచోలి తో ఆమె అత్యంత గాఢమైన ప్రేమలో పడింది. ఆ ప్రేమ ఎంత గాఢమైనదంటే ధన పిశాచాలు నర్తించే సో కాల్డ్ ఉన్నత వర్గాల ఇళ్ళల్లో కూడా ఇంతటి నిర్మలత్వం ఎలా ఆవిర్భవిస్తుంది, అని ఆశ్చర్యపోయేటంత!
సూరజ్, తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఆమె సంపాదించుకున్నదంతా తన మీద ధారపోస్తున్నా సిగ్గు లేకుండా స్వీకరించాడు. సూరజ్ మీద పిచ్చి ప్రేమతో అతని కుటుంబ సభ్యులకు బహుమానాలు కొనివ్వడానికి కూడా జియా లక్షలు (కోట్లేమో) తగలేసింది. తన నిజాయితీతో కూడిన ప్రేమకు స్వచ్చమైన ప్రేమను బదులు కోరుకుంది.
కానీ సూరజ్ తనను మోసం చేస్తున్నాడని తెలిసి తల్లడిల్లిపోయింది. ఆమె రాసిన ఉత్తరం చదివితే ఆమె ప్రేమాగ్ని ఎంత తీక్షణమైనదో, ఆమె ప్రేమ సౌరభం ఎంత పరిమళభరితమైనదో, ఆమె హృదయ నైర్మల్యం ఎంతటి స్ఫటిక సమానమో తెలుస్తుంది.
జియా ఖాన్ ఎంతటి సామాన్య యువతి అంటే శారీరకంగా కలవడానికి సూరజ్ బలవంతపెడుతున్నపుడు గర్భం వస్తుందేమో అని భయపడేటంత. ‘నిరోధ్ తెచ్చావా?’ అని సినిమాల్లో హీరోయిన్ల చేత మన దర్శకోత్తములు చెప్పించి దశాబ్దం దాటిపోయినా, బ్రిటన్ లో పుట్టి పెరిగిన పిల్ల బాలీవుడ్ నటుడి కొడుకుని ప్రేమించి గర్భం వస్తుందేమోనని తీవ్రంగా భయపడిపోయిందంటే ఆమె ఎంత అమాయకురాలై ఉండాలి? గొర్రె కసాయినే నమ్మినట్లు, ఈ అమాయక యువతి, ఆడపిల్లల్ని కోరికలు తీర్చుకునే సాధనాలుగా పరిగణించే ఒక అసహ్యకరమైన మగోన్మత్త పిశాచానికి తన హృదయాన్ని అర్పించుకుంది.
తనను మోసం చేస్తూ మరింతమంది యువతులతో ప్రేమ కబుర్లు చెబుతున్నాడని, తిరుగుతున్నాడని తెలిసినా తన ప్రేమను చంపుకోలేక సూరజ్ పై కోపాన్ని చంపుకోవడానికే జియా మొగ్గు చూపింది. సూరజ్ తల్లిదండ్రులు తనకు బలవంతంగా అబార్షన్ చేసినా సూరజ్ తనవాడవుతాడన్న నమ్మకంతో అలాగే కానిచ్చింది.
ఆమె సూరజ్ ప్రేమ కోసం ఎంత పరితపించిందంటే తన ప్రేమపై పరిహాసాలాడినా సహించింది. తనను టార్చర్ పెట్టినా భరించింది. చివరికి సూరజ్ తిరుగుళ్లతో, మోసంతో తనకిక బతుకు లేదనుకుంది. కనీసం ‘నువ్వు నన్ను మోసం చేస్తున్నావు’ అన్న మాటను కూడా సూరజ్ తో చెప్పలేని తీవ్రమైన ప్రేమ లోతుల్లోకి ఆమె కూరుకుపోయి, అక్కడే ఊపిరి తీసుకుంది.
పత్రికల ప్రకారం సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఆయనను పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. జియా రాసిన చివరి లేఖ సూరజ్ ని ఉద్దేశించింది కాదనీ, ఎనిమిది నెలల పరిచయంలోనే సూరజ్ వివాహానికి హామీ ఎలా ఇవ్వగలడని సూరజ్ తరపు లాయర్ కోర్టులో వాదించాడు. ఎనిమిది నెలల పరిచయం గర్భం చేయడానికి, ఆమెను దూషించి, కొట్టి, టార్చర్ పెట్టడానికి ఎలా సరిపోయిందో ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
జియా మానసికంగా ఎంత చిత్రహింస అనుభవించిందంటే, పొద్దున్నే మెలకువ వచ్చినపుడు మెలకువ తెచ్చుకోవడానికి కూడా భయపడినంత బరువైన హృదయాన్ని, పీడకలల పగళ్లను ఆమె మోసింది. ప్రేమతో నాలుగు మాటలు వినడానికి నోచుకోలేనంత కరువుగా బతికింది. ఆమె చివరి ఉత్తరంలోని కొద్ది భాగాలను డైలీ భాస్కర్ పత్రిక ప్రచురించింది. ఆ భాగాలు తెలుగు పాఠకుల కోసం…
——xxx——xxx——
(జియా ఖాన్ రాసిన ఆరు పేజిల చివరి ఉత్తరం కింది బొమ్మలలో చూడవచ్చు)
“ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ నేనిక కోల్పోయేదేమీ లేదు గనుక ఇప్పుడైనా నేను చెప్పాలి. నేనిప్పటికే సర్వస్వం కోల్పోయాను. నువ్వు దీనిని చదువుతున్నట్లయితే, నేనప్పటికి (ఈ లోకాన్ని) విడిచిపెట్టి పోయి గానీ లేదా విడిచి వెళ్ళే క్రమంలో గానీ ఉంటాను.”
“నేను లోలోపల చిట్లిపోయాను. నీకు ఇది తెలియకపోవచ్చు గానీ, నిన్ను ప్రేమించడంలో నన్ను నేనే కోల్పోయేంత గాఢంగా నన్ను ప్రభావితం చేశావు. అయినప్పటికీ నువ్వు నన్ను రోజూ చిత్రహింసలకు గురి చేశావు.”
“ఈ రోజుల్లో నేను కాంతి అనేది ఎరుగను. మేలుకోవడానికి ఇష్టపడని క్షణాల్లోకి నేను మేలుకొంటున్నాను.”
“నా జీవితాన్ని నీతో కలిసి చూసుకున్న కాలం ఒకటి ఉండేది. కానీ నువ్వు నా కలల్ని ఛిన్నాభిన్నం చేశావు. నేను నా లోపల చచ్చిపోయిన భావం కలుగుతోంది. నేను నా జీవితాన్ని ఇంతగా ఎప్పుడూ, ఎవరికీ ఇవ్వలేదు. ఎవరిపైనా, ఎప్పుడూ ఇంతగా శ్రద్ధ తీసుకోలేదు. నా ప్రేమకు నువ్వు మోసంతో, అబద్ధాలతో బదులిచ్చావు.”
“నేను ఎంత ఖర్చు చేసి నీకు బహుమానాలు కొనిచ్చానో నాకు లెక్కలేదు. నీ కోసం నేను ఎంత అందంగా తయారవుతానో నీకు లెక్కలేదు. గర్భవతిని కాకుండా కాపాడబడ్డాను, కానీ నన్ను నేను నీకు సర్వస్వం ఇచ్చుకున్నానే?”
“ప్రతి రోజు నువ్వు నాకు కలిగించిన బాధ నాలోని ప్రతి తునకనూ నాశనం చేసింది, నా ఆత్మనూ నాశనం చేసింది. నేను తినలేను, నిద్రపోలేను, ఆలోచించలేను, వ్యవహరించలేను. నేను ప్రతి దాన్నుండీ పరుగెత్తి పారిపోతున్నాను.”
“నా కెరీర్ కి ఇక ఎంత మాత్రం విలువలేదు. నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నేను ఎంతగా ఆశపడ్డానంటే, ఎంత క్రమశిక్షణాయుతంగా మారిపోయానంటే, నేను నీకు పడిపోయాను; నాలోని అత్యంత మెరుగైనదాన్ని వెలికి తీయగల ప్రేమ అది అని నేను భావించాను. విధి మనిద్దరిని ఎందుకు ఒక చోటికి చేర్చిందో నాకు తెలియకుంది.”
“నేను ఇంతవరకూ ఎదుర్కొన్న ఆ మొత్తం బాధ, అత్యాచారం, దూషణ, చిత్రహింస…. దీనంతటికీ నేను తగను. నీ నుండి ఎటువంటి నిబద్ధతను గానీ, ప్రేమను గానీ నేను చూడలేకపోయాను… నువ్వు నన్ను మానసికంగా, భౌతికంగా గాయపరుస్తావని నేను అంతకంతకూ ఎక్కువగా ఎంత భయకంపితురాలిని అవుతూ వచ్చాను. నీకు జీవితం అంటే పార్టీలు, అమ్మాయిలు. నాకు జీవితం అంటే నువ్వూ, పని.”
“నేనిక్కడే ఉంటే నిన్ను ప్రేమిస్తాను, కానీ కోల్పోతాను. అందుకే నా పదేళ్ళ కెరీర్ కీ, కలలకీ వీడ్కోలు చెబుతున్నాను… నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు గానీ నువ్వు నన్ను మోసం చేస్తున్న విషయం గురించి నాకు సమాచారం అందుతోంది..”
“నేను దానిని విస్మరించడానికే మొగ్గు చూపాను, నిన్ను నమ్మడానికే నిర్ణయించుకున్నాను. కానీ నువ్వు నన్ను అపహాస్యం చేశావు. నేనెప్పుడూ బైటకి వెళ్లలేదు, నేనింకెవరినీ కోరుకోలేదు. నేనొక విధేయురాలిని. కార్తీక్ తో నేనెవరినీ కలవలేదు, నువ్వు నిరంతరం నాకు కలిగిస్తున్న బాధని నువ్వు కూడా (ఒక్కసారి) అనుభవించాలని మాత్రమే భావించాను. నేను నీకు ఇచ్చినంతగా మరే మహిళా నీకు ఇవ్వలేదు, నేనా సంగతి నా రక్తంతో రాసివ్వగలను.”
“ఇక్కడ ఉన్నతమైన పరిస్ధితులు నాకోసం చూస్తున్నాయి. కానీ నువ్వు ఎంతగానో ప్రేమించే వ్యక్తి నిన్ను దూషించాలనుకుంటున్నపుడు, నిన్ను కొడతానని బెదిరిస్తున్నపుడు, ఇతర అమ్మాయిలతో ‘మీరు అందగా ఉన్నారని’ చెబుతూ నిన్ను మోసం చేస్తున్నపుడు, నువ్వు వెళ్లడానికి ఏ చోటూ మిగలని పరిస్ధితుల్లో నిన్ను గెంటివేస్తున్నపుడు, నువ్వు ప్రేమతో వస్తే నీ మొఖం మీదనే అబద్ధాలు ఆడుతున్నపుడు, కారులో వెంటబడాల్సిన పరిస్ధితిని నీకు కల్పించినపుడు, నీ కుటుంబాన్ని అగౌరవపరిచినప్పుడూ… ఆ ఉన్నతమైన పరిస్ధితులకు ఉన్న విలువ ఏపాటిదని?”
“నువ్వు ఎప్పుడూ కనీసం నా సోదరిని కలవనైనా లేదు. కానీ నేను నీసోదరికి బహుమానాలు కొనిచ్చాను. నువ్వు నా ఆత్మను నిలువునా చీరేశావు. ఊపిరి పీల్చుకోవడానికి నాకిక ఏ కారణమూ లేదు. నేను కోరుకున్నదల్లా ఒక్క ప్రేమ మాత్రమే. నేను నీకోసం అన్నీ చేశాను. నేను మన కోసం పని చేస్తున్నాను. నా భవిష్యత్తంతా సర్వనాశనమైపోయింది. నా సంతోషం అంతా నానుండి లాగివేయబడింది.”
“నేనెప్పుడూ నీకు అత్యుత్తమమైంది జరగాలని కోరుకున్నాను. నీ మెరుగుదల కోసం నా వద్ద ఏ చిన్న మొత్తం ఉన్నా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధపడిపోయాను. నా ప్రేమను నువ్వు ఎప్పుడూ స్వీకరించలేకపోయావు, నా మొఖం మీదనే కొట్టావు.”
“నాకిక విశ్వాసం లేదు. నాకిక ఆత్మ గౌరవం మిగిలి లేదు. నాకింకా ఏ మాత్రం ప్రతిభ మిగిలి ఉన్నా, ఆశ మిగిలి ఉన్నా అదంతా నువ్వు తీసేసుకున్నావు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు.”
“గోవా ట్రిప్ నా పుట్టిన రోజు కానుక. నువ్వు నన్ను మోసం చేశాక కూడా నీ కోసం ఖర్చు పెట్టాను. నన్ను లోతుగా బాధపెట్టినా, మన పాపను అబార్షన్ చేసుకోవాల్సి వచ్చింది.”
“నేను మళ్ళీ తిరిగి వచ్చినపుడు నీ పుట్టిన రోజుని ప్రత్యేకంగా చేయడానికి సాధ్యమైనంత తీవ్రంగా ప్రయత్నిస్తే, నా క్రిష్టమస్ నీ, పుట్టినరోజు డిన్నర్ నీ అభాసుపాలు చేశావు. వాలెంటైన్స్ డే రోజున నానుండి దూరంగా ఉండడానికే ఇష్టపడ్డావు. ఒక సంవత్సరం పాటు కలిసి ఉంటే మనిద్దరం ఎంగేజ్ అవోచ్చని ఓసారి ప్రామిస్ చేశావు.”
“జీవితంలో నువ్వు కోరుకున్నదంతా అమ్మాయిలతో పార్టీలు చేసుకోవడం, నీ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం. నేను కోరుకున్నదంతా నువ్వు, నా సంతోషం. నువ్వు ఆ రెండింటినీ నానుండి తీసేసుకున్నావు.
“నేను నిస్వార్ధంగా నీ కోసం ఖర్చు పెడుతుంటే, నేను నీ కోసం దుఃఖిస్తుంటే నువ్వు నా మొఖం మీదనే నవ్వేవాడివి.”
“దీని తర్వాత నాకీ ప్రపంచంలో మిగిలిందేమీ లేదు. నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వూ నన్ను ప్రేమించాలని కోరుకున్నాను. మన భవిష్యత్తు గురించి కలలు కన్నాను. మన విజయం కోసం కలలు కన్నాను…”
“శిధిలమైన కలలు, శుష్క హామీలు తప్ప నేనీ చోటులో వదిలివెళ్ళడానికి ఏమీ లేవు. నేనిప్పుడు కోరుకునేదంతా నిద్రలోకి జారుకుని మరెప్పటికీ మేల్కొనకపోవడమే. నేను ఏమీ కాను, కానీ నాకు అన్నీ వున్నాయి. నేను నీతో ఉన్నపుడు కూడా ఎంతో ఒంటరితనాన్ని అనుభవించేదాన్ని. నన్ను ఒంటరినీ, బలహీనురాలినీ చేశావు.”
“నేను ఇంతకంటే చాలా చాలా ఎక్కువే…”
——xxx——xxx——
ఎంత బాధ, ఇంకెంత వేదన, మరెంత ప్రేమ! ఇంత అమాయకమైన, ఇంత నిర్మలమైన, ఇంత స్వార్ధరహితమైన ప్రేమను అనుభవించలేని అర్భకుడు సూరజ్ పంచోలి.
జియా ఖాన్ అపాత్రదానం చేసింది.
నాకీ ఉత్తరం చదువుతుంటే లియో టాల్స్టాయ్ రచించిన మహత్తర నవల ‘అన్నా కరేనినా’ గుర్తుకొస్తోంది. అప్పటికే వివాహిత అయిన అన్నా కరేనినా, తన కంటే చిన్నవాడైన వ్రాన్ స్కీతో యాదృచ్ఛిక క్షణాలలో తన ప్రమేయం లేకుండానే ప్రేమలో పడిపోతుంది. కానీ స్త్రీని ఇనుప తెరల మాటున బంధించి ఉంచిన ఆ ఫ్యూడల్ అరిస్టోక్రటిక్ సమాజంలో… అటు వివాహ బంధనాలు తెంచుకోలేక, ఇటు గాఢమైన ప్రేమకు బద్ధురాలు కాలేక నవల చివర్లో రైలు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడుతుంది అద్భుత సౌందర్య రాశి అన్నా కరేనినా.
జియా ఖాన్ కి పెళ్లి కాలేదు. సూరజ్ కంటే నాలుగేళ్ళు పెద్దదే. కానీ వ్రాన్ స్కీ నుండి కరేనినా పొందినట్లు అంతే గాఢమైన ప్రేమను బదులు పొందలేకపోయింది. ఆ ప్రేమ రాహిత్యమే, ఆ సాంస్కృతిక పతన విలువలే, ఆ ఆధునిక అరిస్టోక్రటిక్ విలువ రాహిత్యానికే ఆమె తన ప్రేమను బలి చేయాల్సి వచ్చింది.
కానీ ఆమె మరింత నిర్మాణాత్మకంగా ఆలోచించి ఉండాల్సింది. ప్రేమ రాహిత్యపు ఎడారి నుండి బైటపడి అనంతమైన ప్రేమను అందివ్వగల ఒయాసిస్సులను ఆమె వెతుక్కోవలసింది. కనీసం తనను తానైనా ప్రేమించుకుని ఉండాల్సింది. తనదంతా సూరజ్ అనే ఒక అర్భకుడు లాగేసుకున్నాడని ఆమె తప్పుగా అభిప్రాయపడింది. సంక్షుభిత క్షణాల్లో అత్యంత అవసరమైన ఆత్మ విశ్వాసాన్ని ఆమె ప్రోది చేసుకోలేకపోయింది. త్వరపడి తన విలువైన ప్రేమ హృదయాన్ని ఒక గౌరవ హీనుడికి, ఆత్మ రాహిత్యంతో బాధపడుతున్న ఒక రోగిష్టికి అనవసరంగా బలి ఇచ్చింది.
ప్రేమను, డబ్బును ముడి పెట్టడంలోనే జియా ఖాన్ పొరబాటుపడింది. ప్రేమను వెలిబుచ్చడం అంటే బహుమానాలు కొనివ్వడమే అని తప్పుగా అభిప్రాయపడింది. కానీ ఆమె పెరిగిన వాతావరణం ఆమెకు నేర్పింది అదే. నిజమైన ప్రేమ ఎలాంటిదో తెలుసుకునే అవకాశం బహుశా ఆమెకు లేదు. నిజమైన ప్రేమ ఇవ్వడం స్వాభావికమైనది. కాబట్టి జియా ఇవ్వగలిగింది. కానీ నిజమైన ప్రేమను పొందడం స్వాభావికం కాదు. అలా కాకుండా ఈ సమాజం అనేక అడ్డు తెరలను ఏర్పాటు చేసి ఉంచింది. అనేక అదృశ్య సామాజిక బంధనాలను నిర్మించి, అనేక భ్రమాజనిత వెలుగు జిలుగులను విరజిమ్ముతుంది ఊర్ధ్వలోకపు రంగుల ప్రపంచం. ఈ వెలుగు జిలుగుల మర్మాన్ని జియాఖాన్ పసికట్టలేక పోయింది. ఫలితంగా తనను తాను ఆత్మార్పణం కావించుకుంది.
ఈ ప్రపంచం ఒక నిర్మలమైన ప్రేమ హృదయాన్ని దూరం చేసుకుంది.
😥
వస్తువులని కొనివ్వడమే ప్రేమ అని ఆమె ఎలా అనుకుంది? ఎంత పల్లెటూరి అమ్మాయైనా నేను ఆమెకి ఏ బంగారు గొలుసో కొనిస్తే ఆమె ప్రేమలో పడిపోతుందా?
జియాఖాన్ వేదన ఎంత తీవ్రమో ఆమె రాసిన ప్రతి అక్షరంలో ప్రతిఫలిస్తోంది. దీన్ని తెలుగు పాఠకులకు సహానుభూతితో అందించటంలో మీ చొరవ అభినందనీయం.
ఆ దు:ఖాన్ని అర్థం చేసుకుంటూనే- ఆమె తన బతుకును బలి చేసుకోకుండా తట్టుకుని ఉండాల్సిందని అనిపిస్తోంది!
అప్పుడేప్పుడో 1938-40 ప్రాంతాల్లో బుచ్చి బాబు గారి రచనల్లో స్త్రీ ని మగవాన్ని ఆకర్షించి మభ్య పెట్టే వస్తువుగా చూపెట్ట బడుతుంది. ఆవిధంగా స్త్రీ ని ద్వేషంచడం కనబడతుంది. అది సాహిత్యంలో (భూస్వామ్య సమాజం) బావ వాదుల కాలం. ఈ నాటి ధన దురాహంకారం తో మగవాడు స్త్ర్రీని బోగవస్తువు గానే కాకుండ, ‘యూజ్ అండ్ త్రో’ వస్తువుగా చూస్తున్నడు. ఆడపిల్లల ఆర్త నాధాలు ఈ మౄగాలకు వినిపించవు, వినిపించినా వాల హౄదయాలను కరిగించవు. స్త్రీలు ఈ పిత్రుస్వామ్య సామాజిక కట్టుబాట్లకు ఎదురు తిరగకుండ ఈ సీరియల్ కధలు ఆగేవి కావు. అంతవరకు, ఈ నిర్హేతుకమైన, నిర్దాక్షినమైన ఏసిడ్ అటాక్ లు, హత్యలు, మానబంగాలు అగేవి కావు. ప్రతూషల్ని, జియాఖన్లని మనం చూస్తునే వుంటం.
జియా అంటే అరబిక్ లో ” వెలుతురు ” అని అర్ధం. ప్రేమను పంచి, జియా,ఒక వెలుగు వెలిగి ,
‘ పోయింది’ !
సూరజ్ అంటే సూర్యుడు ! నీతి హీనుడై , తన కాంతి అంతా కోల్పోయాడు !
ఆమె మనసు ఎంత సున్నిత మైనదో ఆమె లేఖలు చెబుతున్నాయ్.
ఆమె మోస పోయింది. ఎందుకు అంటే ఒక ముర్కుడుని ప్రేమించి తన ప్రేమ సమరాజ్యం లో నిలవలేక పోయింది.
ప్రేమను ఇవ్వడమే ప్రేమ కాదు. మనము ఇచ్చే ప్రేమ అవతలి వారు
ఎలా తీసుకున్నారో కూడా తెలుసుకోవడం ప్రేమ లో భాగం. అలా తెలిసి కూడా ప్రేమించడం
అవివేకం. ఏ విదం ఇన ఫీలింగ్స్ లేకుండా ప్రేమ పుట్టడం అసాధ్యం.
అండర్ వరల్డ్ మాఫియాలు…. అసాంఘిక శక్తులు…మోసాలు, ద్రోహాలు…ఇలా సకల పిశాచాలు చెట్టపట్టాలేసుకుని సంచరించే బాలీవుడ్ లో జియా…లాంటి సున్నిత మనస్కురాలు ఉందంటే నమ్మశక్యం కావడం లేదు.
ఇక హీరోయిన్లను వ్యక్తిగత కాంక్షలకు వాడుకుని…అంతా ఐపోయాక మోసం చేయడం, లేదంటే
ప్రాణాలే తీయడం భారత చిత్రపరిశ్రమలో ఇవాళ కొత్తకాదు.
దివ్యభారతి మరణం ఇవాళ్టికీ అనుమానస్పదమే….
ఐదారేళ్లక్రితం ఓ తెలుగు అగ్రహీరోయిన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెనుక కూడా ఇటువంటి
కారణాలే ఉన్నాయి. ఓ తెలుగు కుర్ర హీరో ప్రేమ పేరుతో ఆ తారను వాడుకుని వదిలేశాడని ఆరోపణలున్నాయి.
ఇక మహానటి సావిత్రి కూడా ఓ తమిళ హీరోను ప్రేమించి…..తన జీవితాన్ని విషాదాంతం చేసుకుందంటారు.
గాఢంగా ప్రేమించి మోసపోయారనో….ప్రేమ మైకంలోనో….ఇలా జరిగిందని తీసిపారేయలేం
లోకం పోకడ తెలీని ఓ మారుమూల అమ్మాయి మోసపోయిదంటే ఏమో అనుకోవచ్చు కానీ
ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉండి, ఆధునిక ప్రపంచంలో సంచరిస్తూ కూడా..వారిలో కనీస చైతన్యం లేకపోవడం నిజంగా బాధాకరమే.
“ప్రేమను ఇవ్వడమే ప్రేమ కాదు. మనము ఇచ్చే ప్రేమ అవతలి వారు ఎలా తీసుకున్నారో కూడా తెలుసుకోవడం ప్రేమ లో భాగం.”
సుభాష్ గారు, విలువైన మాట చెప్పారు. తన ప్రేమను తీసుకునే అర్హత ఎదుటివారికి ఉందో లేదో గ్రహించాల్సిన బాధ్యత ప్రేమికులపై ఉంటుంది. కాని మన చుట్టూ ఉన్న సమాజం ఆ తెలివిడిని అందజేసేది కాకపోవడమే విషాదం.
చందుతులసి గారూ, ఆర్ధికంగా ఉన్నత స్ధితిలో ఉన్నవారికి సామాజిక చైతన్యమే లేనప్పుడు ప్రేమ చైతన్యం మాత్రం ఎక్కడినుండి వస్తుంది? బాధాకరమే అయినా, జియా ఖాన్ లాంటివారు మోసపోయే సమాజంలోనే మనం ఉన్నాం.
కారణాలు ఏమైనప్పటికీ , జియా ఖాన్ లేఖ ద్వారా, ఆమె చాలాకాలం నుంచీ , తన జీవితం లో జరిగిన సంఘటనలనూ , తాను ఆ సంఘటనల్లో , కేవలం ఒక సమిధ అయిపోయినట్టు నిర్ణయించుకుని , తీవ్రమైన మనస్తాపం చెందినట్టు తెలుస్తుంది ! శాస్త్రీయం గా దీనిని ‘ సివియర్ డిప్రెషన్ ‘ అని అంటారు !
సివియర్ డిప్రెషన్ లో ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచనలూ , నిర్ణయాలూ రావడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపించినపుడు , తలి దండ్రులు సరి అయిన చికిత్స చేయించాలి ! ప్రియుడు మోసం చేశాడనో , లేదా పరీక్షలో పాసవలేదనో ! తమ విలువైన జీవితాలను అంతం చేసుకో కూడదు ! ( ” baagu .net లో డిప్రెషన్ ఆత్మ కధ పేరు తో కొన్ని టపాలు పోస్టు చేశాను చూడ గలరు )
( శాస్త్రీయ కోణం లో కూడా ఈ సమస్యను చూడడం , ఆత్మ హత్య కు పురి గొల్పిన కారణాలను ఆమోదించినట్టు కాదు ! )
baagaa raasaaru
డబ్బున్న సూరజ్ పంచోలి లాంటి యువకులు ఎందరెందరో అమ్మాయిలతో ప్రేమాటలాడుకుంటారు పెళ్లిదాకా వస్తే చల్లగా తప్పుకుంటారు!కోర్టుకేసుల్లోంచి అవలీలగా తప్పుకుంటారు!జియాఖాన్ ఆత్మహత్యాలేఖ చదివితే ఆమె అమాయకపు నిష్కళంక ఆరాధన ,మూగప్రేమ సర్వస్వ సమర్పణ గుండెలను పిండేస్తుంది!ఆమెజీవితం అమ్మాయిలకు కనువిప్పు కావాలి!