బి.జె.పి పదవులకు అద్వానీ రాజీనామా, ముదిరిన సంక్షోభం


ఈ పార్టీకిక సిద్ధాంతాల్లేవ్!

ప్చ్! ఈ పార్టీకిక సిద్ధాంతాల్లేవ్!

ఈనాడు పత్రిక అంచనా తల్లకిందులయింది. ఆ పత్రిక విలేఖరి ఊహించినట్లు అద్వానీ కోసం ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. తన అభ్యంతరాలను పక్కకు నెట్టి, మోడీకి ఎన్నికల ప్రచార సారధ్య బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ పార్టీ అగ్రనేత అద్వానీ తీవ్ర చర్యకు దిగారు. పార్టీలోని అన్నీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. తన లేఖనే రాజీనామా పత్రంగా భావించాలని ఆయన కోరారు. అద్వానీ రాజీమానాను తిరస్కరిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ తిరస్కరణకు పెద్దగా విలువ లేదన్నది స్పష్టమే. రాజ్ నాధ్ సింగ్ అద్వానీ ఇంటికి వెళ్ళి నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని ది హిందు తెలిపింది. అగ్రనేతలంతా అద్వానీ ఇంటికి క్యూ కట్టినట్లు చానెళ్లు చెబుతున్నాయి.

సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే పరిస్ధితి పార్టీలో లేదని, సిద్ధాంతాలు లేని పార్టీలో తాను ఎక్కువ కాలం ఇమడలేనని భావిస్తూ రాజీనామాకు సిద్ధపడినట్లు అద్వానీ రాజీనామాలో తెలిపారు. ఆయన రాజీనామా పూర్తి పాఠం ఇలా ఉన్నది.

ప్రియమైన శ్రీ రాజ్ నాధ్ సింగ్ గారికి,

నా జీవితం అంతా జన సంఘ్, భారతీయ జనతా పార్టీ లకు సేవ చేస్తూ గడిపాను. అది నాకు అత్యంత ప్రతిష్టను, అవధుల్లేని సంతృప్తిని కలిగించే విషయం.

గత కొద్ది కాలంగా పార్టీ ప్రస్తుత పనితీరు లోనూ, లేదా అది ప్రయాణిస్తున్న దిశ లోనూ ఇమడడం నాకు కష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్, నానాజీ మరియు వాజ్ పేయి గార్లు స్ధాపించిన సైద్ధాంతిక పార్టీయే ఇదన్న భావన నాకిక ఏ మాత్రం లేదు. వారి ఏకైక దృష్టి దేశమూ మరియు దానియొక్క ప్రజలపైనే. మనలోని అత్యధిక నాయకులు తమ వ్యక్తిగత ఎజండాలకు మాత్రమే కట్టుబడి ఉన్నారు.

కాబట్టి నేను పార్టీ యొక్క  మూడు ప్రధాన వేదికలైన జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, మరియు ఎన్నికల కమిటీల నుండి  రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. దీనినే రాజీనామా పత్రంగా పరిగణించగలరు.

మీ

సంతకం/ ఎల్.కె.అద్వానీ

10.06.2013

తన చివరి ఆకాంక్ష భారత దేశానికి ప్రధానిగా పని చేయడం అని అద్వానీ గతంలో ఒకసారి చెప్పి ఉన్నారు. నిజానికి ఇప్పటి బి.జె.పి పార్టీలో ఆయనను మించిన నాయకుడు లేరనే చెప్పాలి. బాబ్రీ మసీదును కూల్చి రామ మందిరం నిర్మించాలన్న డిమాండ్ తో ఆయన రధ యాత్ర చేపట్టి తన యాత్ర పొడవునా మత కల్లోలాలను రెచ్చగొట్టి తద్వారా పార్లమెంటులో 2 సీట్లున్న పార్టీని 80 సీట్ల పార్టీగా మార్చారు. అనంతరం అతి పెద్ద పార్టీగా బి.జె.పి అవతరించడంలో వాజ్ పేయి కంటే అద్వానీ కృషే ఎక్కువ. ఐనా 1999లో ఎన్.డి.ఏ ప్రభుత్వంలో మొదట హోమ్ మంత్రిగానూ, అనంతరం ఉప ప్రధాని పదవితోనూ ఆయన సరిపెట్టుకోవలసి వచ్చింది.

వాజ్ పేయి ప్రధానిగా ఉండగా ఆయన ఆరోగ్యం చెడిపోయిందని పుకార్లు వచ్చినపుడు అద్వానీ తదుపరి ప్రధాని అని కూడా వార్తలు వచ్చాయి. కానీ వాజ్ పేయి ప్రధానిగా కొనసాగారు. జి.డి.పి వృద్ధి రేటు 8-9 శాతం వద్ద కొనసాగడంతో అదే దేశాభివృద్ధి అని చాటుకుంటూ గర్వాతిశయంతో పార్టీ గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించింది ఎన్.డి.ఏ. ‘అంతా బాగుంది’, ‘దేశం వెలిగిపోతోంది’ అంటూ కృత్రిమ నినాదాలు ఇచ్చి ప్రజల వాస్తవ పరిస్ధితిని కప్పి పుచ్చడానికి ప్రయత్నించింది. అయితే ప్రజలు మెలకువగా ఉండడంతో బి.జె.పి/ఎన్.డి.ఏ 2004 ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. అప్పటినుండి పార్టీ కోలుకున్నదే లేదు. అద్వానీ చివరి ఆకాంక్ష తీరిందీ లేదు.

ఈ లోపు దేశ రాజకీయ చిత్రపటం మీదికి నరేంద్ర మోడి దూసుకు వచ్చారు. అద్వానీ ఏ హింస రచన తోనైతే పార్టీని పైకి తెచ్చారో నరేంద్ర మోడి అంతకు మించిన ధ్వంస రచనతో తనదైన సొంత ముద్రను ఏర్పరుచుకున్నారు. ఆ ముద్ర దేశంలోని మైనారిటీ మతాల ప్రజలకే గాక సెక్యులర్, పురోగామి శక్తులన్నింటికీ ప్రబల శత్రువుగా అవతరించింది. చివరికి ప్రపంచ దేశాలను టెర్రరిజం బూచి చూపి కబళించే అమెరికా, బ్రిటన్ తదితర క్రూర సామ్రాజ్యవాద దేశాలు సైతం మోడితో సంబంధాలకు నిరాకరించాయి.

సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు అనుకూలంగానూ, గుజరాత్ ప్రజలకు వ్యతిరేకంగానూ మోడి అనుసరించిన పచ్చి విధానాల వలన సంక్షుభిత బ్రిటన్ ఈ మధ్య కాలంలో మోడితో సంబంధాలు మెరుగుపరుచుకున్నప్పటికీ అమెరికా ఇంకా అదే ఎడమ పాటిస్తోంది. వివిధ సామ్రాజ్యవాద కంపెనీల మధ్య వైరుధ్యాలలో భాగంగానే దీనిని చూడాలి తప్ప మోడి గొప్పతనంగా చూడలేము.

గుజరాత్ మత హత్యాకాండలకు బాధ్యుడిని చేస్తూ గోవా జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే ఆయనను తప్పించాలని వాజ్ పేజీ ప్రతిపాదించగా అద్వానీ దానికి అడ్డు పుల్ల వేశారు. కేడర్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ఆయన వాదించి మోడిని కాపాడారు. అనంతరం వీలు కుదిరినప్పుడల్లా మోడి సాగించిన అభివృద్ధి గురించి అద్వానీ పొగుడుతూ ఉండేవారు. కానీ తన చివరి ఆకాంక్షకు మోడి ఎసరు తెస్తున్నారని అర్ధం అయ్యాక అద్వానీ వైఖరిలో మార్పు వచ్చింది. చివరికి ‘మోడి అభివృద్ధి ఏపాటిది, అప్పటికే అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేపట్టారు. నిజానికి వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనీయుడు’ అనేంతవరకు అద్వానీ వెళ్లారు.

మోడి సాగించిన విధ్వంసకర రాజకీయాలు అద్వానీ ప్రారంభించినవే. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం రధయాత్ర చేపట్టి మత కల్లోలాలలో వేలాది అమాయకులను పొట్టనబెట్టుకున్న వ్యక్తి ఈ రోజు సిద్ధాంతం అంటూ వగచడం ఒట్టి బూటకం. గురువు అద్వానీని మించిన శిష్యుడుగా మోడి అవతరించి గురువు గారి పీఠానికే ఎసరు తేవడం, పార్టీ అంతా ఆయన వెనుక నిలబడడంతో అద్వానీ తీవ్ర నిరాశా, నిస్పృహలకు లోనయ్యారన్నది స్పష్టమే. తత్ఫలితమే ఆయన రాజీనామా తప్ప ఆయన చెబుతున్నట్లు ప్రజల మేలు కోరే సిద్ధాంతాలేవీ బి.జె.పి కి లేవు. 

హింస ఎప్పుడూ దానిని ప్రారంభించినవారిని కూడా బలి కోరడం అనివార్యం. అద్వానీ పతనం దాని ఫలితమే.

అద్వానీ రాజీనామా తీవ్రమైన విషయమని ఎన్.డి.ఏ కన్వీనర్ శరద్ యాదవ్ అంటున్నారు. అంటే అద్వానీ రాజీనామా ఎన్.డి.ఏ కూటమికి ఎసరు తెస్తున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పిలో విభేదాలు ఉన్నాయని అద్వానీ రాజీనామా స్పష్టం చేస్తున్నదని కాంగ్రెస్ సంతోషిస్తోంది. అద్వానీ, మోడీ ల విభేదాలు ఆ పార్టీ స్వంత విషయాలు అంటూనే రానున్న ఎన్నికల్లో దేశంలో ధర్డ్ ఫ్రంటే అధికారంలోకి వస్తుందని టి.డి.పి నేత చంద్రబాబు నాయుడు ఆశపడుతున్నారు.

మొత్తం మీద అద్వానీ రాజీనామా దేశ రాజకీయాలను ఒక్క కుదుపు కుడిపిందని చెప్పక తప్పదు. బి.జె.పి స్టాల్ వార్ట్ గా పేర్కొనదగిన అద్వానీ లాంటి వ్యక్తి రాజీనామా చేస్తే కుదుపు లేకపోతేనే ఆశ్చర్యం కావచ్చు.

ఎన్.డి.ఏ అధికారంలోకి వస్తే తెలంగాణ వస్తుందని ఆశించినవారికి కూడా అద్వానీ రాజీనామా ఆశనిపాతం కావచ్చు. అసలు స్వంత పోరాట శక్తిపైన, ప్రజల పైనా ఆధారపడకుండా అధికార పార్టీలపైనా, వాటి అధికార రాజకీయాలపైనా ఆధారపడాలని భావించడమే తెలంగాణ పోరాట శక్తుల తీవ్ర లోపం మరియు వైఫల్యం.

రానున్న రోజుల్లో దేశ పార్లమెంటరీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్వానీ వెనక్కి మళ్ళితే కుదుపు కాస్తా టీ కప్పులో తుఫానుగా మారినా మారవచ్చు. కానీ పరిణామాలు వెనక్కి వెళ్లలేనంత తీవ్రతతో కూడుకుని ఉన్నందున ఆసక్తికర మలుపులు ఖాయం చేసుకోవచ్చు. ప్రధాని పదవి దక్కకపోతే అద్వానికి ఇక రాజకీయాలు అనవసరం. రాజకీయాలు అక్కర్లేకపోతే బి.జె.పి ఎటుపోతే ఆయనకేమి? కాని అద్వానీ అంత తేలికగా ఎందుకు తప్పుకుంటారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s