ఎడ్వర్డ్ స్నోడెన్: ప్రిజం లీక్ చేసింది సి.ఐ.ఎ కాంట్రాక్టరే


ఎడ్వర్డ్ స్నోడేన్

ఎడ్వర్డ్ స్నోడేన్

అమెరికన్ మిలటరీ గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ, ప్రపంచ ప్రజల రోజువారీ ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లపై నిఘా పెట్టడానికి అభివృద్ధి చేసిన ‘ప్రిజం’ కార్యకలాపాల గురించి ‘ది గార్డియన్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలకు వెల్లడి చేసింది సి.ఐ.ఎ మాజీ కాంట్రాక్టరేనని గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది. సి.ఐ.ఎ కాంట్రాక్టర్ గా పని చేసి, అనంతరం ఎన్.ఎస్.ఎ మిలట్రీ కాంట్రాక్టర్ బూజ్ అలెన్ వద్ద ఉద్యోగిగా పని చేస్తున్న ఎడ్వర్డ్ స్నోడెన్ తమకు ‘ప్రిజం’ గురించి సమాచారం ఇచ్చాడని సదరు పత్రిక తెలిపింది.

ఎడ్వర్డ్ స్నోడెన్ వ్యక్తిగత విజ్ఞప్తి మేరకే తాము అతని పేరు వెల్లడిస్తున్నామని పత్రిక తెలిపింది. అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గాన్ని లోకానికి వెల్లడించే ఉద్దేశ్యంతోనే తాను ఈ పత్రాలను లీక్ చేశానని, బ్రాడ్లీ మ్యానింగ్ తరహాలో తనకు అమెరికా ప్రభుత్వం నుండి చిత్ర హింసలు ఎదురవుతాయని తనకు తెలుసని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రస్తుతం హాంకాంగ్ లోని ఒక హోటల్ లో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను పలు పత్రికలు, పరిశీలకులు బ్రాడ్లీ మేనింగ్ 2.0 గానూ, వికీలీక్స్ 2.0 గానూ అభివర్ణించడం విశేషం. అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్న మార్క్సిస్టు సామాజిక సూత్రం మరోసారి రుజువవుతోంది.

మౌలిక స్వేచ్ఛలు (Basic Liberties)

ఎడ్వర్డ్ స్నోడెన్ గతంలో సి.ఐ.ఎ లో సాంకేతిక సహాయకుడుగా పని చేశాడని అనంతరం డిఫెన్స్ కాంట్రాక్టర్ బూజ్ అలెన్ హామిల్టన్ వద్ద ఉద్యోగిగా కొనసాగుతున్నారని రష్యా టుడే తెలిపింది. తన ఐడెంటిటీని వెల్లడించాల్సిందిగా ఆయన గార్డియన్ పత్రికను కోరడంతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. “నేనెవరినో దాచిపెట్టుకునే ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేనేమీ తప్పు చేయ లేదని నాకు తెలుసు” అని స్నోడెన్ ఇంటర్వ్యూలో అన్నట్లుగా ఆర్.టి తెలిపింది.

అమెరికా ప్రభుత్వం తనపైన విచారణ ప్రారంభించే అవకాశం ఉందని స్నోడెన్ ఊహిస్తున్నారు. అయితే ప్రిజం వెల్లడి తాను నమ్మిన సూత్రాలకు అనుగుణంగానే చేశానని, ప్రభుత్వం ప్రజల ఏకాంతంలోకి ఎలా చొరబడుతున్నదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నదని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. ప్రజల మౌలిక స్వాతంత్ర్యాలను కాపాడే కోరికే తనను ఈ పనికి పురికొల్పిందని ఆయన తెలిపారు. “ప్రజలు ఎంత మాత్రం బెదిరిపోరన్న సందేశం ప్రభుత్వానికి నా చర్య ద్వారా అందాలి” అని స్నోడెన్ వ్యాఖ్యానించారు.

ప్రతిసందేశం

ఆఫ్గన్, ఇరాక్ యుద్ధ పత్రాలు, డిప్లొమేటిక్ కేబుల్స్ ను వికీలీక్స్ కు లీక్ చేసిన బ్య్రాడ్లీ మ్యానింగ్ ను రెండు సంవత్సరాల పాటు చిత్ర హింసలు పెట్టింది. ఒంటిపై గుడ్డలు లేకుండా, రోజులో గంట మాత్రమే బైటికి అనుమతిస్తూ 23 గంటల పాటు అత్యంత చిన్న గదిలో ఏకాంత కారాగారవాసం మ్యానింగ్ అనుభవించారు. మానవ హక్కుల గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా, బ్య్రాడ్లీ మ్యానింగ్ ను కలవడానికి ఐరాస ప్రతినిధికి సైతం అనుమతి ఇవ్వలేదు. ప్రపంచ వ్యాపితంగా నిరసనలు పెల్లుబుకి, వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో రెండేళ్ల తర్వాత మాత్రమే బ్రాడ్లీ మ్యానింగ్ ను ఐరాస ప్రతినిధి కలవగలిగాడు.

ఐరాస ప్రతినిధి తయారు చేసిన నివేదిక మ్యానింగ్ అనుభవించిన దారుణ పరిస్ధితుల గురించి తెలియజేసింది. ఆ తర్వాత అనివార్యంగా అమెరికా మెరుగైన సౌకర్యాలు కలిగిన మరో జైలుకు మ్యానింగ్ ను మార్చవలసి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయిన మ్యానింగ్ విచారణ అత్యంత రహస్యంగా, కేవలం కొద్ది భాగాలు మాత్రమే విలేఖరులకు అనుమతిస్తూ సాగుతోంది. ఈ చర్యల ఉద్దేశ్యం స్పష్టమే. భవిష్యత్తులో మరెవ్వరూ మ్యానింగ్ తరహాలో అమెరికా రాజ్య దుర్మార్గాలకు వ్యతిరేకంగా గొంతెట్టకూడదన్నదే ఈ చిత్రహింసల సందేశం.

అయితే అలాంటి చిత్రహింసలకు జనం భయపడబోరని, తాము చేయదలుచుకున్నది చేసి తీరుతారని ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పదలుచుకున్నారని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా సామ్రాజ్యవాద రాజ్యం చాటిన చిత్రహింసల సందేశానికి “ప్రతిసందేశాన్ని” సామాన్య జనం నుండి స్నోడెన్ ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి జులియన్ ఆసాంజే, బ్రాడ్లీ మ్యానింగ్ ల తరహాలో ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికన్ సామ్రాజ్యవాద మదపుటేనుగును ఒంటరిగా ఢీకొన్న ధీరోదాత్తుడన్నది నిర్వివాదాంశం.

“ఇటువంటి భారీ రహస్య గూఢచార యంత్రాన్ని నిర్మించి తద్వారా ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రజల మౌలిక స్వేచ్ఛలను, ఏకాంతాన్ని, అంతర్జాల స్వేచ్చను (internet freedom) అమెరికా ప్రభుత్వం నాశనం చేయడానికి నా అంతరాత్మలోని ఉత్తమ భాగం అంగీకరించలేదు” అని ఎడ్వర్డ్ స్నోడెన్ గార్డియన్ విలేఖరి గ్లెన్ గ్రీన్ వాల్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

Whisleblowing 2.0

ప్రపంచ ప్రజల రోజువారీ ఈ మెయిళ్ళు, ఛాటింగ్, మొబైల్ సంభాషణలు, టెక్స్ట్ మెసేజ్ లు, వీడియోలు, ఫోటో షేరింగ్ లు, లైక్ అన్ లైక్ లు… తదితర సమస్త సంభాషణలను (కమ్యూనికేషన్స్) ప్రిజం ద్వారా ఎన్.ఎస్.ఎ, ఎఫ్.బి.ఐ, జి.సి.హెచ్.క్యూ (బ్రిటన్) లు వింటున్నపుడు లేదా చూస్తున్నపుడు లేదా చదువుతున్నపుడు ఇక ఏకాంతం అనే ప్రశ్నే తలెత్తదు. ఫేస్ బుక్ యూజర్లు అనేకమంది తమ ప్రతి కదలికను, భావాన్ని తమ వాల్ పైన రికార్డు చేస్తున్నారు. ఇదెంత ప్రమాదకరమో స్నోడెన్ లీక్ ద్వారా తెలుస్తోంది. స్నోడెన్ లీక్ చేసిన పత్రాల ప్రకారం ప్రముఖ అంతర్జాల కంపెనీల సర్వర్లలోకే ప్రిజంకు నేరుగా ప్రవేశం ఉన్నది. ఇది గత ఏడు సంవత్సరాలుగా నడుస్తోంది.

స్నోడెన్ డబ్బు కోసం ఈ పని చేయలేదు. ఆయనకు సంవత్సరానికి 200,000 డాలర్ల చెల్లింపులు వచ్చే ఉద్యోగం. విలాసవంతమైన జీవనం. “ప్రజల పేరు చెప్పి, ప్రజలకే వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాల గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడమే నా ధ్యేయం” అంటున్న స్నోడెన్ బహుధా అభినందనీయుడు. బ్రిటన్ మిలట్రీ గూఢచార సంస్ధ MI5 లో పని చేసిన మాజీ గూఢచారి అన్నీ మేకన్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

“ఎన్.ఎస్.ఎ నేరాల గురించి వెల్లడి చేసిన ఈ మొత్తం విధానం గానీ, అమెరికా ప్రజలతో పాటు మిగిలిన ప్రపంచ ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నది గానీ అత్యంత అధునాతనమైనది. అమెరికా నుండి పారిపోయి హాంగ్ కాంగ్ అతను (స్నోడెన్) చేరుకోవడాన్ని నేను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాను. గ్లెన్ గ్రీన్ వాల్డ్ లాంటి కేలిబర్ కలిగిన విలేఖరులతో ఆయన కలిసి పని చేయడం అంటే… ఆయన చాలా చాలా గొప్ప పని చేశారు. నేను దీనిని Whisleblowing 2.0 అని పిలుస్తాను” అని అన్నీ మేకన్ రష్యా టుడే తో వ్యాఖ్యానించారు.

7 thoughts on “ఎడ్వర్డ్ స్నోడెన్: ప్రిజం లీక్ చేసింది సి.ఐ.ఎ కాంట్రాక్టరే

  1. సుభాష్ గారు, ఎవరన్నా ఈ గొప్ప వ్యక్తికి చిన్న ప్రశంస ఐనా ఇవ్వకపోతారా అని ఈ టపా రాసినదగ్గర్నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పటిదాకా ఎవరూ రాకపోయేసరికి నిరాశపడ్డాను. రెండు మాటల్లోని మీ అభినందన ఆ లోటు పూడ్చింది. ధన్యవాదాలు.

  2. బాగా చెప్పారండి, ఎడ్వర్డ్ స్నోడేన్ త్యాగదనుడు, త్యాగాలు చేసె వారికి ప్రశంసలు లభించినా చాలాపరిమితంగాంటాయి. ఎందుకంటే, వారిని అర్దం చేసుకుండే వారు ప్రపంచంలో చాలతక్కువ మంది ఉంటారు. అదేవిధంగా, ప్రశంసలు ఎధురు చూసి చేసేదాని పేరు కూడ త్యాగం కాదు. ఎడ్వర్ద్‌ స్నోడేన్‌ చేసిన పని ప్రపంచం లో కనీసం అయిదు పది చిన్న దేశాలు అమెరికా మీద తిరబడితే ఎలా వుంటుందో అలా వుంది.మానవజాతి మీద ఆయనకు ఎంత ప్రేమ! తన జాతిని రక్షించుకోవడానికి కావలసిన జీన్‌ మానవునిలోనే నిక్షిప్తమయి వుంటుదటా! అది లేని వారు ఎక్కువగా వుంటే అది వున్నవారు తక్కువ. ఈ తక్కువైనవారే ఈప్రపంచాన్ని రక్షించగలరు! ఒక జూలీయన్‌ అసాంజ్‌, ఒక ఎడ్వర్ద్‌ స్నోదేన్‌ మానవజాతి వారసులు.

  3. “ప్రశంసలు ఎధురు చూసి చేసేదాని పేరు కూడ త్యాగం కాదు.”

    నిజం చెప్పారు. అలా గుర్తింపుకోరుకోనితనాన్ని, స్వార్ధ రాహిత్యాన్ని స్నోడెన్ ఇంటర్వ్యూలో గుర్తించవచ్చు. ఆయన ఇంటర్వ్యూని అనువాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే పూర్తి ఇంటర్వ్యూ దొరకలేదు. పూర్తి పాఠం దొరుకుందేమో అని వెతుకుతున్నాను. ది హిందూ లో గార్డియన్ నుండి సేకరించి ప్రచురించారు. కాని ఇతర వార్తలను చూసినప్పుడు అది కొంతవరకే అని నాకు అర్ధం అయింది. దొరక్కపోతే దొరికినంతవరకు చేస్తాను.

  4. 29 ఏళ్ళ వయసులోనే స్నోడెన్.. వ్యక్తుల ప్రైవసీ పట్ల చూపే విలువ, అతడి వ్యక్తిత్వ విశిష్టత ముచ్చటేస్తున్నాయి.

    అతడి తెగువ సామాన్యమైనది కాదు! దానికి ఎదుర్కోవాల్సిన తీవ్ర పర్యవసానాలు తెలిసే ఆ సాహసం ప్రదర్శించాడు.

    ‘నన్ను నేను ఓ హీరో గా భావించుకోవటం లేదు. ఎందుకంటే నా వ్యక్తిగత ప్రయోజనం కోసమే చేస్తున్నానిది. ప్రైవసీ లేని ప్రపంచంలో బతకాలనుకోవటం లేదు’ అని ప్రకటించాడు స్నోడెన్. భయ సందేహాలకతీతంగా ఇంటర్నెట్ ఉపయోగించాలనుకునే ప్రతి ఒక్కరూ స్నోడెన్ కు మద్దతివ్వాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s