ఈ రోజు (సోమవారం, 10.06.2013) ఈనాడు దినపత్రిక ఆరో పేజీలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ప్రచురించారు. “ఏమో గుర్రం ఎగరా వచ్చు” శీర్షికన వచ్చిన ఈ విశ్లేషణ ప్రకారం అద్వానిని పక్కన పెట్టడం కూడా బి.జె.పి పధకరచనలో ఒక భాగమే. ప్లాన్-ఎ లో మోడి సారధ్యం వహించి పార్టీకి అత్యధిక సీట్లు రాబట్టాలి. ప్లాన్-ఎ విఫలం అయితే ప్లాన్-బి అమలులోకి వస్తుంది. ప్లాన్-బి ప్రకారం మోడి తగినన్ని సీట్లు కూడగట్టలేకపోతే గనక, మోడరేటర్ ముసుగు ధరించిన అద్వానీ ముందుకు వచ్చి సో కాల్డ్ సెక్యులర్ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. ఇదంతా ఆర్.ఎస్.ఎస్, అద్వానీల ఆశీస్సులతోనే జరుగుతోందని ఈనాడు కధనం చెబుతోంది.
గతంలో వాజ్ పేయి మోడరేటర్ అవతారంతో ఉంటే, అద్వాని హార్డ్ లైనర్ అవతారంతో ఉండేవారు. వాజ్ పేయి తప్పుకున్నాక అద్వానీకి మోడరేటర్ అవతారం ఎత్తవలసిన అవసరం వచ్చింది. అందుకోసం ఆయన అనేక ప్రయత్నాలు చేసి కొన్నిసార్లు తలపైనా బొప్పి కట్టించుకున్నారు కూడాను. జిన్నాని సెక్యులరిస్టు అని పొగిడి ఆర్.ఎస్.ఎస్ చేత చీవాట్లు తినడం లాంటివి ఆయన ఎదుర్కొన్నారు.
మోడి ఉన్నతితో అద్వానీ ఆయన పక్కన సహజంగానే మోడరేటర్ లాగా కనిపించడం మొదలు పెట్టారు. ఏ పార్టీలో నైనా అతివాదులు, మితవాదులు, మధ్యేవాదులు అంటూ మూడు వర్గాలు తధ్యం. ఆయా పార్టీలు ఈ మూడు వర్గాలను కాపాడుకుంటాయి. పరిస్ధితిని బట్టి ఏది అవసరమైతే ఆ వర్గాన్ని ముందుకు నెట్టి అధికారం చేజిక్కించుకోడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఆటలో భాగంగానే బి.జె.పి ఇప్పుడు ప్లాన్-ఏ, ప్లాన్-బి లను రూపొందించుకుందని భావించవచ్చు.
రాజకీయ పార్టీలు అధికారం కోసం వేసే ఎత్తుగడలు కొన్నిసార్లు మామూలు బుర్రకి అర్ధం కావు. ఈ విశ్లేషణ అలాంటి తెలివిడి పెంచుకోడానికి ఉపకరిస్తుంది. (కింద బొమ్మ పైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంటు ఓపెన్ అవుతుంది. లేదా అంతర్జాలంలో నేరుగా చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.)
–
–