బి.జె.పి కార్యవర్గం: కృత్రిమ ఎత్తులో మోడి? -కార్టూన్


The Hindu

The Hindu

రాజకీయ పార్టీల్లో నాయకులకు పదవి, హోదా, గౌరవం ఎలా రావాలి? మొదట వారికి ప్రజాదరణ ఉండాలి. అనంతరం ప్రజాదరణ ఉన్న నాయకుల ఆమోదం ఉండాలి. ఈ రెండు పక్షాలు కాస్త అటూ ఇటూ అయినా నష్టం లేదు. కనీసం ఒక పక్షం ఆదరణ పొందినా రెండో పక్షం ఆదరణ ఎదోలా పొందారనిపించుకోవచ్చు. కానీ రెండూ లేకపోతే కష్టమే. బి.జె.పి నాయకుడు నరేంద్ర మోడీకి ఈ రెండూ ఉన్నాయా? లేక రెండూ లేవా? లేక ఒకటి ఉండి మరొకటి లేదా?

చూడబోతే మోడీకి ఈ రెండూ ఉన్నాయని ప్రయత్నపూర్వకంగా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోడి గుజరాత్ తప్ప మరో రాష్ట్రంలో పార్టీని గెలిపించిన దాఖలాలు లేవు. మా రాష్ట్రానికి రావొద్దు అన్నవారు ఉన్నారు గానీ, రండి అని ఆదరంతో, గెలిపిస్తాడన్న విశ్వాసంతో పిలిచినవారు దాదాపు లేరు. అలా పిలిచిన రాష్ట్రం కర్ణాటకలో బి.జె.పి పరిస్ధితి ఎలా ఉన్నదో అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలింది. కానీ ఆర్.ఎస్.ఎస్ నాయకులు కొందరితో పాటు, బి.జె.పి నాయకులు కూడా రానున్న ఎన్నికల ప్రచార కమిటీ సారధ్యాన్ని మోడీకి అప్పగించడానికి నిర్ణయించారని పత్రికలు చెబుతున్నాయి.

గోవాలోని పనాజి లో బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్ర నేత ఎల్.కె.అద్వానీ అనారోగ్యం సాకుచూపి ఎగ్గొట్టారు. అనారోగ్యం ఏమీ లేదని, ప్రచార కమిటీకి అధిపతిగా మోడిని ఎంపిక చేయడం ఇష్టం లేకనే ఆయన రాలేదని పత్రికలు ఘోషిస్తున్నాయి. 85 సంవత్సరాల అద్వానీ తన రాజకీయ జీవితంలో జాతీయ కార్యవర్గానికి హాజరు కాకపోవడం ఇదే మొదటిసారట. అద్వానీ పరోక్షంలో, ఆయనకు ఇష్టం లేకుండా, పార్లమెంటు ఎన్నికల లాంటి ముఖ్యమైన కార్యక్రమానికి ప్రచార సారధ్య బాధ్యతలు అప్పజెపితే అటువంటి నిర్ణయానికి సార్ధకత ఉంటుందా అన్న అనుమానాలు ఉన్నా అనుకున్న పని కానిచ్చేయాలని ఆర్.ఎస్.ఎస్ నేతలు కూడా ఆమోదించేశారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.

అద్వానీ ఉండరు గనుక ఆయన బదులు సుష్మా స్వరాజ్ మోడి నియామకంపై వ్యతిరేకత వ్యక్తం చేయవచ్చని భావిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మోడీకి మద్దతు ఇవ్వడం ఇష్టం లేనివారంతా కార్యవర్గ సమావేశాలకు హాజరు కాకపోవడం. ఉమా భారతి, జశ్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, యోగి ఆదిత్యానంత్ తదితరులంతా అద్వానీకి సన్నిహితులని, వారెవరూ కార్యవర్గ సమావేశాలకు హాజరు కావడం లేదని ది హిందు తెలిపింది. ఇక సుష్మా స్వరాజ్ లాంటి వారు వ్యతిరేక స్వరం వినిపించి ఏమి లాభం?

వీరందరి పరోక్షంలో బి.జె.పి కార్యవర్గ సమావేశాల్లో మోడి ఆధారిటీ ఎలా చెలాయించబడుతుందో ఈ కార్టూన్ ద్వారా స్పష్టం అవుతోంది. ప్రజలు, కార్యకర్తలు, నాయకుల సర్వామోదంతో ప్రధమ నాయకత్వ స్ధానాన్ని చేజిక్కించుకోవలసి ఉండగా కృత్రిమ ఎత్తులతో నాయకత్వ స్ధానం చేరుకోవడం వలన నష్ట పోయేది పార్టీలే. బహుశా మోడి తప్ప గెలుపు తీరాలకు చేర్చే నాధుడు లేకపోవడం బి.జె.పికి ఉన్న పరిస్ధితి కావచ్చు. కానీ అద్వానీ పైన నమ్మకం ఎందుకు పోయింది? రధ యాత్ర ద్వారా రెండు సీట్లను 80 సీట్లకు చేర్చిన అద్వానీ ఇప్పుడు పార్టీలో ఎదుర్కొంటున్న దయనీయ పరిస్ధితిని చూస్తే జాలివేయక మానదు.

గత కొద్ది వారాలుగా మోడిని నియంత్రించడానైకి అద్వానీ చేయని ప్రయత్నం లేదేమో! దాదాపు దశాబ్దం క్రితం గుజరాత్ లో గోధ్రా రైలు దహనం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ముస్లింలపై కనీ వినీ ఎరుగని రీతిలో దహన, హత్యాకాండలు చెలరేగినపుడు అప్పటి హోమ్ మంత్రి అద్వానీయే మోడీకి రక్షణగా నిలిచారని చెబుతారు. ముఖ్యమంత్రిని మార్చడానికి ప్రధాని వాజ్ పేయి ప్రయత్నించినా దానిని అద్వానీయే అడ్డుకున్నారని, అలా చేస్తే క్యాడర్ కి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని అద్వానీ వారించినట్లు చెబుతారు. మోడిని ఆ విధంగా ప్రమోట్ చేసిన అద్వానీ ఇప్పుడు తన జీవిత ఆకాంక్షకు అడ్డుగా నిలిచిన శిష్యుడిని చూసి వగచి మాత్రం ఏమి ప్రయోజనం?

మోడిని అడ్డుకునే క్రమంలో గుజరాత్ కంటే మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కువ వృద్ధి సాధించారని, అప్పటికి అభివృద్ధి చెందిన రాష్ట్రం మోడి చేతుల్లో ఉండగా, అత్యంత వెనుక బడిన రాష్ట్రాన్ని ఎం.పి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టి అభివృద్ధి పధంలోకి తీసుకుపోయారని అద్వానీ ఇటీవల ప్రశంసలు కురిపించి మోడిని తక్కువ చేయడానికి ప్రయత్నించారు. కానీ బి.జె.పి నాయకత్వం ముందుకు వచ్చి అద్వానీ మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పి అద్వానీ మాటలకు వచ్చిన అర్ధాన్ని మరోవైపుకి తిప్పారు. అసలు మోడిని మించిన పాపులర్ లీడర్ బి.జె.పి లో లేనే లేదని తెగేసి చెప్పారు. చివరికి చౌహాన్ కూడా తానసలు బి.జె.పి లో నెంబర్ 3 కూడా కాదని అద్వానీ ప్రశంసను తిరస్కరించినంత పని చేశారు.

అయినా పట్టు వదలని అద్వానీ ఎన్నికల ప్రధార సారధ్యాన్ని మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి అప్పజెప్పాలని మరో బాణం రువ్వారు. ఆయన కాస్తా ‘నో, ధ్యాంక్స్’ చెప్పేసి పక్కకు తప్పుకున్నారు. ఇంతకీ గోవా సమావేశాల్లో ఏమన్నా నిర్ణయాలు జరుగుతాయో లేదో స్పష్టం కావడం లేదని పత్రికలు, ఛానెళ్లు వ్యాఖ్యానిస్తున్నాయి. అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కూడా చూద్దాం అన్నారే తప్ప మోడీకి సారధ్య బాధ్యతలు ఇస్తున్నదీ లేనిదీ చెప్పలేదు. అనేకమంది ముఖ్య నాయకులు లేరు గనుక నిర్ణయం వాయిదా పడినా పడవచ్చు. అదే జరిగితే అద్వానీకి కాస్తంత ఊరట లభించినట్లే. కానీ ఆ ఊరట ఎన్నాళ్లు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s