పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల ప్రకారమే శ్రీశాంత్ తదితరుల ఆటగాళ్లు నడుచుకున్నారని పోలీసులు సంచలన ఆరోపణ చేశారు.
అయితే మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ నియంత్రణ చట్టాన్ని ప్రయోగించింది ఢిల్లీ పోలీసులు కావడం విశేషం. ఒక రాష్ట్ర చట్టాన్ని మరొక రాష్ట్ర పోలీసులు ఎలా ప్రయోగిస్తారో అర్ధం కానీ విషయం. ఇప్పటివరకు అరెస్టయిన మొత్తం 26 నిందితులపైనా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ఎన్.డి.టి.వి ప్రకారం దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని నేరస్ధ సిండి’కేటు’ హవాలా మార్గాల ద్వారా ఐ.పి.ఎల్ లోని బెట్టింగు, స్పాట్ ఫిక్సింగ్ లను నియంత్రించినట్లు తమ వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీలోని ట్రయల్ కోర్టుకు పోలీసులు తెలిపారు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన కొంతమంది బడా బుకీలకు దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ లతో నేరుగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. ఆ మేరకు తమ పరిశోధనలో తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపారు. ది హిందూ పత్రిక ప్రకారం ఈ సాక్ష్యాలు ఫోను సంభాషణల రూపంలో ఉన్నాయి. ఇంకా ఇతర రూపాలలో కూడా పోలీసులకు సాక్ష్యాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది. పాకిస్ధాన్, దుబాయ్ లలోని గుర్తు తెలియని వ్యక్తుల వద్దకు ఇండియా నుండి ఫోన్ కాల్స్ వెళ్ళినట్లు తాము కనుగొన్నామని పోలీసులు తెలిపారు.
ఎన్.డి.టి.వి ప్రకారం ఆటగాళ్లకు ఈ అండర్ వరల్డ్ బాసులతో నేరుగా సంబంధాలు ఉన్నదీ లేనిదీ తాము పరిశోధిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ది హిందూ పత్రిక ప్రకారం బుకీలు ఆటగాళ్లను (కనీసం ఒక ఆటగాడిని) బెదిరించి లొంగదీసుకున్నారు. ఆటగాళ్లపై MCOCA చట్టాన్ని ప్రయోగించాలంటే మొదట వారికి అండర్ వరల్డ్ మాఫియాలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు నిరూపించాల్సి ఉంటుంది. 1994లో ప్రవేశపెట్టిన ఈ చట్టం నల్ల చట్టంగా పలువురి విమర్శలను ఎదుర్కొంది. MCOCA చట్టం ప్రయోగాన్ని కోర్టు ఇంకా ఆమోదించాల్సి ఉన్నదని ఎన్.డి.టి.వి తెలిపింది.
ఢిల్లీ కోర్టు శ్రీశాంత్ కస్టడీని మరో రెండు వారాల పాటు పొడిగించగా ముంబై కోర్టు గురునాధ్ మీయప్పన్, విందూ దారా సింగ్ లకు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు మరో ఆరుగురు బుకీలకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే వారిని దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది. ది హిందూ ప్రకారం బుకీలు దుబాయ్, కరాచీ, ఇంకా ఇతర పాకిస్ధాన్ నగరాలకు చేసిన ఫోన్ సంభాషణలను పోలీసులు ట్రాక్ చేసి రికార్డు చేశారు.
ఢిల్లీ పోలీసులు హైద్రాబాద్ కి చెందిన మరొక బుకీ కోసం వెతుకుతున్నారు. అతను దొరికితే గనుక స్పాట్ ఫిక్సింగ్ లో పాత్ర ఉన్న మరొక ఐ.పి.ఎల్ ఫ్రాంచైజీ లోని ఆటగాళ్లు ఎవరో పోలీసులకు సమాచారం దొరుకుందని తెలుస్తోంది. హైద్రాబాద్ నుండే అరెస్టయిన యాహ్యా ఖాన్ ఈ మేరకు సదరు హైద్రాబాద్ వ్యక్తి గురించిన సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది.
“అండర్ వరల్డ్ నుండి బుకీలు, ఆటగాళ్ల వరకూ ఒక సంఘటిత నేరస్ధ సిండికేటు పరస్పర అవగాహనతో పని చేస్తోంది. ఈ కేసులో బలవంత పెట్టడం, బెదిరించడం, ఒత్తిడి చేయడం తదితర చర్యలను ఆటగాళ్లపై ప్రయోగించారు. అరెస్టయినవారిలో ఒకరి (బుకి) పై మోపిన రెండు కేసులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది” అని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. “ముంబై వచ్చినపుడు మీ సంగతి చూస్తాం అని సదరు బుకి, ఆటగాడిని బెదిరించాడు” అని అధికారి తెలిపాడు.
MCOCA చట్టం ప్రకారం 10 సంవత్సరాల నుండి జీవిత కాలం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది.
నిజానికి ఐ.పి.ఎల్ పుట్టిందే డబ్బు కోసం. వందల కోట్లు చేతులు మారుతున్న ఐ.పి.ఎల్ గాంబ్లింగ్ లో అండర్ వరల్డ్ మాఫియా పాత్ర ఉండదనుకోవడమే అత్యాశ. కాకపోతే ముఠాల మధ్య కొట్లాట పరిష్కారం కానపుడు కొన్ని సార్లు పరస్పర హత్యలు, దాడుల ద్వారా పరిష్కారం చేసుకుంటే, మరికొన్ని సార్లు పోలీసులు, కోర్టుల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎప్పుడూ ఉండేదే. జనం ఆదరణ ఉన్నంతవరకు ఆటగాళ్లకు ఈ పాట్లూ తప్పవు, నేరగాళ్లకు ఫీట్లూ తప్పవు. ఇలాంటి నేర సామ్రాజ్యాలను ప్రోత్సహించే ఆటల జూడాన్ని ప్రోత్సహించడం అవసరమా అన్నది ఆలోచించుకోవలసింది ప్రజలే.
క్రికెట్ వెర్రిని’ తోశి రాజనిపించే ‘వేలం వెర్రి’
డబ్బు మూలుగుతున్న వారికిది ‘వెరీ మెర్రీ ‘
మిస్సవుతున్నాయి, ‘ పెద్ద పెద్ద క్యాచ్ లు’
మెస్సవుతున్నాయి, గొప్ప గొప్పమ్యాచ్ లు !
‘ బాట్టింగ్ తో బెట్టింగ్ ‘ ఇది నేటి క్రికెట్టు !
నిత్యం పడుతూన్నది , సామాన్యుడి వికెట్టు !
చాలా ఘాటు గా ఉందీ మసాలా కర్రీ !
పరిణామాలు కలిగిస్తున్నాయి, చాలా వర్రీ !