కూతురిని నాలుగేళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన తల్లిదండ్రులు?


Hemavathi 00

కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రధానంగా ఆడపిల్లదేనా? ‘వాడికేం మగాడు’ అనే సమాజం తల్లిదండ్రుల చేత తన కూతుళ్లపైన ఎంతటి ఘోరకలికయినా తెగించేట్లు చేస్తుందా?

ఆడపిల్లలకు ఇష్టమైనవారిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో కొందరు తల్లిదండ్రులు ఎంత క్రూరంగా వ్యవహరించగలరో బెంగుళూరులోని ఈ హృదయ విదారక సంఘటన చెబుతోంది. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు 31 యేళ్ళ (ఇప్పుడు 35) తమ కూతురిని నాలుగేళ్లుగా గదిలో బంధించి ఉంచిన తల్లి దండ్రులను ఎలా అర్ధం చేసుకోవాలి?

ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసుల ప్రకారం ఆమె పేరు హేమావతి. అత్యంత ఘోరమైన పరిస్ధితుల్లో ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉన్న ఆమెను మంగళవారం వారు కాపాడారు. సోమవారం అంతా పెద్ద పెద్ద అరుపులు ఆ ఇంటి నుండి వినిపించడంతో ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో ఆమె నాలుగేళ్ల నరకం నుండి బైటపడింది. తిండి, నిద్రలతో పాటు ప్రకృతి సహజ కార్యకలాపాలన్నీ ఆ గదిలోనే జరిగిపోయేలా బలవంతంగా నెట్టబడడంతో అశుభ్ర పరిస్ధితులలో, ఒంటి పైన సరైన బట్టలు కూడా లేకుండా అధికారులు ఆమెను చూడవలసి వచ్చింది.

హేమావతి బి.కామ్ గ్రాడ్యుయేట్. ఆమె మౌలిక జీవతావాసరాలను ఒకే గదిలో తీర్చుకోవలసి రావడంతో దారుణ పరిస్ధితుల మధ్య ఆమెను కాపాడామని అధికారులు చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు గదిలో బంధించడంతో ఆమె కనీసం నడవ లేకపోతున్నదని వైద్య అధికారులు తెలిపారు. కాళ్ళకు, చేతులకు గోళ్ళు పొడవుగా పెరిగి ఉన్నాయని పత్రికలు తెలిపాయి. ఆరోగ్యమంత్రి యు.టి.ఖాదర్ ఆమెను సందర్శించి బాధితురాలిని NIMHANS (National Inistitute of Mental Health and Neurosciences) లో చేర్చమని ఆదేశించారు.

“నాకు ఆకలిగా ఉంది. ఇప్పటికప్పుడు నేను ఏదీ మాట్లాడలేను” అని హేమావతి విలేఖరులతో చెప్పినట్లుగా ది హిందు తెలిపింది. హేమావతి తండ్రి రేణుకప్ప తన కూతురుకు ఐదేళ్ల క్రితం పెరాలసిస్ అటాక్ వచ్చిందని, అనంతరం మతి చలించిందని చెబుతున్నాడు. అప్పటినుండి ఆమె మంచాన పడిందని అతను చెబుతున్నాడు. బెంగుళూరు లోని రెండు ఆసుపత్రులలో ఆమెకు చికిత్స చేయించడానికి తాము ప్రయత్నించామని ఆయన చెప్పాడు.

అయితే పొరుగువారు చెబుతున్న విషయాలు భిన్నంగా ఉన్నాయి. హైమావతికి ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఒక ఆఫీసులో ఎకౌంటెంటుగా ఉద్యోగం కూడా చేసిందని వారు చెప్పారు. తన మనసుకు నచ్చిన ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నదని, ఆ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారని వారు చెప్పారు. ఆ కారణంతోనే ఆమెను హౌస్ అరెస్ట్ లో ఉంచారని చుట్టుపక్కలవాళ్లు ఆరోపించారని ది హిందు తెలిపింది.

డి.ఎన్.ఎ (డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్) పత్రిక ప్రకారం తన కూతురు వాతపు నెప్పులతో (rheumatic pains) బాధపడుతోందని కానీ మందులు తీసుకోవడం లేదని హేమావతి తండ్రి రేణుకప్ప తెలిపాడు. తాము తమ కూతురును అక్రమంగా బంధించారన్న వాదనను ఆయన తిరస్కరించాడు. హేమావతి ‘హౌస్ అరెస్టు’ లో లేదని, తన ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటోందని ఆమె సోదరుడు చెప్పాడు. చికిత్స తీసుకుంటోందని ఒకరు, తీసుకోవడం లేదని మరొకరు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

ఒక వేళ హేమావతి మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా గదిలో బంధించవలసిన అవసరం ఏమి వచ్చింది? ఎకౌంటెంటుగా పని చేసిన మహిళకు ఉన్నట్లుండి మతి ఎలా చలిస్తుంది? పెరాలసిస్ వచ్చినా వివిధ పరికరాల సహాయంతో బైట తిరుగుతున్నవారు, చేతనైనంతలో పనులు చేసుకుంటున్నవారు ఎంతమంది లేరు? పెరాలసిస్ వలన మతి చలించిందని చెప్పడం నమ్మశక్యంగా లేదు. రుమాటిక్ నొప్పులకు పూర్తి చికిత్స లేకపోయినా లేచి తిరిగేట్లు చేయగలిగిన మందులు ఉన్నాయి. అదీ కాక తనకు ఆకలిగా ఉందని చెప్పవలసిన పరిస్ధితిలో ఆమె ఎందుకు ఉన్నదీ తల్లిదండ్రులు, సోదరుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇరుగు పౌరుగువారు చెప్పిందే నిజం అయితే ఇది స్త్రీలపై సాగుతున్న వివక్షలో మరొక కోణం మాత్రమే.

8 thoughts on “కూతురిని నాలుగేళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన తల్లిదండ్రులు?

 1. ఇక్కడ స్రీల పట్ల ఎవరు వివక్షత చూపుతున్నారు? ఈ విషయంలో సమాజం ఆ అమ్మాయికి సహాయం చేయటానికి ముందుకొచ్చింది. ఆ అమ్మాయి కన్నతల్లి ఉండికూడా, అటువంటి పనులు చేస్తే అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నట్లు ఎలా గమ్ముగా ఉండింది? తల్లి పాత్ర పోషించే స్రీలు వారికి నచ్చని విషయం పిల్లలు చేస్తే ఎంత అణచివేతకు గురిచేస్తారో అనేదానికి ఈ వ్యవహారం ఒక మంచి ఉదాహరణ. నిజంగా ఆ అమ్మాయి అమ్మ అడ్డుకొని ఉంటే ఇంత అమానుషంగా ఆ అమ్మాయితో కుటుంబ సబ్యులు ప్రవర్తించగలరా!?

 2. మనోహర్ గారు, ఆ అమ్మాయి తల్లి గురించి ఏ పత్రికా రాయలేదు. ఆమె పరిస్ధితి గురించి సమాధానం చెప్పింది ఆమె తండ్రి, సోదరుడు మాత్రమే. అయినా మీకు ‘ఆ అమ్మాయి కన్నతల్లి ఉండికూడా’ అని రాయాలనిపించింది. ఎందుకంటారు?

  “తల్లి పాత్ర పోషించే స్రీలు వారికి నచ్చని విషయం పిల్లలు చేస్తే ఎంత అణచివేతకు గురిచేస్తారో అనేదానికి ఈ వ్యవహారం ఒక మంచి ఉదాహరణ.”

  ఈ ఘటనకు సంబంధించినంతవరకూ ఇలా అనడానికి నాకు ఏ ఆధారమూ కనపడలేదు. మీరు ఎలా అనగలిగారో మరి! హేమావతి పరిస్ధితిని సమర్ధించినవారిని వదిలిపెట్టి ఒక్క మాటా మాట్లాడని ఆమె తల్లిపై నిందమోపడానికి మీరు ఎందుకు ఆత్రపడుతున్నారు? స్త్రీలపై వివక్ష ఎంత లోతుగా ఉందో బహుశా మీ ఆత్రమే చెబుతోందనుకుంటాను.

  పైగా అమ్మ అడ్డుకుని ఉంటే… అంటున్నారు. అమ్మలు అడ్డుకుంటే కుటుంబాల్లో ఆగిపోయే పనులున్నాయా? అనేక కుటుంబాల్లో అసలు అమ్మల మాటలకు తమ తమ సొంత విషయాల్లోనే విలువలేని పరిస్ధితి. అలాంటిది కూతుళ్ల విషయంలో వారి మాటలు ఎవరు వింటారు? కుటుంబ సభ్యుల ప్రవర్తనకు వారిని బాధ్యులు చేయడం మాని అక్కడి అమ్మని బాధ్యులను చేయడం అసంగతం.

 3. అయినా, పిత్రుస్వామయ వ్యవస్థ పోత పోసిన మానసిక నమూనాలు 80 శాతం మంది మన దేశ స్త్రీలు. కుటుంబ గౌరవ రక్ష ణ లో వారిది కూడా, ప్రదాన పాత్ర కాకపొయినా, ముఖ్య పాత్రే.ఇది కాదనలేని నిజం.

 4. కారణాలు ఏమైనప్పటికీ , చాలాకాలం గా ,ఈ యువతి తన సొంత తల్లి దండ్రుల చేతా, సోదరుడి చేతా , తీవ్రమైన నిర్లక్ష్యానికీ , అశ్రద్ధ కూ, గురైన లక్షణాలు స్పష్టం గా కనబడుతున్నాయి ! బూజు పట్టిన ఆచార వ్యవహారాలూ , పట్టింపులూ హేమవతి జీవితాన్ని అంధకారం చేశాయి ! తగిన వైద్య సహాయం తో ఈ యువతి ఆరోగ్యం కుదుట పడుతుందని ఆశిద్దాం !
  కొస మెరుపు:కనీసం జీవచ్చవం లాగానైనా ” బ్రతకనిచ్చారు , ప్రాణాలు తీయకుండా ! అందుకు సంతోషించాలేమో మనమంతా !

 5. సుధాకర్ గారు, తిరుపాల్ గారి స్పందన తాత్వికంగా ఉంటే, మీ స్పందన ఎంతో వాస్తవికంగా ఉంది. వాస్తవాల నుండి పుట్టే తత్వం నేటి సమాజానికి అవసరం.

 6. “ఒక్క మాటా మాట్లాడని ఆమె తల్లిపై నిందమోపడానికి ..”

  ఆ తల్లి కూతురిని హింసిస్తుంటె ఒక్కమాట మాట్లాడలేదు గనుక. మీరు చెప్పే లాజిక్ ప్రకారం ఇంట్లో తల్లి మాటకు విలువలేదు అంటే, మరి అదే తల్లి అత్తగారు పాత్ర పోషిస్తూంటే, వరకట్ణం కేసులో కోడలు చిన్న ఫిర్యాదు చేస్తే ఆమేను, ఆడబిడ్డను అందరిపైన చర్య తీసుకొంటారు. అబ్బాయి తల్లులు అసాధ్యులు, అమ్మాయి తల్లులులైతే అమాయకులని అర్థం. ఆ విధంగా చూసినా స్రీలలో 50% మంది అబ్బాయిల తల్లులు అసాధ్యులన్నమాట. అమ్మలు అడ్డుకుంటే కుటుంబాల్లో ఆగిపోయే పనులున్నాయా? అని మీ ప్రశ్నకు సమాధానంగా 50% తల్లులు అడ్డుకోవచ్చు.

  ఇక్కడ వాదోప వాదాలకు తావివ్వకుండాలోచిస్తే, ఇది ఏ పల్లేటూరిలోనో జరిగిన సంఘటన కాదు. సిటిలో జరిగిన సంఘటన. బెంగళూరు లాంటి సిటిలో ఉన్న ఆ అమ్మాయి తల్లి మరీ అంత అమాయకురాలు అంటే నమ్మ బుద్ది కావటంలేదు.

 7. మనోహర్ గారు, మీరు చెప్పిన అర్ధాలు నాకు లేవు. మీ వ్యాఖ్యకు తిరుపాల్ గారి వ్యాఖ్య సమాధానంగా తీసుకోవచ్చు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, పితృస్వామిక వ్యవస్ధలో తల్లులకు, అత్తలకు, ఆడబిడ్డలకు అధికారం మగ వ్యక్తి వల్లనే వస్తుంది. పెళ్ళిళ్లలో మగ పెళ్లివారికీ, ఆడ పిల్ల తరపువారికీ మధ్య ఉండే అంతరం మీకు తెలియనిదా? సామాజిక వ్యవస్ధ మూలాల విషయంలో సిటీకి, పల్లెకు సారంలో లేదా పునాదిలో మార్పు ఉండదు. కనిపించే మార్పులు రూపానికి లేదా ఉపరితలానికి సంబంధించినవి.

  వాదోపవాదాలకు తావిద్దాం. అందులో తప్పేమీ లేదు. అవి చర్చకు మరొక రూపమే కదా. కాకపోతే అవి వ్యక్తిగత విద్వేషం స్ధాయికి దిగకూడదు. ఆ పరిమితుల్లో వాదోపవాదాలు అవసరమే అని నా అభిప్రాయం.

 8. “వాస్తవాల నుండి పుట్టే తత్వం నేటి సమాజానికి అవసరం”‘ బాగుంది,సహజంగ వచ్చే బావొద్యేగమే నిజమైనది. థాంక్స్‌.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s