సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే


చీఫ్ ఇన్ఫర్మెషన్ కమిషనర్

చీఫ్ ఇన్ఫర్మెషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్, బి.జె.పి, సి.పి.ఐ(ఎం), సి.పి.ఐ, ఎన్.సి.పి, బి.ఎస్.పి పార్టీలు ఆర్.టి.ఐ హక్కు కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించిన కేసులను విచారించిన సి.ఐ.సి ఫుల్ బెంచి ఈ తీర్పు ప్రకటించడం విశేషం. తీర్పు సందర్భంగా కమిషన్ పేర్కొన్న వివిధ అంశాలు

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఎం.ఎల్.శర్మ మరియు అన్నపూర్ణ దీక్షిత్ లతో కూడిన సి.ఐ.సి ఫుల్ బెంచి, ఆర్.టి.ఐ నిర్దేశించిన విధి, విధానాల పరిధిలోకి రాజకీయ పార్టీలు వస్తాయని తేల్చి చెప్పింది. “ఈ పార్టీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు ఈ మేరకు సి.పి.ఐ.ఓ మరియు అప్పిలేట్ ఆధారిటీలను తమ తమ ప్రధాన కార్యాలయాల వద్ద ఆరు వారాల లోపల నియమించాల్సిందిగా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నాము. ఆ విధంగా నియమించబడిన సి.పి.ఐ.ఓలు, ఈ ఆదేశంలో పొందుపరచబడిన ఆర్.టి.ఐ దరఖాస్తులకు తగురీతిలో నాలుగు వారాల లోపల స్పందించాలి.” అని సి.ఐ.సి తీర్పు పేర్కొంది. ఆర్.టి.ఐ చట్టం నిర్దేశించిన ప్రకారం తప్పనిసరిగా వెల్లడించవలసిన సమాచారాన్ని తమ తమ వెబ్ సైట్లలో ఈ రాజకీయ పార్టీలు ఉంచాలని కూడా సి.సి.సి ఆదేశించింది.

ఆర్.టి.ఐ కార్యకర్తలు సుభాష్ అగర్వాల్, అనీల్ బైర్వాల్ లు పైన ఉదహరించిన రాజకీయ పార్టీల నుండి తమ ఆర్ధిక వనరుల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేశారు. వీరు ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే స్వచ్ఛంద సంస్ధకు చెందినవారు. వివిధ వ్యక్తులు, సంస్ధలు ఈ ఆరు రాజకీయ పార్టీలకు స్వచ్ఛందంగా ఇచ్చిన ఆర్ధిక సహాయాల వివరాలను ఇవ్వాల్సిందిగా వారు తమ దరఖాస్తులలో కోరారు. దాతల పేర్లు, చిరునామాలతో పాటు ఇతర సమాచారం ఇవ్వాల్సిందిగా వారు కోరారు. అయితే ఈ పార్టీలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించాయి. తాము ఆర్.టి.ఐ చట్టం పరిధిలోకి రామని కనుక కోరిన సమాచారం ఇవ్వమని చెప్పేసాయి. పార్టీల వాదనలను సి.ఐ.సి నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ, అవి ఆర్.టి.ఐ చట్టం పరిధిలోకి ఎందుకు వస్తాయో సోదాహరణంగా వివరించింది.

 

ఆర్.టి.ఐ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

ఆర్.టి.ఐ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

ది హిందూ పత్రిక ప్రకారం హియరింగ్ సందర్భంగా ఆర్.టి.ఐ కార్యకర్తలు అగర్వాలు, బైర్వాల్ లు మూడు ప్రధాన వాదనలను లేవనెత్తారు. 1. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరోక్ష పద్ధతిలో రాజకీయ పార్టీలకు ఆర్ధిక సహాయం ఇవ్వడం, 2. ప్రజా విధుల నిర్వహణ, 3. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈ సంస్ధలకు అప్పగించబడిన హక్కులు, బాధ్యతలు.

“ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలలో ఈ రాజకీయ పార్టీల వినియోగం నిమిత్తం విశాలమైన భూములను అత్యంత తక్కువ ధరలకు అందుబాటులో ఉంచారు. దానితోపాటు అత్యంత చౌక ధరలకు, ప్రభుత్వ భవనాలను ఈ రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచారు. తద్వారా ఆర్ధిక లబ్దిని వాటికి సమకూర్చారు” అని బెంచి తన తీర్పులో పేర్కొంది. పార్టీలకు ఇచ్చిన ఆదాయపన్ను రాయితీలు, ఎన్నికలప్పుడు ఆల్ ఇండియా రేడియో, దూర్ దర్శన్ లు కేటాయించిన ఉచిత సమయం కూడా పార్టీలకు ప్రభుత్వం నుండి పరోక్షంగా అందిన ఆర్ధిక లబ్ది కిందకి వస్తుందని తీర్పు స్పష్టం చేసింది.

“(కాబట్టి) ఐ.ఎన్.సి/ఏ.ఐ.సి.సి, బి.జె.పి, సి.పి.ఐ(ఎం), సి.పి.ఐ, ఎన్.సి.పి మరియు బి.సి.పి పార్టీలు పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్ధిక లబ్ది పొందాయని చెప్పడానికీ, తద్వారా ఆర్.టి.ఐ చట్టం సెక్షన్ 2(h) కింద అవి పబ్లిక్ ఆధారిటీలుగా పరిగణించబడతాయని చెప్పడానికీ మాకు ఎలాంటి సందేహమూ లేదు” అని సి.ఐ.సి ఫుల్ బెంచి తీర్పు పేర్కొంది.

బైర్వాల్ లేవనెత్తిన పబ్లిక్ డ్యూటీ (ప్రజా విధులు) వాదనను కూడా బెంచి సమర్ధించింది. “రాజకీయ పార్టీలు, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సాధ్యమైన అన్ని మార్గాలలోనూ పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అవి నిరంతరాయంగా ప్రజా విధులను నిర్వర్తించడంలో మునిగి ఉంటాయి. కాబట్టి, వారు ప్రజలకు జవాబుదారీగా ఉండడం చాలా అవసరం” అని సి.ఐ.సి తేల్చి చెప్పింది.

రాజకీయ పార్టీలు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆధునిక రాజ్యాంగ ప్రభుత్వంగా వ్యవహరిస్తాయని సి.ఐ.సి పేర్కొంది. “రాజకీయ పార్టీలు తమకే ప్రత్యేకమైన పద్ధతిలో ఆధునిక రాజ్యాంగ ప్రభుత్వ సంస్ధలుగా వ్యవహరిస్తాయి. ఇవి అవశ్యముగా ప్రభుత్వేతర సంస్ధలైన రాజకీయ సంస్ధలు. ప్రభుత్వేతర సంస్ధలే అయినప్పటికీ, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, ప్రభుత్వ అధికారాన్ని చేతిలో ఉంచుకోవడమో లేక ప్రభావితం చేయడమో లాంటి విధులను నిర్వహిస్తాయి” అని సి.ఐ.సి స్పష్టం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను నిర్వహించేది రాజకీయ పార్టీలే గనుక సి.ఐ.సి పరిశీలన ఎంత సరైనదో అర్ధం చేసుకోవచ్చు.

ఆర్.టి.ఐ చట్టం కోసం పోరాడిన పార్టీలు, ఆ చట్టాన్ని తామే తెచ్చామని చెప్పుకునే పార్టీలు తమ వరకు వచ్చేసరికి ఆ చట్టం తమకు వర్తించదు అని చెప్పడం పట్ల సి.ఐ.సి చురకకు అంటించింది. “ప్రభుత్వ సంస్ధలన్నింటికీ పారదర్శకత మంచిది అని చెబుతూ, రాజకీయ పార్టీలకు మాత్రం మంచిది కాదని చెప్పడం అసంగతం. వాస్తవానికి రాజ్యం యొక్క కీలకమైన సంస్ధలను నియంత్రించేది రాజకీయ పార్టీలే” అని సి.ఐ.సి కుండబద్దలు కొట్టింది.

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చేసే ఖర్చులకు డబ్బు ఎక్కడి నుండి వస్తున్నదో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు ఉన్నదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సి.ఐ.సి ఉటంకించింది. ఈ న్యాయమీమాంస భావనలు రాజకీయ పార్టీల విధి నిర్వహణలోనూ, వాటి నిధుల వ్యవహారంలోనూ అత్యున్నతమైన ప్రగతిశీలమైన పారదర్శకతను ప్రేరేపిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ అనవసరం అని సి.ఐ.సి తీర్పు పేర్కొంది.

“రాజకీయ పార్టీలు నిర్వర్తించే ప్రజా విధుల స్వభావం రీత్యా… ఈ సందర్భంలోని (ఆరు) రాజకీయ పార్టీలు ఆర్.టి.ఐ చట్టం సెక్షన్ 2(h) ప్రకారం ప్రజాధికార సంస్ధలని ముక్తాయించడమైనది” అని సి.ఐ.సి స్పష్టం చేసింది.

ఇప్పుడిక రాజకీయ పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే. అయితే యధావిధిగా రాజకీయ పార్టీలు రూపొందించే చట్టాలకు అనేకానేక రంధ్రాలు ఉన్నట్లే ఆర్.టి.ఐ చట్టానికి ఉన్న రంధ్రాల నుండి ఆయా పార్టీలు తేలికగా జారిపోగలవని వేరే చెప్పనవసరం లేదు.

3 thoughts on “సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

  1. మనకు తెరముందు కనిపిచేది టెక్నికల్ ముఖం అయితే తెరవెనుక కనిపించేది ప్రాక్టికల్ ముఖం. దాన్ని చూడటనికి ఒక ప్రత్యేక అద్దం కావలి. ఆ అద్దం లేకపోతే అబ్బా మనది కదా ప్రజాస్వమ్యం! అనిపిoచక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s