కంచి దారిలో ఇండియా జి.డి.పి వృద్ధి కధ!


India GDP

దేశ వనరులన్నీ తవ్వి తీసి దేశ ప్రజలకు వినియోగపెట్టడం మాని విదేశాలకు ఎగుమతి చేయడమే అభివృద్ధిగా చెప్పుకున్న భారత పాలకుల అభివృద్ధి కధ కంచి దారి పట్టినట్లు కనిపిస్తోంది. 2012-13 సంవత్సరానికి గాను దశాబ్ద కాలంలోనే అత్యంత తక్కువ జి.డి.పి వృద్ధి రేటును భారత ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసింది.

మాన్యుఫాక్చరింగ్, సేవలు, వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం తదితర ముఖ్యమైన అన్ని రంగాలలోనూ వృద్ధి రేటు కుంటుబడడంతో గత ఆర్ధిక సంవత్సరం కేవలం 4.8 శాతం మాత్రమే జి.డి.పి వృద్ధి చెందింది. ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఆర్ధిక మంత్రి చిదంబరం ఎంతో ఇష్టంగా చెప్పుకునే 8 లేదా 9 శాతం వృద్ధి రేటుకి ఎంతో దూరంలో ఉండడం గమనార్హం.

2011-12 సంవత్సరంలో 6.2 శాతం ఇండియా స్ధూల జాతీయోత్పత్తి (జి.డి.పి) వృద్ధి చెందింది. అప్పుడే వివిధ జాతీయ, అంతర్జాతీయ పరిశీలకులు పెదవి విరిచారు. అలాంటిది 2012-13 లో కనీసం 5 శాతం కూడా లేకపోవడం పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. జనవరి – మార్చి (2013) క్వార్టర్ కి గాను జి.డి.పి వృద్ధి రేటు 5.1 శాతం మాత్రమే. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో మొదటి, రెండవ, మూడవ క్వార్టర్లలో జి.డి.పి వృద్ధి రేటు వరుసగా 5.4, 5.2, 4.7 శాతాల మేరకు జి.డి.పి వృద్ధి చెందిందని సి.ఎస్.ఓ (సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్) తెలిపింది.

ప్రధానంగా వ్యవసాయం, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాలు భారత అభివృద్ధి కధను పట్టి కుదిపేస్తున్నాయి. మైనింగ్, క్వారీయింగ్ రంగం నాల్గవ క్వార్టర్ జి.డి.పి 2011-12లో 5.2 శాతం వృద్ధి చెందితే 2012-13 లో వృద్ధి చెందకపోగా 3.1 శాతం మేర కుచించుకుపోయింది. అనగా వృద్ధి శాతం -3.1%. వార్షిక పెరుగుదలను గమనిస్తే ఈ రంగం 2011-12 ఆర్ధిక సంవత్సరంలో -0.6 శాతం వృద్ధి చెందగా, ఈ సంవత్సరం కూడా -0.6 శాతం వృద్ధిని (కుచింపు) నమోదు చేసింది.

వ్యవసాయ రంగం జి.డి.పి చివరి క్వార్టర్ లో 2011-12లో 2 % వృద్ధి చెందగా 2012-13లో అది 1.4 శాతానికి పడిపోయింది. వార్షిక వృద్ధి పరంగా చూస్తే 2011-12లో 3.6% వృద్ధి చెందగా 2012-13లో అది 1.9 శాతానికి తగ్గిపోయింది.

విద్యుత్, నీరు, గ్యాస్ ల సరఫరా రంగం తీసుకుంటే చివరి క్వార్టర్ లో 2011-12కి గాను 3.5% వృద్ధి చెందగా 2012-13 చివరి క్వార్టర్ కి గాను 2.8% కి తగ్గిపోయింది. వార్షిక వృద్ధి పరంగా తీసుకుంటే 2011-12లో 6.5 శాతం వృద్ధి చెందగా 2012-13లో 4.2%కి తగ్గిపోయింది.

నిర్మాణ రంగం: చివరి క్వార్టర్ లో 2011-12 కి గాను 5.1% నమోదు కాగా 2012-13లో 4.4 శాతానికి తగ్గిపోగా వార్షిక వృద్ధి 2011-12 లో 5.6% నుండి 2012-13లో 4.3%కి తగ్గిపోయింది.

సేవల రంగం గురించి భారత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. ఈ గొప్పంతా ప్రధానంగా సాఫ్ట్ వేర్ రంగానిదే. భారత సాఫ్ట్ వేర్ ఎగుమతులకు అమెరికా, యూరప్ లు ప్రధాన టార్గెట్. తక్కువ వేతనాలు ఇస్తారు కనుక ఇది సాధ్యం అయింది. ఈ రంగం వృద్ధి కూడా పడిపోయింది. చివరి క్వార్టర్ లో 2011-12కి గాను 11.3% జి.డి.పి వృద్ధి నమోదు కాగా అది 2012-13లో 9.1 శాతానికి పడిపోయింది. వార్షిక వృద్ధి రేటు 2011-12లో 11.7% ఉండగా 2012-13లో 8.6 శాతానికి పడిపోయింది.

ఈ విధంగా సకల రంగాలలో భారత దేశ ఉత్పత్తి పడిపోయింది. ఇంతా చేసి ద్రవ్యోల్బణం ఈ కాలంలో వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంది. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే భారత జి.డి.పి అసలు వృద్ధి రేటు నమోదు చేసిందా అని అనుమానం కలుగుతోంది. మన్మోహన్, అహ్లూవాలియా, చిదంబరం, రంగరాజన్ లాంటి వారంతా వృద్ధి రేటు గొప్పగా ఉంటుందని హామీలు గుప్పించినవారే. 2012-13 సంవత్సరం వృద్ధి రేటు 7 శాతం పైనే ఉంటుందని ఒకరు అంటే కాదు 8 శాతం వరకు ఉంటుందని మరొకరు నొక్కి చెప్పారు. అధమం 6 శాతం ఉంటుందని అన్న పెద్దలు అనేకులు. ఇవన్నీ పోగా వాస్తవం 4.8 శాతం వద్ద తేలింది. దీనికి సంజాయిషీ ఇచ్చినవారు లేరు.

భారత పాలకులు ప్రజలకు ఎప్పటికి నిజాలు చెబుతారు?

2 thoughts on “కంచి దారిలో ఇండియా జి.డి.పి వృద్ధి కధ!

  1. ప్రజలకు జవాబు చెప్ప వలసిన అవసరం భారత పాలకులు ఎమీ లేదు. ప్రజలు ఓటేస్తే వారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మరీ రెండోసారి కూడా గెలిపించి, వారి ఆత్మ విశ్వాసాన్ని ఎంతో పెంచారు. వాళ్ళకి అలవాటైంది చేశారు. కాంగ్రెస్ పార్టి ఏమైనా బిజెపి పార్టినా ? దేశం, జాతీయత మొదలైన వాటి గురించి పట్టిచుకోవటం కాంగ్రెస్ పార్టి అజెండాలోనే ఎప్పటినుంచో లేదు. దళితులు, ముస్లిం ఓట్లను కాపాడుకొంట్టూ, పేద వర్గాలకు ఉచిత పథకాలు ఇవ్వచూపి, ధనవంతులకి పూర్తి స్థాయి వత్తాసు పలుకుతూ, మీడీయా ద్వారా మధ్యతరగతి వారికి ఆశలు కల్పించటమే కాంగ్రెస్ పాలన విజయ రహస్యం. ఈ ఫార్ములను మీడీయా ద్వారా అమలు జరపటం లో అదెంతో విజయాన్ని సాధించింది. పరీపాలించిన రోజులు పాలించారు. ప్రజలు వద్దంటే ఇంటికి పోతారు. ఇప్పుడు ఆ పార్టిలో నాయకులు అంట్టు ఎవరు ఉన్నారు? ఎవరు లేకనే ప్రజలకు ,పార్టికి నచ్చినా నచ్చకపోయినా షిండే ను మంత్రి గా కొనసాగిస్తున్నారు. అలాగని మిగతా మంత్రుల పర్ఫార్మెన్స్ ఎమి బాగుందని? అటుతిప్పి ఇటు తిప్పి చిదంబరం కు మళ్ళీ మళ్ళీ ఆర్ధిక శాఖకు కేటాయిస్తారు. ఆయన తప్పించి ఆ శాఖలో పనిచేయటనికి ఆపార్టిలో ఉన్న వారు ఎవరు? ఉన్న ఒక్క ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసి కూచొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టిలో నాయకత్వ సంక్షోభం/శూన్యత చాలాఎక్కువగా ఉంది. పెరిగిన మధ్యతరగతి ప్రజల అంచనాలను అందుకొనే వారు, ఆపార్టిలో ఎవ్వరు లేరు. ఓడిస్తే, సంపాదించుకొన్న డబ్బులను ఖర్చు చేసుకొంట్టూ ఆదేశం ఈ దేశం తిరుగుతూ, హాయిగా ఇంటికి వెళ్ళి కూచొంటారు.

  2. ప్రపంచ వ్యాప్తంగా, ప్రజాస్వామ్య దేశాలలో అందరు పాలించినట్లే మేము పాలించాం. మీరు పిలిచి అధికారమిచ్చి మమ్మల్ని పీఠం పైన కూఛొని బెట్టి, మళ్ళి మమ్మల్నే ప్రశ్నిస్తారా? మేము చేసేది చేసాం, మీకు చేతనైంది చేసుకొండి అని అంట్టారు. ఒకవేళ మీరు వాళ్లను ఓడిస్తే కొంతకాలం విశ్రాంతి దొరికిందని ఆనందిస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s