ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి


ఒఇసిడి సభ్య దేశాలు (క్లిక్ చేసి పెద్ద బొమ్మ చూడండి)

ఒఇసిడి సభ్య దేశాలు (క్లిక్ చేసి పెద్ద బొమ్మ చూడండి)

ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్

ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని సంస్ధ తెలిపింది.

17 ఐరోపా దేశాల యూరో జోన్ జి.డి.పి వృద్ధి రేటు అంచనాను ఒ.ఇ.సి.డి మరోసారి తగ్గించింది. ఉమ్మడి కరెన్సీని వినియోగిస్తున్న యూరోపియన్ దేశాలను యూరో జోన్ గా చెబుతారు. ఈ దేశాల సంయుక్త జి.డి.పి గత ఆరు క్వార్టర్లుగా పెరగడానికి బదులు తగ్గిపోతోంది. అనగా యూరోజోన్ ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లో ఉందని అర్ధం. (రెండు క్వార్టర్లు వరుసగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి రేటు నమోదు ఐతే దానిని సాంకేతికంగా రిసెషన్ అంటారు.)

ఈ సంవత్సరం యూరో జోన్ జి.డి.పి 0.6 శాతం కుచించుకుపోతుందని ఒ.ఇ.సి.డి తాజాగా అంచనా వేసింది. 2012లో -0.5 శాతం జి.డి.పి వృద్ధిని యూరోజోన్ నమోదు చేసింది. 2013కి గాను ఆర్ధిక వృద్ధి 0.1 శాతం ఉంటుందని ఆరు నెలల క్రితం అంచనా వేసిన ఒ.ఇ.సి.డి, 1 శాతం వృద్ధి చెందుతుందని సంవత్సరం క్రితం అంచనా వేసింది. యూరోజోన్ ఆర్ధిక వ్యవస్ధ పనితనం పైన ఒ.ఇ.సి.డికి సైతం నానాటికీ నమ్మకం సన్నగిల్లుతున్న పరిస్ధితిని ఇది సూచిస్తోంది.

“ఇంకా బలహీనంగా ఉన్న బ్యాంకుల పెట్టుబడులు, ప్రభుత్వ రుణాల అవసరాలు, (బెయిలౌట్ల నుండి) బైటికి వచ్చే మార్గంలో ఉన్న ప్రమాదాలు… ఇవన్నీ కలిసి ఐరోపా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండలుగా మారాయి” అని ఒ.ఇ.సి.డి తెలిపింది. ఋణ పీడిత యూరోజోన్ దేశాలకు ఇ.సి.బి (యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్), ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు (ఈ మూడింటిని ట్రొయికా అంటారు) సంయుక్తంగా బెయిలౌట్లు ఇస్తున్నాయి. మార్కెట్ కంటే తక్కువ వడ్డీకి, అనేక విషమ షరతులను జత చేసి, ట్రొయికా ఇస్తున్న రుణాలే బెయిలౌట్లు. బెయిలౌట్ల కోసం విధించిన ఒక్కో షరతును విరమించుకోవడాన్ని ‘exit strategy’ అంటున్నారు. ఇది కూడా ప్రమాదమే అని ఒ.ఇ.సి.డి అంటోంది.

బెయిలౌట్లు అంటే కాస్త అటు ఇటూగా ఒకప్పటి ‘షాక్ ధెరపీ’ తో సమానం. ఈ షాక్ ధెరపీ బహుళజాతి కంపెనీలకు (డాక్టర్లు) కాసులు కురిపిస్తే, ప్రజలకు (రోగులు) షాక్ ఇస్తుంది. అంటే అతి తక్కువ కాలంలో ఉద్యోగాలు ఊడబీకి, సదుపాయాలు రద్దు చేసి, ప్రజలపై ఖర్చు తగ్గించి, అదంతా కంపెనీలకు తరలిస్తారు. ఇది జనానికి ఎలాగూ షాకే. విచిత్రం ఏమిటంటే ప్రజల ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడాలంటే వారి ఆర్ధిక పరిస్ధితిని ఒక్కసారిగా క్రుంగదీయాలని ఈ షాక్ సిద్ధాంతం (ఆచరణలో) చెబుతుంది. ‘నువ్వు బతకాలంటే నువ్వు చావాలి’ అనడం అన్నమాట!

లిబియా ప్రజలకు అమెరికా, ఐరోపాలు అదే చెప్పాయి. మీ దేశాన్ని ‘రక్షిచాలంటే మీరు చావాలి’ అని లిబియా ప్రజలకు చెప్పారు, లైబీరియా ప్రజలకు చెప్పారు. మాలి ప్రజలకు చెబుతున్నారు. సిరియా ప్రజలకు చెబుతున్నారు. గత మూడేళ్లుగా యూరో జోన్ ప్రజలకు కూడా చెబుతున్నారు. మరి బతికేదెవరు? ఇంకెవరు, కంపెనీలు. అనగా సూపర్ ధనికులు. ఒక దేశం బతకడం అంటే ఈ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు రావడం అని అర్ధం.

యూరోజోన్ జాతకం పట్ల పెదవి విరిచిన ఒ.ఇ.సి.డి అమెరికా జాతకం చూసి కళ్ళు మెరిపించింది. మహర్జాతకం అని ప్రకటించింది. 2013లో 1.9 శాతం వృద్ధిని అమెరికా నమోదు చేస్తుందని, 2014లో ఇంకా పెరిగి 2.8 శాతం నమోదు చేస్తుందని తెలిపింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ విషయానికి వస్తే 2013లో 3.1 శాతం వృద్ధి నమోదు చేస్తుందని 2014 లో 4 శాతం వృద్ధి అవుతుందని అంచనా కట్టింది.

నిజానికి అమెరికా వృద్ధి అంతా కృత్రిమం. ఆర్ధిక సంక్షోభం తర్వాత ఒక దేశం రికవరీ అయిందని చెబితే ఊరికే జి.డి.పి పెరిగితే సరిపోదు. దానితో పాటు నిరుద్యోగం తగ్గిపోవాలి. అంటే ఉపాధి పెరగాలి. కానీ అమెరికాలో ఉపాధి పెరక్కపోగా తగ్గిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఇక ప్రయత్నించడం మానేస్తే నిరుద్యోగులుగా నమోదు అవుతున్న వారి సంఖ్య అక్కడ తగ్గుతోంది. దానినే నిరుద్యోగం తగ్గుదలగా చెప్పుకుంటోంది అమెరికా. అంతే కాక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును అత్యంత తక్కువగా 0.25 శాతం వద్ద ఉంచి నెలకి 80 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూ.ఇ) ని కంపెనీలకు అందిస్తోంది. అదంతా స్టాక్ మార్కెట్లలోకి వెళ్ళి సూచిలను పైకి నేడుతోంది గానీ ఉత్పత్తిలోకి వెళ్తున్నది తక్కువ. అదే అమెరికా సాధిస్తున్న అభివృద్ధి. ఇది కృత్రిమం. వడ్డీ రేటు సాధారణ స్ధాయికి పెంచి క్యూ.ఇ ఆపేస్తే అప్పుడు తెలుస్తుంది అమెరికా అభివృద్ధి ఏమిటో.

యూరోజోన్ దేశాల్లో మొత్తం మీద 12.1 శాతం నిరుద్యోగం ఉన్నది. ఇది ఇంకా పెరుగుతుందని ఒ.ఇ.సి.డి తెలిపింది. ఇంకా ఇంకా పెరిగి 2014 లో మాత్రమే అత్యంత ఎక్కువ స్ధాయిలో స్ధిరత్వం పొందుతుందని తెలిపింది. అంటే ఇప్పుడప్పుడే జనాలకి ఉద్యోగాలు ఇచ్చేదీ లేదని కంపెనీలు, ప్రభుత్వం తేల్చి చెబుతున్నట్లే.

యూరోజోన్ లో గ్రీసు, స్పెయిన్ ల ప్రజలు అత్యంత కఠినమైన విధానాలు ఎదుర్కొంటున్నారు. ఇటలీ, బ్రిటన్, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల ప్రజలది కూడా కాస్త అటు ఇటూగా అదే పరిస్ధితి. స్పెయిన్ నిరుద్యోగం వచ్చే యేడు 28 శాతంకి పెరుగుతుందని, గ్రీసు కి 28.4 శాతం ఉంటుందని ఒ.ఇ.సి.డి తెలిపింది. ఈ దేశాల్లో అమలు చేస్తున్న పొదుపు విధానాలు ప్రజల పాలిట శాపంగా పరిణమించాయి.

ప్రపంచ దేశాలకు ఐరోపాయే అతి పెద్ద ఎగుమతి మార్కెట్. అందువలన ఇక్కడ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంటే ఈ దేశాలకు చేసే ఎగుమతులపైన ఆధారపడ్డ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కూడా ప్రభావితం అవుతాయి. ఆ విధంగా ఇండియా కూడా బాగా ప్రభావితం అవుతోంది. అమెరికా కూడా అంతే. చాలా దేశాలకు అమెరికా ఎగుమతి మార్కెట్. కానీ పొదుపు విధానాల వలన అక్కడి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం వలన చైనా, ఇండియా లాంటి దేశాల జి.డి.పి తగ్గిపోతోంది. 10 శాతం వరకు వృద్ధి నమోదు చేసిన చైనా ఇప్పుడు 8 శాతం, అంతకంటే తక్కువ నమోదు చేస్తోంది. ఇండియా నాలుగేళ్ల క్రితం 9 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇప్పుడు 5 చిల్లర. అందుకే ఐరోపా ఆర్ధిక వ్యవస్ధ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పు అంటున్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s