భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై కోర్టు ఆదేశించినా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోడానికి నిరాకరించినా ప్రధాన మంత్రి కార్యాలయం తిరిగి కోర్టుకు అప్పీలుకు వెళ్లిందే తప్ప కనీస వేతనాలు చెల్లించడానికి సుముఖంగా లేదు.
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు ప్రధాన మంత్రి ఎవరనే విషయం పెద్ద సమస్య అయింది. సోనియా గాంధీ ప్రధాని మంత్రి కావడానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష బి.జె.పి తో పాటు సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్ధితి. ఆ నేపధ్యంలో నేషనల్ అడ్వైజరి కౌన్సిల్ (ఎన్.ఎ.సి) ఉనికిలోకి వచ్చింది. ప్రధాని పదవిలో మన్మోహన్ సింగ్ ను కూర్చుండబెట్టి ఎన్.ఎ.సి చీఫ్ గా సోనియా గాంధీ నియమితులయ్యారు. తద్వారా ప్రభుత్వంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పాటు చేశారని, నిజానికి ప్రధానిపై పెత్తనానికే ఎన్.ఎ.సి ని సృష్టించారని విమర్శలు వచ్చాయి. అది వేరే కధ.
ఎన్.ఎ.సి లో వివిధ సామాజిక కార్యకర్తలను సభ్యులుగా తీసుకున్నారు. వారిలో అరుణా రాయ్ ఒకరు. ఆమె పదవీ కాలం మే 31తో ముగియనుంది. ఆ తర్వాత తన పదవీ కాలాన్ని పొడిగించవద్దని అరుణా రాయ్ సోనియా గాంధీకి లేఖ రాయగా దానిని సోనియా ఆమోదించారని పత్రికలు తెలిపాయి. ఈ సందర్భంగా అరుణా రాయ్ ఉపాధి హామీ పధకంలో కనీస వేతనాల అమలు పట్ల ప్రధాన మంత్రి కార్యాలయం వైఖరిని తూర్పారబట్టారు.
“మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పని చేస్తున్న కూలీలకు కనీసం వేతనం చెల్లించాలన్న ఎన్.ఎ.సి సిఫారసును ప్రధాన మంత్రి నిరాకరించడం తీవ్రమైన దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను. ఉపాధి హామీ పధకం కూలీలకు కనీస వేతనాలు చెల్లించాలన్న కర్ణాటక హై కోర్టు తీర్పును ఆమోదించి అమలు చేయడానికి బదులుగా తీర్పుపై అప్పీలుకు వెళ్లడానికే ఆయన మొగ్గు చూపారు.” అని అరుణా రాయ్ వ్యాఖ్యానించారు. (ది హిందు)
“కర్ణాటక హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించిన తర్వాత కూడా కనీస వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించడం మరింత బాధాకరం. ఒక పక్క ఇంక్లూజివ్ గ్రోత్ కి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ ఇండియా లాంటి దేశాలు కనీస వేతనాల చెల్లింపులను నిరాకరించడాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అయితే కనీస వేతనాల చట్టాన్ని గౌరవించి తీరాలని ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి ఎన్.ఎ.సి బైటి నుండి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను గుర్తించాను” అని అరుణా రాయ్ పేర్కొన్నారు.
అరుణా రాయ్ తన పదవీ కాలాన్ని పొడిగించవద్దని కోరడానికి గల కారణాన్ని ఆమె పరోక్షంగా చెబుతున్నారని భావించవచ్చు. ఎన్.ఎ.సి లాంటి అత్యున్నత అధికార సంస్ధలో సభ్యురాలిగా ఉండి కూడా ప్రభుత్వం చేసిన కనీస వేతనాల చట్టాన్నే ప్రభుత్వం చేత అమలు చేయించడంలో తాను విఫలం అయ్యాయని ఆమె గుర్తించారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలను ప్రభుత్వాలే అమలు చేయకపోగా, కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా అమలు చేయకపోతే ఈ దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం అని ఎలా భావించగలం? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు కాదని, ప్రజాస్వామ్యం అంటే ప్రజల బాగోగులు ఎల్లవేళలా నెరవేరడమేనని వాస్తవంలో అది జరగకపోగా ప్రజలపై సాగుతున్న శ్రమ దోపిడీకి ప్రభుత్వమే కాపలాదారుగా వ్యవహరిస్తునదని అరుణా రాయ్ మాటల ద్వారా స్పష్టం అవుతోంది.
ఇంకా ఎవరికైనా అనుమానమా?
అరుణారాయ్ కి ఇన్ని ఏండ్ల తరువాత తెలిసింది మన్మోహన్ ఎలాంటివాడో. ఆమె మాటలను మనం విశ్వసించాలా? ఇందులో ఆమె స్వార్థం ఏదో ఉంటుంది.
అదే కదా! అది కూడా పదవీ కాలం ముగిశాక?