సిరియాపై ఆయుధ నిషేధం ఎత్తివేసిన ఐరోపా


బ్రసెల్స్ లో ఇ.యు సమావేశం అనంతరం విలియం హేగ్ (బ్రిటన్ విదేశీ మంత్రి) తో డిడియర్ రేండర్స్ (బెల్జియం విదేశీ మంత్రి)

బ్రసెల్స్ లో ఇ.యు సమావేశం అనంతరం విలియం హేగ్ (బ్రిటన్ విదేశీ మంత్రి) తో డిడియర్ రేండర్స్ (బెల్జియం విదేశీ మంత్రి)

తాను చెప్పిన నీతిని తానే అడ్డంగా ఉల్లంఘించింది యూరోపియన్ యూనియన్. రెండేళ్ల క్రితం సిరియాలో హింస చెలరేగినందున ఆయుధ సరఫరా మరింత హింసను ప్రేరేపిస్తుందన్న కారణం చెబుతూ సిరియాపై ఆయుధ నిషేధాన్ని (arms embargo) యూరోపియన్ యూనియన్ విధించుకుంది. ఇపుడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎత్తివేతతో సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు యధేచ్ఛగా, బహిరంగంగా ఆయుధాలు సరఫరా చేసుకునే అవకాశం ఐరోపా దేశాలకు వస్తుంది. ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలకు లాభాలు పెంచి, వెంటిలేషన్ పై ఉన్న ఆర్ధిక వ్యవస్ధలకు కాసింత ఊపిరి ఇచ్చే తాజా నిర్ణయం సిరియా ప్రజలకు ప్రాణాంతకం కానుంది.

విచిత్రం ఏమిటంటే సిరియా ప్రజల పేరు చెప్పే ఆయుధ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రహస్యంగా అందజేసిన ఆయుధాలతో సిరియా ప్రజలపై మూకుమ్మడి హత్యాకాండలకు, టెర్రరిస్టు దాడులకు పాల్పడిన ఆల్-ఖైదా టెర్రరిస్టులు కూడా సిరియా ప్రజల పేరు చెప్పి ఆ ప్రజలనే చంపుతున్నారు. వారికి ఆయుధాలు సరఫరా చేసే అమెరికా, ఐరోపాలు సిరియా ప్రజల కోసమే అంటున్నాయి. ఇంతకుమించిన యుద్ధ నాటక రంగం మరొకటి ఉండబోదు.

యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు సమావేశమై సోమవారం ఈ నిర్ణయం ప్రకటించారు. ఇ.యు విదేశీ విధాన అధిపతి కేధరిన్ ఆస్టన్ సమావేశం అనంతరం నిర్ణయాన్ని ప్రకటించిందని ది హిందు తెలిపింది. సిరియా టెర్రరిస్టులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వీలుగా ఆయుధ నిషేధం ఎత్తివేయాలని బ్రిటన్ మొదటి నుండి ఇ.యు దేశాలపై ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ కు జత కలిసింది. ఇటీవల కాలంలో జర్మనీ కూడా తోడయింది. ఇ.యు నాయకుడు జర్మనీ గొంతు కలపడంతో నిషేధం ఎత్తివేతకు మార్గం సుగమం అయింది. తీవ్ర చర్చోపచర్చలు జరిగిన తర్వాత నిర్ణయం చేశారని పశ్చిమ పత్రికలు చెప్పుకుంటున్నాయి.

“(సిరియాలో) క్షీణిస్తున్న పరిస్ధితికి అనుగుణంగా స్పందించడానికి, చర్చించడానికి నిరాకరిస్తున్న అస్సాద్ ప్రభుత్వానికి బడులువ్వడానికి ఈ నిర్ణయం మాకు వెసులుబాటును కల్పిస్తుంది” అని బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ విలేఖరులతో అన్నాడు. నిజానికి చర్చలకు నిరాకరిస్తున్నది అమెరికా, ఐరోపాలే. ఐరాస, అరబ్ లీగ్ ల సంయుక్త ప్రతినిధులు కోఫీ అన్నన్ (మాజీ), లఖ్దర్ బ్రహిమి లతో పాటు రష్యా, చైనాలు సిరియా సమస్యను శాంతియుత పరిష్కారానికి ప్రయత్నిద్దామని చెవినిల్లు కట్టుకుని పోరినప్పటికీ అవి పెడచెవిన పెట్టాయి. టెర్రరిస్టులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తే వారు విజయం సాధిస్తారని ఆశించాయి. ఆ ఆశతోనే గత సంవత్సరం జెనీవాలో జరిగిన శాంతి ఒప్పందాన్ని అమలు చేయకుండా అడ్డుకున్నాయి.

కానీ ఇప్పటివరకు అలా జరగలేదు. పైగా ఇటీవల కాలంలో టెర్రరిస్టు తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తినడం పెరిగింది. దానితో అమెరికా, ఐరోపాలు శాంతి చర్చలకు ప్రతిపాదించాయి. అమెరికా విదేశీ మంత్రి జాన్ కేర్రీ ప్రత్యేకంగా రష్యా వెళ్ళి జెనీవాలో రెండో సారి శాంతి చర్చలు చేద్దామని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సమ్మతించాడు. ఒక వైపు చర్చల గురించి జాన్ కేర్రీ మాట్లాడుతుండగానే తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసే బిల్లును సెనేట్ కమిటీ ఆమోదించినట్లు ప్రకటించింది. సెనేట్, ప్రతినిధుల సభ ఆమోదిస్తే అమెరికా ఆయుధాలు సరఫరా చేయడమే తరువాయి. ఇప్పుడు ఇ.యు ఏకంగా ఆయుధ నిషేధాన్ని ఎత్తి వేసింది. దానితో ఐరోపా దేశాలు ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు కూడా ఆయుధాల సరఫరాకు మార్గం సిద్ధం చేసుకున్నాయి.

ఈ నేపధ్యంలో జెనీవాలో రెండో శాంతి చర్చల సమావేశం జరుపుదామన్న అమెరికా, ఐరోపాల ప్రతిపాదనపై పలువురు నిపుణులు వెలిబుచ్చిన అనుమానాలు వాస్తవమేనని అర్ధమవుతోంది. ఈ చర్చలకు సిరియాలో ప్రభుత్వంతో తలపడుతున్న ప్రతిపక్షాలకు ప్రతినిధులెవరో ఇంతవరకూ తేల్చుకోలేదు. అనేక ముక్కలుగా చీలిపోయి ఉన్న సాయుధ ప్రతిపక్షాలలో కొన్ని సంస్ధలు తాము సమావేశానికి హాజరు కాబోమని తెలిపాయి. అస్సాద్ దిగిపోతే తప్ప చర్చలు జరిపేది లేదని అవి చెబుతున్నాయి.

జెనీవా సదస్సు పేరుతో శాంతి చర్చలు జరిపినట్లు జరిపి అవి విఫలం అయ్యే విధంగా చూసి ఆ వంకతో సిరియా ప్రతిపక్ష టెర్రరిస్టులకు ఆయుధాలు సరఫరా చేయడానికి అమెరికా, ఐరోపాలు ఎత్తు వేసాయని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా సెనేట్ బిల్లు, ఐరోపా ఆయుధ నిషేధం ఎత్తివేత ఆ అనుమానాలను నిజం చేశాయి.  సిరియాలో హింసను అడ్డుకోడానికి ఇ.యు మే 2011లో ఆయుధ నిషేధం విధించింది. ఇప్పుడు అక్కడ హింస తగ్గిన జాడలేవీ లేవు. సిరియా ప్రభుత్వం పై చేయి సాధిస్తున్నందున హింస తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. సరిగ్గా అలాంటి ప్రమాదాన్ని నివారించడమే అమెరికా, ఐరోపా కుయుక్తుల లక్ష్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s