కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే -జపాన్ లో ప్రధాని


ఖేదారాన్ చీఫ్, జపాన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలతో ప్రధాని మన్మోహన్

ఖేదారాన్ చీఫ్, జపాన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లతో ప్రధాని మన్మోహన్

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. భారత దేశంలో ప్రజలకు హామీలు ఇచ్చే అవకాశం ఎన్నడూ రాని ఆయన (ఎన్నికల్లో పోటీ చేయరు గనుక) దానిని జపాన్ లో దొరకబుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అడిగిందే తడవుగా జపాన్ పారిశ్రామిక వేత్తలకు హామీలు ఇచ్చేశారు ప్రధాని మన్మోహన్ సింగ్. ‘కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే’ అంటూ పరమానంద రాగం ఆలపించినంత పని చేశారు.

‘మీ మార్కెట్లు ఇంకా బాగా తెరవాలి’ అంటే ‘దాందేముంది, మా ప్రజలకు కష్టమైనా తెరుస్తాం’ అని హామీ ఇచ్చేశారు. ‘ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను విధానం ఉంది, మాకు నచ్చలేదు’ అంటే ‘దేశమంతా వర్తించేలా త్వరలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ తెస్తున్నాం. దాంతో మీ సమస్యలన్నీ మటుమాయం’ అంటూ ‘టాట్టడాంయ్’ అన్నంత తేలిగ్గా చెప్పేశారు. ‘ఇండియాలో పన్నుల వ్యవస్ధ సంక్లిష్టంగా ఉంది’ అని వలపోగా, ‘ప్రాధాన్యతా రంగాల ఋణ షరతులను సరళతరం చేస్తాం’ అని నమ్మబలికారు. విదేశీ బ్యాంకులను భారత మెట్రోల్లో భ్రాంచీలు తెరవనివ్వండి అని అడగ్గానే ప్రధాని ‘అలాగే’ అన్నారు.  మొత్తం మీద జపాన్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి దేశ సంపదలు, మార్కెట్లలో వారికి వాటా ఇస్తామని చెప్పారు. మన్మోహన్ ఉదార బుద్ధికి భారత ప్రజలే ఇంకా నోచుకోలేదు!

‘జపాన్ బిజినెస్ ఫెడరేషన్’ జపాన్ లోని ప్రధాన పారిశ్రామిక సంస్ధల సంఘం. దీనిని జపనీస్ భాషలో ఖేదారాన్ అంటారట. ఈ ఖేదారాన్ సభ్యులతో సమావేశమైన మన్మోహన్, వారు లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. భారత ప్రజలు వివిధ ఉద్యమాల రూపంలో లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి నోరు పెగలని ప్రధాని, జపాన్ పారిశ్రామికవేత్తలకు మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ లాగా అక్కడ కూడా సమాధానం ఇవ్వకుండా రమ్మంటారా అని అడగొచ్చు. ఇక్కడ సమస్య అది కాదు. ‘జపాన్ పారిశ్రామికవేత్తలను’ సంతృప్తిపరచడానికి ‘భారత ప్రజలకు కఠినమైన, బాధాకరమైన నిర్ణయాలు తీసుకుంటాం’ అని చెప్పడమే సమస్య.

“మా ప్రజలు వేగవంతమైన అభివృద్ధి యొక్క ఫలాలను రుచి చూశారు. కనుక అంతకంటే తక్కువకు మావాళ్లు ఒప్పుకోరు. మా ఆర్ధిక వ్యవస్ధ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కఠినమైన, బాధాకరమైన నిర్ణయాలు తీసుకోడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని నేను మీకు గట్టిగా హామీ ఇస్తున్నాను” అని ప్రధాని మన్మోహన్ ఖేదారాన్ సమావేశంలో వాగ్దానం చేశారని ది హిందూ (పి.టి.ఐ ద్వారా) తెలిపింది.

ఇంతకీ అభివృద్ధి ఫలాలను ఎవరు రుచి చూసినట్లు? కాంగ్రెస్ గొప్పలు చెప్పుకునే ‘ఉపాధి హామీ పధకం’ విదేశీ కంపెనీలు, ఎఫ్.డి.ఐ లు ఇస్తున్నది కాదు కదా. అంగన్వాడీ, బాల్వాడి, నగదు బదిలీ తదితర పధకాలన్నీ ఎఫ్.డి.ఐలు ఇస్తున్నవి కాదే. దేశ జనం శ్రమ చేసి సంపాదించుకుంటున్న ఫలాలవి. ఇంకా చెప్పాలంటే విదేశీ పెట్టుబడులకు ఖనిజాలు, భూములు లాంటి దేశ సంపదలు దోచిపెడుతుంటే జనం తిరగబడకుండా ఉండడానికి భారత ప్రభుత్వం విదిలిస్తున్న మెతుకులవి. కాకపోతే సూపర్ ధనికులు మరిన్ని డబ్బు కట్టలు మూటేసుకుంటున్నారు. మన్మోహన్ గారు ‘మావాళ్లు’ ఆనంటున్నది వీరే అయితే ఆయన మాటలు నిజమే.

వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పన్నులు ఉండడం వలన జపాన్ పెట్టుబడిదారులు, కంపెనీలు కష్టాలు ఎదుర్కొంటున్నారని మిత్సుబిషి కార్పొరేషన్ అధికారి వాపోతూ జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) ఎప్పటిలోపు అమలు చేస్తారని సూటిగానే అడిగాడు. జి.ఎస్.టి అంటే దేశం అంతా ఒకే పన్ను విధానం అమలులో ఉండడానికి కేంద్రం ప్రతిపాదించిన పన్ను. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ పన్నుల ఆదాయంలోకి కేంద్రం చొరబడుతోందని, తమ ఆదాయం తగ్గుతుందని కాంగ్రెసేతర రాష్ట్రాలు, కొన్ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా ఆరోపిస్తూ వ్యతిరేకిస్తున్నాయి. దానికి మన్మోహన్ ఇలా చెప్పారు.

“భారత దేశం ఒక ఫెడరేషన్. (వాస్తవానికి ఫెడరేషన్ కాదు, యూనియన్.) రాష్ట్రాలను తమ పన్నుల శక్తిని సరెండర్ చేసేలా అంగీకరింపజేయడానికి కష్టాలు ఎదురవుతున్నాయి. కానీ ఆటంకాలను అధిగమిస్తామని నాకు నమ్మకం ఉంది. మేము కృషి చేస్తాము. మరిన్ని రాష్ట్రాలను లైన్ లో పెట్టడానికి కృషి చేస్తున్నాము. అందుకోసం రాజ్యాంగం సవరించాల్సిన అవసరం ఉంది. సాధారణ చట్టం కంటే అత్యంత శక్తివంతమైన ప్రయత్నాలు సాగించాల్సి ఉంది…. కనుక రేపే చేస్తామని చెప్పలేను. 2014 నాటికి ఎన్నికలు అనేవి మార్గం నుండి తప్పుకున్నాక ఏ ప్రభుత్వం వచ్చినా భారత అభివృద్ధి కధను ముందుకు తోడ్కొని పోవడానికి అన్ని పక్షాల మధ్య సాధారణ ఏకీభావం ఉంటుంది.”

అదీ కధ! విదేశీ పెట్టుబడిదారుల కోసం మన దేశ రాజ్యాంగాన్ని సవరిస్తారట! ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటుంది? పైగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అందరం ఏకీభావంతో రాజ్యాంగాన్ని సవరిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని. ఎన్నికలనేవి దేశ ప్రజలకు నమ్మబలుకుతున్నట్లు మన్మోహన్ గారి దృష్టిలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రుజువు కాదు. అవి పాలకవర్గాల పాలనకు ఆటంకం మాత్రమే. విదేశీ కంపెనీలను సంతృప్తిపరిచే విధానాలకు ఎన్నికలు ఆటంకం. ప్రధాని చెప్పిన ఈ మాట మాత్రం ప్రత్యక్షర సత్యం. ప్రజల పేరు చెప్పుకోడానికే ఎన్నికలు. ఆ తర్వాత జరిగేదంతా ప్రజా వ్యతిరేకమే.

జపాన్ పారిశ్రామికవేత్తలు ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్ షిప్ కు చాలా ఆసక్తిగా ఉన్నారని కానీ సంక్లిష్టమైన పన్నుల విధానం వారిని నిరుత్సాహపరుస్తున్నదని ఖేదారాన్ అధిపతి హీరోమాసా యోనేకురా ప్రధానికి వివరించారు. ప్రధాని మన్మోహన్ ఈ అడ్డంకులను అధిగమిస్తామని మరోసారి గట్టి హామీ ఇచ్చారు. మరోసారి 8 శాతం వృద్ధి రేటుకు (గతంలో 9 శాతం అనేవారు) తిరిగి వస్తామని ఆ క్రమంలో అడ్డంకులు తీసేస్తామని ప్రధాని చెప్పారు.

ప్రాధాన్యతా రంగాల రుణాల (Priority Sector Lending) విషయంలో కూడా ప్రధాని జపాన్ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. ఇది ద్రవ్య రంగానికి సంబంధించినది. “ఇది సాంకేతికంగా కష్టమైన ప్రశ్న. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వశాఖలకు సంబంధించిన విషయం ఇది” అని చెప్పిన ప్రధాని జపాన్ పరిశ్రమలకు భారత దేశంలో సానుకూలమైన వాతావరణం (hospitable environment) కల్పించి, భారత దేశంలో జపాన్ పరిశ్రమల ఉనికి పెరిగేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. “పైకి పోయే కొద్దీ కింది స్ధాయిల గురించి మనకి తక్కువగా తెలుస్తుంది” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

‘ఇంక్లూజివ్ గ్రోత్’ సంభవించేలా చూస్తామని తొమ్మిదేళ్లుగా ఆయన భారత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలులోకి రాకుండా అలాగే ఉన్నా, భారత జనాన్ని కష్టపెట్టయినా మీ సమస్యలు తీరుస్తామ్ అని జపాన్ పరిశ్రమాధిపతులకు ఇచ్చిన వాగ్దానం మాత్రం శుభ్రంగా నెరవేరుస్తారని ఆయన తొమ్మిదేళ్ల పాలన రుజువు చేస్తోంది. భారతీయులు వ్యతిరేకిస్తున్నా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంటామ్ అని బుష్ కి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు. ‘వాల్ మార్ట్ కంపెనీకి రిటైల్ మార్కెట్ ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వడం లేదు’ అని అక్కడ ఒబామా ఆగ్రహించారో లేదో నెలలు తిరిగేలోపు రిటైల్ ఎఫ్.డి.ఐ చట్టం ఇక్కడ రెడీ అయిపోయింది.

ఇన్సూరెన్స్ రంగంలో 24 నుండి 49 శాతానికి ఎఫ్.డి.ఐ పెంచడాన్ని ఉద్యోగులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఆ మేరకు జపాన్, అమెరికా, ఐరోపా కంపెనీలకు ప్రధాని హామీ ఇచ్చారు. వేరే సమస్యపైన బి.జె.పి అలగడం వల్ల అది కొద్దిలో తప్పిపోయింది. ఇంకా ఇలాంటివి ఎన్నో స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్ధలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయి. ఐనా వాటి లాభదాహం పెరిగేదే తప్ప తరిగేది కాదు. కానీ ప్రజలకు కాసింత ఆసరా ఇస్తే చాలు, వారి అసంతృప్తి చల్లబడుతుంది. తేలికగా చల్లబడే అసంతృప్తులను ఎగదోస్తూ ఎంతకీ తరగని లాభదాహాలను తీర్చాలని భావించడం భారత పాలకుల వర్గ స్వభావం. దానికి స్ధానం లేకుండా చేసుకోవలసింది ప్రజలే.

2 thoughts on “కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే -జపాన్ లో ప్రధాని

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s