సిరియా యుద్ధంలో ‘గేమ్ ఛేంజర్’ గా రష్యా టుడే అభివర్ణించిన ఎస్-300 క్షిపణుల సరఫరా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేయొద్దంటూ ఇజ్రాయెల్ మరోసారి రష్యాను కోరింది. ఈసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-300 క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే షిప్పింగ్ చేస్తున్న వాహనాలపై దాడి చేసి నాశనం చేస్తామని హెచ్చరించింది. కాగా క్షిపణుల సరఫరాను రష్యా గట్టిగా సమర్ధించుకుంది. సిరియాతో కుదుర్చుకున్న పాత ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని తెలియజేసింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మోషే యాలోన్ మంగళవారం రష్యాకు తాజాగా హెచ్చరిక జారీ చేశాడు. అత్యాధునిక క్షిపణులను సిరియాకు సరఫరా చేసినట్లయితే సరఫరా చేస్తున్న వాహనాలపై తమ మిలట్రీ దాడులు చేస్తుందని ఆయన హెచ్చరించాడు. సిరియాకు ఎస్-300 వాయు రక్షణ క్షిపణులను సరఫరా చేసే హక్కు రష్యాకు ఉన్నదని రష్యన్ రక్షణ శాఖ అధికారి ఒకరు ప్రకటించిన కొద్దిసేపటికి ఇజ్రాయెల్ ఈ హెచ్చరిక చేసిందని ది హిందు (ఎ.పి ద్వారా) తెలిపింది.
ఇజ్రాయెల్ ఇప్పటికే మూడుసార్లు సిరియాపై దాడి చేసింది. లెబనాన్ లోని సిరియా మిత్రపక్షం హిజ్బోల్లాకు ఇరాన్ సరఫరా చేస్తున్న ఆయుధాలను నాశనం చేసేందుకే ఈ దాడి జరిగిందని పశ్చిమ పత్రికలు చెప్పాయి. ఈ సంగతి ఇజ్రాయెల్ బహిరంగంగా అంగీకరించలేదు. తాను చేసే దుష్ట కార్యాలను బహిరంగంగా అంగీకరించకపోవడం ఇజ్రాయెల్ రాజ్యాధిపతులు అనుసరించే అహంభావపూరిత విదేశాంగ విధానాల్లో ఒకటి. ఇజ్రాయెల్ అహంకారం అమెరికాకు సదా సిద్ధంగా ఉండే ఆయుధం. నిజానికి సిరియాపై ఇజ్రాయెల్ చేసిన మూడు దాడుల గురించి పత్రికలకు సమాచారం ఇచ్చింది అమెరికా గూఢచార వర్గాలే.
మూడోసారి ఇజ్రాయెల్ చేసిన దాడి ఎటువంటి ఆయుధ సరఫరా పైనా జరగలేదు. సిరియా ప్రభుత్వానికి చెందిన ఒక సైనిక బ్యారాక్స్ పైన ఆ దాడి జరిగింది. అందులో 40 మంది వరకు సిరియా సైనికులు చనిపోయారు. తమ స్వాధీనంలోని ప్రాంతాలను సిరియా ప్రభుత్వ సైనికులకు కోల్పోతున్న పరిస్ధితిలో కిరాయి తిరుగుబాటుదారుల స్ధైర్యం పెంపొందించే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ ఈ దాడికి తెగబడిందని వివిధ పరిశీలకులు తెలిపారు.
ఎస్-300 క్షిపణులు మధ్య ప్రాచ్యం ప్రాంతం వరకు తీసుకుంటే అత్యంత శక్తివంతమైనవని తెలుస్తోంది. 200 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైళ్ళు వాయు తల రక్షణకు పేరెన్నికగన్నవి. క్షిపణిదాడులను గాలిలోనే అడ్డుకుని వాయుతలానికి రక్షణగా ఉండడమే కాక బహుళ దిశల్లో, బహుళ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించి లక్ష్యాలను ఛేదించగల శక్తి కలిగినవి.
ఇంతవరకు మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆర్మీదే పై చేయి. ముఖ్యంగా లెబనాన్ లోని ఇజ్రాయెల్ శత్రువు హిజ్బొల్లాకు రష్యా క్షిపణులు (సిరియా ద్వారా) అందితే ఇజ్రాయెల్ ప్రాంతీయాధిపత్యానికి గట్టి దెబ్బ ఎదురవుతుంది. అటువంటి పరిస్ధితిని సిరియా ససేమిరా అంగీకరించదు. అందుకే రష్యాను హెచ్చరించడానికి సైతం అది వెనుదీయడం లేదు. క్షిపణుల సరఫరాను నివారించడానికి ఇజ్రాయెల్ ప్రధాని ఒకసారి రష్యా వెళ్ళి పుతిన్ ను కలిసివచ్చాడు. పుతిన్ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆర్.టి ద్వారా తెలుస్తోంది.
“మాకు సంబంధించినంతవరకు అది (ఎస్-300 సరఫరా) మాకు బెదిరింపుతో సమానం” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యాలోన్ అన్నాడు. “ఈ దశలో యుద్ధ విస్తరణ ఉన్నదని అనుకోవడం లేదు. (ఎస్-300) షిప్ మెంట్లు ఇంకా జరగలేదు. జరగదని మేము ఆశిస్తున్నాము. కానీ, దేవుడు తప్పించుగాక, అవి సిరియాను చేరితే ఏమి చేయాలో మాకు తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించాడు.