మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్


Cartoon from Eenadu Sunday magazine, May 12, 2013

Cartoon from Eenadu Sunday magazine, May 12, 2013

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం.

భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే ఆ నెపాన్ని భూస్వాముల మీదికి నెట్టి తప్పించుకోవచ్చు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్ధాపకులు కాన్షీరామ్ స్వయంగా తన వారసురాలిగా తొలినాడే ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టిన మాయావతి ఆ పార్టీ సిద్ధాంతాలను ఊహించని వైపుకి తీసుకెళ్ళడం పదవీ రాజకీయాలు కనీస నిజాయిటీని సైతం పాటించవనడానికి ప్రబల తార్కాణం కావచ్చు.

కాన్షీరామ్ సిద్ధాంతం లేదా బహుజన్ సమాజ్ పార్టీ చెప్పిన సిద్ధాంతం ఏమిటి?

‘ఈ దేశం బహుజనులది. సబ్బండ వృత్తుల కులాల బహుజనులు తమ శ్రమతో ఈ దేశాన్ని నిర్మిస్తే కొద్ది సంఖ్యలోని అగ్రకులాలు ఆ శ్రమ ఫలితాన్ని దోచుకుని తింటూ దేశాన్ని ఏలుతున్నారు. జనాభాలో కేవలం 10 శాతంగా ఉన్న బ్రాహ్మణులు మరియు ఇతర అగ్ర కులాలు 90 శాతంగా ఉన్న బహుజనుల ఓట్లను వేయించుకుని రాజ్యాన్ని ఏలుతున్నారు. అలా కాకుండా బహుజన కులాలన్నీ ఏకమై ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి తమ ఓట్లు అగ్ర కులాలకు కాకుండా తమకే వేసుకునేట్లయితే రాజకీయాధికారం వారి సొంతం అవుతుంది’

ఇదీ స్ధూలంగా బహుజన్ సమాజ్ పార్టీ నేత కాన్షీరామ్ చెప్పిన సిద్ధాంతం. బి.ఎస్.పి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 20 నుండి 30 శాతం వరకు ఓట్లు గెలుచుకోవడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీని గుర్తించక తప్పలేదు. తొంభైల్లో ములాయం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రెండేళ్లలోనే ఉపసంహరించుకున్న మాయావతి అనంతరం అత్యంత విచిత్రంగా, పరిశీలకులను నిశ్చేష్టులను చేస్తూ, బి.జె.పి మద్దతుతో కొద్ది నెలల పాటు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిస్టించారామె. ఏ అగ్రకుల భావజాలాన్నైతే అంబేద్కర్ చీల్చి  చెండాడి తన జీవిత పర్యంతం సమాన ప్రతిపత్తి కోసం కృషి చేశారో అదే భావజాలాన్ని పరిహాసం చేస్తూ అగ్రకుల భూస్వామ్య పార్టీతో పొత్తు పెట్టుకోవడం దళితుల పార్టీకి ఎలా సాధ్యం?

ఎలా సాధ్యమో మాయావతి చేసి చూపారు. బహుశా పార్లమెంటు బురద రాజకీయాల్లోనే ఇలాంటివి సాధ్యం కావచ్చు. కానీ ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మూల సిద్ధాంతాన్నే మాయావతి సవరించారు. బ్రాహ్మణులను సైతం బాధితులుగా పేర్కొన్నారావిడ. వేలయేళ్ల దళితుల అణచివేతల చరిత్రకు పొసగని  సరికొత్త సిద్ధాంతాన్ని రచించిన మాయావతి, బ్రాహ్మణులు, దళితుల ఐక్యసంఘటన పేరుతోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలిగారు. కానీ ఆ పదవి మూణ్నాళ్ళ ముచ్చటే అయింది. అయితే దాన్నుండి మాయావతి ఎన్నికల రాజకీయాల పాఠాలను బహుశా బాగానే నేర్చుకోగలిగారు.

క్రమంగా తమ పార్టీ సైద్ధాంతీకంగా దూరంగా పెట్టిన అగ్రకుల భూస్వాములను, పెట్టుబడుదారులను బహిరంగంగానే పార్టీలో చేర్చుకోవడం, పదవులివ్వడం ప్రారంభం అయింది. దానర్ధం అంతకు మునుపు భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు ఆమె పార్టీకి మద్దతు ఇవ్వలేదనీ, ఆమె పాలన నుండి లబ్ది పొందలేదనీ కాదు. కానీ అలాంటివి లోపాయకారీగా వివిధ సాకుల మాటున జరిగాయే తప్ప సైద్ధాంతిక మద్దతుతో అవి జరగలేదు.

2007లో సొంతగా మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి కాగలిగిన మాయావతి తన సిద్ధాంతాన్ని ఒక విపరీత స్ధాయికి చేర్చారు. ఆమె దృష్టిలో బహుజనులంటూ ఎవరూ లేరిక. ఉన్నదంతా సర్వజనులే. తమ పార్టీ బహుజనుల పార్టీ కాదనీ, సర్వ జనుల పార్టీ అనీ ఆమె చెప్పడం ప్రారంభించారు. అంటే బి.ఎస్.పి ఇక దళితుల పార్టీ కాదు. బహుజనుల పార్టీ కాదు. సబ్బండ కులాల పార్టీ కాదు. అధికారం కోసం అర్రులు చాస్తూ దళితుల ప్రయోజనాలను సిద్ధాంతంలో కూడా గాలికి వదిలేసిన అనేక పాలకవర్గ పార్టీల్లో ఒకటి ఇప్పటి బి.ఎస్.పి. ఆ పార్టీ మొదటి నుండి పాలకవర్గాల పార్టీయే అయినా దళిత ముద్ర ప్రత్యేక గుర్తింపులు తెచ్చింది. ఇపుడా గుర్తింపు కూడా బి.ఎస్.పి కి ఇవ్వనవసరం లేదు.

పార్లమెంటరీ బురదలో మునిగాక ఇక తన-మన అనే తేడాలను ఆదర్శ రాజకీయ భావాలైనా, అస్తిత్వ రాజకీయ భావాలైనా ఇలా తమ అస్తిత్వాన్ని కోల్పోతాయో మాయావతి ఉరఫ్ బి.ఎస్.పి ప్రయాణమే ఒక సూచిక.

16 thoughts on “మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

 1. అధికారంలోకి రావడానికి ఏ అవకాశం దొరికినా మన రాజకీయ పార్టీలు అస్సలు వదులుకోవు.
  ఆఖరికి తమ మౌలిక సిద్ధాంతాలకే విరుద్ధమైనా…నైతిక విలువల కన్నా…అధికార పీఠానికి ఎక్కువ విలువ ఇవ్వడం దురదృష్టకరం. ఒక్క కమ్యూనిస్టు పార్టీనే ఈ విషయంలో ( కొంత ) మెరుగు.

  బహుజనులు…తమ ఓట్లు తమ వర్గానికి వేసుకోవడం ద్వారా..అధికారంలోకి వచ్చి తమ జీవితాలు మెరుగుపరుచుకోవచ్చునని నాడు కాన్షీరాం ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు జరుగుతుంది మరోటి.

  ఎన్నికలకు ముందు….అధికారంలోకి వచ్చేదాకానే… కులం పేరుతో రాజకీయాలు చేస్తారు..
  తర్వాత సమీకరణాలు మారుతాయి. ఇక అప్పుడు మామూలు కులాలు పోయి కొత్త కులాలు వస్తాయి.

  అవి ఒకటి దోపిడీదారులు, ఇంకోటి పీడితులు

  దోపిడీదారులు తమ వర్గ (దోపిడి) ప్రయోజనాలకోసం పాటుపడతారు.
  పేదవాళ్లు తమ మనుగడకోసం పోరాడుతూనే ఉంటారు.

  బీఎస్పీ ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నది ఇదే.

  అందుకే ఓటు మన కులం వాడికే వేయాలా….మన వర్గ ప్రయోజనాలు కాపాడే వానికి వేయాలా అని జనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

  అన్నట్లు విశేఖర్ గారు…మొదటి సారిగా ఓ తెలుగు కార్టూన్ పై స్పందించినట్లున్నారు.

 2. చందుతులసి గారు

  ఈ అంశం పైన ఆర్టికల్ రాయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఉదయం ఎందుకో ఈనాడు ఆదివారం మ్యాగజైన్ తిరగేస్తుండగా ఈ కార్టూన్ కనిపించింది. నా ఆలోచన ఈ విధంగా అమలు చేశాను.

  తెలుగు పత్రికల్లో కార్టూన్లు స్ధానిక రాజకీయాలకు సంబంధించినవే అయి ఉంటున్నాయి. అదీ కాక గతంలో లాగా తెలుగు పత్రికల్లో ఫ్రంట్ పేజీ కార్టూన్ లకు స్ధానం పోయింది. మొక్కుబడిగా చిన్న కార్టూన్ ఇచ్చి వదిలేస్తున్నారు.

  గతంలో ఈ పరిస్ధితి లేదు. ప్రతి తెలుగు పత్రికా మంచి కార్టూనిస్టును కలిగి ఉండడం ప్రతిష్టగా భావించేవి. ఫ్రంట్ పేజీలో మంచి కార్టూన్ ఇవ్వడానికి ఒక విధంగా పోటీ ఉండేది. వ్యాపార ధోరణి పెరగడం వల్లనేమో కార్టూనిస్టులకు కొలువులు రద్దయ్యాయి. వారే సొంతగా కార్టూన్ పత్రికలనీ, కార్టూన్ వెబ్ సైట్లనీ నడుపుకోవలసిన పరిస్ధితి. మరి వీక్లీలన్నా కొనసాగిస్తున్నాయో లేదో మరి!

 3. శేఖర్ గారు,

  మీరు రాసింది సంతృప్తి కలిగించలేదు. కాన్షీరాం మాయవతి రాజకీయాలలో వచ్చే నాటికే పార్లమెంట్ ప్రజాస్వామ్య రాజకీయాల లోపాలు, వైఫల్యాలు ప్రజలకి దాదాపు అవగతమైపోయాయి. ఆ చివరి సమయంలో అతి వేగంతో, భారి అంచనాలతో బహుజనులను ఆకర్షిస్తూ రాజకీయాలలో దూసుకొచ్చిన పార్టి బి.యస్.పి. ఎవరైనా రాజకీయలమీద విరక్తి చెందిన వారు, వీరిపాలన లో కొచ్చాక కూడా గత పాలకులు పాలించినట్లు ఉంట్టుందని అంటే ,దళితు మేధావులు నమ్మేస్థితిలో లేరు. మేము అధికారంలోకి స్వశక్తితో మొదటిసారిగా ఒక రాష్ట్రంలో రాబోతుంటే, అగ్రవర్గాల వారికి రావటం ఇష్టంలేక మాట్లాడుతున్నట్లు భావించేవారు. వాళ్లు అంత గా ఆపార్టి తో మమైకమయ్యారు. మీకు తెలిస్తే ఈ క్రింది నా అనుమానలను నివృత్తి చేయండి. మాయవతి గారి పాలన గురించి,ఆమే ఎందుకు విఫలమైందో అవగాహన లెకపోవటం వలన ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. మిమ్మల్ని ఇరుకున పెట్టటానికి కాదు.

  1. ఆమే అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు ఏ ఏ రంగాలలో మేలు చేయగలిగింది.
  2. వాళ్లకి ఉండే ఎన్నో సమస్యలలో ప్రాథమికమైన వాటినన్నా నెరవేర్చిందా?
  3. ఇక ఆమేకి సలహాలు ఇవ్వటానికి ఎప్పుడు అందుబాటులో ఉండే కంచా అయ్యలయ్య లాంటి దళితుల మేధావుల కొరత లేదు. బంగారం లాంటి అవకాశం చేతికి వచ్చినపుడు కాపాడు కోవటానికి వాళ్లు ఆమేకి చేసిన సహాయం, ప్రయత్నం ఏమిటి?
  4. బ్రాహ్మణ,బనియా ఓట్ల కొరకు ఆమే ప్రయత్నించి, గెలిచిన కొన్ని నెలలకే ఆమే మొహం చాటేయటానికి గల ప్రత్యేక కారణాలు ఎమైనా ఉన్నాయా?
  5. ఆమే పాలనలో, నేను ఇది చేశాను, నా మార్క్ అని చెప్పుకొనే మంచి పనులు ఉన్నాయా?

 4. చిరంజీవి రాజకీయాలలో కి వచ్చినా ఆ పార్టికి సైద్దాంతిక బలం లేదు. కాన్షీరాం, మాయవతి లు ఎంతో స్ట్రగుల్ అయ్యారు. ఈ రోజు సంగతి వేరు, కాని అప్పట్లోవాళ్లు ఎంతో పోరాడారని అనుకొంటాను.ఆమేను ఒకసారి యస్ పి పార్టి వారు చంపటానికి కూడాప్రయత్నించారు. అప్పుడు బి జె పి పార్టీ వాళ్ళు రక్షించారని విన్నాను.

 5. @Praveen,
  You may say personality cult. But she is end product of dalit moment or dalit consciousness.
  “తమ పార్టీ బహుజనుల పార్టీ కాదనీ, సర్వ జనుల పార్టీ అనీ ఆమె చెప్పడం ప్రారంభించారు.”

  When she said like that Did any dalit intelctual raised objection? I did know much about her, I am asking this questions.

 6. మనోహర్ గారు,

  సంతృప్తి పడనివారు ఇంకా ఉండొచ్చు కూడా.

  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లోపాలు, వైరుధ్యాలు ప్రజలకు దాదాపు అవగతమైపోయాయంటారా? అదే నిజమైతె వారెప్పుడో తగిన చర్యలకు దిగి ఉండేవారు కాదా.

  తగిన చర్యలకు దిగినవారిని నక్సలైట్లు అని పేరు పెట్టారు కదా. కొందరు మేధావులు వారిని టెర్రరిస్టులు అని కూడా పిలుచుకుంటారు. శ్రీశ్రీ అన్నట్లు “తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు. నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు. ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్క అంటారు.”

  మీ ప్రశ్నల ఉద్దేశం నాకు అర్ధమైంది. వివిధ సందర్భాల్లో మాయావతి, బి.ఎస్.పి లపై నా అభిప్రాయాలు వివరించాను. అన్ని అభిప్రాయాలూ అన్ని సందర్భాల్లో చెప్పడం కుదరదు కదా. మాయావతి పాలకవర్గాల మనిషి అని పైన చెప్పాను కూడా.

  స్ధూలంగా చూస్తే: మాయావతి లేదా బి.ఎస్.పి కులాల ఆధారంగా పుట్టిన పార్టీలు. కాని ఆ పార్టీ పుట్టడానికి తగిన పునాది దేశంలో ఉంది. దళితులు ఇంకా సామాజిక, ఆర్ధిక, రాజకీయ అణచివేతలకు గురవుతుండడమే ఆ పునాది. ఈ వాస్తవం దృష్ట్యా కుల సంఘాలను సానుభూతితో అర్ధం చేసుకోవచ్చు గానీ ఆమోదించలేము.

  దళిత కులాలు కుల సంఘాలు పెట్టుకుంటే అణచివేత పునాది కనుక దానిని అర్ధం చేసుకోవచ్చు. కాని అగ్ర కులాలు కుల సంఘాలు, కుల సంక్షేమ సంస్ధలు పెట్టుకొవడం, తమ కులాల్లోని పేద వారిని ఉద్ధరిస్తామని చెప్పుకోవడం ఒక విపరీత పరిస్ధితి. అది పేద ప్రజలు మరింత కటువుగా విడిపోవడానికి, అణచివేతకు, దోపిడికి గురికావడానికి దారి తీస్తోంది.

  కుల అణచివేతకు విరుగుడు కుల పార్టీలు, కుల సంఘాలు కాదు. పేద ప్రజలను అణచిపెట్టి, విడదీసి ఉంచడానికీ, వారి శ్రమను దోచుకోవడానికి అత్యంత శక్తివంతమైన భూస్వామ్య సాధనం కులం. అలాంటి కులాన్ని బలపరిస్తే పేద ప్రజలకు మరింత నష్టం, వారు ఏ కులంలో ఉన్నా సరే. దళిత పేదలకు ఇంకా నష్టం. ఎందుకంటే వారు అదనంగా సామాజిక అణచివేతను కూడా ఎదుర్కొంటారు గనక.

  మాయావతి పార్టీ దళితులు, బి.సిల అణచివేత పునాదిగా పుట్టిన పార్టీ. ఆ పార్టీకి భూస్వామ్య, పెట్టుబడిదారుల మద్దతు ఉంది. కనుక అది పైకి చెబుతున్నట్లు దళితుల, పేదల ప్రయోజనాలను నెరవేర్చడం దానికి సాధ్యం కాదు. వ్యవస్ధ పునాదిని కదిలించకుండా కేవలం రాజకీయాధికారంతో దళితులను ఉద్ధరించడం కుదరదు.

  ఎవరిని ఉద్ధరించాలన్నా మొదట భూములు, ఫ్యాక్టరీలు ప్రజల పరం కావాలి. ఇంకా చెప్పాలంటే శ్రామికుల పరం కావాలి. కాని అవి ఇప్పుడు భూస్వాములు, పెట్టుబడుదారులు, మాఫియాలు, సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉన్నాయి. వీటిని లాక్కొని అశేష ప్రజలకు అప్పజెప్పకుండా ఎటువంటి మార్పు సాధ్యం కాదు. మార్పుగా కనిపించేది పై పూత మాత్రమే. అది కూడా కొద్ది మంది దళిత ధనికులు తయారు కావడానికి దారి తీస్తుంది తప్ప దళిత జనోద్ధరణకు సహాయపడదు.

  మీరు ప్రతిసారి నన్నేదో ఇరుకున పెట్టనున్నట్లు భావిస్తుంటారనుకుంటా. ఉన్న విషయం మాట్లాడితే ఇరుకున పడే అవసరం ఎవరికీ రాదు. చర్చ చేయడానికి ప్రయత్నించండి. కాని ఇరుకున పెట్టడానికి కాదు. ఇక్కడ అలాంటివి సాధ్యం కాకపోవచ్చు.

 7. “మీరు ప్రతిసారి నన్నేదో ఇరుకున పెట్టనున్నట్లు భావిస్తుంటారనుకుంటా.”
  నేను ఎప్పుడు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేయాలను కోలేదు. నాకా ఉద్దేశమే లేదు. బ్లాగులో ఎవడి స్వేచ్చ, సిద్దాంతం, ఇష్టం వారిదే అని నమ్ముతాను. అలా ప్రత్యేకించి రాయటానికి కారణం. ఇంత పెద్ద వ్యాసం మీరు రాసిన తరువాత కూడా , నేను వేసిన ప్రశ్నలు చూసి మీరు ఎక్కడ నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకొంటారో అనే కోణంలో ముందుగా ఆలోచించి రాశాను. అంతకు మించి ఎమీ లేదు.

 8. మనొహర్ గారు,
  బి ఎస్ పి గాని, మరొకటి గాని, ఏ ఉద్దేశం తో పుట్టిందో అ ఉద్దేశం నుండి వై తొలిగినప్పుడు దానంతటదే చరిత్రలో కనుమరుగై పోతుంది దలిత ఇంటలక్సువల్ ఎందుకు ఖండించాలి? కొంతమది సమాజంలో ఉన్న సమస్యలను సొమ్ము చేసుకుంటారు.

 9. Karpuri Thakur claimed himself as socialist and became CM of Bihar. After he became CM, his government killed many naxalites in fake encounters and even made firings on unarmed farms. Even Mayawati used the name of dalit existencialism as Karpuri Thakur and Ram Manohar Lohia did use the name of socialism.

 10. చరిత్రలొ చాలామంది ఈ అసమానతలు చుసి చలించిపొయి తమ జీవితాలను వాటికి దారపొచారు. వాళ్ళకు తొచిన పరిస్కారాన్ని వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నించారు. ఇందులొ రకరకాల పరిస్కార మార్గాలు చుపేరు. ఒకరు ప్రభుత్వమే పేదలకు పెట్టుబడులు ఇవ్వాలంటె మరివకరు దానాలద్వరా, ఇలా రకరకాల మార్గాలు చుపేరు. కాని ఆచరణలొ ఏదీ సరైన ఫలితాల్ని ఇవ్వలేదు. మంచి మనసుంటే సరిపొదు కన్నిళ్ళు సమస్యను పరిస్కరించలేవు. కాన్షిరాం కుడా తెలిసి చేసినా తెలియక చేసినా బుర్జువా పరిపాలనకు ఎంత మెరుగులు దిద్దాలని చేసినా దాని పునాది కారణంగా ఆ మెరుగులు ఎమీ పనిచేయవు. ప్రస్తుతం ఆ మెరుగులు దిద్దే కార్యక్రమంలొనే కమ్యునిస్టు పార్టీలు కుడా వున్నాయి. బి.యస్.పి. పార్టీకీ, కమ్యునిస్టు పార్టీలకు తేడా అంటూ ఏమీలేదు పేర్లలొ తప్ప!!.

 11. “But she is end product of dalit moment or dalit consciousness.”

  This is utterly wrong. It is nothing but belittling Dalit consciousness. You are expressing the prohibited sentiment in a veiled manner.

  Dalits’ movement and their consciousness is aimed at centuries old caste oppression. It was for betterment of their pathetic living conditions. It is born against masscares like Karamchedu, Neerukonda, Padirikuppam etc…

  Dalit movements surfaced because there has been a failure of communist parties to organize anti-caste movements as well as class movements. In the absence of strong class conscious movements, naturally, the ruling classes step in and place their agents to show that they are representing Dalits’ interests also.

  Mayavati benefited from Dalit movement in that way. In the end, Mayavati is one of the products of machinations of the upper caste and upper class ruling classes but not the end product of Dalit consciousness. Upper caste ruling classes succeeded in diverting a part of Dalit consciousness into their fold in the form of Mayawatis.

  Actually, Dalit consciousness should be welcomed and should be allowed to take it’s course in search of casteless society. It should be streamlined into the struggles of establishing classless society and communist parties should have taken such a role. But they failed. That doesn’t mean that Dalit consciousness failed. It succeeded in certain fronts and it is progressing. It may not be visible to the naked eye, but it is progressing.

  There are Dalit intellectuals and intellectuals in general who rejected Mayawati’s deliberate anti-Dalit aberrations. If we cannot see, read and listen them, that will not imply that there are none.

 12. వి శెఖర్ గారూ. నేను పై కామెంట్లొ దళిత ఉద్యమాన్ని యక్కడా కించపరచలేదు. నేను విమర్శించింది దళిత నాయకుల్ని మాత్రమే అదికుడా మాయావతిని. కాన్షిరామ్ని కాదు. ప్రతి పొరాటమూ వర్గపొరాటానికి దారితీస్తుందని అనుకొవడం లేదు తీయాలనికుడా అనుకొవడం లేదు. తాత్కాలిక సమస్యలకొసం తాత్కాలిక పొరాటాలు కుడా అవసరమే.

  నేను నా బావాల్ని ముసుగు వేసుకుని నర్మ గర్బంగా తిరొగామి బావాల్ని వ్యెక్తపరుస్తునన్నారు. నాకు ఆ అవసరం లేదు నా బావాల్ని ఎప్పుడూ సుటిగానే వ్యక్తపరిచాను. నేను వ్యక్తపరచాలనుకుంటె సుటిగానే వ్యక్తపరుస్తాను పైగా తిరొగామి బావాలకు ఇంకా కాలం చెల్లలేదు సమాజంలొ వాటికి ఆమొదముద్రవుంది. .

  మాయావతి విషయమై గతంలొ మనిద్దరి మద్య చర్చ జరిగింది . మొత్తం పైన మీరు మాయావతికి వీరాభిమానిలా తొస్తున్నారు.

 13. రామ్మోహన్ గారు పై సమాధానం మీకిచ్చింది కాదు. మనోహర్ గారికి ఇచ్చినది. పొరబడడానికి అవకాశం లేకుండా ఆయన రాసిన వాక్యాన్ని ఉటంకిస్తూ సమాధానం ఇచ్చాను. ఐనా ఎందుకో పొరబడ్డారు. సంబోధన లేకపోవడంతో పొరబడ్డారనుకున్నా ఉటంకనను బట్టి గమనించి ఉండాల్సింది.

  అయినా, ఈ ఆర్టికల్ మాయావతిని విమర్శిస్తూ రాసింది. దళితులకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె విస్మరిస్తోందని, పాలకవర్గాలకు సేవకురాలని రాశాను. తాము చెప్పిన సిద్ధాంతాలకు కూడా కట్టుబడి లేరని రాసాను. అందులో మీకు వీరాభిమానం ఎలా కనపడింది? చాలా ఆశ్చర్యంగా ఉంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s