అమెరికా: తుపాకులు పట్టుకు తిరిగేవారిలో తెల్లవారే ఎక్కువ


NYPD

NYPD

న్యూయార్క్ నగరంలో నల్లవారి కంటే తెల్లవారే ఎక్కువగా తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని న్యూయార్క్ పోలీసుల సర్వేలో తేలింది. నేరం జరిగినప్పుడల్లా నల్లవారిని అనుమానించే న్యూయార్క్ పోలీసుల ధోరణిలో తీవ్ర తప్పిదం ఉందని దీని ద్వారా స్పష్టం అవుతోంది.

న్యూయార్క్ పోలీసులు గత రెండు మూడు సంవత్సరాలుగా పాటిస్తున్న stop-and-frisk ఆపరేషన్లలో సేకరించిన డేటా ద్వారా నల్లవారి కంటే రెట్టింపు సంఖ్యలో తెల్లవారి దగ్గరే ఆయుధాలు లభ్యమయ్యాయని రష్యా టుడే తెలిపింది. న్యూయార్క్ పోలీసుల స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ నగర మేయర్ బ్లూమ్ బర్గ్ మద్దతుతో నిరాఘాటంగా సాగుతోంది.

2012 లో జరిగిన స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ వివరాలను న్యూయార్క్ పబ్లిక్ అడ్వొకేట్ కార్యాలయం పత్రికలకు విడుదల చేసినట్లు తెలుస్తోంది. రోడ్డు పైన వెళ్ళే వారిని ఆపి తుపాకులు ధరించి ఉన్నారేమో వెతకడాన్ని స్టాప్-అండ్-ఫ్రిస్క్ అని పేరు పెట్టి నిర్వహిస్తున్నారు. అందరినీ కాకుండా అనుమానితులను మాత్రమే ఆపి వెతుకుతారు. ఇలా అనుమానించినవారిలో ఆఫ్రికన్ అమెరికన్ల కంటే తెల్లవారి వద్దనే రెట్టింపు సార్లు ఆయుధాలు దొరికాయి.

నిర్దిష్టంగా చూస్తే, న్యూయార్క్ పోలీసులు తాము ఆపిన ప్రతి 49 మంది తెల్లవారిలో ఒకరి వద్ద ఆయుధం ఉన్నట్లు కనుగొనగా, ప్రతి 93 ఆఫ్రికన్ అమెరికన్లలో ఒకరి వద్ద ఆయుధాన్ని కనుగొన్నారు. లాటినో అమెరికన్లయితే పోలీసులు ఆపి వెతికినా ప్రతి 71 మందిలో ఒకరి వద్ద ఆయుధాన్ని కనుగొన్నారు. అంటే పోలీసులు సాంప్రదాయకంగా భావించే నేరస్ధ స్వభావాల వరుస సరిగ్గా వ్యతిరేకంగా ఉందన్నమాట. తెల్లవారి కంటే ఎక్కువగా లాటినో అమెరికన్లు, వీరిద్దరి కంటే ఎక్కువగా నల్లవారు, నేరస్ధ స్వభావం కలిగి ఉంటారని అమెరికాలో ఒక సాధారణ అవగాహన వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవగాహన వాస్తవానికి పూర్తి విరుద్ధమని న్యూయార్క్ పోలీసుల స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ వెల్లడి చేసినట్లయింది.

ఇది ఒక్క ఆయుధాలకే పరిమితం కాదు. నిషేధిత పదార్ధాలు లేదా సరుకులను కలిగి ఉండడంలో కూడా తెల్లవారే ముందంజలో ఉన్నారని న్యూయార్క్ పోలీసులు సేకరించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్.వై.పి.డి (న్యూ యార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్) సేకరించిన వివరాల ప్రకారం ప్రతి 43 మంది తెల్ల అనుమానితుల్లో ఒకరి వద్ద నిషేధిత పధార్ధాలు (డ్రగ్స్, స్మగుల్ చేసిన సరుకులు మొ.వి) లభ్యం కాగా ప్రతి 61 మంది ఆఫ్రికన్ అమెరికన్ల అనుమానితుల్లో ఒకరి వద్ద అలాంటి పదార్ధాలు లభ్యం అయ్యాయి. లాటినో అమెరికన్ల విషయంలో ఈ సంఖ్య 57. అంటే తెల్లవారి కంటే మూడో వంతు తక్కువ నల్లవారి వద్ద మాత్రమే నిషేధిత పదార్ధాలు దొరికాయి.

నల్లవారే నేరస్ధులని పోలీసుల విశ్వాసం

ఇటీవల కోర్టు దృష్టికి వచ్చిన ఒక కేసు ద్వారా న్యూయార్క్ పోలీసులు నల్లవారి పట్ల ఎంత వివక్షాపూరితంగా వ్యవహరిస్తారో వెల్లడయింది. పోలీసులు కేవలం నల్లజాతి యువకులనే రెగ్యులర్ గా టార్గెట్ చేస్తున్నారని, నల్ల జాతి యువకులు నేరస్ధ స్వభావం కలిగి ఉంటారని వారు భావించడమే దీనికి కారణమని వెల్లడయింది. నల్లజాతి ప్రజలతో పాటు ఇతర మైనారిటీ జాతి ప్రజలపై కూడా న్యూయార్క్ పోలీసులు వివక్ష చూపుతున్నారట.

మార్చి నెలలో పెడ్రో సెర్రనో అనే న్యూయార్క్ పోలీసు అధికారి కోర్టులో ఇచ్చిన సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. 8 యేళ్లుగా పోలీసు డిపార్టుమెంటులో పని చేస్తున్న సదరు అధికారి తనకు తన పై అధికారులు నల్ల జాతి యువకులను ఎక్కువగా టార్గెట్ చేయాలని చెప్పినట్లు తెలిపాడు. ఇనస్పెక్టర్ క్రిష్టఫర్ మెక్ కార్మిక్ అనే పై అధికారి ఈ మేరకు తనను ఆదేశించినట్లు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. “ఈ విషయం నీకు చెప్పడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: నల్ల పురుషులు 14 నుండి 20 లేదా 21 వరకు” అని కార్మిక్ సూచించాడని పెడ్రో సాక్ష్యం ఇచ్చాడు. ఫ్లాయిడ్ వర్సెస్ సిటీ న్యూయార్క్ కేసులో పెడ్రో ఈ సాక్ష్యం ఇచ్చాడని ఆర్.టి తెలిపింది. న్యూయార్క్ పోలీసులు తమపై జాతి వివక్ష చూపారాని 4 గురు వ్యక్తులు ఈ కేసులో ఆరోపించారు.

జాతి వివక్షకు అమెరికా ఒక్కటే కేంద్రం కాదు. అనేక యూరోపియన్ రాజ్యాల్లో జాతి, మత వివక్ష కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభం దరిమిలా నిరుద్యోగం పెరిగి సామాజిక సంక్షోభం తలెత్తడంతో జాతి వివక్ష మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి చోట్ల అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపార సంస్ధల నాయకులు కూడా బహిరంగంగానే జాతి, మత వివక్షలతో ప్రకటనలు గుప్పిస్తూ స్వార్ధ ప్రయోజనాలు నీరవేర్చుకుంటున్నారు. న్యూయార్క్ పోలీసులు కేవలం శాంపిల్ మాత్రమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s