మే 20 తేదీన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని ఒక భారీ పెను తుఫాను తాకింది. ఓక్లహామా నగరం దగ్గర్లోని మూరే లో ఈ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం పూట సంభవించిన ఈ రాక్షస తుఫాను దెబ్బకి 24 మంది చనిపోయారని అంట్లాంటిక్ పత్రిక తెలిపింది.
గంటకు 200 మైళ్ళ వేగంతో వీచిన విధ్వంసక పెనుగాలులు కలపతో నిర్మించిన ఇళ్లను ఎత్తి కుదేసినట్లు పెకలించి వేశాయి. రెండు మైళ్ళ వెడల్పున విస్తరించిన ఒక ట్విస్టర్ 20 మైళ్ళ దూరం ప్రయాణించి తాను నడిచిన దారివెంట పెను విలయాన్నే చవిచూపింది.
కూలిపోయిన ఇళ్లలోనూ, ప్రాధమిక పాఠశాల భవనం లోనూ చిక్కుకుపోయిన వారిని, స్కూలు పిల్లలను కింద ఫొటోల్లో చూడవచ్చు. ఏరియల్ ఫోటోల ద్వారా కనిపిస్తున్న దృశ్యాలు ప్రకృతి ఆగ్రహానికి గురయితే ఎలా ఉంటుందో ఒక చిన్న నమూనా (sample) ను మనకు చూపుతున్నట్లుగా ఉంది.
గ్లోబల్ వార్మింగ్ పుణ్యాన ఎడారి తాపాన్నంతా కుమ్మరించే వేడి గాలులు ఒక పక్క మాడ్చేస్తుండగా, మరొక పక్క ప్రకృతి తన కోపాన్నంతా చూపుతూ ఒక్క కసురు కసిరినట్లుగా ఈ ట్విస్టర్లు అమెరికాను చుట్టేస్తున్నాయి.
ఈ సంవత్సరం అమెరికాను తాకిన తుఫానుల్లో ఇది నాల్గవది. ఇంకెన్ని కోప తాపాలను ప్రకృతి దాచి ఉంచిందో గాని మనిషి మేల్కొని ఇప్పటికైనా తన తప్పులను సవరించుకోవాలి.
–
–