చైనా ప్రధాని లీ-కెషాంగ్ భారత్ పర్యటన నేటితో మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రెండు రోజుల్లోనే పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పలు ‘అవగాహనా ఒప్పందాలు’ (Memorandum of Understanding -MoU) కుదిరాయని కూడా వారు తెలిపారు. పర్యటన ప్రారంభంలో ‘తొలుత వాణిజ్య సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకుని సరిహద్దు సమస్య దీర్ఘకాలికంగా పరిష్కరించుకుందాం’ అని లీ-కెషాంగ్ చెప్పినట్లు ది హిందు పత్రిక ప్రకటించింది. తీరా ఆయనతో మన్మోహన్ చర్చలు జరిపాక ‘వీలయినంత త్వరలో సరిహద్దు సమస్య పరిష్కారం చేసుకోడానికి ఇరు దేశాలు నిర్ణయించాయని’ అదే పత్రిక తెలిపింది. అంటే లీ-కెషాంగ్ ప్రతిపాదనను ఇండియా పూర్వపక్షం చేసినట్లా? లేక ఇలాంటి విషయాలు ఇలాగే ఉంటాయా?
కొన్ని ఒప్పందాల్లో ఇండియా కంటే చైనా ముద్రే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఋతుపవన వరదల కాలంలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన హైడ్రాలజీ వివరాలను (నీటి మట్టం, నీటి విడుదల, వరద నీరు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో మొ.వి) ఇండియాకు రోజుకు రెండుసార్లు తెలియజేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇది జూన్ 4, 2013 తేదీన ముగియనున్న పాత ఒప్పందాన్ని పొడిగించడమే తప్ప కొత్త ఒప్పందం కాదని ది హిందు విలేఖరి గార్గి పర్సాయ్ తెలిపారు. బ్రహ్మపుత్ర నదిపైన చైనా నిర్మిస్తున్న వివిధ ఆనకట్టల నిర్మాణాలపై సంయుక్త యంత్రాంగం ఏర్పాటు చేద్దామన్న ప్రతిపాదనకు ఒప్పందాల్లో స్ధానం దొరకలేదని గార్గి తెలిపారు.
హైడ్రాలజీ సమాచారాన్నే మరింత వివరంగా అందిస్తామని లీ పేర్కొనడమే గాని దానికి సంబంధించి వివరాలు వెలువడలేదని తెలుస్తోంది. పొడిగించిన ఒప్పందం ప్రకారం జూన్ 1 నుండి అక్టోబరు 15 వరకు రోజుకు రెండుసార్లు చొప్పున హైడ్రలాజికల్ డేటాను చైనా ఇవ్వనుంది. ఈ కాలంలో కాకుండా ఇతర నెలల్లో సాధారణ ప్రవాహం కంటే ఎక్కువగా నీరు ప్రవహిస్తున్నట్లయితే ఆ వివరాలు కూడా ఇవ్వాలని తాజా ఒప్పందం పేర్కొంటున్నది. పొడిగింపు ఒప్పందంలో ఇదొక్కటే అదనపు చేర్పుగా తెలుస్తోంది.
నీటి-వినియోగ సామర్ధ్యాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియాకు అందజేయడానికి ప్రత్యేకంగా వేరే ఎం.ఒ.యు కుదిరినట్లు పత్రికలు తెలిపాయి. ఈ మేరకు భారత నీటి వనరుల మంత్రిత్వ శాఖకు చైనాకు చెందిన జాతీయ అభివృద్ధి మరియు సంస్కరణల కమిషన్ కు మధ్య సహకార ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగంలో నీటిని సమర్ధవంతంగా వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం ఉద్దేశించారు.
బ్రహ్మపుత్ర నది చైనాలో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియాలో ప్రవేశిస్తుంది. చైనాలో ప్రవహిస్తున్న నది భాగం పైన ఆ దేశం ఏడు ప్రాజెక్టులు నిర్మించింది. వీటిలో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల పైన ఇండియాకు అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా 510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన జాంగ్ము ప్రాజెక్టు నీటిని నిలవ చేయడానికి ఉద్దేశించిందని, దీనివలన భారత్ కు రావలసిన నీరు రాదేమోనని, నీటి మళ్లింపు జరగొచ్చని ఇండియా అనుమానిస్తోంది. దానివలన అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన అప్పర్ సియాంగ్, లోయర్ సుహాన్ శ్రీ ప్రాజెక్టులకు నీటి లభ్యతలో తేడా వస్తుందని భావిస్తోంది.
చైనా ఈ అనుమానాలను కొట్టిపారేస్తోంది. ఇక్కడ రిజర్వాయర్లను తాము నిర్మించలేదని, నీటి మళ్లింపు కూడా జరగదని, అది కేవలం రన్-ఆఫ్ ప్రాజెక్టు మాత్రమేనని, ఆ దేశం చెబుతోంది. ఇంత వ్యవహారం నడుస్తున్నప్పటికీ లీ-కెషాంగ్ (లీ కెకియాంగ్) సందర్శనలో ఈ విషయమై ఎటువంటి చర్చలు జరిగినట్లు లేదు. కనీసం భవిష్యత్తులో చర్చించనున్నట్లు సూచనలు కూడా లేనట్లు పత్రికలు చెబుతున్నాయి. దీనికి భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. సంయుక్త వర్కింగ్ మెకానిజం ఏర్పాటు కోసం డర్బన్ లో జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా భారత్ కోరినప్పటికీ చైనా నుండి ఇంతవరకు స్పందన లేదని తెలుస్తోంది.
మొత్తం మీద డ్రాగన్ విరజిమ్మే సహజ వేడి సెగల షేక్ హేండ్ భారత ఏనుగు నెత్తి మాడినట్లు కార్టూన్ సూచిస్తోంది. ఒప్పందాలు ముగిసి తీరిగ్గా విశ్లేషణలు జరిగితే తప్ప ఇరు పక్షాలు సమానంగా లాభపడ్డారా లేక అమెరికా, ఐరోపాల వలే చైనాతో కూడా అసమాన ఒప్పందాలకు భారత పాలకులు సరిపెట్టుకున్నారా అనేది తేలగలదు.