గూగుల్ అభివృద్ధిలో దశాబ్ద కాలం గడిపి ప్రత్యర్ధి కంపెనీ ‘యాహూ’ సి.ఇ.ఓ గా పది నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన మెరిస్సా మేయర్, కొత్త బాధ్యతల్లో తన మొదటి పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. అంతర్జాలంలో విస్తృత యూజర్ బేస్ ఉన్న టంబ్లర్ బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేయడానికి యాహూ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్లకు (దరిదాపు 7,000 కోట్ల రూపాయలు) బేరం కుదిరినట్లు ఎ.పి వార్తా సంస్ధ సమాచారం.
గూగుల్ ఆవిర్భావం తర్వాత ఏ దశలోనూ సరికొత్త టెక్నాలజీని, ఆధునికతను, నూతన ఆవిష్కరణలను వినియోగదారులకు అందుబాటులోకి తేవడంలో విఫలం అవుతూ వస్తున్న యాహూ, టంబ్లర్ కొనుగోలుతో జడత్వం వదిలి గూగుల్ తో పరుగు పందెంలో సరిజోడి అనిపించుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడే నిర్ధారణలకు రావడం తొందరపాటుతనం అని అంగీకరిస్తూనే, మెరిస్సా మేయర్ సారధ్యంలో కొత్త ఉత్సాహాన్ని పొందిన యాహూ కంపెనీ గూగుల్, ఫేస్ బుక్ తదితర కంపెనీలకు కోల్పోయిన మార్కెట్ ను తిరిగి పుంజుకునే వైపుగా అడుగులు వేస్తోందని అంచనా వేస్తునారు.
ఎవరీ మేయర్?
ఒప్పందం వివరాల్లోకి వెళ్ళే ముందు మెరిస్సా మేయర్ గురించి చెప్పుకోవాలి. వచ్చే మే 30 తో 38 యేళ్ళు పూర్తి చేసుకునే మేయర్ గూగుల్ అభివృద్ధి, విస్తరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 2012లో అమెరికాలోని శక్తివంతమైన మహిళల్లో 14వ స్ధానంలో నిలిచారామె. 1999లో 24 యేళ్ళ వయస్సులో గూగుల్ కంపెనీలో ఉద్యోజినిగా చేరి అనతికాలంలోనే ఉన్నత స్ధాయికి చేరడమే కాక గూగుల్ స్ధాయిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంజనీర్, ప్రోడక్ట్ మేనేజర్, ఎక్జిక్యూటివ్ లాంటి పాత్రలు నిర్వహించి గూగుల్ కి చెందిన ‘గూగుల్ సెర్చ్, గూగుల్ ఇమేజెస్, గూగుల్ న్యూస్, గూగుల్ మేప్స్, గూగుల్ బుక్స్, గూగుల్ ప్రోడక్ట్ సర్చ్, గూగుల్ టూల్ బార్, ఐగూగుల్, జిమెయిల్ లాంటి పేరు పొందిన సర్వీసులకు రూపకల్పన చేసి వాటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గూగుల్ సెర్చ్ హోమ్ పేజీ రూపకల్పనలో ఆమెదే కీలక పాత్ర.
గూగుల్ రంగంలోకి రాక ముందు ఇంటర్నెట్ లో యాహూ కంపెనీది దాదాపు ఏకచ్ఛత్రాధిపత్యం. యాహూ మెయిల్, మెసెంజర్, సెర్చ్ ఇంజన్, న్యూస్, పర్సనల్ హోమ్ పేజ్ తదితర సర్వీసులతో యాహూయే పెద్ద కంపెనీ. కానీ గూగుల్ ఆవిర్భావంతో యాహూ సెర్చ్ ఇంజన్ కి మొదట పోటీ వచ్చింది. అనంతరం ఒక్కో అంతర్జాల సర్వీసును కొనుగోలు చేస్తూ గూగుల్ తన సర్వీసులను విస్తృతం కావించింది.
గూగుల్ ఎదుగుదల
ఈ క్రమంలో అనేక ఉచిత సర్వీసులను వినియోగదారులకు అందుబాటులో ఉంచి తద్వారా మరే ఇతర అంతర్జాల కంపెనీ వద్ద లేనంతటి భారీ యూజర్ డేటాను సేకరించి భద్రపరుచుకుంది. అందుకోసం అనేక అనైతిక చర్యలకు గూగుల్ పాల్పడింది. ‘డోంట్ బి ఈవిల్’ అనే నినాదం ఇచ్చి, దానిని తానే తుంగలో తొక్కింది. వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి భద్రపరుచుకుంది. ఉచిత సర్వీసుల మాటున సేకరించిన యూజర్ డేటాను తన అతి పెద్ద పెట్టుబడిగా మార్చుకుంది.
ఈ డేటాను ఇతర కంపెనీలకు అమ్ముకోవడం దగ్గరినుండి, అదే డేటా ఆధారంగా స్ధానిక సర్వీసులను చిటికెలో అందజేసే సౌకర్యాలను అందుబాటులో ఉంచడం వరకు చేసింది. ప్రతి సర్వీసులోనూ యాడ్స్ చొప్పించి 2012 చివరి నాటికి 300 బిలియన్ డాలర్ల (దరిదాపు 16.2 లక్షల కోట్ల రూపాయలు) విలువ గల కంపెనీగా అవతరించింది. అమెరికా రాజ్య వ్యవస్ధకు గూగుల్ ఇపుడు అత్యంత సన్నిహితమైన కంపెనీ అంటే అతిశయోక్తి కాదు. అంతర్జాలంలో ఎక్కడ పట్టినా గూగుల్ ముద్ర కనిపిస్తోందంటే అందులో అనేక విధాలుగా అది అనుసరించిన కుయుక్తులు, వ్యాపార అనైతికత, సామాజిక విలువలకు తిలోదకాలు ఇవ్వగల తెగింపు… ఇవన్నీ ముఖ్యపాత్ర పోషించాయి. అంతర్జాలంలో “గూగుల్ లేకుండా కనీసం ఒక్క రోజయినా” గడవని పరిస్ధితి ఈ రోజు నెలకొని ఉన్నది.
ఈ ఎదుగుదలలో గూగుల్ అనైతిక విధానాలలో మేయర్ పాత్ర ఎంత ఉన్నదీ తెలియదు. ఆమె పాత్ర ప్రధానంగా సాంకేతిక అభివృద్ధిలోనే తప్ప వ్యాపార విధానాలలో లేదని కొందరు చెబుతారు. అది ఎంతవరకు నిజమో తెలియదు.
యాహూ బాధ్యతలు
ఈ నేపధ్యంలో మేయర్ ను బుట్టలో వేసుకోవడంలో యాహూ సఫలం అయింది. జులై 16, 2012 తేదీన యాహూ కంపెనీ ప్రెసిడెంట్ మరియు సి.ఇ.ఓ గా బాధ్యతలు స్వీకరించిన మేయర్ ఆ మరునాడే తాను గర్భవతినని ప్రకటించారు. యాహూ ఉద్యోగుల్లో పునరుత్తేజం నింపడంలో ఆమె మొదట కేంద్రీకరించిందని, ఆ క్రమంలో కఠిన విధానాలు అవలంబించ్చిందని విమర్శలు ఉన్నాయి. ఇంటి వద్ద ఉండి పని చేసే ఉద్యోగులకు ఆ సౌకర్యం రద్దు చేసి ప్రతి ఒక్కరూ ఆఫీసుకు రావలసిందేనని ఆమె హుకుం జారీ చేశారామె. కానీ గర్భిణిగా చివరి రోజుల్లో ఆమె సెలవు తీసుకోడానికి బదులు ఇంటివద్ద నుండి పని చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.
యాహూ బాధ్యతలు స్వీకరించాక ‘టంబ్లర్ కొనుగోలు’ కంపెనీ విస్తరణ కార్యక్రమంలో అతి పెద్దది. చైనా ఇంటర్నెట్ కంపెనీ ఆలీబాబాలో సగం షేర్లు అమ్మడం ద్వారా కూడగట్టుకున్న 5.4 బిలియన్ డాలర్లలో 1.3 బిలియన్లు ఈ కొనుగోలుకు వినియోగిస్తున్నారని ఏ.పి తెలిపింది. అయితే టంబ్లర్ బాస్ డేవిడ్ కార్ప్ ను తొలగించబోమని ఆయన సారధ్యంలోనే స్వతంత్రంగా పని చేస్తుందని యాహూ ప్రతినిధులు చెబుతున్నారు. టంబ్లర్ బ్లాగుల్లో ప్రకటనలు దాదాపు కనిపించవు. టంబ్లర్ వినియోగదారులకు అతి పెద్ద ఆకర్షణ ఆ లక్షణమే. అయితే టంబ్లర్ లో యాడ్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా యాహూ ఆదాయం పెంచుతామని మేయర్ చెప్పినట్లు బిజినెస్ ఇన్సైడర్ పత్రిక చెబుతోంది.
మేయర్ ది మొదటి నుండి చదువులో రాణించిన చరిత్ర అయితే టంబ్లర్ వ్యవస్ధాపకుడు డేవిడ్ కార్ప్ ది అందుకు పూర్తి విరుద్ధం. స్కూల్ చదువు నుండి వైదొలిగి ‘బడి మానేసిన విద్యార్ధి’గా మిగిలిన కార్ప్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఆసక్తి పెంచుకుని పిన్న వయస్సులోనే అంతర్జాలంలో ఒక టెక్నాలజీ జెయింట్ గా ఎదిగాడు. వివిధ కంపెనీలు మారుతూ, ఆరేళ్ళ క్రితం సొంతగా టంబ్లర్ ప్రారంభించి కొద్ది కాలంలోనే భారీ యూజర్ బేస్ కల ప్లాట్ ఫారం గా తీర్చి దిద్దాడు. అలాంటి టంబ్లర్ ని టేకోవర్ చేయడం యాహూకి ఎంతవరకు ఉపకరిస్తుందో వేచి చూడవలసిందే.
2008లో యాహూ కొనుగోలుకు మైక్రో సాఫ్ట్ కంపెనీ తీవ్రంగా ప్రయత్నించింది. షేర్ కు 33 డాలర్లు ఇవ్వజూపినప్పటికీ యాహూ కో ఫౌండర్ జెర్రీ యాంగ్ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత యాహూ షేర్ నాలుగేళ్ల పాటు 20 డాలర్లు దాటకుండానే గడిపింది. మేయర్ రాకతో 26.52 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న యాహూ షేర్ ధర 33 డాలర్లకు చేరితే ఆ క్రెడిట్ మేయర్ కే దక్కుతుంది.
టంబ్లర్ సర్వీస్ లో ప్రకటనలను చొప్పిస్తే దానికి ఉన్న యూజర్ బేస్ నిలుస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. టంబ్లర్ ఆకర్షణే ప్రకటనలు లేకపోవడం కనుక ఈ అనుమానాలు. మొబైల్ గాడ్గెట్స్ లక్ష్యంగా చేసుకుని యాహూని అభివృద్ధి చేసే వైపుగా మేయర్ పధకాలు రూపొందిస్తోందని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో డెస్క్ టాప్ పి.సిలు, లాప్ టాప్ లు తగ్గిపోయి మొబైల్ ఫోన్ల పైనే ఎక్కువగా జనం ఆధారపడతారని అంచనా వేస్తున్నారు. మొబైల్ వినియోగానికి టంబ్లర్ అనువుగా ఉన్నందున టంబ్లర్ కొనుగోలు ద్వారా మేయర్ వేసిన ఎత్తుగడ ఫలించవచ్చని భావిస్తున్నారు.