ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు?
ఆదివారం (19/05/2013) ఈనాడు పత్రికలో వచ్చిన ఒక వార్తా విశ్లేషణ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో చిన్న క్లూ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. (పైన బొమ్మని క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో పేపర్ కటింగ్ ఓపెన్ అవుతుంది.) “అలా ‘బుక్’ అయ్యారు” అనే శీర్షికన వచ్చిన ఈ కధనంలో ఈ కింది వాక్యాలు గమనించండి.
“ఫిక్సర్లతో ఆటగాళ్లు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఫోన్ లో మాట్లాడరు. ఇది ఫిక్సింగ్ లో ప్రాధమిక సూత్రం. ఇంతకుముందు కూడా ఎంతోమంది బుకీలు మ్యాచ్ లను ఫిక్స్ చేశారు. కానీ ఎవరూ ఇంత తెలివి తక్కువగా వ్యవహరించలేదు.” ఇది ఒక బుకీ చెప్పిన మాట.
ఆయన ఇంకా ఏమన్నాడంటే –శ్రీశాంత్, దొరికిన ఇతర క్రికెటర్లు మొత్తం వ్యవహారంలో చిన్న పావులు మాత్రమేనని, కీలక వ్యక్తులు కాకపోవచ్చని.
మరయితే అసలు నిర్వాహకులు ఎవరు? పెద్ద ఆటగాళ్ళా, ఫ్రాంచైజీల యజమానులా, లేక వారి తరపున పనిచేసే అనుచరులా? లేక రాజకీయ నాయకులు, వారి కార్యాలు నెరవేర్చే మాఫియాలా?
ఈనాడు ఇంకా ఏమంటున్నదో చూడండి. –అసలు వ్యక్తులను పక్కనబెట్టి.. తామే ఎక్కువ లాభాలు సంపాదించేద్దామన్న కొందరు జూనియర్ బుకీల అత్యాశే శ్రీశాంత్ తదితరులు దొరికిపోవడానికి కారణమంటున్నాయి బెట్టింగ్ వర్గాలు.
కనుక వివిధ బెట్టింగ్/బుకింగ్/ఫిక్సింగ్ వర్గాల మధ్య ఒక వైరుధ్యం తలెత్తిందన్నమాట! ‘అప్పటికే పాతుకుపోయిన పెద్ద ముఠాను సవాలు చేస్తూ మరో ముఠా కొత్తగా అవతరించింది. కొత్త ముఠా వాస్తవానికి పాత ముఠాలో భాగమే అయినప్పటికీ ఫిక్సింగ్ ఆదాయాల్లో వారికి అందుతున్న వాటా పట్ల వారు సంతృప్తిగా లేరు. దానితో తామే కొత్తగా మరో ముఠా ఏర్పరుచుకుని ఫిక్సింగ్ మార్కెట్ లోకి పోటీదారులుగా జొరబడ్డారు.’ -అని భావించవలసి వస్తోంది.
ఈనాడు సదరు బుకీని ఇంకా ఇలా ఉటంకించింది.
“ఇక్కడ వ్యాపారం నమ్మకంతో జరుగుగుతుంది. తేడా వస్తే ఫలితాలూ తేడాగానే ఉంటాయి. అంతర్గతంగా ఒక వ్యవస్ధ పనిచేస్తోంది. అందులో భాగంగానే అందరూ పని చేయాలి. కాదని స్వతంత్రిస్తే.. మళ్ళీ వ్యవస్ధలోకి రాకుండా చేస్తారు. శ్రీశాంత్ విషయంలో కొందరు జూనియర్ బుకీలు వ్యవస్ధకు దూరంగా స్వతంత్రంగా పనిచేయాలని భావించి ఉంటారు. అందుకే దొరికిపోయారు.”
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే…
‘అందుకే దొరికిపోయారు’ అనడం ‘తేడా వస్తే ఫలితాలు తేడాగానే ఉంటాయి’ అనడానికి పర్యాయ పదజాలంగా తోచడం లేదా?
‘తేడాగా వ్యవహరిస్తున్న’ పిల్ల ముఠాని అసలు ముఠా అసలు ముఠా సహించలేకపోయింది. ‘అందుకే దొరికిపోయేలా చేసింది’ అనొచ్చా?
పోలీసులు కూడా బుకీ మాటలను ధృవీకరించారని చెప్పడం గమనించవచ్చు. అంటే పిల్ల ముఠా దొరికిపోవడంలో పోలీసుల పాత్ర/సహకారం ఉందన్నమాట! “మార్చి నుండి నిఘా వేశాం. వారిని తప్పులు చేయనిచ్చాం. చేశాక పట్టుకున్నాం” అని పోలీసులు చెప్పినట్లు జాతీయ పత్రికలు చెప్పాయి. అంటే ఏప్రిల్ లో ఐ.పి.ఎల్-6 ప్రారంభం కావడానికి మునుపే తప్పు జరగనున్నట్లు పోలీసులకు తెలుసు. దానిని నివారించడానికి బదులు తప్పు జరగడానికే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకు? పట్టుకోవడానికి!
బహుళ ప్రజాదరణ పొందిన ఒక ఆటల పండగలో జైలు శిక్షలు పడే నేరాలు జరగనున్నాయని తెలిసినపుడు వాటిని జరగకుండా ఆపి ప్రజల ఆనందంతో గేమ్స్ ఆడకుండా ఆపుతారా లేక నేరాలు జరగనిచ్చి నేరస్ధులను పట్టుకుంటారా?
ఇంకా స్పష్టంగా అర్ధం కావడానికి ఒక హత్యా నేరం జరగబోతోందని ఖచ్చితమైన సమాచారం అందినపుడు అక్కడికి ముందుగానే వెళ్ళి హత్య జరగకుండా ఆపుతారా లేక హత్యా స్ధలంలో మాటుగాచి, హత్య జరిగేవరకు ఎదురు చూసి, దానిని వీడియో తీసి ‘మేము రెడ్ హ్యాండెడ్ గా హంతకుడ్ని పట్టుకున్నామహో’ అని సగర్వంగా వీడియో ప్రదర్శిస్తూ సంచలనాత్మకంగా ప్రకటిస్తారా? ఈ రెండోది జరిగితే పోలీసులని పిచ్చోళ్ల కింద జమకడతాం.
కానీ పోలీసులు పిచ్చోళ్ళు కాదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ అయితే అసలే పిచ్చాయన కారు. అత్యాచారం దోషులను శిక్షించండి అని అడగడానికి గుమికూడిన జనం పైన అమానుషంగా టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, లాఠీ చార్జ్ తదితర ఆయుధాలను మరో మాట లేకుండా ప్రయోగించిన ఘనత ఆయన సొంతం. నిర్భయ మరణించాక మళ్ళీ నిరసనలు చెలరేగుతాయేమోనని ‘ముందు జాగ్రత్త చర్య’గా ఢిల్లీ మెట్రో రైల్ సర్వీసులను రద్దు చేయించిన ఘనత కూడా ఆయనదే.
శ్రీశాంత్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని మొదటి నుండి అమిత శ్రద్ధతో దగ్గరుండి పర్యవేక్షించింది నీరజ్ కుమారే. పత్రికలకు ఫిక్సింగ్ వీడియోలు, వారి సంభాషణలు విలేఖరులకు వెల్లడించిన సమావేశంలో ఆయనా ఉన్నట్లు పత్రికల్లో వచ్చింది. నిర్భయ నిరసనలను అణచివేయడంలో ఎంతో ముందు జాగ్రత్తగా వ్యవహరించి జరగబోయే నిరసనలను కూడా నివారించిన నీరజ్ కుమార్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని జరగకుండా నివారించడానికి బదులు జరగనిచ్చి అరెస్టు చేయడానికే ఎందుకు మొగ్గు చూపినట్లు?
కొంపతీసి, అసలు ముఠాకి………………..?
ఎవరు ఎవరయినా, ఫిక్సింగ్ ముఠాల మధ్య వైరుధ్యమే శ్రీశాంత్ కొంప ముంచిందనడంలో అనుమానం లేదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు మాఫియా ముఠాల మధ్య వైరుధ్య పరిష్కారానికి ముగ్గురు (లేదా ఐదుగురు) యువ క్రికెటర్ల కెరీర్ నాశనం అయింది. క్రికెటర్ల వద్దకి బుకీలు వచ్చారు గానీ, బుకీల వద్దకి క్రికెటర్లు వెళ్లలేదు. ఇది క్రికెటర్ల నేరాన్ని సమర్ధించడానికి కాదు. వారు బలి పశువులు అయ్యారని చెప్పడానికి.
ఒకప్పటి హేమా హేమీలు ఫిక్సింగ్ లో దోషులుగా తేలారు. ఒక ఒక అజారుద్దీన్, ఒక హాన్సీ క్రానే… వీరిద్దరూ కెప్టెన్లే. వీరే కాక అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మ… వీరూ పేరు పొందిన క్రికెటర్లే. ‘ఫిక్సింగ్ అందరికీ తెలిసిన ఒక వాస్తవం’ అని అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్ లు ప్రకటించిన మాట మరువరాదు.
నీరజ్ కుమార్ ప్రకారం విదేశాల నుండి ప్రధాన నేరస్ధులు తాజా ఫిక్సింగ్ వెనుక పని చేశారు. వారు మాఫియాలే అని కొన్ని పత్రికలు చెబితే పాక్ లో ఉన్న దావూద్ ఇబ్రాహీం అని మరి కొన్ని పత్రికలు చెప్పాయి. అంటే భారత మాఫియాకు పోటీగా పాకిస్ధాన్ మాఫియా మరో ముఠాను అభివృద్ధి చేసే క్రమంలో వారికి భారత మాఫియాలు చెక్ పెట్టారా? అందుకోసం శ్రీశాంత్ తదితరులు బలి పశువులు అయ్యారా అన్నవి సమాధానం దొరకని, ఎవరికి వారు సమాధానాలు ఊహించుకోదగిన ప్రశ్నలు.
ఏతా వాతా తేలేదేమిటంటే ఢిల్లీ పోలీసుల సాహసకృత్యం, మద్రాసు పోలీసుల అపరాధ పరిశోధన, ముంబై పోలీసుల సరికొత్త వెల్లడి… ఇవన్నీ అండర్ వరల్డ్ మాఫియా ముఠాల మధ్య తలెత్తిన వైరుధ్యాలను పరిష్కారం చేసుకునే క్రమంలో నీటి పైకి తేలిన కొద్ది బాహ్య రూపాలు మాత్రమే.
ఐస్ బెర్గ్ చివరి కొన మాత్రమే నీటిపై తేలుతూ కనిపిస్తుంది. దానిలో 90 శాతం పైన నీటిలోపలే కనపడకుండా భద్రంగా ఉంటుంది. కాదు పైకి తేలుతున్నదే మొత్తం ఐస్ బెర్గ్, లోపల అసలేమీ లేదు అని చెప్పేందుకు జరుగుతున్న ప్రయత్నమే అరెస్టులు, పరిశోధన.
ఈ పరిస్ధితుల్లో శ్రీశాంత్ ని అంతగా ద్వేషించడానికి ఏమీ లేదు. దిష్టి బొమ్మలు తగలబెట్టి వీరంగం వేయాల్సిన అవసరం అసలే లేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటి సంగతి పట్టించుకుంటే కాస్త ఆత్మ సంతృప్తయినా దక్కుతుంది.
నిన్నపేపర్ లో ఈ పట్టుపడిన క్రికేటర్ లను పెళ్ళి చేసుకోవటానికి ఎవ్వరు ముందుకు రావటం లేదని, వీరి అవినితి గురించి అవమానకరం గా చాలా వర్ణిస్తూ రాశాడు. క్రికేట్ లో జరిగే అవకతవకలు ఎన్నో ఉంటాయి. ఐ.పి.యల్. మాచ్ బ్లాక్ మని ని వైట్ మని గా మార్చటానికి జరిగే ఆటాలని పేపర్ వారికి మాత్రమే ఇంతకాలం తెలియదన్నట్లు,నిన్ననే ఈ సంఘటనతో వారు తెలుసుకొన్న ఒక ఆశ్చర్య కరమైన విషయం. పెద్దవాళ్లందరిని వదిలేసి, చిక్కాడు కదా అని చిన్న వ్యక్తులను నీచంగా చిత్రికరిస్తూ, అవమాన పరచటంలో పేపర్ కి సరిసాటి ఎవరు రారేమో!
అది అతిశయోక్తి కాకపోతే ఏమిటి? మైనర్ బాలికని రేప్ చేసిన మృగాళ్ళకే పెళ్ళిళ్ళు అవ్వగా లేనిది కేవలం లంచాలు తీసుకున్న క్రికెటర్లకి పెళ్ళిళ్ళు అవ్వవా?