ధర్మాన, సబిత రాజీనామా చేసేశారు


Dharamana, Sabithaకాంగ్రెస్ అవినీతి వ్యతిరేక నాటకంలో ఒక అంకం పూర్తయింది. ధర్మాన రాజీనామా తిరస్కరణను గతంలో ఆమోదించిన అధిష్టానమే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిందట! ధర్మానతో పాటు ‘కళంకిత మంత్రుల’ ఒకరయిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామా కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందట. ఈ విషయం ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకున్న మంత్రులు ఇరువురు ఆయనను కలుసుకుని తమ రాజీనామా పత్రాలు అందజేశారని ది హిందు తెలిపింది.

అయితే మంత్రుల రాజీనామా విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ధర్మాన వ్యక్తిగత సన్నిహతులను ఉటంకిస్తూ ఆయన రాజీనామా సంగతి పత్రిక తెలిపింది. శ్రీకాకుళంలో తన అనుచరులతో చర్చలు జరిపిన తర్వాత ధర్మాన విమానంలో విశాఖ నుండి రాజధానికి వచ్చారు. రాజీనామా చేయమని కోరితే తగిన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడబోనని తన అనుచరులతో ధర్మాన అన్నట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. అంటే ఆయన మొదట చేసిన రాజీనామా వట్టిదేనన్నమాట!

ధర్మాన విచారణకు సి.బి.ఐ అనుమతి కోరడం, అనుమతి నిరాకరిస్తూ కేబినెట్ తీర్మానం ఆమోదించి గవర్నర్ కి పంపడం, ఆ తీర్మానాన్ని గవర్నర్ వెనక్కి తిప్పి పంపడం… ఇవన్నీ వ్యవస్ధలు సక్రమంగానే నడుస్తున్నాయన్న అభిప్రాయాలను (భ్రమలను) కలిగించేవి. లేకపోతే రాజీనామా చేశానని చెప్పి 7 నెలలు అధికార బాధ్యతలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన ధర్మాన బడ్జెట్ సమావేశాల నుండి మళ్ళీ బాధ్యతల్లోకి ఎలా వస్తారు? అది కూడా ఆయనపై సి.బి.ఐ విచారణకు అనుమతి నిరాకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిప్పి పంపిన తర్వాత!

హోమ్ మంత్రి సబిత కూడా దాల్మియా సిమెంటు కేసులో ఏ4 గా సి.బి.ఐ చేర్చినపుడు ‘తాను రాజీనామా చేశానని, ముఖ్యమంత్రి వద్దన్నారని’ తెలిపారు. అంటే నేరం చేశారని దేశ అత్యున్నత నేర విచారణ సంస్ధ కోర్టులో అభియోగాలు మోపిన తర్వాత కూడా వారు మంత్రులైతే పదవుల్లో కొనసాగవచ్చన్నమాట! నైతిక సూత్రాలన్నీ విస్మరించి కేబినెట్ మొత్తం అలాంటివారికి అండగా నిలిచే లగ్జరీ కూడా వారి సొంతం.

48 గంటలు నిర్విరామంగా పోలీసుల నిర్బంధంలోనో, జైలులోనో గడిపితే సాధారణ ఉద్యోగిని విధులనుండి సస్పెండ్ చేస్తారు, అభియోగాలు నమోదు కాకపోయినా సరే. మంత్రులకు వర్తించే సూత్రం ఉద్యోగులకు ఎందుకు వర్తించకూడదు?

అధిష్టానం వైఖరిని స్పష్టం చేస్తూ ఏ.ఐ.సి.సి ప్రతినిధి పి.సి చాకో “ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి” అని ఆదివారం ఢిల్లీలో ప్రకటించారని పత్రికలు చెబుతున్నాయి. చానెళ్ల ముందు ఆమేరకు ఆయన మాట్లాడుతుండగా దృశ్యాలు కూడా ప్రసారం అయ్యాయి. అధిష్టానం యొక్క ఈ వైఖరి ధర్మాన రాజీనామా తిరస్కరణకు ఆమోదం తెలిపినపుడు ఏమయింది? ఒకే వ్యక్తి, ఒకే కేసు ఐనా అధిష్టానాల వైఖరులు ఇలా మారుతూ పోతాయా? ఇలా ఒకే కేసులో వివిధ కాలాల్లో, వివిధ వైఖరులు చూపడానికి ఏమిటి ప్రాతిపదిక?

కేంద్రంలో ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించాము కనుక రాష్ట్రంలో కూడా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిందని పత్రికలు రాస్తున్నాయి. కర్ణాటకలో కూడా నూతన మంత్రివర్గాన్ని నియమించేటపుడు ఇద్దరు కళంకిత ఎమ్మెల్యేలను మంత్రివర్గం నుండి దూరంగా పెట్టిన సంగతిని కూదాయ కాంగ్రెస్ అధిష్టానానికి మద్దతుగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

అవినీతి జరిగింది ఆంధ్ర ప్రదేశ్ లో. ఇక్కడి ప్రజల భూములను, ఆస్తులను లాక్కొని అక్రమంగా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడంలోను, ప్రజలకు చెందిన ఖనిజ వనరులను ప్రైవేటు మాఫియాలకు దోచి పెట్టడంలోనూ మంత్రులు ప్రత్యక్ష పాత్ర పోషించారు. స్వయంగా జి.ఓ లు జారీ చేసి ప్రజలను బాధపెట్టారు. రాజ్యాంగం, ఆ పేరుతో ప్రజలు అప్పగించిన బాధ్యతలను స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇందులో బాధితులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. బాధించినది కూడా ఆంధ్ర ప్రదేశ్ మంత్రులే. అలాంటిది ఇక్కడి నేరాలకూ, కేంద్రంలోనూ, మరొక రాష్ట్రంలోనూ జరిగిన నేరాలకూ లంకె పెట్టడం ఏమిటో అసలు అర్ధం కాని విషయం. చూడబోతే ఇది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునేటప్పుడు వచ్చిన తగాదాను పరిష్కరించుకోవడంగా కనిపిస్తోంది తప్ప ప్రజా పాలన, ప్రభుత్వ నియమాలు, చట్టాల అమలు నేరము-శిక్ష ఇత్యాది సూత్రాలేవీ పరిగణనలో ఉన్నట్లు కనిపించడం లేదు.

అక్రమ జి.ఓ ల వలన తాము నేరుగా లబ్ది పొందలేదని ధర్మాన, సబితలు వాదిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే ఎవరు లబ్ది పొందారు? వై.ఎస్.రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డిలు లబ్ది పొందారని ఇప్పటికైనా స్పష్టంగా చెప్పగలరా? ఆ మేరకు వారు కోర్టులో సాక్ష్యం ఇవ్వగలరా? సాక్ష్యం ఇస్తామని ప్రజలకు చెప్పగలరా? ఇదొక విషయం అయితే స్వయంగా సంతంకం చేసి జి.ఓ లు విడుదల చేసిన మంత్రులు ‘తాము చదవకుండా సంతకాలు పెట్టామని, పదాలను మార్చిన సంగతి చూడలేదని, తమకు ఒక్క పైసా దక్కలేదని’ వాపోవడం ఏ నియమానికి కట్టుబడి వాదిస్తున్నారు? ఇలా చదవకుండా సంతకాలు పెట్టేస్తామని వారు ప్రజలకు చెప్పగలిగితే వారిని ఈ ఉచ్చులోకి లాగిన ఎమ్మెల్యే పదవులే వారికి దక్కకపోను కదా!

నేరం జరిగినపుడు ధర్మాన రెవిన్యూ మంత్రి కాగా, సబిత ఇంద్రా రెడ్డి గనుల శాఖ మంత్రి. 30 నిమిషాల సేపు జరిగిన సమావేశంలో ఇరువురికీ అధిష్టానం సందేశాన్ని ముఖ్యమంత్రి వివరించారట. ఇద్దరినీ కాపాడడానికి తాను ఎంతగా శ్రమించినదీ ఏకరువు పెట్టారట. కానీ కేంద్ర మంత్రుల రాజీనామా, కర్ణాటక మంత్రివర్గ రూప కల్పన తదితర అంశాలను అధిష్టానం లేవనెత్తాక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాట్లాడలేకపోయారట. ఇంతకీ మిగిలిన ముగ్గురు మంత్రుల విషయం ఏమిటో తెలియలేదు. వారిపైన కూడా సి.బి.ఐ అభియోగాలు మోపితే తప్ప వారు ‘రాజీనామా చేయవలసిన’ కళంకిత మంత్రుల కిందికి రారేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s