అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం


Cartoon: Satish Acharya

Cartoon: Satish Acharya

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది.

పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎఫ్.ఎం.ఐ.కలీఫుల్లా ఈ మేరకు రూలింగ్ ఇచ్చిందని పి.టి.ఐ తెలిపింది.

“రెండు వేళ్ళ పరీక్ష, దరిమిలా జరిగే నిర్ధారణ అత్యాచార బాధితుల ఏకాంత హక్కు, మానసిక సమగ్రత, గౌరవాలను ఉల్లంఘిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. కనుక ఈ పరీక్ష, బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, వారి అంగీకారంతోనే జరిగిందని తనకు తానుగా అర్ధం ఇచ్చేది కాజాలదు” అని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా కూడా ఒక అంగీకారం ఉన్న సంగతి కోర్టు ప్రస్తావించింది.

లైంగిక అత్యాచార బాధితులు తమ శారీరక, మానసిక సమగ్రత మరియు గౌరవాలను కోల్పోకుండా న్యాయం పొందే హక్కు ఉందని అంతర్జాతీయ స్ధాయి అంగీకారం ఉన్నదని కోర్టు పేర్కొంది. “వైద్య ప్రక్రియలు క్రూర, అమానవీయ లేదా గౌరవాన్ని తగ్గించే పద్ధతుల్లో జరపడానికి వీలు లేదు. లింగ వివక్షా పూరిత హింసలో బాధితుల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. లైంగిక హింసల నుండి బతికి బట్టకట్టిన వారికి అటువంటి సేవలను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వారి భద్రతకు భంగం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. ఆమె ఏకాంత హక్కును చిత్తారీతిన, చట్ట విరుద్ధంగా భంగం కలిగించడానికి వీలు లేదు” అని కోర్టు పేర్కొంది.

సిగ్గు చేటు

లైంగిక అత్యాచార బాధితుల పైన నేరం జరిగిందీ లేనిదీ నిర్ధారించడానికి వైద్య సిబ్బంది రెండు వేళ్ళు జొనిపి యోని బిగుతును అంచనా వేసే విధానం ఇంకా అమలులో ఉంది. పరీక్ష చేసే వ్యక్తికి వదులుగా ఉన్నట్లు అనిపిస్తే అత్యాచారాన్ని నిర్ధారించడం లేదంటే అత్యాచారం జరగలేదని చెప్పడం ఒక విధానంగా అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.

Photo: India Today

Photo: India Today

ఇలా వేళ్ళ పరీక్ష ద్వారా హైమన్ పొర ఉన్నదీ లేనిదీ కూడా నిర్ధారించి తద్వారా అత్యాచారాన్ని నిర్ధారించడం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పద్ధతులు అశాస్త్రీయం అని నిర్ధారణ జరిగి దశాబ్దాలు గడిచింది. అయినప్పటికీ ఈ రెండు వేళ్ళ పరీక్ష అమలులో ఉండడం వైద్య శాస్త్ర రంగానికే గాక, శాస్త్ర అభివృద్ధిని పరిగణించని నేర నిర్ధారణ రంగానికి, మొత్తం సమాజానికే సిగ్గు చేటు.

ఇటువంటి పరీక్షల ద్వారా జరిగిన నిర్ధారణలు కోర్టులు కూడా అంగీకరించడం ఆశ్చర్యం కలిగించే విషయం. సుప్రీం కోర్టులో ఒకటి రెండు ధర్మాసనాలు పూనుకుని రూలింగ్ ఇస్తే తప్ప ఇలాంటి అశాస్త్రీయ పద్ధతులు ప్రధాన నేర విచారణా స్రవంతి నుండి వైదొలగని దయనీయ పరిస్ధితి నేటికీ కొనసాగడం బట్టి శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి సమాజంలోని అట్టడుగు సెక్షన్ల ప్రజలకు చేరలేదనడానికి మరో తార్కాణం. ఇంతకీ ధర్మాసనం రూలింగ్ తర్వాత కూడా ఈ పరిస్ధితి ఆగుతుందా అన్నది అనుమానమే.

జిల్లా ఎస్.పి స్ధాయి అధికారి అనుమతి లేకుండా ఐ.టి సెక్షన్ 66ఎ మోపడానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇటీవల పి.యు.సి.ఎల్ పౌరహక్కుల సంస్ధ నేత జయ వింధ్యాలను చీరాల పోలీసులు అరెస్టు చేయడం కోర్టు ఆమెకు రిమాండు విధించడం కూడా జరిగిపోయింది. ఈ లెక్కన లైంగిక అత్యాచారాల విషయంలో సుప్రీం తాజా రూలింగ్ ఎప్పటికీ అమలులోకి వచ్చేను?

అంతర్జాతీయ నిరసనలు

రెండు వేళ్ళ పరీక్ష (two finger test) విషయంలో అంతర్జాతీయ స్ధాయిలో సైతం అనేక విమర్శలు చెలరేగాయి. ఈ పరీక్ష వెనుక మహిళా ఎదుర్కొటున్న సామాజిక అణచివేత ప్రధాన పాత్ర పోషించడం గుర్తించవలసిన విషయం. బాధిత మహిళ యొక్క లైంగిక అనుభవాన్ని బట్టి ఆమె గుణగణాల్ని నిర్ధారించి, తద్వారా అత్యాచార నిందితుడి దోషిత్వాన్ని లెక్కగట్టే అమానుషం ఇక్కడ దాగి ఉంది. మహిళ అంగీకారం లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు, భంగం కలిగించే హక్కు ఎవరికి లేదన్న ప్రాధమిక సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం.

భారత కోర్టులలో మహిళలకు సంబంధించి వెనుకబడిన భావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వివిధ తీర్పులు తెలియజేస్తున్నాయి. బాధిత మహిళ లైంగిక అనుభవానికి ఆమె కేరక్టర్ కి ముడి పెట్టే ధోరణి సమాజంలో ఇప్పటికీ ప్రబలంగానే ఉంది. లైంగిక అనుభవానికి అలవాటు పడి ఉన్నందున అత్యాచారం జరిగినట్లు కాదని సూర్యనెల్లి బాలిక కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి అదే అభిప్రాయాన్ని ఇటీవల కూడా వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ప్రస్తావించిన 2009 నాటి ఒక తీర్పు ఇలా పేర్కొంటోంది. “బాధితురాలు లైంగిక క్రియకు అలవాటుపడిన దానిలా, నైతిక విలువలు లేని దానిలా కనిపిస్తోంది.” ఇదే కేసులో పాట్నా హై కోర్టు ఇలా పేర్కొంది, “అమ్మాయి 20-23 సంవత్సరాల వయస్కురాలు అయినప్పటికి, ఇంకా పెళ్ళి కానప్పటికి లైంగిక క్రియలకు అలవాటు పడి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది ఆమె కేరక్టర్ పైన అనుమానాలకు తావిస్తోంది.” అంటే అప్పటికే లైంగిక క్రియల్లో పాల్గొన్నందున ఆమె కేరక్టర్ మంచిది కాదని కనుక అత్యాచారం జరిగినా అది అత్యాచారం కిందికి రాదని హై కోర్టు, సుప్రీం కోర్టు తేల్చేసాయి. ఒకసారి ఒక వ్యక్తితో లైంగిక క్రియలో పాల్గొంటే ఇక ఆమెను ఎవరైనా అత్యాచారం చెయ్యొచ్చన్నమాట! సూర్యనెల్లి కేసులో కేరళ హై కోర్టు మాజీ జడ్జి జస్టిస్ బసంత్ చెప్పింది కూడా ఇదే.

వేళ్ళతో పరీక్ష చేసి అత్యాచార నేరం నిర్ధారించడం కూడా ఫోరెన్సిక్ పరీక్షగానే చెప్పడం ఒక విపరీతం. ఇది అత్యంత ప్రాచీన పరీక్ష అని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఒక నివేదికలో నిరసించింది. ఈ పరీక్ష ద్వారా హైమన్ పొర ఉన్నదీ లేనిదీ వైద్యులు నోట్ చేస్తారని, యోని సైజు, వదులుతనం/బిగుతుతనం నిర్ధారిస్తారని సదరు నివేదిక తెలిపింది. ఇది “అశాస్త్రీయం”, “అమానవీయం”, “అవమానకరం” అని చెప్పిన నివేదిక “అమ్మాయిలు లేదా మహిళలు కన్నెలుగా ఉన్నారా, లేక లైంగిక చర్యలకు అలవాటు పడ్డారా అని నిర్ధారించడానికి ఈ పరీక్షని ఉద్దేసిస్తారు. కానీ వాస్తవంలో ఈ రెండింటిలో దేనినీ అది నిర్ధారించలేదు” అని పేర్కొంది. 2010లో వెలువడిన ఈ నివేదిక ప్రకారం వైద్య శాస్త్ర పాఠ్య గ్రంధాల్లో సైతం ఇలాంటి అభిప్రాయాలకు తావిచ్చే బోధనలు జరుగుతున్నాయని వీటిని తొలగించాలని డిమాండ్ చేసింది.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నేర చట్ట సవరణ బిల్లు అత్యాచార నిర్ధారణ విషయంలో ఏమి చెప్పిందీ వివరాలు అందుబాటులో లేవు. సుప్రీం కోర్టు తాజా రూలింగ్ తో నైనా ప్రభుత్వాలు ఈ రెండు వేళ్ళ పరీక్షను రద్దు చేయాలి. ఆ మేరకు మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.

7 thoughts on “అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

  1. ఇనుప కచ్చడాల సంస్కృతి మారకపోవడం మన దురద్రుష్టం అయితే ఈలాంటి న్యాయమూర్తులు ఏకొద్ది మదయిన ఉండటం మన అదృష్టం.

  2. ఆలస్యం గానైనా , ఒక మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు ! ” baagu.net లో కొన్ని నెలల క్రితం ” రెండు వేళ్ళ (అ )న్యాయం ” అనే పేరు తో ఒక టపా ప్రచురించాను !
    ( ఆ టపా మూలం , టైం పత్రిక లో వచ్చిన ఒక వార్తా కధనం !. ) అంటే ముందుగా ఈ రెండు వేళ్ళ న్యాయం గురించి తెలిపింది పత్రికలే !

  3. శేఖర్ గారూ , baagu.net ఆర్కైవ్స్ లో జనవరి ఆరు 2013 న వేసిన టపా ” రెండు వేళ్ళ ( అ ) న్యాయం ”. లింక్ ఎట్లా ఇవ్వాలో తెలియక ఈ వివరాలు ఇవ్వడం జరుగుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s