కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?


ఆర్కిటిక్ కౌన్సిల్ సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు

ఆర్కిటిక్ కౌన్సిల్ సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా లభించింది. తమ లక్ష్యం కేవలం శాస్త్ర పరిశోధన కోసమే అని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దాన్ని నమ్మడం కష్టం. మరో వైపు చైనా తన ఉద్దేశాలను ఏమీ దాచుకోవడం లేదు.

‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో పరిశీలక సభ్య దేశం హోదా కోసం భారత దేశం పెట్టుకున్న దరఖాస్తును కౌన్సిల్ బుధవారం ఆమోదించిందని పత్రికలు తెలిపాయి. చైనా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలకు ఈ హోదా ఇస్తున్నట్లు స్వీడన్ నగరం కిరున లో జరిగిన సమావేశంలో ఆర్కిటిక్ కౌన్సిల్ ప్రకటించింది. కౌన్సిల్ నిర్ణయాన్ని ఇండియా స్వాగతించింది. తన శాస్త్ర పరిశోధనా సామర్ధ్యాన్ని, ముఖ్యంగా ధృవ పరిశోధనా సామర్ధ్యాన్ని వినియోగించే అవకాశం తమకు వచ్చిందని ఇండియా ప్రకటించింది. ఆర్కిటిక్ కౌన్సిల్ తన పని తాను చేసుకుపోతుంటే, ఆ పనికి ఇండియా సహకరిస్తుందని మన ప్రభుత్వ భావం.

అయితే పైకి ఎన్ని చెప్పినా వివిధ దేశాల లక్ష్యం ఆర్కిటిక్ ఖండం వనరులలో వాటా పొందడమే. ఇన్నాళ్లూ అక్కడ పూర్తిగా మంచు కప్పబడి ఉండడంతో వనరుల తవ్వకానికి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అమెరికా, రష్యా, యూరప్ లతో సహా వివిధ దేశాలు అక్కడ శిబిరాలు నెలకొల్పి వివిధ పరిశోధనలు సాగిస్తూ వచ్చాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా ఇటీవలి సంవత్సరాలలో ఆర్కిటిక్ మంచు వేగంగా కరిగిపోతోంది. మరో అయిదారేళ్లలో పూర్తిగా కరిగిపోతుందని అంచనా వేస్తున్నారు.

ఆర్కిటిక్ మంచు కరిగిపోతే పెద్ద మొత్తంలో వనరులు అందుబాటులోకి వస్తాయి. అపారమైన ఖనిజ వనరులు, చమురు వనరులకు ఉత్తర ధ్రువం చుట్టూ ఉన్న ఆర్కిటిక్ ఖండం నిలయం అని భావిస్తున్నారు. వనరులే కాకుండా సముద్ర మార్గానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. వివిధ దేశాల మధ్య వాణిజ్య రవాణాకు, సరఫరాలకు సముద్ర మార్గం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా గతంలో వేల కిలో మీటర్ల దూరం సాగే వాణిజ్య ప్రయాణ మార్గాలు ఇప్పుడు బాగా తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఈ మార్గాల పైన నియంత్రణ కోసం సహజంగానే పోటీ తలెత్తుతుంది.

ఈ పోటీలో ముందంజలో ఉండడానికే ఉభయ కొరియాల వద్ద అమెరికా ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం సముచితం. ఉత్తర కొరియా అణు బాంబుల వలన, తమకు ప్రమాదం ఉందని అమెరికా పైకి దాడి చేస్తామని ఉత్తర కొరియా బెదిరింపులు కూడా చేస్తోందని చెబుతూ అమెరికా అలాస్కాలో మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకూ పోలండులో మిసైల్ రక్షణ వ్యవస్ధను స్ధాపిస్తానంటూ చెప్పిన అమెరికా కొరియా ఉద్రిక్తతలు సాకుగా చూపుతూ దానిని అలాస్కాకు తరలిస్తానని ప్రకటించింది. తద్వారా ఉత్తర కొరియా నుండి వచ్చే అణు బాంబులు అమెరికా భూభాగాన్ని తాకాక మునుపే అలాస్కా మిసైల్ రక్షణ వ్యవస్ధ గాలిలోనే అడ్డుకుంటాయని తెలిపింది.

అయితే అమెరికా చెబుతున్నది అబద్ధమని వివిధ విశ్లేషకులు తేల్చేశారు. ఉత్తర కొరియా కోరి అమెరికా కొరివితో నెత్తి గోక్కోదని, ఆర్కిటిక్ వనరుల పైన గుత్త స్వామ్యం పొందే ఉద్దేశ్యంతోనే అలాస్కాలో మిసైల్ రక్షణ వ్యవస్ధను పెంచడానికి అమెరికా ప్రయత్నిస్తోందని బ్రిటిష్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి ఒకరు రష్యా టుడేతో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో రూపొందే ఆర్కిటిక్ సముద్ర రవాణా మార్గాలను నియంత్రించే దురుద్దేశం అమెరికాకు ఉన్నదని అందుకే అలాస్కాలో ఆధునిక ఆయుధ వ్యవస్ధను మోహరిస్తున్నదని ఇతర విశ్లేషకులు కూడా వ్యాఖ్యానించారు.

అటువంటి ఆర్కిటిక్ ఖండంలో శాస్త్ర పరిశోధన లక్ష్యం కోసం ఆర్కిటిక్ కౌన్సిల్ సభ్యత్వం కోసం ప్రయత్నించినట్లు ఇండియా చెప్పడం అనుమానాస్పదం. నిజానికి ఇండియా తనంతట తానుగా ఆర్కిటిక్ వనరుల కోసం ప్రయత్నిస్తే రానిచ్చేవారెవరూ లేరు. ఇండియా దరఖాస్తు ఆమోదం వెనుక అమెరికా హస్తం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కౌన్సిల్ లో చైనా ఉనికిని పూర్వపక్షం చేసే ఎత్తుగడలో భాగంగానే ఇండియాకి సభ్యత్వం లభించేలా అమెరికా ప్రభావితం చేసిందని వారి అవగాహన. ఇది ఎంతవరకు నిజమన్నది భవిష్యత్తు పరిణామాలు ఎలాగూ రుజువు చేస్తాయి.

Lomonosov & Mendeleev Ritzనిజానికి ఇండియాకు అమెరికా కంటే రష్యాతో దగ్గరగా ఉంటేనే ఎక్కువ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఆర్కిటిక్ కు అత్యంత దగ్గరగా ఉన్న దేశం రష్యా. అయితే ఆర్కిటిక్ లోని లోమోనోసోవ్ రిట్జ్, మెండెలీవ్ రిట్జ్ లు తమవేనని రష్యా చేస్తున్న వాదనలకు ఇండియా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు రిట్జ్ లు తన ‘కాంటినెంటల్ షెల్ఫ్’ లో భాగమని కనుక అవి తమవేనని రష్యా వాదిస్తోంది. ఈ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రష్యాకు అనుకూలంగా ఇండియా రాజకీయ నిర్ణయం తీసుకోగలిగితే ఫలితం ఉంటుంది.

ఆర్కిటిక్ కౌన్సిల్ లో ఇప్పుడు 8 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి: కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్ లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, అమెరికా. ఆర్కిటిక్ లో భాగంగా తమ భూభాగాలను కలిగి ఉన్న దేశాలు మాత్రమే శాశ్వత సభ్యత్వానికి అర్హులు. ఆర్కిటిక్ లో భూభాగం లేని వారు పరిశీలక హోదా పొందడానికి మాత్రమే అర్హులు. కౌన్సిల్ తాజా నిర్ణయంతో మొత్తం 12 దేశాలు శాశ్వత పరిశీలక సభ్యత్వా హోదాను సంపాదించాయి. టర్కీ, యూరోపియన్ యూనియన్ లు తాత్కాలిక పరిశీలక హోదాను కలిగి ఉన్నాయి.

ఆర్కిటిక్ ప్రాంతంలో దాదాపు 45 లక్షల మంది నివసిస్తున్నారు. స్ధానిక ఎస్కిమో ప్రజల ప్రయోజనాలను కాపాడడం తమ లక్ష్యాల్లో ఒకటిగా ఆర్కిటిక్ కౌన్సిల్ చెబుతోంది. అయితే స్ధానిక ప్రజల ప్రతినిధులు మాత్రం తాము ఉత్తర అమెరికా రెడ్ ఇండియన్ల పరిస్ధితిని ఎదుర్కోడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఆర్కిటిక్ కౌన్సిల్, తత్సంబంధిత పరిణామాలలో ఈ వైరుధ్యాలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. క్రమ క్రమంగా అంతర్జాతీయ రాజకీయాల్లో సైతం ఒక ప్రముఖ స్ధానాన్ని ఆర్కిటిక్ ఆక్రమించినా ఆశ్చర్యం లేదు.

2 thoughts on “కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

  1. ఈ ఆర్కీటిక్ లు అంతార్కిటీక్ లు అన్నీ ఒకరోజు కరిగిపోయేవే నాతో ఒకసారి వనరులు సరిగ్గా పంపిణీ జరగక పోతే ఊద్యమాలు చెయ్యక తప్పదు అన్నారు కాని ఇప్పుడు ఉద్యమాలు అంటె వ్యాపరస్తుల దగ్గర చందాలు వసూలు చేసి పంచుకోవటం తేడా వస్తే తిట్టుకొవడం ఉద్యమం అంటే పాపమా అని నన్ను అడిగారు అది పాపం కాదు అబద్దాలు చెపుతూ మోసాలు చేస్తూ వేసుకునే అందమైన ముసుగు ………..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s